హత్య యెందుకు జరిగిందో, యెలా జరిగిందో తెలిసింది కానీ ఎవరు చేశారో తెలియడంలేదు. మొదట్నుంచీ మంచి శీలం కలిగి ఉండని వనజ కీ హత్యతో సంబంధముండడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో హత్య చేస్తే తను పట్టుబడే అవకాశమున్నదని ఆమెకు తెలుస్తుంది. చూస్తూ చూస్తూ ఏ ఆడదీ నిండు సంసారంలో నిప్పులు పోసుకోదు! రంగారావు హత్య జరిగితే ఆ సమయంలో వనజ బ్రతుకు అన్ని విధాలా నాశనమవుతుంది. అందువల్ల హత్య విషయంలో ఆమె యెవరికీ సహకరించే అవకాశంకూడా లేదు.
వెంకన్న అనుమానమంతా పద్మ పైనే కేంద్రీకృతమై ఉంది. రంగారావు కారణంగా ఆమె భర్త ఆమె కళ్ళెదుటనే పరస్త్రీలతో సుఖించడం మొదలుపెట్టాడు. ఈ ఘోరాన్ని ఏ ఆడదీ సహించలేదు. భర్తను చేజేతులా చంపుకోలేదు. తన మనసులోని ద్వేషం నానాటికీ పెరిగిపోతూంటే ఆఖరికి ఒక రోజున ఆమె రంగారావును హత్య చేసింది.
అయితే రంగారావు ద్వారకా లాడ్జికి వేడుతున్నట్లు ఆమెకు ఎలా తెలిసింది?
ఒక పర్యాయం పద్మ యింటిని సోదా చేస్తే తప్ప, రహస్యం బయటపడదని వెంకన్నకు అనిపించింది.
భార్యా భర్తలిద్దరూ మొదటి ఆట సినిమాకు వెళ్ళిన సమయాన్నవకాశంగా తీసుకొని రహస్యంగా ఆ ఇంట్లో ప్రవేశించాడు వెంకన్న. తనకు పనికివచ్చే వివరాలేమైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతికాడు. కానీ పనికొచ్చే వేమీ దొరకలేదు.
పద్మ బట్టలపెట్టెలో ఒక ప్లాస్టిక్ సంచీ ఉంది. అందులో కొన్ని ఉత్తరాలు, బిల్లులు ఉన్నాయి. ఉత్తరాలు ప్రకాశం పద్మకు రాసినవి. ప్రతి ఉత్తరం మొదలు చివర చదివి మళ్ళీ ప్లాస్టిక్ సంచీలోకి తోసేశాడు వెంకన్న.
బిల్లుల్ని కూడా పరీక్షించి చూశాడు. ఒకటి కాల్ గ్యాసు డిపాజిట్ కు సంబంధించినది. మరొకటి బంగారానికి సంబంధించిన తూకం వివరాలున్నది. రెండూ కూడా కనీసం రెండేళ్ళవి. వాటిలో కొత్త బిల్లులు అయిదున్నాయి. నాలుగు బిల్లులు పాతవి. అంటే ఏడెనిమిది నెలల క్రితంవి. ప్రెషర్ కుక్కర్, ఇస్త్రీపెట్టె వగైరా గృహసంబంధమైన వస్తువులవి. బహుశా గ్యారంటీ పీరియడ్ అయ్యేవరకూ జాగ్రత్తగా దాచిఉండాలి.
పద్మ చాలా జాగ్రత్తైన మనిషేనని గ్రహించాడు వెంకన్న. అతను అయిదో బిల్లును పరీక్షగా చూశాడు.
వస్తువు వెల ఇరవై రెండు రూపాయలని ఉంది. అక్షరాలనుబట్టి ఆ వస్తువేదో గ్రహించడం కష్టమైంది. బిల్లు మిసెస్ అని ఏదో పేరున వ్రాసి వుంది. అక్షరాలను ఎంత పరిశీలించినా అర్ధం కావడంలేదు. కానీ ఆ పేరుపద్మిని కాదని అనిపిస్తోంది. మిసెస్ ప్రకాశం అనుకుందామనుకొన్నా సరిపోవడంలేదు. ఆ బిల్లు ప్రత్యేకత ఏమిటంటే అది రంగారావు హత్యకు రెండు రోజులకు ముందు వ్రాయబడింది.
ఆ బిల్లు తనకు పనికి వస్తుందని వెంకన్న అనుకోలేదు. కష్టపడి ఆ ఇంట్లో ప్రవేశించి ఉత్త చేతులతో వెనక్కు పోవడం ఇష్టంలేక అత నా బిల్లును జేబులో పెట్టుకొని జాగ్రత్తగా ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు.
వెంకన్న ఆ బిల్లు తీసుకొని అందులో ఉన్న అడ్రసు ప్రకారం షాపు చేరుకున్నాడు.
అది మహాలక్ష్మి మెటల్ స్టోర్స్!
వెంకన్న ఆ బిల్లు తీసుకొని షాపులో అతనికి చూపించి "కొన్నాళ్ళ క్రితం ఇందులోని వస్తువు కొన్నారు. సరిగ్గా అలాంటిదే కావాలి...." అంటూ బిల్లు చూపించాడు.
షాపు అతను ఓ క్షణం బిల్లువంక చూసి లోపలికి వెళ్ళాడు. తిరిగివచ్చిన అతని చేతిలో తళతళ మెరిసే కత్తి ఉంది.
వెంకన్న ఉలిక్కిపడ్డాడు.
అదే-అది హత్యాయుధం! రంగారావు గుండెల్లో దిగబడిన కత్తి అదే!
వెంకన్న డబ్బు చెల్లించి ఆ కత్తి కొన్నాడు. బిల్లును జాగ్రత్తగా జేబులో పెట్టుకొని మర్నాడు ప్రకాశం ఆఫీసుకు వెళ్ళేవరకూ వేచి అప్పుడు పద్మను కలుసుకొని "ఇదివరలో మీ భర్తకు మీకు రంగారావుతో ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పేస్తానని బెదిరించాను. మీరు చలించలేదు. కానీ యిప్పుడు తిరుగులేని అభియోగంతో వచ్చాను. రంగారావును చంపింది మీరే! హత్యాయుధం ఒక కత్తి! దాన్ని మీరు మహాలక్ష్మి మెటల్ స్టోర్సులో హత్యకు రెండు రోజుల ముందు కొన్నారు. ఇవన్నీ నేను ఋజువు చేయగలను...." అన్నాడు.
పద్మ తెల్లముఖం వేసి వెంకన్న వంక చూసింది-"ఇవన్నీ మీరెలా కనుక్కోగలిగారు? మీరు మనుషులా, దేవతలా!" అంది.
"మంచి పనికి పూనుకొన్న సామాన్యున్ని-" అన్నాడు.
"ఇన్ని కనుక్కోగలిగినవారు మరి అసలు హంతకురాలిని యెందుకు తెలుసుకోలేకపోయారు....?" అంది పద్మ.
"బుకాయించవద్దు. మీరే ఈ హత్య చేశారు...."
"నేను కాదు. ఇన్ని తెలిసిన మీకు అబద్దం చెప్పను. అన్నీ చెప్పేస్తాను. యీ హత్య చేసినది సరిత?" అంది పద్మ.
వెంకన్న తెల్లబోయాడు. "నేను నమ్మలేను" అన్నాడు అప్రయత్నంగా.
"అంతా చెప్పేస్తాను-వినండి!" అంది పద్మ.
ప్రకాశం పద్మను క్షమించినా అది అవకాశంగా తీసుకొని ఆమెను లోకువ కట్టాడు. పగ పేరుతో రంగారావు భార్య సరితను తను లొంగదీసుకొంటానన్నాడు. అందుకు పద్మను సహకరించామన్నాడు. భర్తకూ మరో ఆడదానికీ తార్పుడుకత్తెగా పని చేయాల్సి వచ్చిన తన గతికి కుమిలి ఏడ్చింది పద్మ. మనసు రాయి చేసుకొని సరిత దగ్గరకు వెళ్ళి మొత్తం కధ అంతా వివరంగా చెప్పింది.
ఫారిన్ సెంట్ పేరుతో భర్త చేస్తున్న ఘోరాలు విని సరిత షాక్ తింది. ఆమె భర్తను యెంతగానో ఆరాధిస్తోంది. ఈ షాక్ తో ఆమె పూర్తిగా మారిపోయింది. ఆ క్షణంనుంచి భర్త చర్యలనోకంట కనిపెట్టసాగింది. వనజ, రంగారావు కలిసి వేసుకున్న కార్యక్రమం గురించి ఆమె నాలుగురోజులు ముందుగానే ఆరాతీసింది.
రంగారావులాంటి చీడపురుగును బ్రతకనివ్వకూడదనీ అందుకు సహకరించమనీ ఆమె పద్మను కోరింది. పద్మ సరిత పేరిట ఒక కత్తిని కొని ఆమెకు యిచ్చింది. ఎందుకైనా మంచిదని ఆ బిల్లు తనదగ్గర జాగ్రత్తపెట్టింది. పద్మ భర్త క్యాంపులో వున్నాడు. పద్మ సరిత యింటికి మకాం మార్చింది.
