Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 24


    ఆమె లలిత శిరసుపై చేయి వేసింది.
    లలిత అపనతి శిరస్కయె కళ్ళు వత్తుకుంది.
    "ఒకసారి భోజనానికి రావాలి. క్రొత్తగుడ్డ కట్టి వెళ్ళాలి...ఈ కోరిక నిరాకరించకమ్మా అంది.
    "అలాగే.... ఇక వెళ్ళొస్తాము" అంటూ ఇద్దరూ సరళ ఇంటికి బయలుదేరారు.
    "మీ మనసెలావుంది?" భార్య ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు. వారిద్దరు వెళ్ళిన దిక్కుగాచూస్తూ పరధ్యానంగా వున్నాడు.
    "చాల తృప్తిగా- నిండుగా వుంది- ఆ డబ్బు కూడా స్వీకరించినట్లైతే ఇంకా ఆనందించేవాడిని."
    "వారిప్రయత్నాలన్నీ ఇంతవరకు సఫలమైనే భవిష్యత్కాలంలో కూడా వారి జీవితాలు- వారివారి దృక్పథాలలో సఫలం కావాలని కోరుతున్నాను."
    "ఒక్క మాటడుగుతాను- నీ మనసులోని మాట చెప్పాలి-" భార్య కళ్ళల్లో చూస్తూ అడిగాడు.    
    ఆమె నవ్వింది- "బలే పరీక్ష....మీ దగ్గర దాపరికమా?"
    "మరి..... లలితకు అన్నివస్తువులు పెట్టారు.... ప్రేమకు పుస్తె నానుత్రాడు-వజ్రపుటుంగరం తప్ప మరేమీ ఇవ్వలేదే! నీకెలా వుంది?"
    ఆమె నవ్వింది- ఆ నవ్వు పన్నీటిజల్లులా వుంది......" మన ప్రేమ కేమిలేదు? ఉండవలసిన నగలన్నీ ఇచ్చాము..... ఇంకా కావాలన్నా కొనటానికి సిద్ధంగా వున్నాము, అన్నీ వుండగా వాళ్ళివ్వవలసిన ఆవశ్యకత లేదు.... మనం ఆశించలేదుకూడ....లలిత పాపం ఏమీ తెచ్చుకుని వుండదు. ఐరావతమ్మ బాగా ఆలోచించి చేసింది. ప్రేమ అంత అడంబరంగా వుంటే చిన్నకోడలికి యిప్పుడు కాకపోయినా మరొకప్పటికైనా బాధ అనండి- అసూయ అనండి- కలక్కమానదు. వారి సమీక్షాకరిత్వాన్ని మెచ్చుకుని తీరవలసిందే"
    భార్యవైపు మందహాసంచేస్తూ చూస్తూండిపోయాడు రామారావు.
    క్రొత్తజంట సరళ ఇంటికెళ్తే ఎదురుగా తాళం కప్ప వెక్కిరించింది, "లలితా తాళం పగలగొట్టి లోపలికెళ్దామా?" అన్నాడు దాన్ని పట్టించుకోలేదు లలిత. "ఒకవేళ మనింటికెళ్ళిందేమో?"
    "మీ ఇల్లెక్కడ?"
    "ఉందిలెండి- సరేం.... నాలిక కరచుకుని పకాల్న నవ్వింది.
    "ఆ.... పేరుపెట్టి పిలవటం ప్రారంభించావూ? అమ్మతో చేస్తానుండు.'
    "అబద్దాలకు పుట్టినిల్లు'
    "ఆడపిల్లలు పుట్టాలి. వాళ్ళు నీ అంత అందంగా వుండాలి"
    సరాల కనబడలేదన్న విచారం అలా తేలిపోయింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. సాయంత్రం దాకా ఏదో మాట్లాడుకుని ఆ మాటే మరచారు. ఈలోగా ఐరావతమ్మ వచ్చి శంభూ అల్లరి చేస్తాడు వాడినేమీ అనవద్దు తెచ్చి తనకు వప్పచెప్పమని వెళ్ళింది. సాయంత్రం చల్లగా ఉంది. ఏకాంతం ప్రలోభ పరుస్తోంది.
    తల్లి కనుమరుగైన మరుక్షణం తలుపు గడియవేసి మంచంమీద పడుకుని దిండును కావిలించుకున్నాడు నరేన్. "లలితా!" అని నెమ్మదిగా పిల్చాడు. ఆమె రాలేదు! మళ్ళీ పిల్చాడు! ఆమె చిరునవ్వుతో అటుతిరిగి పోయింది.
    ఆమె తనవైపు చూచేలాలేదు. టీపాయ్ మీద వేజ్ లో వున్న పువ్వు నొకదాన్ని తీసుకొని ఆమెమీదికి విసిరేశాడు. అదివెళ్ళి ముఖాన్ని తాకుతూ క్రిందపడగానే లలిత బెదిరిపోతూ చూచింది. నరేన్ వేపు కోపంగా చూచింది.
    "అలా చూడొద్దని లక్షసార్లు చెప్పాను అంటూ లేచి ఆమెను లాక్కెళ్ళి ప్రక్కనే కూచున్నాడు. కిటికీలోంచి లేతఎండ గదిలో పడ్తోంది. కిరణాలు కొన్ని ఆమె వెంట్రుకలను సోకి బంగారుమయం చేస్తున్నాయి. కిటికీకి దగ్గరగా వున్న బోగన్ విలా పుష్పాలు పిల్లగాలికి సుతారంగా అల్లల్లాడుతున్నాడు. దుద్దులలోని ఎర్రరాయి మెరుస్తూ సన్నటి కాంతిని చెంపమీద వెదజల్లుతుంది. రేగిన ముంగురులు అవిరామంగా వింజామరలు వీస్తున్నాయి...
    లలితా అంటూ దగ్గరగా తీసుకున్నాడు. రెండేళ్ళనాడు నిన్ను చూచిన దగ్గర్నుంచీ ఈ క్షణంకోసం ఎదురుచూస్తున్నాను."
    "ఎక్కడచూచారు?"
    "సరళ ఇంట్లో - మా యింట్లో - మీ ఇంట్లోచూచాను... బహుశః నీవు నన్ను నిరంజన్ అనుకునివుంటావు నేను ఎక్కవసేపు లేనుకూడా"
    "ఔను అంత పరిశీలనగా చూడముకదా..... తెలిసినట్లైతే..." ఆమె అసంపూర్ణంగా ఆపేసింది.
    "ఊ తెలిసినట్లైతే!" జవాబు చెప్పమన్నట్లు కళ్ళలో కళ్ళుపెట్టి చూచాడు.
    లలిత నవ్వింది. వేయిమల్లెలు ఒక్కసారి వికశించినై. నల్లటి మేఘాలనువదలి చంద్రబింబం ఒక్కసారి బహిర్గతమై వెన్నెల వెదజల్లి నట్లుంది.

                                   25

    మర్నాడు సరళ కోసం బయల్దేరాడు నిరంజన్. ఇల్లు తాళం పెట్టి వుంది. కాసేపు వరాండాలో అటూ యిటూ పచార్లు చేసి ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ మెట్లు దిగుతూ వుంటే సరళ ఎదురొచ్చింది. నిరంజన్ ఆమె ముఖంలోని అలసట. నిస్పృహ గమనించి ఏం జరిగిందోనని బెంగ టిల్లి పోయాడు. గబగబ మెట్లు దిగి ఎదురు వెళ్ళి భుజంమీద నిద్ర పోతున్న మేనల్లుణ్ణి అందుకున్నాడు.
    "ఎక్కడికి వెళ్ళావమ్మా"
    సరళ నిట్టూర్పు విడిచింది.
    పైట కొంగున తాళంచెవి తీసి గొళ్ళేనికి వేల బడుతున్న కప్పతెరచింది. పిల్లాడ్ని అందుకో బోయినట్టు చేతులు జాపింది. నిరంజన్ "పర్వాలేదు పద అని ఆమె వెనుకే లోపలికి వచ్చాడు.
    "నిన్న నరేన్ పెండ్లికి -
    సరళ అలసటనంతా ప్రదర్శిస్తూ సోఫాలో విసుగ్గా చతికిల బడింది. ఏదో జరిగి వుంటుందని ఆందోళన పడ్డాడు నిరంజన్.
    "ఏం జరిగింది సరళ-" అని నిస్సహాయంగా మొహం పెట్టాడు నిరంజన్.
    కుడిచేతి బొటనవ్రేలు, చూపుడువెలు కణతలమీద నొక్కుకుంది సరళ "ఈ దుర్గతో పెద్ద చిక్కువచ్చి పడిందన్నయ్యా అన్నది.
    "దుర్గ క్షేమమా?"
    "ఆ....క్షేమమే ఇదిచూడు"అంటూ లోపలికి వెళ్ళి ఓ కవరు తెచ్చింది. అది దుర్గ సరళకు వ్రాసిన ఉత్తరం.... లేఖ అందిన వెంటనే రమ్మని వ్రాసిందామె! అంతకన్నా కబురూ లేదు.
    "నిన్ననే అందింది. వెంటనే వెళ్లాను"
    "ఏమిటి సంగతి?"
    "దుర్గ హాస్పిటల్ లో వుంది."
    "జబ్బుగా వుందా?....పాపం"
    "జబ్బుగాదు......ప్రాణంమీద విసుగుపుట్టింది..."
    "సరళ.....ఆత్మహత్యా...?"    
    ".....ఆత్మహత్యా ప్రయత్నమే చేసిందిగాని - లేదని ఋజువు అయ్యేలా చేశారు తను..."
    "ఏం జరిగింది?"
    "నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకుంది"
    "ఎందుకు?"
    "దానికి పెద్ద కథవుంది. ఆ కథకు నాంది మనకు తెలుసు....ఇక తరువాతది ఊహించుకోవచ్చు."
    "భోంచేశావా?"
    "లేదు. ఆకలిగా లేదు- వీడికి వళ్ళు వెచ్చగా వుంటే వచ్చేశాను.
    "దుర్గదగ్గర ఎవరున్నారు"
    "మీ బావ కూర్చున్నారు. నర్సులున్నారు.... వాళ్ళ అత్తగారు కూడా వున్నారు."
    "మరికాస్త ఏదైనా తిని వివరంగా చెప్పు" అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. సరళ అలసిపోయి సోఫాలో చేరగిల పడింది. కొడుకు బాగా నిద్రపోతున్నాడు. నాలుగుక్షణాలు కళ్ళుమూసి తెరిచేవరకు డబ్బాతో బిస్కట్లు గ్లాసునిండా హార్లిక్స్ కలుపుకుని తెచ్చాడు నిరంజన్
    సరళ బిస్కట్లు తింటూ నరేన్ లలితల పెళ్ళి వివరాలన్నీ కనుక్కొంది.
    "దుర్గ తల్లిదండ్రులెక్కడున్నారు?" అని అడిగా. నిరంజన్.
    "వాళ్ళు స్వగ్రామానికెళ్ళి నెలరోజులైంది- అంటే పెళ్ళయిన కొన్నాళ్ళకు వెళ్ళిపోయారు."
    "కట్నంతాలూకు సొమ్ము?"    
    "దుర్గ పేరిట బ్యాంక్ లో వుంది."
    "అంతా డబ్బురూపంలో ఇచ్చారా?"
    "లేదు- వాటి కేవేవో తికమకలున్నాయి ఏభై వేలుమాత్రం వున్నాయని దుర్గ చెప్పింది.
    "సరే అసలేం జరిగింది?
    "దుర్గను కాపురానికి పంపేటప్పుడు చాలపేచీలు వచ్చాయి అలక పాన్పుదగ్గర కార్ కావాలన్నాడు సుధాకర్"
    సుధాకర్ పేరువినగానే నిరంజన్ కు కడుపులో దేవినట్లైంది. మోకాళ్ళుపై మోచేతులు ఆనించి చేతులు కట్టుకుని ముందుకు ఆతృతతో వంగాడు. అతనిముఖంలో వృషమైన భావసంచలనాన్ని చూచి సరళ బాధపడింది.
    "అదీ తక్కువ ధరలోకాదు మాంచి ఖరీదైన.... ఇస్తారా ఇవ్వరా అని బేరమాడారు నా కెందుకో- అక్కడ వుండాలనిపించలేదు ఆడబిడ్డకు వేయి న్నూట పదహారులు ఖర్చు చేశారట గాని వాళ్ళకు తృప్తి కల్గలేదట. అలకపాన్పు దగ్గర అల్లుడి కోర్కె కోసం ఐదువేలు కేటాయించారుట అతడేమి అడిగినా దుర్గతల్లి సమ్మతించేలా చేసింది. ఒక్కొక్క పెళ్ళికి ఇంత ఖర్చుచేయగలమా? అన్న ఆలోచన లేకపోయింది. ఈ పెళ్ళయిపోయి పిల్ల సంహోషంగా అత్తారింటికెళ్ళాలనుకున్నారు.
    పదిహేనురోజులక్రిందట- సినిమా తీయాలనుకున్నాను. డబ్బు కావాలని అడిగాడుట సినిమాలంటే మోజేగాని దానికయ్యేఖర్చు చూచే సరికి దుర్గకు భయంవేసిందట ఏం చెయ్యాలో తోచక అత్తగారికి చెప్పిందట. ఆమె ఆమాట కాస్తా మామగారిచెవిలో వేసిందట తండ్రి ఉగ్రస్వరూపుడై ఏమేమి అన్నాడోగాని ఇతను రౌద్రమూ అయి దుర్గను నానా మాటలని చెయ్యిచేసుకున్నాడట ఆమెకు ఏంచేయాలో తోచలేదు. లేఖ వ్రాసి తల్లిదండ్రులకు తెలియజేయమని వ్రాసింది. లేఖకూడా నాకు బలే గమ్మత్తు అందింది. ఉత్తరంరాసిన రెండురోజులకుకూడా ఆమె పోస్ చేయలేకపోయింది. సెన్సారీ కాందే ఉత్తరం బైటికిపోదు! పని మనిషి ఇల్లుతు పటానికొచ్చిందట. అయ్యో- ఉత్తరం పోస్ట్ చేయించమని చినబాబుగారు మొన్నరాత్రి ఇచ్చారు. మర్చిపోయాను.... ఇదిగో ఆ బల్లమీద పెడ్తాను. వేసిరా ఆలసంచేశానని కోపంవస్తుంది ..... ప్చ్- మర్చిపోయాను.... అంటూ ఏదో తనలో తాను కోపగించుకుంటుంటే అది గప్ చిప్ గా వెళ్ళి పోస్ట్ లో పడేసిందట! ఉత్తరం రాగానే దాని వాళ్ళ అమ్మవాళ్ళకు పంపించేద్దామంటే వారి అడ్రస్ తెలీదు! మన పోస్టుమాన్ నడిగి పంపేసరికి నాల్గురోజులయిపోయింది.
    వాళ్ళ నాన్నగారు వెంటనే వచ్చారు. వ్యాపారరీత్యా వచ్చినట్లుగా వచ్చారు. సుధాకర్ ను పనిలో పెట్టమన్నారు అప్పుడుగాని అతడు బాధ్యతా యుతంగా ప్రవర్తించడని హెచ్చరించాడు. విజయవాడ కాలేజీలో ఖాళీ వుందని చెప్పారుట. సుధాకర్ తండ్రి కూడా నానాచివాట్లు పెట్టి ఉద్యోగంలో జేరమన్నాడట. అతనికుద్యోగం చేయటం బొత్తిగా ఇష్టంలేదు. లోపలికివచ్చి దుర్గను తిట్టటం తప్ప ఏమీ ఉపయోగం లేకపోయింది. దుర్గ యిరుకున పడిపోయింది. పిక్చర్ తీయడానికి డబ్బు అడిగాడట. అతని స్నేహితుడు - తను కలిసి తీస్తారుట మరి, దుర్గకు భయంవేసింది. దుర్గ నిజంగా యిస్తే అది తిరిగి రాకపోతే -ఏమిటి గతి? దుర్గకు తెలుసు వాళ్ళనాన్న ఎంత శ్రమపడితే ఇంతడబ్బు కూడ వేయ గల్గాడో.
    దుర్గమామగార్ని అడిగిగాని ఇవ్వనందిట. దాంతో అతనునీచంగా ఇక తనముఖం చూడనని బెదిరించాడు. ఆమెకు నిజంగానే భయంవేసింది ఇస్తే అది రాదు చాలదు. ఇవ్వకపోతే భర్త అనురాగానికి దూరం అయిపోతుంది.... ఆలోచించుకొని చేస్తానన్నదిట......అతడు జేబులోంచి నిద్రమాత్రల సీసా బైటికి తీసి - డబ్బిస్తే సీసాను దిబ్బలో పారేయ్. ఇవ్వకపోతే నోట్లో వేసుకో. అని వెళ్ళిపోయాడట. దుర్గకి ఇది తెగని సమస్య అయిపోయిందిట డబ్బుమాత్రం ఇవ్వకు తల్లీ - అంటారేగాని భర్తనే విధంగా అదుపులోకి తెచ్చేది మాత్రం వాళ్ళకు దురూహ్యంగానే ఉండిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS