Previous Page
పేక మేడలు పేజి 24


    భానూ! అమ్మా! భానూ, ఈ దుఃఖాన్ని నేను భరించలేను. నీ సాహసాన్ని నేను క్షమించ లేను. నీకోసం అలమతించే బిడ్డకు ఇంత అన్యాయం చేస్తావా? స్వార్ధంకంటే త్యాగం ఎంత ఘనమైనదో ఆలోచించావా? నీ స్వార్ధంకోసం నిన్ను ప్రేమించే వాళ్ళను సర్వనాశనం చేస్తావా? నువ్వు సుఖానికి దూరమైనా నా కోసం ఈ అన్నకోసం-బ్రతికి ఉండకూడదా భానూ! అప్పుడు నాది స్వార్ధమంటావా? నీ బిడ్డను నువ్వే పెంచుకోలేకపోయావా? దానికి నేను ఉన్నానంటావా? ఇది నీకు న్యాయం కాదు భానూ! న్యాయంకాదు! నువ్వు కట్టిన వన్నీ పేకమేడలే అయితే, అవి అనుభవానికి కాకుండాపోతే అపరాధ మెవరిదంటావు? అది నీ దౌర్భాగ్యమని నువ్వెందుకనుకోవు? భానూ! ఇప్పుడు నేను ఎన్ని చెపితే నీకు వినపడుతుంది? ఎంత ఏడిస్తే నీకు దయకలుగుతుంది? చెల్లీ!
    "కేశవ్! ఏడుస్తున్నావా?"
    "ఆ....లేదు. రా అక్కయ్యా! భాను చూశావా ఎంత..."
    "అవును. ఎంతపని చేసింది! ఉత్తరాలలో ఏం రాసింది?"
    "కారణం ఏమీ రాయలేదు. రాయకూడని దేదో జరిగి ఉండాలి. లేకపోతే నాకు తప్పకుండా రాసేది."
    అక్కయ్య దిగాలుపడి నించుంది.
    "బాబు నిద్రపోతున్నాడా?"
    "కదులుతూంటే జోకొట్టి వచ్చాను. నువ్వు కాస్సేపు పడుకో కూడదూ?"
    "కూర్చున్నా పడుకున్నా ఒకటే అక్కయ్యా! కళ్ళు మూతలు పడడం లేదు. మనసంతా ఏమిటోగా ఉంది."
    "భానుకి ఏ అదృష్టమూ లేదనుకొంది గానీ నీవంటి అన్నయ్య చాలు. దానికోసమే అది బ్రతికి ఉండాలి."
    "అక్కయ్యా, మన బాధతో మనం ఏమో అనుకొంటాంగానీ భానులాంటిదానికి మరో మార్గం లేదు. అది నాకు తెలుసు." కొంతసేపు మాట్లాడి అక్కయ్య కూతురు లేస్తే వెళ్ళింది. నేను నెమ్మదిగా వెళ్ళి నాని పక్కలో పడుకున్నాను. ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉంది. కాని ఎవరూ నిద్రపోవటం లేదు.
    తెల్లవారింది. బాబు మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు. మళ్ళా ఏదో మభ్య పెట్టబోయాను. వాడు నమ్మ లేదు. వాడికి ఊహ ఎక్కువ. "మా అమ్మ.....వత్తుందన్నావ్.....మామయ్యా!.....మా అమ్మ ఏదీ?" అని నిలదీసి అడుగుతున్నాడు.
    "వస్తుందిరా మరి. చుట్టాలు ఇంత గమ్ముని రానిస్తారేమిటి? రెండు రోజుల్లో వచ్చేస్తుంది. అందాకా నిన్నూ, నన్నూ ఆడుకోమని చెప్పింది."
    "ఉహూ! నేను ఆలుకోను. మామయ్యా! నన్ను మా అమ్మ దగ్గిరికి తీసికెళ్ళవూ?" బాబు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను ఏమీ జవాబు చెప్పలేక పోతున్నాను వాడి ప్రశ్నలకు. ఏమిచెప్పినా వాడు వినటం లేదు. పిల్లలందర్నీ పిలిచి చూపిస్తే వాళ్ళతో చేరటం లేదు. నా దగ్గర తప్పితే ఎక్కడికీ వెళ్ళటం లేదు. "అమ్మా!" అంటూ దీనాతిదీనంగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రోజు వాడు సరిగా అన్నం తినలేదు. రాత్రి నేను పక్కలో పెట్టుకు పడుకున్నాను. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. నిద్రలో కూడ వెక్కుతున్నాడు. త్రుళ్ళి పడి లేచి ఏడుపు ప్ర్రారంభించాడు. వాణ్ణి ఎలా సముదాయించాలో ఇంట్లో ఎవరికీ అర్ధం కావటం లేదు. పిన్ని ఎత్తుకోబోయింది. కెవ్వుమంటూ నన్ను కావలించుకున్నాడు. "వద్దు నానీ! ఎవరి దగ్గరికీ వెళ్లొద్దు. నేనే ఎత్తు కుంటానుగా. మరి ఏడవకు బాబూ!" అంటూ భుజం మీద వేసుకున్నాను.
    వాడు పుట్టింది మొదలు ఒక్క గంటకూడా తల్లిని విడిచి లేడు. ఇంట్లో తండ్రిఉన్నా తల్లితోనే వాడికి అపారమైన అనుబంధం. ఇప్పుడు వాడికి ఊహ తెలుస్తూన్న సమయం. తల్లిని ఎలా మరిచిపోతాడు? నా హృదయం దడదడ లాడింది. వాడు బెంగపెట్టుకుంటే ఏం చేయాలి? చిన్నతనమనీ, వాడే క్రమంగా మరిచిపోతాడనీ అనుకున్నాను గానీ, వాడు నిద్ర లేచి మళ్ళా ఏడిస్తే ఏం చెప్పాలి? నెమ్మదిగా వాణ్ణి పక్కమీద పడుకోపెట్టాను.
    మరి రెండు రోజులు గడిచాయి. బాబు బెంగ పడిపోయాడు. పూర్తిగా అన్నంతినటం మానేశాడు. "అమ్మా! అమ్మా!" అనే మాటలు విరామం లేకుండా ఏడుస్తున్నాడు. అమ్మను తీసుకు రమ్మంటున్నాడు. లేకపోతే తనను తీసుకు వెళ్ళమంటున్నాడు.
    పిన్ని ఏడుపుతో మరీ జడిసిపోయాడు. నిద్రలో ఉలిక్కిపడటం, త్రుళ్ళిపడిలేచి ఏడవటం, అందరి మొహాల్లోనూ ఏదో వెతుక్కోవటం, నిరాశపడి బావురుమనటం. నాకేమిటో భయంగా ఉంది. పిన్నీ, అక్కయ్యలూ నెమ్మదిగా వాడిని సముదాయించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని వాడు ఎవర్నీ దగ్గరకు రానివ్వటం లేదు. ఆ రాత్రి వాడికి జ్వరం తగిలింది. వెంటనే వెళ్ళి డాక్టర్ ను లేపుకొచ్చాను. డాక్టర్ ఏదో ఇంజక్షన్ యిచ్చి వెళ్ళాడు.    
    తెల్లారేసరికి కొంచెం తగ్గింది. వాడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను మొహం కడుక్కుని వచ్చి దగ్గరగా కూర్చున్నాను.    
    నెమ్మదిగా పిలిచాను-"నానీ..."
    నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
    "అమ్మ దొంగా! మెలుకువగానే ఉన్నావా?"
    "అమ్మ...ఏదీ?"
    అయ్యో! ఎంత తప్పు చేశాను! ఆ అక్షరాలే వాడికి గుర్తు తేగూడదు.
    "మామయ్యా!"
    "అవునుగానీ నానీ! నువ్వు కాఫీ తాగుతావా? కొంచెం."

    "ఊహూ! మా అమ్మ ఎప్పులూ కాఫీ ఇవ్వదు."
    "పోనీ పాలు తాగుతావా?"
    "నా కొద్దు."
    "నువ్వుమంచివాడివి కదూ? కొంచెం తాగు. మరి తీసుకురానా?"
    "మా అమ్మ దగ్గిరికి తీసికెళ్ళవా?"
    సరేనంటే పాలుతాగగానే బయలుదేరుదా మంటాడు. కాదంటే పాలే తాగనంటాడు. నేను మాట్లాడకుండా కూర్చున్నాను. వాడు ఏడవటం మొదలు పెట్టాడు. వాడిని చూస్తున్న కొద్దీ నా కడుపు తరుక్కుపోతూంది. ఇంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్న వాడు ఎంత దౌర్భాగ్యుడోకదా! వాడు మంచం దిగిపోయి నామీది కోపంతో నాలుగడుగులు వెళ్ళి నించుని ఏడుస్తున్నాడు. వాడికి ఎవరూ లేనట్టూ, అనాధఅయి పోయినట్టూ, ఏకాకిగా విలపిస్తున్నట్టూ అనిపిస్తున్నది. పిన్ని ఈ బెంగతో మరీ కుళ్ళిపోతూంది. నేను బలవంతంగా వాని దగ్గరకు తీసుకున్నాను. వాడు నిస్సహాయంగా నా ఒడిలో ఇమిడిపోయాడు వెక్కుతూ.

                              *    *    *

    బాబు విపరీతమైన జ్వరంలో పడి ఉన్నాడు. తెలివి లేదు. మధ్య మధ్య "అమ్మా! అమ్మా!" అంటూ కలవరిస్తున్నాడు. డాక్టర్ పక్కగదిలో ఇంజెక్షన్ తయారు చేస్తున్నాడు మౌనంగా. ఇంట్లో అందరూ బాబు పరిసరాల్లో కూర్చుని ఉన్నారు. అందరి మొహాల్లోనూ ఏదో భయం కొట్టుకులాడుతూంది. నేను తటాలున లేచి వెళ్ళాను. డాక్టర్ అప్పుడే సిరింజి తీసుకురాబోతున్నారు. "డాక్టర్...." అంటూ చేతులు పట్టుకున్నాను భయంతో. నా శరీరం కంపిస్తూంది. గొంతు పెగిలిరావటం లేదు. "బాబు...ని బ్రతికి స్తానని వాగ్ధానం చెయ్యండి.....డాక్టర్!"
    "రావుగారూ! మీరు భయపడకండి. నేను మంచి మందులు వాడు తున్నాను. నా శాయ శక్తులా ప్రయత్నిస్తాను."
    "కాదు డాక్టర్! బాబు.... బ్రతుకుతాడని చెప్పలేరా? ఏసిటీకైనా తీసికెళ్ళిపొమ్మంటారా?"
    "రావుగారూ! మీరు తొందరపడుతున్నారు. బాబుకి తల్లిపైన బెంగ తప్పితే మరే జబ్బూ లేదు. నన్ను డాక్టర్ గా కాదు, మీ సోదరుడుగా చూడండి. ఒక పసిపాపకు నేను అన్యాయం చేస్తానా?"
    "క్షమించండి డాక్టర్! నా బాధ మీకు తెలీదు. మా చెల్లి కొడుకుని నాకు అప్పగించి ఆత్మహత్య చేసుకొంది. బాబుని నేను బ్రతికించుకోలేకపోతే, డాక్టర్! నేను చెప్పలేను. వాణ్ణి బ్రతికించి తీరాలి."
    డాక్టర్ నన్ను తోసుకొని బయటకు వెళ్ళాడు. నేను వెనకే పరుగెత్తాను. ఇంజెక్షన్ నొప్పితో బాబు కెవ్వుమన్నాడు. కళ్ళుమూసుకొని పడుకొని ఎంతోసేపు ఏడిచాడు.    
    క్రమంగా పగలు జారిపోతూంది. నలువైపులా చీకటి అలుము కుంటూంది. పిన్నీ, నేనూ బాబు మంచం దగ్గరే కూర్చున్నాము. నాకు నాలుగు అయిదు రోజులనుంచీ నిద్రలేదు. అలా బాబు పక్కలో పడుకొంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
    
                              *    *    *

    సావిడి అంతా చీకటిగా ఉంది. పిన్ని లేచిదీపం వెయ్యలేదు. చీకటిలోనే చీడీలు ఎక్కి ఎవరో వస్తున్నారు. కదలికలన్నీ భాను నడకను పోలి ఉన్నాయి. మరీ దగ్గరకు వచ్చింది. భాను!
    'భానూ!' అంటూ అరిచాను. పిన్ని స్పృహ తప్పి పడిపోయింది. భాను మరీ దగ్గరకు వచ్చి నవ్వింది. 'కోపం వచ్చింది కదూనీకు? వచ్చేశాగా? నేను కెరటాలలో కొట్టుకుపోతూ ఉంటే ఒక జాలరి బ్రతికించాడు. రెండు రోజులు నాకు తెలివే రాలేదు.' చెప్పుకుపోతూంది. నేను వెర్రివాడిలా చూస్తున్నాను.    
    'అయ్యో! బాబుకి జ్వరం వచ్చిందా? నాన్నా!నేనమ్మా! వచ్చాను అమ్మని. చూడు నానీ!' భాను నానీని తీసి గుండెలకు హత్తుకుంది. బాబును ఎత్తుకొని గాలిలో నుంచి.....అలా....
    'భానూ!'

                              *    *    *

    "కేశవ్! కేశవ్! బాబూ!"
    ఎవరో తట్టి లేపుతున్నారు. ఉలిక్కిపడ్డాను. దిగ్గున లేచి కూర్చున్నాను. బాబు పక్కలోనే ఉన్నాడు. నా శరీరమంతా గజగజ వణికిపోతూంది. పిన్ని నా చెయ్యి గట్టిగా పట్టుకొంది.
    "పిన్నీ! భాను.... రాలేదా?"
    "...."
    "పిన్నీ! నువ్వుకూడా భానుని చూశావు కదూ?"
    పిన్ని నెమ్మదిగా అంది: "కలవచ్చిందాబాబూ! భాను తిరిగి వస్తుందా? అంత భాగ్యమా?"
    "కలకాదు పిన్నీ! భాను నాకు పూర్తిగా కన్పించింది. ఒక జాలరి బ్రతికించాడని చెప్పింది."
    "నీకు కలే వచ్చింది. అయ్యో తల్లీ!" అంటూ పిన్ని పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టింది.    
    బాబు త్రుళ్ళిపడిలేచిపోయాడు. భయంతో నన్ను అంటిపెట్టుకుపోయాడు. వీపు నిమురుతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. సన్నగా పుల్లలా ఎండిపోయాడు. కళ్ళు గుంటలు పడిపోయి లోతుకు దించుకు పోయాయి. తల దుబ్బుగా పెరిగిపోయింది. కడుపు వెన్నెముకకు అంటుకు పోయింది. నాకు దుఃఖం ఉబికి వచ్చింది. ఇప్పుడు భాను ఉంటే! నిజంగా వస్తే! బాబు యిలా అయిపోతాడని తెలిస్తే భాను ఎప్పుడూ అంతపని చేసేది కాదు.
    వీధిలోకి, చీకటిలోకి శూన్యంగా చూస్తూ కూర్చున్నాను. ఈ సారి నిజంగా ఎవరో చీడీలు ఎక్కి వస్తున్నారు. నేను తటాలున లేచి దీపం వేశాను. నిర్ఘాంతపోయాను. బావ! బాబుతండ్రి! నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడి ఉన్నాను. అతను నా దగ్గరగా వచ్చి నా చేతుల్లోంచి బాబును అందుకున్నాడు. వాడి మొహంలోకి తదేకంగా చూడసాగాడు. అతని కళ్ళ వెంట నీళ్ళు ధారాపాతంగా జారిపోతున్నాయి. బాబును గుండెలకు అదుముకున్నాడు.
    నేను మంత్రించినట్టు నిలబడిపోయాను. 'బావ మారిపోయాడా? నిజంగా మారిపోయాడా?' పిన్నికూడా నాలాగే రాయిలా కూర్చుండిపోయింది.        
    ఎవరితో ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. అతను మాసిన గడ్డంతో, చిరిగిపోయిన బట్టలతో బికారిలా ఉన్నాడు. కళ్ళలో అగాధాలు కన్పిస్తున్నాయి. ఏదో సత్యం తెలుసుకొనగలిగినట్టు కృంగిపోతున్నాడు. తన ఉనికికి తనే సిగ్గుపడుతున్నాడు. ఎవరినీ చూడలేనట్టు కొడుకుమొహం లోకి దృష్టి సారించాడు. ఆ దృష్టిలో నిజమైన, పవిత్రమైన పశ్చాత్తాపం!
    బాబు అప్రయత్నంగా కళ్ళు తెరిచాడు. వెర్రిగా క్షణంచూసి కెవ్వుమన్నాడు. ఒక్క ఊపుతో తండ్రిచేతుల్లోంచి గచ్చుమీద పడిపోయాడు. పరుగెత్తి వెళ్ళేసరికి తండ్రి తిరిగి కొడుకును ఒళ్ళోకి తీసుకోబోయాడు.    
    "బాబు జడుస్తున్నాడు. నేను ఎత్తుకుంటాను" అన్నాను నెమ్మదిగా. అతను తల దించుకొని నేలమీద కూర్చున్నాడు. బాబు తెలివిలో లేడు. ఒళ్ళు నిమురుతూ ఒడిలో పడుకోబెట్టుకున్నాను.
    "అ....మ్మ......అమ్మ...." పెదవులు చలిస్తున్నాయి. నాకేమీ తోచటం లేదు. చెయ్యి కూడా కదపలేకపోతున్నాను. ఏదో మొండితనంతో బాబు మొహం మీదికి వంగి కళ్ళల్లోకి చూడసాగాను. ఆ పసికన్నుల్లో జ్యోతి కూడా పేలవంగా వేలుగుతూంది. కనురెప్పలు ఎత్తిచూడలేక పోతున్నాడు. డాక్టర్ వచ్చాడు. బాబు కళ్ళు మూతలు పడిపోయాయి. ఉదయుడు అస్తమించాడు. తండ్రి కొడుకు మృత కళేబరాన్ని గుండెలకు అదుముకొంటూ రోదిస్తున్నాడు. ఆడే పాడే బిడ్డను, బంతిల తిరిగిన కొడుకును ఒకసారి కూడా ఎత్తుకొని, కనీసం కన్నెత్తి చూడని దౌర్భగ్యుడు! భగవాన్! నన్నూ తీసికెళ్ళు! చెల్లీ! నన్ను క్షమించు! నాతల భారంగా.... నా కళ్ళు చీకట్లు.....కమ్ము తున్నాయి..... బాబూ!
    భాను నిజంగా పేకమేడలే కట్టిందా? మనిషికి మనిషే విలువ అని నమ్మటంలో తప్పటడుగు వేసిందా? చదువు విషయంలో ఆశలు నిరాశ లయినా బెదిరిపోక, అది జీవితంలో ఒక భాగమే గానీ జీవితం కాదని సరిపెట్టుకొని, అసలైన జీవితంలో కోరికలు పెంచుకొని పొరపాటు చేసిందా? భార్యగా, ఇల్లాలుగా తనకు ఒక విలువైన స్థానం కావాలనీ, తన భర్త హృదయంలో తనకు విశాలమైన చోటు లభించాలనీ కాంక్షించటంలో దురాశ పడిందా? స్త్రీగా, తల్లిగా పవిత్ర మైన స్థానంలో ఉండాలనీ, తన బిడ్డను స్వహస్తాలతో పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలనీ తపించి పోవటంలో తొందరపడిందా?
    ఎంత ఆలోచించినా ఇవి ఏవీ నిజం కావని పిస్తూంది. అయిఅప్పుడు భానుకు పరాజయమే ఎందుకు ఎదురౌతూ వచ్చింది? అన్ని విషయాల లోనూ శోకదేవతే ఎందుకు స్వాగతం పలికింది? భాను కట్టినవన్నీ చూపులకే గానీ అనుభవానికివీలుకాని పేకమేడలే ఎందుకయ్యాయి? అది ఆమె దౌర్భాగ్యమనీ, జన్మ సుకృతమనీ, కర్మ ఫలమనీ ఎందుకు సమర్ధించవలసి వచ్చింది?
    కారణం తోస్తున్నది.
    భాను భారతదేశంలో ఒక స్త్రీగా పుట్టింది.

                           


                                 ----అయిపోయింది----


 Previous Page

WRITERS
PUBLICATIONS