కృష్ణవేణి
---శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ

ఐదారు రోజుల తదనంతరం ఓనాటి ఉదయం ఫోటోలు తీసుకు నాదగ్గరకు వచ్చింది. వస్తూనే చిరునవ్వుతో నా కందించింది. అందుకుంటూనే ఆతృతగా పరికించారు. నిజంగా మురిసిపోయాను. అంత అందంగా ఉన్నానని చూసుకు గర్వపడ్డాను. ఆ ఫోటో అతి సహజంగా వుంది. కొట్టవచ్చినట్లు లేని వెలుతురులో నా ప్రతిబింబం కొట్టవచ్చినట్లే ముద్రపడింది. ఆ కాటుక కళ్ళల్లో ఏదో మెరుపూ, ఆ తెల్లని చెక్కిళ్ళలో ఏదో నునుపూ, నాకా క్షణంలోనే కొత్తగా గోచరించాయి. కంగారులో అంటీ అంటని కుంకుమని చూసు కుంటే, తుడిచి సరిచేసుకోవాలనిపించింది. చిరు నవ్వు దాచుకున్న పెదవుల్ని చూస్తూంటే నవ్వు వచ్చింది. కొబ్బరాకులు చించుతూన్న ఎడంచేతికి నిండుగా గాజులున్నాయి. వారగా తిరిగివున్న జడ లోని చేమంతులు కుడిభుజంమీద నుండి తొంగి చూస్తున్నాయి. పల్చని పైటలోంచి సన్నని గొలుసు ముద్దులు మూట కడుతూంది.
"రేణూ! యిది నేనా!" అన్నాను నవ్వి.
"నీ అందానికి ప్రతిబింబం" అంది.
"కాదు. నీ నేర్పుకు నిదర్శనం" అన్నాను.
"నిజంగా చెడుతుందనుకున్నాను గానీ, ..." అంది రేణు.
తర్వాత ఆ ఫోటో అమ్మకీ వదినకీ చూపించాము.
"శాంతకీ ఓ కాపీ పంపుతాను." అంది రేణు.
"ఇక మన తతంగం అయింది. నీ స్నేహితుడి ఫోటో ఎప్పుడొస్తూందేమిటి?" అంది.
ఆ రాత్రే మాధవ్ కు ఫోటోలో కవరు పూర్తి చేశాను.
మాధవ్ జవాబుతో పాటు అతని ఫోటో రాలేదు. జవాబు చాలా రాశాడు. జ్ఞప్తివుంచుకో దగ్గ కొన్ని వాక్యాలే జ్ఞప్తి వున్నాయి. "నిజంగా ఫోటో చూస్తూనే తిరిగి నిన్ను దగ్గిరగా చూసి నట్టే భ్రమపడ్డాను. నేను కోరిన విధంగానే అలకంరించుకున్నావు. ఆ అలంకారం నీకిష్టముంటుందో లేదోకూడా ఆలోచించకుండా అడిగాను. చూడు కృష్ణవేణీ! నేనెలా వర్ణించినా తప్పుగా వుంటుందేమో! నుదుట కుంకుమ జడలో పువ్వులూ, ఎంత అందానిచ్చాయో నీకు తెలుసా? ఎప్పుడూ అలాగే వుండాలని స్నేహాన కోరుతున్నాను.
'బిగించి వుంచుకున్న నీ పెదవుల్లో ఏవో చెప్పలేని మాటలు దాచుకున్నట్లు వుంది. నీ ఫోటో టేబుల్ మీద వుంచుకోవాలనుకున్నానుగానీ డైరీ లోనే వుంచాను. ప్రతీరోజూ కాస్సేపు అది చూస్తూవుంటాను. అంతటితో సంతృప్తి, పడతాను. దేనికైనా భాగ్యం వుండాలి కృష్ణవేణీ! నావంటి వాడి రాతలో ఎన్ని వంకరలుంటాయో భగవంతుడికే తెలియాలి.
ఇక ముగిస్తాను. నేను క్షేమం. ఎప్పుడూ క్షేమంగానే వుంటాను. ఈ వుత్తరంలో మితి మీరి ఏదైనా రాసినట్లు అనిపిస్తే మనస్పూర్తిగా మన్నించు. నా ఫోటో తొందరలో పంపుతాను. మరిచాను. రేణు శ్రద్ధజేస్తే ఫోటో గ్రాఫీలో మంచి భవిష్యత్తు తెచ్చుకోగలదే. నా అభినందనలు అందజేయి ఉంటాను."
ఆ వుత్తరం నారో చాలా ఆలోచనలు రేపింది. తనేదో వేదన వుంచుకున్నాడు మనసులో. చాల సార్లు సూచాయిగా అన్నాడుగానీ, వివరించింది లేదు. కారణాలేముంటాయో చెప్పందే ఎవరి కైనా ఎలా తెలుస్తుంది?
