ముత్యాల్రావు కు భయంతోనూ ఆశ్చర్యంతోనూ నోట మాటరాలేదు-"నువ్వు.....నువ్వు.....డిటెక్టివువా?" అన్నాడు.
"అవును నీ భార్య స్థిత ప్రజ్ఞురాలు. తన సమస్యలకు పరిష్కారం తనే వెతుక్కోవాలనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని విడనాడదు. నీ కాళ్ళు పట్టుకుని నిన్ను లొంగదీసుకోవాలనే ఉద్దేశమామెకు లేదు. అయితే నీ దుర్మార్గత్వాన్ని ఆమె ఎక్కువ అంచనా వేసింది. నువ్వు చాలా మంచివాడివనీ - నేరంచేసే స్వభావం నీకు లేదనీ ఆమె నాకు చెబుతూండేది.
అందువల్లనే ఈ రోజు ఆమె నిన్ను ఆటపట్టించడానికో అబద్ధం చెప్పాలనుకుంటే నేనూ వారించనూ లేదు. ఆమెను నీనుంచి రక్షించాల్సిన అవసరంకోసం నన్ను నియమించలేదు. నిన్ను బాబూరావు రీటాలనుంచి రక్షించడంకోసం నన్ను నియమించింది. అయితేనే నూహించనిది జరిగిపోయిద్న్హి. నిన్ను ఉరికంబం ఎక్కించినా-నాకు నీ భార్య శైలజను రక్షించలేక పోయానన్న బాధ అలాగే మిగిలిపోతుంది-" అన్నాడు కిషోర్ దిగులుగా.
"ఉరికంబం.....ఉరికంబం...." అన్నాడు ముత్యాల్రావు...."వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు....."
"నీ మొత్తం నేరాలన్నీ నేను ఋజువు చేయగలను. హత్య చేయడంలో నీ భాగం తెలుసుకోవడంక్సోఅమే నేను శవాన్ని అటూ యిటూ మార్చి నీ ముఖభావాలు పరీక్షించాను. శవాన్ని చూసి నీకు భయం, ఆశ్చర్యం కలిగాయి తప్పితే ఏడుపు రాలేదు. నీ కోసం అన్నీ త్యాగం చేయాలనుకునే భార్య దగ్గర్నుంచి నువ్వు ప్రాణాలు కోరితే-చట్టం చూస్తూ ఊరుకోదు. అదీ నీ ప్రాణాలు కోరుతుంది. పద-పోలీసుస్టేషన్ కు...." అన్నాడు కిషోర్.
"నేను రాను...." అన్నాడు ముత్యాల్రావు.
"ఇంక నువ్వు తప్పించుకోలేవు...." అన్నాడు కిషోర్.
ముత్యాల్రావు ఉన్నట్లుండి తన పిడికిలితో కిషోర్ తలమీద గట్టిగా మోదాడు. కిషోర్ తూలి కిందపడ్డాడు. అతడికి తలంతా దిమ్మెక్కిపోయింది. పడడంలో అతడి తల మంచానికి కొట్టుకుని కొద్దిగా రక్తం వచ్చింది.
ఆ వ్యవధి చాలు ముత్యాల్రావుకి.
కిషోర్ కదలడంలేదు. బహుశా అతడికి స్పృహతప్పి ఉండాలి.
ముత్యాల్రావు పాంటు, షర్టు వేసుకున్నాడు. వంటింట్లోకి వెళ్ళి పనసకాయ కత్తి తీశాడు. దాన్ని జాగ్రత్తగా బొడ్లో దోపాడు. ఇంట్లోంచి బయట పడుతూ మరోసారి బెడ్రూంలోకి తొంగిచూశాడు.
కిషోర్ కదులుతున్నాడు.
తను బయటపడినా ఎలాగు పట్టుబడిన తప్పదని తెలుసు ముత్యాల్రావుకి తన జీవితం ఎలాగూ నాశనమై పోయింది. కానీ తనవల్ల కావలసిన కార్యం ఒకటి ఉన్నది.
10
ముత్యాల్రావు ఇల్లు పోలీసులతోటీ చుట్టుపక్కల వారితోటీ చాలా హడావుడిగా ఉన్నది. కిషోర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు జరిగిన కథంతా చెబుతున్నాడు. ఈ కధలో చాలా భాగం ఇరుగుపొరుగులకు తెలియదు.
కిషోర్ కధనం గురించి ఇన్ స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. కిషోర్ పూర్తిగా నిజం చెబుతున్నాడా అన్న అనుమానం కూడా ఆయనకున్నది. ఆ సమయంలో అక్కడకు ముత్యాల్రావు ప్రవేశించాడు. అతడి చేతిలో రక్తసిక్తమైన కత్తి ఉన్నది.
"హంతకుడు......హంతకుడు....." కొందరు భయంగా అరిచారు. కొందరు ఆ ప్రాంతంనుంచి పారిపోడానికి ప్రయత్నించారు.
'అవును ఇన్ స్పెక్టర్ గారూ......నేను హంతకుణ్ణి...." అంటూ తన చేతిలోని కత్తిని జారవిడిచాడు ముత్యాల్రావు. తన రెండు చేతుల్నీ ముందుకు చాపాడు-అరెస్టు చేయవచ్చునన్నట్లుగా!
క్షణాలమీద ముత్యాల్రావు చేతులకు బేడీలుపడ్డాయి.
"నువ్వు నీ భార్యను ఎందుకు చంపావు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"నేను మొత్తం మూడు హత్యలు చేశాను ఇన్ స్పెక్టర్ గారూ-" అన్నాడు ముత్యాల్రావు.
కిషోర్ ఉలిక్కిపడి-"మూడు హత్యలా?" అన్నాడు.
"అవును నేను సామాన్యుణ్ణి నన్ను శైలజ ప్రేమించడం నా అదృష్టం. అయితే ఆ అదృష్టాన్ని గుర్తించకుండా ఆమెను స్లో పాయిజన్ తో చంపాలనుకున్నాను. ఆమె ఎంత ఉన్నతురాలో ఈ రోజే నాకు అర్ధమైనాక-అప్పటికే ఆవేశంలో నేనామెను హత్య చేసిన విషయం గుర్తించినాక.....నేనో కొత్త విషయాన్ని కనుగొన్నాను.
బాబూరావు, రీటా మొదట్నించీ స్వప్రయోజనాల కోసం నన్ను నా భార్యకు వ్యతిరేకంగా తయారుచేస్తున్నారు. వాళ్ళు నా మనసుపై స్లో పాయిజాన్ లా పనిచేశారు. నే నా విష ప్రభావానికి క్రమంగా గురవుతూ వచ్చి ఈ రోజుకు హత్యచేసే స్థితికి చేరుకున్నాను.
నా భార్య నాక్కాకుండా పోవడానికి కారణమైన స్లో పాయిజన్ ను నా మనసులోకి ఎక్కించిన ఆ దుర్మార్గుల బారినుండి కనీసం కొంతమందిని రక్షించడంకోసం-ఇంకో రెండు హత్యలు చేశాను. ఎలాగూ ఓ హత్య చేశానుకదా-ఇవి నాకు కష్టంకాలేదు. మొదటి హత్య చేశాక నా కెంత దిగులు కలిగిందో - ఈ హత్యలు చేశాక అంత సంతృప్తి నన్నావహించింది-ఇంక నాకు ఉరికంబమెక్కుతున్నానన్న బాధలేదు...." అన్నాడు ముత్యాల్రావు.
కిషోర్ ముత్యాల్రావు మాటల్లోని సారాంశం వెతుకుతున్నాడు. యే డబ్బుకోసం తనామెను చంపాలనుకున్నాడో, ఆ డబ్బు తనకామె ఇచ్చేసిందని తెలియగానే శైలజ ఔన్నత్యం ముత్యాల్రావుకి అర్ధమయింది. కానీ అంతకుముందే అతడికామె ఔన్నత్యం యెందుకు తెలియలేదు?
-:అయిపోయింది:-
