అరటి ఆకు వేసి మూడు ఇడ్లీలు ఎట్టింది తల్లి. "నెయ్యి అయిపోయింది తల్లీ కారప్పొడి వేయనా-పచ్చడి వేయమంటావా! అని ఆప్యాయంగా అడిగిందామె ఇడ్లీ వేడికి అరటాకు కమిలిపోయింది. తన కబురు విని తల్లి హృదయం ఒక్కసారి ఇలాగే లేత ఆకువలె కమిలిపోదు కదా! బలవంతాన ముగించి లేచి ఆకు తీసుకుని వెళ్ళిపోయింది కూతురి ప్రవర్తన వింతగా తోచిందామెకు. కూరగాయలు ముందేసుకుని కూచుంది. పరధ్యానంగా తరుగుతూ అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఆ వేపుగా వచ్చే పిల్లల్ని గద్ధిస్తూంది.
తల వంచుకుని తరుగుతున్న ఆమె దృష్టికి ఎర్రని పరిగంచు పట్టు చీర కనబడటంతో గబుక్కున తరగటం ఆపుజేసి నెమ్మదిగా దృష్టిపైకి సారించింది.
"ఎక్కడికే లలితా ఆ చీర కట్టావు?" చిరాగ్గా అరచింది. తెల్ల వారితే షికార్లు.....ఏ ఉద్యోగ ప్రయత్నాలు చేయనవసరం లేదు. ఆ చేసే దేదో ఆయన జేస్తారులే చేతులు గిన్నెలో ముంచి కడుక్కుని విసురుగా లేచి నిలబడింది. అడ్డంగా వున్న కత్తిపీటను అరుగుమీద పెట్టి ఇటువైపు తిరిగేసరికి లలిత ఆమె పాదాలను స్పృశించి ఒక్కడుగు వెనక్కువేసి నిలబడింది. ఆమె హృదయం భగ్గుమంది.
"ఎక్కడికే.? ఇదేమిటీ పని?"
గీత చర చర వచ్చి ఇద్దరికీ కొంతదూరంలో ఆగిపోయింది. తల్లి వేపు నిశితంగా చూచి మెల్లగా అంది "అమ్మా - లలిత తన ఇంటికి వెళ్తోంది.... ఇక ఇక్కడికి రాదు.....మాతృమూర్తిని-ఆశీర్వదించి పంపు-ఆమె రెండు చేతులు హృదయంమీద వేసుకుంది. హృదయాన్ని పిండుతున్నట్లు చేతులను నలుపుకుంది. ముఖమంతా విచారరేఖలతో వికృతంగా నిశిపులిమినట్లు తేజో విహీనమైంది. ఆమె మాట్లాడటం లేదు. ఉద్వేగంతో ఎత్తుగా లేస్తున్న హృదయంలోని దావానలం ప్రేలుతుందేమో నన్నంతగా చలించిపోయింది, ఆమె ఏమంటుందోనని ఆత్రంగా బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఆమె తలపట్టుకుని అరుగునానుకుని చేరబడింది!
పుష్ప పరుగెత్తుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంది.
"అమ్మా- అమ్మా-మాట్లాడవే!" అని అరచింది పుష్ప. "ఇలాంటి సమయంలో ఉదాసీనం తగదమ్మా-నీ కూతురు సౌభాగ్యవతిగా వర్ధిల్లా లని ఆశీర్వదించవూ?"
ఆమె పుష్పను పట్టుకుని బావురుమంది.
గీత దగ్గరగా వెళ్ళింది "దాని ముఖం చూడు ఎంత దిగులుగా వుందో. తనకీ విచారం లేదంటావా? ఈ బంధాలన్నీ తెగత్రెంపులు చేసుకోటం సులభం అనుకున్నావా? ఎటూ తేల్చుకోలేక ఆమె హృదయంలోని దడ ఎవరి కర్ధమౌతుంది. నువ్వు నాన్న ఒకే వైపు ఆలోచిస్తారు గాని ఎదుటి పక్షాన గూర్చి తలంచరు."
"గీతా- గీతా ఏమిటమ్మా నాకీ రంపపు కోత.... దాన్ని ఈ పని. చెయ్యకుండా ఆపలేవా తల్లీ"
"లేదమ్మా. లలితకు మైనారిటీ తీరింది. ఆమెను ఆపుజేయగల హక్కు మనకు లేదు."
"ఇది జరిగి తీరవలసిందేనా?
"తప్పేముంది. దారినిపోయే ఎవడినో కాదమ్మా చేసుకునేది- ఎవరికి ఏ విధమైన నష్టం కలుగదు- ఏ అవమానం కలుగదు. తక్కువ కులం వాడితో లేచిపోవటం లేదు.... కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని మీకు లేదు. కాబట్టి ఆ తతంగం లేని పెళ్ళి చేసుకుంటోంది. దానికింత రాద్దాంతం దేనికి ఎవరు ఏడ్చినా లాభంలేదు.... అమ్మని కనుక కష్టంగా వుంది నీకు. అయినా తప్పదు. హృదయం త్యాగభరితమైంది....లలితను మనస్పూర్తిగా ఆశీర్వదించు...ఆలస్యమైపోతుంది. గీత బోధ పర్చింది.
"ఎక్కడికే, ఈ ప్రయాణం? తిన్నగా వారి యింటికైనా?"
"కాదమ్మా. రిజిస్టేషన్ ఆఫీసుకు."
"ఎవరెవరు వెళ్తున్నారు?"
"ప్రేమ. నేను పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు.
"ఏం..... వాళ్ళమ్మా- నాన్నా."
"వాళ్ళేమీ జోక్యం కల్గించుకోవటంలే"....కొడుకు చేసుకుంటానంటే వద్దు అనటానికి వాళ్ళకు కారణాలేవీ కనబడలేదు కానీ పెళ్ళికి హాజరు కావటాని కిష్టం లేనట్లుంది..... ఏమో... మరి"
"ఐతే వీళ్ళిద్దరూ ఎక్కడుంటారు?"
"ప్రేమ వాళ్ళున్న దగ్గర"
"అంటే?"
"సగం భాగంలో ప్రేమ వాళ్ళుంటారు. మిగతా సగం బాగంలో వీళ్ళుంటారుట"
"నీకు చాల సంగతులు తెలుసే గీతా!" వెగటుగా అందామె.
"ఔను, ప్రేమ నాకు అన్నీ చెప్పింది."
"ఔనౌను. ఆ ప్రేమకిక పనేముంది?.... నా కెందుకులే తల్లీ ఎవరినో అనటం దేనికి..... మా బంగారం మంచిదికాదు.... అంతే"
"అమ్మా ఆలస్యమైపోతోంది. హెచ్చరించింది గీత.
"నాన్నగారేరీ.....వారొస్తే ఏం చెప్పమన్నారర్రా" ఆమె కంఠం జీరబోయింది. ముఖాన్ని కొంగులో దాచుకుంది. "ఆడ....పిల్ల.....ల్ని....క.....న్నం.....దుకు శిక్ష ప్రభో" అంటూ బిగ్గరగా ఏడవటం మొదలెట్టింది.
లలిత, గీత పుష్పరేఖ ఒకరినొకరు చూచుకున్నారు. ఎవరి ఆలోచనల్లో వారు సతమతమౌతున్నారు. తల్లిని ఆ విధంగా చూస్తున్న లలిత భీరువైపోయింది. దుఃఖం పట్టలేక తల్లి దగ్గరకు పరుగెత్తి గట్టిగా కౌగలించుకుంది.
"అమ్మా అమ్మా."
"ఎందుకు....? అన్నీ తెగత్రెంపులు చేసుకుని వెళ్తున్ననీకు నా ఆశీర్వచనం దేనికి? వెళ్ళు తల్లీ క్షేమంగా వెళ్ళు. నాకుండేది ఇద్దరే ఆడపిల్లలనుకుంటాను."
గీత లలిత చేయినందుకుంది "ఇకరా లలితా- అమ్మ నిన్ను విడువదు. ఇలాంటి సమయంలో కన్నీరు పెట్టరాదు" అంటూ మందలించింది. లలిత తల్లిని వదలి దూరంగా వచ్చింది. ఆమె ఆ గదివిడిచి గబగబ అడుగు లేస్తూ వెళ్ళిపోయింది. పుష్ప దగ్గరగా వచ్చి చెల్లి కన్నీరు ఆప్యాయంగా తుడిచి వెంట్రుకలు ముఖంమీద పడ్తుండే సర్దింది. ఆమె చెక్కిలిని నిమురుతూ ఏదో చెబుతోంది చటుక్కున ఏదో స్ఫురించటంతో తన మెడలోని ఒంటిపేట గొలుసుతీసి లలిత బోసి మెడలో వేసింది.
"ఈ గాజులుకూడా వేసుకో. మరీ ఏమీలేని బికారిలావెళ్తే మంచిది కాదు"
వద్దక్కా- ఈ మట్టిగాజులు చాలు"
"వద్దమ్మా- నాకెందుకు? పాపపెళ్ళికి-అప్పుడు- బ్రతికి బాగుంటే చూస్తానుగా - నువ్వు దానికిద్దూగాని
"అక్కా వెళ్ళొస్తాను. నాన్నగార్ని ఎలా సర్దిచెప్పారో.
ఆమె నవ్వింది. "మరేమీ భయపడకు - ఏదో చెబుతాంలే....అన్నట్లు ఏమేమి తీసుకెళ్తున్నావు?" "నా గుడ్డలు తప్ప ఏమీ తీసుకెళ్ళటం లేదు. దుద్దులు, గొలుసు, గాజులు నా పెట్టెలోనే వున్నాయి. నాన్నగార్కి చెప్పండి. డిగ్రీకూడా వుంచేవెళ్దునుగానీ వాళ్ళకది పనికిరాదు అంటూ అంత బాధలోనూ నవ్వింది.
"అన్నీ వదిలి వెళ్ళిపోతున్నావా తల్లీ" అని గభాలున లేచింది తల్లి. త్వరగా కళ్ళనీళ్ళు తుడుచుకుని "నీ దుద్ధులూ గొలుసూ గాజులూ ఇక్కడ వుంచేయమని ఎవరన్నారమ్మా." అని లలితను ప్రేమతో కౌగిలించుకొని "అన్నిపట్టుకెళ్ళమ్మా. కన్నెతొడుగు వదిలేసి వెళ్ళడం అమంగళం" అన్నది ఆ ఒక్కక్షణం దుఃఖానికి అతీతురాలైంది.
"ఎంతైనా తల్లికదా" అన్నట్లు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూచుకొన్నారు పిల్లలు ముగ్గురూ.
* * *
24
అప్పుడే భోజనం ముగించుకుని విశ్రాంతిగా కూచున్న శ్రీనివాసరావు దంపతులు ఈ వేళప్పుడెవరొస్తారా? అని ఆశ్చర్యపడ్తున్న సమయంలో రతీ మన్మథుల్లా నరేన్-లలితలు గుమ్మంలో అడుగుపెట్టారు.
వారిద్దర్నిచూచి నిర్ఘాంతపోయారు - ఆమె తమాయించుకుని. "ఆగండి" అంటూ లోపలికి హడావిడిగా వెళ్ళింది. ఎర్రనీళ్ళు తెచ్చి దృష్టితీసి సాదరంగా ఆహ్వానించింది.
"ఎప్పుడైంది పెళ్ళి" శ్రీనివాసరావు ప్రశ్నించాడు.
పదిన్నరకు"
"ఎవరెవరు అతీథులు?"
"వాళ్లిద్దరు గీత"
"గుడ్....నిముషాల్లో అయిపోయిందన్నమాట!"
"నిమిషాలుగూడా సహించరాని వయ్యాయి" అని నరేంద్ర అంటుంటే లలిత సిగ్గుతో ముచ్చటగా ముడుచుకుపోయింది.
"మీ ఇంట్లో తెలుసా లలితా?" ఆమె అడిగింది.
"తెలుసు అందరికీ చెప్పివచ్చాను-నాన్న మాత్రం లేరు"
"ఏమిటో తల్లీ-మేమంతా పిరికివాళ్ళం-భయస్తులం."
"ఇల్లు సిద్ధంగా వుందా? ఎన్నాళ్ళు సెలవు?"
"ఎన్నాళ్ళు ? మొన్ననే కదండీ జాయిన్ అయ్యాను, పెళ్ళంటే సెలవిచ్చారు. ఆ ఆఫీసరుకు పెళ్ళిమజా తెలిసుండాలి. లేకపోతే ఇవ్వడు."
రామారావుగారు కడుపుబ్బ నవ్వేరు.
భార్యా భర్తలు పరస్పరం చూచుకుని లోపలి కెళ్ళారు. భార్యకేసి నిశ్చలంతో చూచి "ఆ వాడి చూపులకు తట్టుకోలేకుండా వున్నాను లలితా!" అన్నాడు నరేన్.
ఆలిత కళ్ళు వాల్చేసుకుంది.
"ఇక్కడికి నవ్వేప్పుడు రాలేదు కదూ?"
"వచ్చాను"
"ఆ బీరువా చాటున ఉన్న తొట్టిలో పూలు చూచావా?"
"ఉహు లేదు" అంది ఆ వేపు దృష్టి సారించి.
"అరే చూళ్ళేదూ? వదిన టూర్ నించి తెచ్చిన మొక్కల్ని పెట్టింది చూద్దూగాని రా" అంటూ ఆమె చేయి పుచ్చుకుని బీరువా వెనకాతలకు తీసుకెళ్ళి గభాలున ఆమెను దగ్గరగా లాక్కుని తాంబూల రాగరంజిత మైన పెదాలను గట్టిగా చుంబించాడు. మరుక్షణం ఏమీ ఎరుగనట్లు చేతులు వెనక్కు కట్టుకుని గోడకున్న ఫోటోలు చూడటంలో నిమగ్నమయ్యాడు.
"దొంగ" అంటూ కోపంతో చూసింది. ఆ మధురానుభూతికి శరీరం పులకరించింది. కళ్ళు మూసుకుని హాయిగా కొంతసేపు అక్కడే నుంచోవాలనుకుంది.
"ఇలాంటి ముద్దునుగూర్చి ఇంగ్లీషులో ఏమన్నారో తెలుసా?" మౌనమే జవాబు "లలిత-నువ్వలా మాట్లాడకుండా వుంటే మళ్ళీ అవేనని చేస్తాను."
"తెలుసులెండి-ముందు వచ్చి కూచోండి" అంటూ సోఫా దగ్గరకు నడిచింది.
అంతలోకి శ్రీనివాసరావు వచ్చాడు. ఆమె తాంబూలం తెచ్చింది.
"రాత్రికి భోంచేసి వెళ్ళండి"
"వీల్లేదు మామయ్యా- సరళ దగ్గర కెళ్ళాలి. అంటూ లేచాడు.
"అప్పుడేనా? ఏదైనా త్రాగి వెళ్దురుగాని"
"ఇంకోసారి" లలిత కూడా లేచింది.
పెళ్ళికూతురికి బొట్టుపెట్టి తాంబూలం యిచ్చిందామె.
శ్రీనివాసరావు భార్యకు కవరు అందించాడు. ఆమె దాన్ని లలిత చేతలో పెడ్తూ అంది "సమయానికి క్రొత్త గుడ్డ లేదమ్మా. ఏదైనా కొనుక్కో."
"మామయ్య ఏమిటిది- వద్దు- వద్దు" అంటూ భార్య చేతిలోని కవరు తీసుకుని వాళ్ళ కివ్వబోయాడు.
"అలా వద్ధనకు నాయనా- తప్పు"
"అవన్నీ ఎందుకు? మీ దగ్గర తీసుకుంటే మళ్ళీ అది మీకు ముట్టేవరకు మాకు శాంతి వుండదు"
"అవేం మాటలు నరేన్" అంటూ మందలించింది.
"అత్తయ్యా- మీ చేతి మీదుగా కొద్దిగా ఒక్క రూపాయి ఇవ్వండి లేకపోతే నూట పదహారు నయాపైసలు ఇస్తే శుభం."
ఇందులో డబ్బులేదు నాయనా! ఒక్క కాగితం మాత్రమే వుంది" అంటూ నవ్వారాయన.
"ఏదీ- మీరు చెక్కు ఇస్తున్నట్లుంది?" అంటూ తెరచి చూచాడు.
"ఐదు వందలకు చెక్కు-? లలితా- తీసుకుందామా?" అంటూ సన్నగా కన్ను గీటాడు.
లలిత ముఖం గంభీరమైంది "వద్దు... వారన్నట్లు కొద్దిగానే ఇవ్వండి.... గరిటెడు గంగి గోవుపాలు..."
"మమ్మల్ని ఇరకాటంలో పడేశారు.....మీరు నిరాకరిస్తే మా హృదయం ఎంత గాయపడ్తుందో తెలుసా నరేంద్రా! మీ వదిన కెంత కోపం వస్తుందో తెలుసా?

"దీన్ని స్వీకరిస్తే మా హృదయాలెంత బాధ పడ్తాయో తెలుసా మామయ్యా- మీ అల్లుడుగార్కి ఎంత కోపం వస్తుందో తెలుసా?"
"అబ్బ.... మీ ఇద్దరితో వచ్చే చిక్కేయిది....సరే ఇది తీసుకోండి" అంటూ ఒక నయాపైసా నరేంద్ర చేతిలో పెట్టాడు.
నరేంద్ర భక్తితో దాన్ని స్వీకరించి "మహా ప్రసాదం" అంటూ ప్రక్కకు తిరిగి "అత్తయ్యకు కోపం వచ్చింది. ఏం చెయ్యను?" అన్నాడు.
లలిత ఆమెకు దగ్గరగా వెళ్ళింది. "నేను ఇంటి నించి ఏమీ తెచ్చుకోలేదుపిన్నీ- మీకీ విధంగా డబ్బు యిస్తే నాహృదయం ఎంత బాధకు లోనౌతుందో మీరు గ్రహించాలి... ఇవన్నీ అత్తయ్య ఇచ్చారు. అక్కయ్య ఈ ఆభరణాలన్నీ ధరింపజేసినది. అవేవో నిరాకరించే హక్కు నాకు లేదు.... కానీ......మీరు నాకిస్తే నేనేమనుకుంటానో తెలుసా? ఏమీ లేని దాన్నని.....తెలుసుకదూ.....ఆ బాధనించి విముక్తి కల్గించండి."