"నావంటి వాడి రాతలో ఎన్ని వంకరలుంటాయో భగవంతుడికే తెలియాలి" .... ఛ! ఎందుకలా పసిపాపలా దిగులుపడిపోతాడు? ....మాధవంటే చెప్పుకోలేని ఆప్యాయతకూడా చిగురించింది ఆ క్షణాలలోనే క్షణక్షణానికీ నామనసులో చిత్రమైన మార్పులొస్తున్నాయి. అతని వేదనేమిటో నాకు తెలీక పోయినా చనువున ఆప్తురాలిగా ధైర్యం చెప్పాలనుకున్నాను. నేనంటూ ఒకదాన్ని వున్నానని నచ్చచెప్పాలనుకొన్నాను-ఆలోచనలతో నిద్రరాలేదు. లేచి చదువుకోబోయాను. మనసు పోలేదు. ఐనా పరీక్షలు సమీపిస్తున్నాయి. శ్రద్దగా చదువుకోమని మాధవ్ కోరిక. ప్రశాంతంగా ఓగంట చదువుకు పడుకున్నాను.
మర్నాటి వుదయం వదిన పూలుగుచ్చు కొంటూంటే-"ఇవ్వాల్టినుంచీ రోజూ నాకూ ఓమాల ఇవ్వాలి వదినా!" అన్నాను.
"ఏమిటీ మార్పు? ఇంతలో రాదనుకున్నాను అన్నగారొచ్చేవరకూ" అంది వదిన నవ్వి.
"పోనీ ఇప్పుడు వచ్చారనుకోకూడదూ?"
"మాకు తెలీకుండానా? అలాంటి శుభవార్త లేవైనా వుంటే చెబుదూ!"
"సరి సరి గాని-సాయంత్రం నుంచి మనమూ తోటపని చేస్తాం."
"అయ్యో! అందుకే కాబోలు ఈమధ్య గులాబీమొక్కలు రెస్ట్ తీసుకుంటున్నాయి."
'మరే! రేపటినుంచీ గడ్డిమొక్క గులాబీలు పూస్తుంది." వదిన నవ్వి పూలు నా జడలో వుంచింది.
ఆరోజే శాంత వస్తున్నట్టు వుత్తరం వచ్చింది. అది అత్తవారింట నుంచి రెండోసారి వెళ్ళిరావటం.
దాదాపు ఏడెనిమిది నెలలు కావస్తుంది. ఆ సంతోషవార్త రేణుకి తెలియజేశాను.
"ఉత్తరం రాసింది నేనైతే జవాబు నీకన్న మాట." అంటే నవ్వి-"దాన్నే అడుగు" అన్నాను.
మర్నాడే శాంత వచ్చింది.
ఒకర్నొకరం చూసి నవ్వుకోటాలు చిట్టిపొట్టి పరామర్శలూ అయ్యాయి. శాంత వాళ్ళమ్మ మూడుకాఫీలు పళ్ళెంతో ఫలహారం పడేసివెళ్ళింది.
"ఇది తట్టెడుపూలూ-అర్ధణా అంత బొట్టూ ఎందుకు పెట్టుకొందో అడుగే శాంతా' అంది రేణు.
శాంత నవ్వింది. కానీ నాకు కోపం వచ్చింది.
"ఆడవాళ్ళూ, పూలూ, బొట్టూ ఎందుకు పెట్టుకొంటారో నీకు తెలీదేమో కాని శాంతకి తెలుసులే అన్నాను"
రేణు నవ్వుతూ-"కోపం దేనికే రేణూ? ఇన్నాళ్ళూ నీ ఆడతనం ఏమైపోయింది? మర్చిపోయావేమిటి?" అంది.
"అయితే ఇప్పుడెందుకు పెట్టుకున్నానంటావ్?"
"బావుంది. అది నాకెలా తెలుస్తుంది? అందుకే శాంత నడగమన్నాను"
"ఛ! ఏమిటి రేణూ దాన్ని వెటకారంచేస్తావ్? అదేం చిన్నపిల్లనుకున్నావా?" అంది శాంత.
"సర్దాకి అంటే దానితో ఏమిటిగానీ నీ స్నేహితుడి కబుర్లే మైనా చెబుదూ కృష్ణవేణీ!" అంది నాతో.
"నీకు తెలీని వేమున్నాయి? అన్నీ ఆవిడే నీకు జేరవేస్తుంది కదా?"
"అవుననుకో ఐనా నువ్వూ కొన్ని చెప్పు. అతను ఫోటో పంపాడా?"
"లేదు పంపుతా నన్నాడు"
"మీరసలు వుత్తరాల్లో ఏం విషయాలు రాసుకొంటున్నారు?
"పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలేం వుండవే ఏదో అతను రాస్తాడు. జవాబిస్తాను. అలాగే ఇక్కడి విశేషాలేమైనా నేను రాస్తే అతను జవాబు రాస్తాడు."
"నాకు తెలీకడుగుతాను కలం స్నేహమంటే ఇలా స్వంత గొడవలు రాసుకుంటారా? ఏవో కొన్ని సమస్యల వంటివి తీసుకొని పరస్పరం అభిప్రాయాలు తెలీజేసుకొంటారంటారు. చర్చలు జరుపుకొంటారంటారు."
"ఏమో! ఇంతవరకూ అదేంలేదు మరి" అన్నాను దోషిలా.
"అది కలం స్నేహం కాదులే. ప్రణయ స్నేహం. అందుకే వాళ్ళకి వూల్లో గొడవలేమీ అక్కర్లేదు." అంది రేణు నవ్వుతూ.
"వేళాకోళమంటూ మితిమీరి మాట్లాడుతున్నావ్ రేణూ! చూడు శాంతా! ఇది " ...
"శాంతేం చూస్తుంది ఇవ్వాళ వచ్చి? రోజూ నేను చూడటంలేదా? నీలో ఎన్నిమార్పులు వస్తున్నాయో నీకు తెలుసా? ఎంతమంది మగవాళ్ళు లేరు మనకి స్నేహితులు? ఆ మాధవంటేనే నీకంత మక్కువెందుకు? ఇది మొదటి రెండు రోజులూ పార్కుకెళ్ళినప్పుడు నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు శాంతా! ఉత్తరాలైనా అన్నీ చూపించదు. ఎందుకో ఆదాపరికం అడుగు." రేణు ఫిర్యాదులు చేస్తూంటే నేను మామూలుగా బుగ్గన చెయ్యేసుకు వింటూ కూర్చున్నాను. శాంత నవ్వి అంది -
"దాని కిష్టమైనట్టు చేసుకొంటుంది. అదేం చిన్నపిల్ల గాదు. మనం అడగటానికి. నువ్వు మాత్రం నోరుమూసుకో."
"మరి దీనికి మనదగ్గిర రహస్యమేమిటీ? చూస్తూండు. ఈ వ్యవహారం అందులోకే దిగుతుంది." అంది రేణు.
"ఎందులోకి?"
"ముందు ప్రేమలోకి తర్వాత పెళ్ళిలోకి.'
"ఇంకేం? కావలసిందే అది కదా?"
"కాని తెలీనివాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడు వాళ్ళ మంచీచెడ్డలు తెలుసుకోవద్దా శాంతా? తర్వాతే పరిస్థితులెదురైనా ఇదే బాధపడాలికదా? రాయిలాంటి ఇదెందుకిలా కరిగిపోవాలి?"
"దానికి జవాబు నీ అనుభవమే చెప్తుంది". వాళ్ళిద్దరూ నా ప్రసక్తే లేనట్టు నాకూ మాధవ్ కీ చిత్రమైన సంబంధం ఏర్పరిచేశారు. కాదని నేను వాదించదలచుకోలేదు. కాబట్టే అక్కడితో ఆచాప్టరు ముగిసింది. తర్వాత కబుర్లలో శాంతా వాళ్ళాయన కబుర్లు దొర్లాయి. "ఇప్పుడెలా వుందేమిటి మీఆయన పరిస్థితి?" అన్నాను. "కొత్తగా మారేదేముంది? ఎప్పుడూ ఒకటే. కాని కృష్ణవేణీ! ప్రతీ వ్యక్తీ జీవితంలో ఒక్క సారైనా పవిత్రంగా గాఢంగా ప్రేమించబడాలంటాను. లేకపోతే జన్మకి సార్ధకతే లేదేమో! మనం ఒకర్ని ఇష్టపడటం లెక్కకాదు. మన మంటే ఒక్కరైనా తనకన్న మిన్నగా ఎంచుకొనే వాళ్ళుండాలి. అంతటి అదృష్టం కొందరికే స్వంతమనిపిస్తుంది.'
శాంతమాటలు వింటేనే సరోజ గుర్తుకు వస్తుంది.
"అవును శాంతా! సరోజవంటి వాళ్ళు మరణించినా చిరంజీవులే" అన్నాను.
ఆరోజంతా చిన్ననాటి స్నేహితురాలు శాంత దగ్గిరే గడిపి సాయంత్రానికి ఇళ్ళకి చేరుకున్నాము.
ఆరాత్రే మాధవ్ గురించి తీవ్రంగా ఆలోచించాను. రేణు ఏదో అందనికాదు. అది అంట గట్టిన సంబంధంలో నిజంలేదా? మాధవుని కేవలం స్నేహితుడిగానే భావిస్తున్నానా? అతనితో ఎటువంటి సంబంధాలూ ఏర్పరచుకోవాలని కోరుకోవటం లేదా? అతని స్నేహం పెంపొందించుకోవాలని నిజంగా అనిపించటం లేదా? నన్ను నేనే నిలదీసి ప్రశ్నించుకున్నాను. కాని నాకు నేనే జవాబులు చెప్పుకోలేకపోయాను. రేణుని దబాయించిన నేను అంతరాత్మని మభ్యపెట్టుకోలేకపోయాను. మాధవ్ అందరివంటి వాడూ కాడనిపించింది. నా దృష్టిలో మాధవ్ కేదో ప్రత్యేకత వుంది.
ఆరాత్రి మాధవ్ కా వుత్తరం అంత విపులంగా ఎలా రాశానో అని ఎన్నోసార్లు అనుకున్నాను.
