Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 24


    "అందమైన ఆడవాళ్ళతో జోక్ చేయడం నా హాబీ కాదు. పరాయి మగాడితో అక్రమ సంబంధముందని చెప్పగా విని హాయిగా నవ్వినా ఆడదాన్ని మిమ్మల్నే చూశాను-" అన్నాడు వెంకన్న.
    "ఉన్నమాటంటే ఉలుకు గానీ-జోక్సుకు కోపమెందుకు?" అంది పద్మ.
    "నేను జోక్ చేయనని ముందే చెప్పాను..."
    "మీరు చెప్పేది జోక్ కాదనుకోండి-ఒకసారి మా ఆయనతో ఇదేముక్క అని చూడండి. అందులోని జోక్ మీకే తెలుస్తుంది-" అంది పద్మ.
    "ఫారిన్ సెంట్ కథ విన్నాక కూడా మీ భర్త మిమ్మల్ని నమ్ముతాడనుకున్నారా" అన్నాడు వెంకన్న.
    "యేమిటా ఫారిన్ సెంటు కధ?-" అనడిగింది పద్మ.
    "యేమీ యెరుగనట్లు అడుగుతున్నారు. అయినా చెబుతున్నాను-" అంటూ వెంకన్న రంగారావు ఫారిన్ సెంటు ప్రభావంతో ఏ విధంగా వశపర్చుకుని ఉంటాడో చెప్పాడు.
    "మీరు మంచి జోక్స్ వేయడమే కాదు. కథలు కూడా అల్లగలరు...." అని నవ్వింది పద్మ-"మీరు నిరభ్యంతరంగా యీ కధను మా వారికి చెప్పవచ్చును-"
    వెంకన్నకు చాలా కోపం వచ్చింది. పద్మ యిలాగనడానికి కారణం అతనికి తోచలేదు. భర్తకు చెబుతానని బెదిరించి సమాచారం లాగాలని అతననుకున్నాడు. కానీ ఆమె బెదరడం లేదు. ఈ వ్యవహారం అంతు తేల్చాలంటే పద్మ భర్తను కలుసుకోవాలి.
    వెంటనే వెంకన్న పద్మ భర్త పని చేసే ఆఫీసుకు వెళ్ళాడు.
    పద్మ భర్త పేరు ప్రకాశం. వెంకన్న ఎవరో తెలియక కంగారుపడ్డాడు.
    "మీతో యేకాంతంగా మాట్లాడాలి!" అన్నాడు వెంకన్న.
    ఆఫీసు భవనానికి ముందున్న పార్కులో ఇద్దరికీ ఏకాంతం లభించింది.
    తన తెలివితేటలన్నీ క్రోడీకరించి వెంకన్న అతన్ని బుట్టలో వేయాలనుకొన్నాడు-"మీ మిత్రుడు రంగారావు హత్య కేసు విషయంలో మీమీద పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. వాళ్ళ దృష్టి మీ పై పడేలోగా మిమ్మల్ని హెచ్చరించాలని వచ్చాను......అన్నాడు.
    "రంగారావును నే నెందుకు చంపుతాను?"  అన్నాడు ప్రకాశం.
    "ఎందుకా?" అని నవ్వాడు వెంకన్న-"రంగారావు ఫారిన్ సెంటుతో మిమ్మల్ని నిద్రపుచ్చి మీ ఎదుట మీ భార్యను లొంగదీసుకొన్నాడు. ఆ విషయం మీరు గ్రహించి అందులో మీ భార్య దోషమేమీ లేదనీ-తప్పంతా రంగారావుదే ననీ తెలుసుకొని రంగారావును చంపేశారు. సహృదయంతో మీ భార్యను క్షమించారు...."
    "అబద్దం-! అంతా అబద్దం!-" అన్నాడు ప్రకాశం.
    లేదు, నిజం చెబితే మీకు రక్షణ లభిస్తుంది-"
    "ఎవరు మీరు?" అన్నాడు ప్రకాశం.
    "వెంకన్న నా పేరు. నా వృత్తి డిటెక్షన్-" అన్నాడు వెంకన్న.
    "మీరు నన్నెలారక్షించగలరో చెప్పండి!" అన్నాడు ప్రకాశం.
    కుర్రాడు దారిలో కొస్తున్నాడు అనుకొన్నాడు వెంకన్న-"నేరస్థుల్ని పట్టివ్వడంలో నా ఆసక్తి లేదు. నేరాలు పరిశోధించి విషయాన్నీ గ్రహించడం నాకు సరదా! నిజం తెలుసుకొన్నాక దాన్ని బయటపెట్టడం మా యిష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో నేను తెలుసుకొన్న ఫారిన్ సెంటు వ్యవహారం యింకా పోలీసులకు తెలియదు. పోలీసులు తెలుసుకొనే అవకాశం కూడా లేదు...."
    ప్రకాశం కళ్ళలో మెరుపు కనిపించింది-"నేను నిజం చెబుతాను. ఎటొచ్చీ రంగారావును చంపలేదంటే అది అబద్దమని మీరు అనుకోకూడదు...."
    "మీరు చెప్పదల్చుకున్న నిజం చెప్పండి!" అన్నాడు వెంకన్న.
    ప్రకాశం భార్య ఫారిన్ సెంటు ప్రభావానికి గురై రంగారావుకు లొంగిన మాట నిజం. అయితే ప్రకాశం రంగారావును అనుమానించలేదు. అయితే అతనికి వనజ కారణంగా ఈ ఫారిన్ సెంటు సంగతి తెలిసింది.
    వనజ, ప్రకాశం గతంలో ప్రేమికులు. వయసు ఆకర్షణ వారిని కలిపింది. పెళ్ళి చేసుకోవాలని వారు అనుకోలేదు. పెళ్ళయ్యాక మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదు. వనజ రంగారావు దగ్గర్నుంచి..........దాన్ని భర్తమీద ప్రయోగించి, ఆ సమయంలో ప్రకాశాన్ని తనింటికి రప్పించుకొని సుఖించేది.
    ఆమె ధైర్యానికి కారణం తెలిసిన ప్రకాశం, రంగారావు వనజనే కాక తన భార్యనుకూడా లోబర్చుకున్నాడని గ్రహించి కోపంగా ఇంటికి వెళ్ళాడు. పద్మ భర్త ముందు నిజం ఒప్పేసుకొని తను అసహాయురాలిననీ తనకు రంగారావు పైన ప్రేమాభిమానాలు లేవనీ చెప్పియేడ్చింది.
    ప్రకాశం భార్యను క్షమించాడు కానీ ఆమె అసహాయత నతనింకో విధంగా వుపయోగించుకొంటున్నాడు. అతను కావాలనుకొన్నప్పుడు వనజ సరాసరి అతని యింటికే వస్తుంది. వనజ మాత్రమే కాదు-అతను కావాలనుకున్న ఆడవాళ్ళు అతనింటికి వస్తారు. ఎవ్వరూ అనుమానించని ఈ పద్ధతి ప్రకాశానికీ బాగుంది.
    "ఒక విధంగా రంగారావు నాకు మహోపకారం చేశాడు. పద్మను పురాణాల్లోని పతివ్రతల స్థాయికి దింపడానికి అతనే కారణం. అలాంటప్పుడు నేను అతన్నెందుకు చంపుతాను?" అన్నాడు ప్రకాశం.
    అతని ప్రశ్న సబబేనని అనిపించింది వెంకన్నకు. కానీ ఫారిన్ సెంటు చూపిస్తున్న దుష్పరిణామాలు అతని మనసుకు బాధ కలిగించాయి. రంగారావు వనజను, మరికొందరు ఆడవాళ్ళను లొంగదీసుకొన్నాడు. వనజ తన కిష్టమైన మగవాళ్ళతో సుఖిస్తోంది. ప్రకాశం భార్య ఎదుటే వ్యభిచరిస్తున్నాడు.
    అన్నింటికీ మూలం-ఫారిన్ సెంట్! ఆ ఫారిన్ సెంటు రంగారావు లాంటి వాడిచేత చిక్కడం!
    .........నమ్మమంటారు?" అన్నాడు వెంకన్న.
    "నమ్మినా నమ్మకపోయినా ఈ ఫారిన్ సెంటు కథను బయట పెట్టకండి. మీకు కొంత ఫీజు కూడా యిచ్చుకుంటాను...." అన్నాడు ప్రకాశం.
    వెంకన్న బాగా ఆలోచించి-"ఈ కథ బయటపెట్టకుండా ఎలా ఉండగలను? ఎందరో ఆడవాళ్ళు అన్యాయానికి బలైపోతున్నారు!" అన్నాడు.
    "ఆడవాళ్ళు బలి కావడమేముంది? వాళ్ళూ సుఖిస్తున్నారు కదా-" అన్నాడు ప్రకాశం.
    "ఇష్టంలేని మగవాడికి శరీరా న్నర్పించడాన్ని మించిన అన్యాయం ఏ ఆడదానికీ ఉండదు-" అన్నాడు వెంకన్న సాలోచనగా.
    హఠాత్తుగా వెంకన్న బుర్రలో ఏదో మెరిసింది- రంగారావుకు లొంగిపోయిన ఆడవారిలో ఎవరో ఒకరికి అతనంటే అసహ్యమై ఉండవచ్చు. ఆమెను రంగారావు బలవంతంగా అనుభవించి ఉండవచ్చు. ఆమె అతనిపై పగ బూని అతన్ని చంపి ఉండవచ్చు.
    ఇంతవరకూ అనుమానితులు ఆరుగురు తేలారు. వనజ, నీరజ, వసంత, గౌరి, పద్మ, ప్రకాశం హత్య జరిగిన రోజు రాత్రి ఈ ఆరుగురూ ఏం చేస్తున్నారో తెలుసుకోగలిగితే హంతకుడు గానీ హంతకురాలు గానీ దొరికిపోతారు.
    
                                       9

    ఒక్క పద్మకు తప్ప మిగతా అందరికీ ఆరోజు అభేద్యమైన ఎలిబీలున్నాయి.
    పద్మ భర్త ప్రకాశం డ్యూటీమీద తన ఆఫీసరుతో కలిసి క్యాంపులో ఉన్నాడు. ఆ రోజు తను కాకినాడలోనే ఉన్నానని పద్మ అంటోంది కానీ ఋజువు చేసే సంఘటనలేమీ చెప్పలేక పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS