"మీరు చెప్పింది కధలా వున్నప్పటికీ అందులో నిజం వున్నదనిపిస్తోంది. నా భర్త ఆ సెంటు వాసన చాలా పర్యాయాలు చూపించారు నాకు. చూసినప్పుడల్లా మరో సారి ఆ పరిమళాన్నాఘ్రాణించాలనిపించేది. అదొక అపూర్వ అనుభవం. వనజ సమక్షంలో ఎన్నో పర్యాయాలు నేనాపరిమళ ప్రభావానికి గురై అచేతనురాలిగా వున్నాను. ఇందులో యింతకథ వున్నదని తెలియదు నాకు" అంది సరిత బాధగా నిట్టూర్చి.
వెంకన్న ఆమెవంక చిత్రంగా చూసి "మీ భర్త గురించి యిప్పుడేమనిపిస్తోంది మీకు?" అనడిగాడు.
"చాలా బాధగా వుంది నాకు" అందామె. ఆమె కంఠం జీవవోయింది "నా భర్త యీ విధంగా ప్రవర్తిస్తున్నాడని ఈ క్షణంవరకూ తెలియదు. ఇప్పుడైనా నమ్మాలనిపించడంలేదు. నమ్మే పక్షంలో నా భర్తతో చేరింది ఒక్క విశ్వనాథం భార్య వనజ మాత్రమేకాదు. ఇంకా నలుగురున్నారు" అని ఆమె ముఖం కప్పుకుని ఏడవసాగింది.
"ఏడ్చి ప్రయోజనం లేదు. అందగత్తెనన్న అహంకారం మీకు బాగావుంది. ఆ అహంకారంపై దెబ్బ తీయడానికే మీకు భగవంతుడిలాంటి భర్తనిచ్చాడు...." అన్నాడు వెంకన్న.
సరిత అలాగే ఏడుస్తోంది.
"నేను వెళ్ళేక తీరుబడిగా శోకిద్డురుగాని ఇప్పటికి మీభర్త నిజస్వరూపం తెలిసింది. విశ్వనాధంగానీ, మిగతా ఆ నలుగురిలో ఒకరుకానీ మీవారి కథ తెలుసుకుని ఈ హత్య చేసివుండాలి. కాబట్టి ఆ నల్గురి గురించీ కూడా చెప్పండి" అన్నాడు వెంకన్న.
"వెంకన్నగారూ! నా భర్తను చంపిన హంతకుడు తెలియనక్కరలేదు. ఆయన పాపం ఆయన్నే కొట్టింది. మీరీ విషయాన్నింతటితో వదిలిపెట్టేస్తే కనీసం మా కుటుంబపరువు దక్కుతుంది" అంది సరిత.
"చూడమ్మా! కేసులో కొంతవరకూ వచ్చేక దాని అంతు తేల్చకపోతే నా పరువు పోతుంది. మీ ఇంటిపరువు రచ్చకీడ్వక తప్పదు. ఎందుకంటే మీ భర్త చేసిన తప్పు సామాన్యమైనది కాదు. కులసతులను చెరుస్తున్నాడు. పూర్వకాలంలో విన్న రావణాసురుడు వగైరాలకంటే ఘోరమైనవాడు మీ భర్త. తమకున్న అద్భుత శక్తులతో రాజ్యాల్నేలడానికే చూశారు తప్పితే ఆడదాన్ని మాత్రం ఈ పద్ధతిలో వంచన చేయలేదు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కొందరుంటే యెంతో మంచిదైన మన సంస్కృతి మట్టి పాలు కావడానికి యెంతో వ్యవధి అవసరంలేదు. ఈ ఫారిన్ సెంట్ గురించీ దాని ప్రభావం గురించీ దీన్ని కొందరు ఉపయోగించుకునే పద్ధతి గురించీ అంతా తెలుసుకోవడం అవసరం" అన్నాడు వెంకన్న.
"అందువల్ల మరికొందరిని నేరాలకు ప్రోత్సహించిన వారౌతారేమో!" అంది సరిత.
"అందుకు అవకాశాలున్నాయి. కానీ కొందరు దుష్టులుంటారని భయపడి ఒక ప్రమాదకరమైన విషయం గురించి దుష్టులను హెచ్చరించకుండా ఊరుకోవడం మంచిదికాదు" అన్నాడు వెంకన్న.
ఏమనుకుందో సరిత వెంకన్నకు తన భర్త వెళ్ళే మిగతా నలుగురు స్నేహితుల గురించీ కూడా చెప్పింది.
8
వెంకన్న ముందుగా నీరజ యింటికి వెళ్ళాడు. రంగారావు ఫారిన్ సెంట్ ప్రభావం చూపించిన మిగతా నలుగురు ఆడవాళ్ళలోనూ నీరజ ఒకతె!
వెంకన్న ఆమె యింటికి భర్త లేని సమయం చూసి వెళ్ళాడు.
"ఆయన ఇంట్లోలేరు!" అంది నీరజ.
"నేను మీతోనే మాట్లాడ్డానికి వచ్చాను" అన్నాడు వెంకన్న.
ఆమె కళ్ళలో బెదురు కనిపించింది "ఎవరు మీరు?"
"రంగారావుకూ మీకూ వున్న ఫారిన్ సెంట్ వ్యవహారం గురించి తెలిసినవాణ్ణి...."
ఆమె దాదాపు వణికిపోయింది "మీరేమంటున్నారో నాకు తెలియడంలేదు" అంది.
"అర్ధమయ్యేలా చెబుతాను నన్ను లోపలకు రానిస్తే ఇది బొత్తిగా గుమ్మందగ్గర మాట్లాడే విషయంకాదు. మీరు వీధితలుపులు తీసేవుంచండి-అక్కడ అలా కూర్చుని మాట్లాడుకోవచ్చ్జు" అన్నాడు వెంకన్న.
ఇద్దరూ హాల్లోకి వెళ్ళి చెరో కుర్చీలోనూ కూర్చున్నారు.
"మీరు నా దగ్గర ఏం దాచినా ప్రయోజనం లేదు. నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి రాలేదు. నేను రంగారావు హత్య కేసు గురించి పరిశోధిస్తూ యిలా వచ్చాను. ఆ హత్య గురించి మీ వద్దనుంచి పనికివచ్చే విషయాలేమైనా తెలుస్తాయని నా ఆశ!" అన్నాడు వెంకన్న.
"ఎవరు మీరు?"
"డిటెక్టివ్ ను పేరు వెంకన్న!"
ఆమె కాస్త తేలిగ్గా నిట్టూర్చింది "మీ రడిగిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ జవాబిస్తాను. నన్ను నలుగురి నోళ్ళలోనూ పడకుండా చేయండి" అందామె.
వనజలాగే నీరజ కూడా రంగారావుకు లొంగిపోయింది. రంగారావంటే నీరజకు అసహ్యం లేదు కానీ ఆమె భర్తను ప్రాణాధికంగా ప్రేమిస్తోంది. భర్తను మోసం చేయివలసివచ్చినందుకామెకు యెంతో బాధగా వుంది. రంగారావుతో ఆమె యెప్పుడూ హోటళ్ళకు వెళ్ళడం జరగలేదు. రంగారావు చనిపోయాడని తెలిసి ఆమె ఎతో సంతోషించింది. జరిగినదేదో జరిగిపోయింది. ఇక ముందైనా నీతిగా బ్రతకవచ్చినని ఆమె అనుకుంటోంది.
వెంకన్నకు ఆమె దగ్గర్నుంచి అంతకుమించిన సమాచారం రాలేదు. ఆమె జవాబులు చెప్పిన పద్ధతినిబట్టి ఆమె నిజమే చెబుతోందని అతననుకున్నాడు.
తర్వాత వెంకన్న వసంతనూ, గౌరినీ కలుసుకున్నాడు. ఇద్దరూ కూడా తమ నేరాలను ఒప్పుకున్నారు. రంగారావు మరణం వారికి చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇద్దరూ కూడా తమ భర్తలను మనసారా ప్రేమిస్తున్నారు. వాళ్ళూ రంగారావుతో హోటళ్ళకు వెళ్ళలేదు.
కథ ముందుకు వెడుతున్నకొద్దీ వెంకన్నకు ఆశ్చర్యం కలుగుతోంది. సరిత తనకు యిచ్చిన అడ్రసులు సరైనవి కాదేమోనని అతననుమానించాడు కానీ ఆమె సరైనవే యిచ్చింది. ఎటొచ్చీ తను కలుసుకున్న ముగ్గురి దగ్గర్నుంచీ తను తెలుసుకున్న విషయాన్ని బలపరిచే సమాచారమైతే దొరికింది తప్పితే కొత్త సమాచారమేదీ దొరకలేదు. ఏదైనా లభిస్తే ఆఖరుమనిషి పద్మదగ్గరే లభించాలి.
వెంకన్న పద్మ దగ్గరకు వెళ్ళాడు. మిగతా ముగ్గురి మీదా ఈమె యింకా యెక్కువ అందంగా వుంది. రంగారావు అభిరుచిని అభినందించక తప్పదు అనుకున్నాడు వెంకన్న.
"మా వారింట్లో లేరు" అంది పద్మ.
"నాకు మీ తోనే పని!" అన్నాడు వెంకన్న.
"ఎవరు మీరు?"
"నా పేరు వెంకన్న. డిటెక్టివ్ ను."
ఆమెకాస్త కంగారుపడి "డిటెక్టివ్ లకు నాతో పనేమిటి?" అంది.
"రంగారావు హత్యకేసు విషయంలో పరిశోధిస్తూ ఇలా వచ్చాను."
భయం పద్మ కళ్ళలో స్పష్టంగా కనబడింది "రంగారావు హత్యకూ నాకూ ఏమిటి సంబంధం?"
"ఫారిన్ సెంటు!" అన్నాడు వెంకన్న.
పద్మ ఉలిక్కిపడి "లోపలకు రండి!" అంది.
ఇద్దరూ కుర్చీలో కూర్చున్నాక వెంకన్న నెమ్మదిగా "రంగారావు గురించి మీకు తెలిసినదంతా చెప్పేయండి. తాళికట్టిన భార్య కాకపోయినా మీరాయనకు భార్యలా వ్యవహరింహినట్లు నా దగ్గర రుజువులున్నాయి" అన్నాడు.
పద్మ ముఖం ఎర్రగా అయింది "మీరేమంటున్నారో నాకు తెలియడంలేదు" అంది.
"ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రంగారావుకీ మీకూ అక్రమ సంబంధం వుంది-" అన్నాడు వెంకన్న తాపీగా.
పద్మ కిలకిలా నవ్వి-"చాలా మంచి జోకు. ఇంకా ఏమైనా చెప్పాలా?" అంది.
