Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 25


                            సునీత గీసిన బొమ్మ
                                                               ---వసుంధర


    మొబైల్ వ్యాన్ శరవేగంతో పోతోంది.
    డైవింగ్ సీట్లో కిల్లర్ ఉత్సాహంగా ఉన్నాడు.
    నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుమీద అవధులు లేని వేగంతో వ్యాన్ నడపడం అతని కెంతో సరదా.....
    ఆ సమయంలో బాగా దూరగా రోడ్డు కడ్డంగా నిలబడి ఉన్న మనిషి కనిపించాడు కిల్లర్ కి ఎందుకైనా మంచిదని ముందే హారన్ మ్రోగించాడు.
    వ్యాన్ ఆ వ్యక్తిని సమీపిస్తోంది.
    హారన్ ఆగకుండా మ్రోగుతోంది.
    అతడు మాత్రం కదలలేదు.
    చివరకు సడన్ బ్రేకుతో వ్యాన్ ఆపాడు కిల్లర్.
    ఆ వ్యక్తి వ్యాన్ ఆపడానికే అక్కడలా నిలబడ్డాడని కిల్లర్ కి అర్ధమయింది. ఎందుకంటే అతడు రెండు చేతులూ అడ్డంగా చాపి ఉన్నాడు.
    అతడొక సర్దార్జీ.
    వ్యాన్ ఆగగానే సర్దార్జీ వచ్చి డోరు తెరిచి లోపలకు ప్రవేశించి డోరు మూసి-"అర్జంటుగా దగ్గర్లోని రైల్వేస్టేషన్ కు పోనీయ్-" అన్నాడు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు కిల్లర్.
    అప్పుడు సర్దార్జీ చేతిలో సాధారణంగా సిక్కులవద్ద ఉండే కృపాణం తళుక్కున మెరిసింది.
    "ప్రశ్న లడగవద్దు అర్జంటుగా స్టేషన్ కు పోనీయ్...."
    "నేను ప్రశ్నలడుగుతాను, జవాబు నచ్చితే నీకు సాయపడతాను. లేదా నీకు బుద్ధి చెబుతాను, నీ చేతి లోని కత్తులు నన్ను బెదిరించలేవు-" అన్నాడు కిల్లర్. అతడి మాటలు ముగిసేసరికి సర్దార్జీ చేతిలోని కృపాణం కిందపడింది. కిల్లర్ అతడి చేతిని మెరుపువేగంతో మెలిపెట్టాడు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు సర్దార్జీ ఆశ్చర్యంగా.
    "నా సంగతి తర్వాత చెబుతాను ముందు నీ సంగతి చెప్పు. నువ్వు టెర్రరిస్టువా?" అనడిగాడు కిల్లర్.
    సర్దార్జీ ముఖం అదోలాగైపోయింది-"పంజాబులో జరిగే అల్లర్లు ప్రతి సిక్కునూ టెర్రరిస్టు చేస్తున్నాయి. అందుకే నేనిప్పుడు పంజాబు బయల్దేరాను. టెర్రరిస్టుల్ని అంతంచేసి నక్కుల దేశభక్తిని నిరూపించుకునేందుకు!"
    "ఇక్కడ నీకేమీ పనిలేదా?" అన్నాడు కిల్లర్.
    "ఉంది నేనొక మెకానిక్కుని. గ్యారేజీ నడుపు తున్నాను. పదహారేళ్ళ వయసులో ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు నాకు నలభైయేళ్ళు ఈ ఇరవై నాలుగేళ్ళలోనూ తెలుగువారిలో ఒకడిగా కలిసిపోయి తెలుగు బాష క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నా కెందరో తెలుగు మిత్రులున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీమన్నారాయణ, ఆయన్ను నేను అన్న కంటే మిన్నగా గౌరవిస్తాను....."
    "ఇదంతా నా కెందుకు చెబుతున్నావు?" అన్నాడు కిల్లర్ అతణ్ణి మధ్యలో ఆపుతూ.
    "ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్ళిన శ్రీమన్నారాయణకు అమృతసర్ లో గురుద్వారా చూడాలనిపించి వెళ్ళాడు. దారిలో కొందరు దుండగులాయన్ను పెట్రోలు పోసి తగులబెట్టారు...." అన్నాడు సర్దార్జీ.
    కిల్లర్ పిడికిళ్ళు బిగిశాయి-"ఎందుకు?"
    "నిజమైన సిక్కు-అమాయకుల ప్రాణాలు తీయడు. సిక్కుల పెఉతో కొందరు విదేశీ గూఢచారు లీ పని చేస్తున్నారు. వారి కారణంగా సిక్కులకు చెడ్డపేరు వస్తోంది. ఇంతకాలం యెంతో స్నేహంగా ఉన్న శ్రీమన్నారాయణ కుటుంబం నన్నిప్పుడు ద్వేషిస్తోంది. బాభీజీ నా ముఖం చూడనంటోంది. నిజం చెప్పాలంటే నా కిప్పుడు పంజబుతో సంబంధం లేదు. నా దేశం తెలుగు దేశం. నా బిడ్డ లీ గడ్డలో పుట్టి పెరిగి పెద్దవారయ్యారు. అయినప్పటికీ పంజాబులో ఎవరో చేసిన తప్పు నన్నిక్కడ నా వాళ్ళకు దూరం చేస్తోంది. అందుకే నేనిప్పుడక్కడకు వెళ్ళి వారి నంతం చేసి వస్తాను....."
    కిల్లర్ అదోలా అతడివంక దూసి-"నువ్వు నిజమే చెబుతున్నావా?" అన్నాడు.
    "నిజమైన సిక్కు అబద్ధం చెప్పడు-" అన్నాడు సర్దార్జీ.
    "అయితే ఎందరో పోలీసులు, సైనికులు చేయలేని పని నీ ఒక్కడివల్ల అవుతుందనుకుంటున్నావా?"
    "కావచ్చు - కాకపోవచ్చు. నా స్నేహితుడి ప్రాణంతీసినవారి ప్రాణం తీసేదాకా నాకు స్థిమిత ముండదు...." అన్నాడు సర్దార్జీ.
    కిల్లర్ అతడి కళ్ళలోని ఆవేశం చదివాడు. అందులో నటనలేదు.
    "నిజమైన సిక్కులకు నేను సాయపడతాను. నీతో కాసేపు మాట్లాడాలి. వ్యాన్ సైడుకి పెడతాను-" అన్నాడు కిల్లర్.
    మొబైల్ వేన్ రోడ్డుపక్కకు చేరింది.
    "ఇప్పుడు చెప్పు-నీ పేరు?"
    "రామ్ చరణ్ సింగ్-"
    "నీ స్నేహితుడు శ్రీమన్నారాయణను పంజాబులో టెర్రరిస్టులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పెట్రోలులో కాలిపోయిన మనిషికి అవమానాలుండదు. అతడే శ్రీమన్నారాయణ అని నీకెలా తెలిసింది? అసలీ వార్త నీ కెలా చేరింది?"
    "శ్రీమన్నారాయణ తోపాటు అమృతసర్ వెళ్ళిన నరసింగరావు ద్వారా యీ విశేషం తెలిసింది....."
    "నరసింగరావెవరు?"
    "అక్కడ ఢిల్లీలో వుంటున్నాడు. శ్రీమన్నారాయణ స్నేహితుడు...."
    "టెర్రరిస్టులు శ్రీమన్నారాయణను కాల్చి నరసింగరావు నెందుకు వదలిపెట్టారు?"
    "నరసింగరావు కార్లో యిద్దరూ అమృతసర్ కు బయల్దేరారు ఢిల్లీ నుంచి, దారిలో టెర్రరిస్టులు వారి కారాపారు. ఇద్దరూ కారు దిగారు. టెర్రరిస్టులు వారిద్ధర్నీ "ఖలిస్థాన్ జిందాబాద్-" అనమన్నారు. ఇద్దరూ అనలేదు. అనకపోతే చంపేస్తామన్నారు వాళ్ళు. నరసింగరావు వెంటనే అనేశాడు. శ్రీమన్నారాయణ టెర్రరిస్టుల్ని నిందించసాగాడు. అంతే వాళ్ళతన్ని పెట్రోలుపోసి తగలబెట్టి నరసింగరావుతో "-ఈ విషయం హిందువులందరికీ చెప్పుకుంటావని నిన్ను వదలి పెడుతున్నాం-" అన్నాడు. నరసింగరావు వాళ్ళు వెళ్ళేదాకా ఆగి కార్లో దగ్గరవున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. పోలీసు సంరక్షణతో అతడు ఢిల్లీ చేరుకున్నాడు-"
    రామచరణ్ సింగ్ చెబుతూంటే కిల్లర్ కళ్ళెర్రబడ్డాయి-"మిస్టర్ సింగ్! ఇలా యెంతకాలమో కొనసాగదు టెర్రరిస్టులపై సిక్కులు కూడా తిరగబడాలి. అప్పుడే దేశంలో సిక్కులకు కూడా రక్షణ లభిస్తుంది-"
    "అందుకే-ముందుగా నేను తిరగబడుతున్నాను. నాకు నా మతమెంతో నా దేవుదెంతో నా ఆలయ మెంతో నా స్నేహితులూ అంతే! నా స్నేహితులంతా హిందువులు...." అన్నాడు రామచరణ్ సింగ్ ఆవేశంగా.
    కిల్లర్ మనిషి కాస్త చల్లబడ్డాడు-"నేను నిన్ను నమ్ముతున్నాను నీకు సాయపడతాను. అయితే ఇలా ఉన్నపళంగా బయల్దేరడం కాదు. ముందుగా కొంత సమాచారం సేకరించాలి-"
    "సమాచారం సేకరించడాని కేముంది? పంజాబు నిండా టెర్రరిస్టులున్నారు. వాళ్ళు సామాన్యులను మత ప్రచారంతో రెచ్చగొడుతూ సోదర హిందువులమీద ద్వేషం నూరిపోస్తున్నారు. వాళ్ళను బ్రతకనివ్వకూడదు...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS