Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 23


    ముత్యాల్రావు ఇన్ లాండ్ లెటర్ కొన్నాడు. మామగారికి ఉత్తరం వ్రాశాడు.
    "పూజ్యనీయులగు మామగార్కి నమస్కారములు
    అనుకోకుండా నేను ఊరు వదిలి వెడుతున్నాను. మీ అమ్మాయి తానొక్కర్తీ ఉండలేనన్నది. అందుకని ఈ రోజు రాత్రి ట్రయిన్ కు మీ యింటికి బయల్దేరి వస్తుంది.
    నేను తిరిగి ఎప్పుడు వచ్చేదీ సరిగ్గా తెలియదు. బహుశా నెలరోజులు పట్టవచ్చును. రాగానే మీకుత్తరం వ్రాస్తాను. విషయం తెలియబర్చడం కోసం ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. అత్తయ్య గార్కి నమస్కారము లందజేయండి. అందర్నీ అడిగినట్లు చెప్పండి.
                                                                                          మీ అల్లుడు
                                                                                          ముత్యాల్రావు-"
    అడ్రసు వ్రాసి ఉత్తరం పోస్టుచేశాడు.
    ఈ ఉత్తరం కారణంగా ఆమె గురించి తనకింకేమీ తెలియనట్లే అంతా భావిస్తారు. తను ఆమె శవాన్ని ముక్కలుచేసి కూడా తీసుకుని వెళ్ళి వివిధ ప్రాంతాల్లో పారేస్తాడు.
    ఈ ఆలోచనలు ముత్యాల్రావుని వణికింపజేస్తున్నాయి. అడుగుపడడం కష్టంగా ఉన్నదతడికి. ఆ విధంగా ఇల్లు చేరేసరికి ఆలస్యమయింది.
    తలుపులతడెలా వేశాడో అలాగే ఉన్నాయి. ఇరుగు పొరుగుల్లో హడావుడి ఏమీలేదు. అంటే ఎవరికీ ఇంత వరకూ ఏమీ తెలియలేదన్న మాట! ముత్యాల్రావు తేలికగా నిట్టూర్చాడు.
    తనిప్పుడేం చేయాలి?
    ముందు శవాన్ని ముక్కలుచేయాలి. అందుకు కత్తినో కత్తిపీటనొ ఉపయోగించాలి. ఈ ఆలోచనకు అతడి అణువణువూ వణికింది. కానీ తప్పుచేశాక ధైర్యం వహించక తప్పదు.
    వంటింట్లో పనసకాయ కత్తి ఒకటి మంచి పదును మీద ఉన్నది. ఆ కత్తి పౌరుషంకొద్దీ శైలజ కొన్నది. పనసకాయ కొని-కొట్టించడం కోసం పొరుగింట్లో అడిగిందామె. అప్పుడు పొరుగింటావిడ-"మావద్ద కత్తి ఉన్నది. కానీ ఎరువు ఇవ్వం-" అని ఖచ్చితంగా చెప్పేసింది. పంతంవచ్చి శైలజ అప్పటికప్పుడు బజార్నించి కత్తిని తెప్పించింది.
    ఆ రోజు పనసకాయ....ఈ రోజు శైలజ.
    
                                       8

    ముత్యాల్రావు వంటింట్లోకి నడిచాడు. ఆ కత్తి ఎక్కడ ఉన్నదీ అతడికి తెలుసు. అటే నడిచాడు.
    నాలుగడుగులు అటు వేశాడో లేదో ముత్యాల్రావు కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా గోడకు ఆనుకుని శైలజ నిలబడి ఉన్నది.
    ముత్యాల్రావు అరవబోయాడు. కానీ తమాయించుకున్నాడు. ఆమె శైలజ కాదు. అది శవం! కళ్ళు తెరిచి వున్నాయి. రెప్ప వాలడంలేదు.
    అయితే ఆ శవం బెడ్రూంలో ఉండాలి. ఇక్కడ కెలా వచ్చింది? శవం నడిచి వచ్చిందా-.....లేక.....
    ముత్యాల్రావు ఒక్క పరుగున బెడ్రూంలోకి వెళ్ళాడు. బెడ్రూంలో శైలజ శవంలేదు. అతడికి ముచ్చెమట్లు పోశాయి.
    ఎలా జరిగిందీ విచిత్రం?
    శైలజ చనిపోలేదా?
    కానీ.....తనామెను పీకపిసికి చంపినమాట నిజం. ఆమె చనిపోయిన మాట కూడా నిజం. వంటింట్లో నిలబడి ఉన్న శైలజ శవంలా ఉన్నది తప్పితే జీవంలేదు. మరి......ఆ శవం ఇక్కన్నించి అక్కడకు ఎలా వెళ్ళింది?
    ముత్యాల్రావుకు భయంతో చెమటలు ధారాపాతంగా కారసాగాయి. అతడు మళ్ళీ వంటింటివైపు నడిచాడు. కానీ సగం నడిచేక అతడికి భయం వేసింది. శైలజ శవాన్ని చూడాలంటేనే అతడికి భయంగా ఉన్నది. అతడి మనసు కీడును శంకిస్తున్నది.
    ముత్యాల్రావు ముందు బాత్రూంలోకి వెళ్ళి రావాలనుకున్నాడు.
    అప్రయత్నంగానే అతడు బాత్రూంలో ప్రవేశించాడు.
    ఎదురుగా గోడకు అనుకుని శైలజ శవం!
    కెవ్వుమన్నాడు ముత్యాల్రావు. అలా అరిచేక తనకేక ఎవరైనా వింటారేమోనని భయం వేసింది. చటుక్కున వీధిలోకి వెళ్ళి చూశాడు. యెవ్వరూ లేరు.
    ఓసారి తేలికగా నిట్టూర్చాడు.
    ఏమిటీ విచిత్రం? శవం ఇల్లంతా ఎలా తిరుగుతోంది? శైలజ చచ్చికూడా తన్ను సాధించదల్చుకుందా?
    ముత్యాల్రావు మళ్ళీ బాత్రూంలోకి వచ్చాడు. ఈ పర్యాయం అతడికక్కడ శైలజ కనబడలేదు. తడబడుతూనే అతడు లోపలకు నడిచాడు. శవం కనబడలేదు.
    ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించాలి-అని అనుకున్నాడతను. మళ్ళీ బెడ్రూంలోకి నడిచాడు.
    బెడ్రూంలో మంచంమీద వెల్లకితలా పడివున్నది శైలజ శవం. తనెలా పడుకోబెట్టాడో-అలాగే వున్నదా శవం!
    'ఇప్పటికి నా మనసు స్థిమితపడింది-' అనుకున్నాడు ముత్యాల్రావు.
    జీవితంలో తొలిసారిగా అదీ అనుకోకుండా హత్యచేశాడతను. ఆ కారణంగా కలిగిన భయంలో మనసు అనేక రకాల భ్రమలకు లోనయింది. అందువల్లనే ఆమె బెడ్రూంలో లేనట్లూ-బాత్రూంలోనూ, వంటింట్లోనూ ఉన్నట్లూ తనకు అనిపించింది.
    అదంతా భ్రమ!
    అతడు శవాన్ని సమీపించాడు.
    శైలజ నిర్జీవంగా పడివున్నది. ఆమె చాలా మంచిది. తనను ప్రేమించింది. కానీ అవన్నీ తల్చుకుందు కిప్పుడు టైము లేదు. ఆమె తన్ను ప్రేమించినప్పటికీ, మంచిదే అయినప్పటికీ-తన్ను బాగా రెచ్చగొట్టింది. హత్యకు ప్రోత్సహించింది. అది శైలజ తప్పుకాని పక్షంలో తన వంటి సామాన్యుడు ఒక నిండు ప్రాణం తీయగలడా?
    ముత్యాల్రావు ఆమె కనురెప్పల్ని మూయడానికి వంగాడు. సరిగ్గా అప్పుడు అతడి భుజంమీద ఎవరిదో చేయిపడింది,
    ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు ముత్యాల్రావు. తర్వాత నెమ్మదిగా వెనక్కు తిరిగాడు.
    
                                        9

    "మొత్తానికి నువ్వు నీ భార్యను చంపేశావన్నమాట" అన్నాడు కిషోర్.
    "లేదు.....నేను చంపలేదు-...." అన్నాడు ముత్యాల్రావు.
    "నువ్వు కాకపోతే ఇంకెవరు చంపుతారు?" అన్నాడు కిషోర్.
    "నువ్వు నా భార్య కారణంగా నీకు అయిదు లక్షలు వచ్చింది. యెలాగో మోసంచేసి ఆస్తి నీ పేరుమీదకు మార్పించగలిగావు. ఆ తర్వాత ఆమెవల్ల నీకు ప్రమాద ముంటుందనిపించింది చంపేశావు" అన్నాడు ముత్యాల్రావు.
    "నీ కథనం బాగుంది. కానీ ఋజువుండాలికదా!"
    "ఉంది-" అన్నాడు ముత్యాల్రావు.
    "ఆ ఋజువు ప్రకారం కూడా నువ్వే హంతకుడి వౌతావు..."
    "ఎలా?"
    "నీ భార్య నీ కోరిక ప్రకారం ఈ రోజే మొత్తం ఆస్తినంతా నీ పేరుకు మార్చేసింది. నీ సంతకాలు రేపు తీసుకునే ఏర్పాటు జరిగింది-" అన్నాడు కిషోర్.
    "ఏమిటీ?"
    "నీ భార్య శైలజ నిన్ను మనసారా ప్రేమించింది. నీకోసం ఏమైనా చేయడానికి సిద్దపడింది. నువ్వు తన్ను అలక్ష్యం చేస్తూంటే ఆ లోపం తనదే ననుకునేది. నిన్నెలాగైనా తనవాన్ని చేసుకోవాలని తాపత్రయపడింది. అందుకు కారణం నువ్వు మహా ప్రేమ పురుషుడివనీ కాదు, అపూర్వ లక్షణాలున్న వాడివనీ కాదు, జస్ట్ లవ్ - అంతే! లవ్వీజ్ బ్లైండ్ అంటారు చూశావా-అదే జరిగిందామె విషయంలో!"
    "ఇంతకీ నువ్వెవరు?" అన్నాడు ముత్యాల్రావు.
    "నేనొక ప్రయివేట్ డిటెక్టివును. ఆమె నీమీద నిఘా వేయడం కోసం నన్ను రప్పించింది. నీ తప్పు లెంచడంకోసం కాదు ఆమె నన్ను నియమించుత! నీ అమాయకత్వాన్ని దుర్మార్గులెవరైనా ఉపయోగించుకుని నిన్ను కష్టాలపాలు చేస్తారేమోనన్న భయంతో! ఆమెకు నీ గురించి అన్నీ తెలుసు-ఆఖరికి నువ్వియ్యబోయిన స్లో పాయిజన్ గురించి కూడా!" అన్నాడు కిషోర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS