నాన్నా! నీకు అమ్మను కరువు చేస్తున్నాను. నువ్వు నిద్రలేచి ఏడుస్తావు. తెలిసీ తెలియని మనసుతో బాధ పడతావు. అందరి మొహాల్లో మా అమ్మకోసం వెదుక్కుంటావు. ఎక్కడా అమ్మ కనిపించకపోతే, రోజులకొద్దీ అమ్మ మాయమైతే నీ పసి హృదయం కొట్టుకులాడుతుంది. బెంగతో నోరు విప్పి చెప్పుకోలేని బాధతో ఏడుస్తావు. నీ లేత మనసుని ఇంతగా మూగగా బాధిస్తున్నావని నాకు తెలుసు. దీనికి నన్ను క్షమిస్తావా? నాన్నా! నువ్వు ఆలోచించు. కాలికి ముల్లుగుచ్చుకుంటే విలవిలలాడిపోతామే! కంటిలో నలుసు పడితే కలవర పడిపోతామే! ఇంత సున్నితంగా కాపాడుకొనే ఈ శరీరాన్ని మనకై మనం త్యజిస్తామంటే, చేతులారా నిప్పు ముట్టించుకు కాలిపోవటానికీ, నడిచి వెళ్ళి సముద్ర కెరటాలలో కలిసి పోవటానికీ, తన చేతులతోనే తన కంఠానికి ఉరి బిగించుకోవటానికీ, తన బ్రతుకుని తనే అసహ్యించుకోవటానికీ కారణాలు ఎంత బలీయమై ఉండాలో ఆలోచించు. ఆలోచించ గలిగితే నువ్వు నన్ను క్షమిస్తావు నాన్నా! క్షమిస్తావు.
నువ్వు కడుపులో ఉన్నానని గ్రహించిన క్షణం నేను ఏమిటో అయిపోయాను. నన్ను మాతృమూర్తిని చేసిన నా చిరంజీవీ! నువ్వు పుట్టిన రోజు నేను సర్వం మరిచిపోయాను. కళ్ళయినా తెరిచి చూడని నిన్ను హృదయానికి చేర్చుకొని పొంగిపోయాను. నువ్వు సూర్యుడితో కలిసి ఉదయించావు. అందుకే నీకు ఉదయుడని పేరు పెట్టాను. జీవితంలో నేను స్వతంత్రించి చేయగలిగిన పని ఇది ఒక్కటే. దానికీ కారణం ఉంది. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు కావలసిన వారు ఆటంక పరచలేదంటే పూర్తిగా ఇష్టంవల్ల కావచ్చు. లేదా ఆ పనిని పట్టించు కోకపోవటంవల్ల కావచ్చు. నీ పేరు విషయంలో ఏది జరిగిందో నువ్వే ఊహించు.
నీమీద నేను ఎన్నో ఆశలు పెట్టుకొన్నాను. నా సంతోష వదనానికి నువ్వే పునాది వేస్తావనీ, ఈ చీకటి జీవితానికి వెలుగు చూపిస్తావనీ, నా కన్నీళ్లు నీ చిట్టి చేతులతో తుడిచివేస్తాననీ.....ఇంకా.....ఇంకా! నేను బ్రతికే ఉంటే నువ్వు అన్నీచేసేవాడివి. కాని నాన్నా! దురదృష్టం నన్ను బ్రతకనివ్వడం లేదు. ఇప్పుడు దానికి నేను విచారించటం లేదు కూడా. నా విచారం, నా దుఃఖం, నా అభిమానం. నా ఆవేశం-అన్నీ గతంలోనే పూర్తి అయ్యాయి.
కాని యీ చివరి ఘడియల్లో నాలో మిగిలి ఉన్న ఒక్క కోరికా నీకు చెబుతాను. అది తీర్చవలసింది నువ్వే! నువ్వు పెరిగి పెద్దవాడవై వృద్ధిలోకి రావాలి. ఆదర్శప్రాయుడైన వ్యక్తి కావాలి. నీ పురుష లోకంలో, ఈ చీకటి సమాజంలో మాణిక్యమై వెలగాలి. అన్యాయాలు చూచి అసహ్యించుకొనే. అక్రమాలుచూసి ఆవేశపడే, దౌర్భాగ్యుల్ని చూసి కన్నీరు కార్చే, నీచత్వాన్ని చూసి తలదించుకొనే పవిత్ర మూర్తిని కావాల. ఆ రోజు రావాలి. అది నువ్వు తేవాలి. విన్నావా బాబూ? ఇది నీకు చాలా చిన్న కోరికగా కన్పిస్తూంది కదూ? మామయ్య సంరక్షణలో నువ్వు యిప్పటికి అలాగే పెంచబడిఉంటావు. అవునా?
నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకో వలసిన విషయం ఒకటి ఉంది. ఈ విశాల ప్రపంచ సృష్టి కర్త భగవంతుడుకానీ, మరేదో శక్తి కానీ, ఏదైనా ఈ ప్రకృతిలో సర్వజీవులూ సమానులు. ఏనుగు ఎంత పెద్దదో, చీమ అంత చిన్నది. కాని దేని విశిష్టత దానికి ఉంది. దేని విలువ దానికి ఉంది. చీమ నీచమైనదీ కాదు. ఏనుగు ఉన్నత మైనదీ కాదు. అది నువ్వు అంగీకరించాలి.
అన్నిటికన్నా మానవుడు ఉత్కృష్టమైన వాడు. ఆలోచించగలడు. అర్ధం చేసుకోగలడు. ఆచరించగలడు. ఈ ప్రత్యేకథ పశుపక్ష్యాదులలో గానీ, క్రిమి కీటకాదులలోగానీ, మరే ప్రాణికీ లేదు. అందుకే మానవుడు మానవుడుగానే ఉండాలి. ఏ ప్రాణికీ సంక్రమించని ఆ ప్రత్యేకత నిలుపు కోవాలి. పశువులు చూశావా? తిండికోసం బిడ్డతో తల్లి కుమ్ములాడుతుంది. తల్లితోనే బిడ్డ సుఖిస్తుంది. అది వాటి అపరాధం కాదు. వాటి కాపరిజ్ఞానం భగవంతుడు ప్రసాదించలేదు. కానీ సర్వం తెలుసుకోగలిగిన మానవుడు అధికారాన్ని ఆరాధిస్తే, అక్రమాలకు దాసుడైతే, నీచత్వానికి తలదించితే అది పశుత్వం కాదంటావా? నువ్వు మానవుడుగా పుట్టావు. మానవుడు గానే జీవించు. మానవుడుగానే మరణించు.
నువ్వు ఒకఆదర్శప్రాయమైన బలీయమైన వ్యక్తిత్వం ఏర్పరచుకున్న నాడు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కాపాడ గలుగుతావు. ఎదుటి వ్యక్తిని తెలుసుకో గలుగుతావు.
నా గురించి నీకు మామయ్య ద్వారా చాలా తెలిసి ఉంటుంది. నేను ప్రస్తుత సాంఘిక జీవితానికి పనికిరాను. అక్రమమైన ఈ పురుషుని అధికారానికి తలదించలేను. ఈ నిస్సహాయ స్త్రీ జీవితాన్ని ఆమోదించలేను. అందుకే నేను తప్పుకొంటున్నాను.
మళ్ళీ కొన్ని తరాల తర్వాత, స్త్రీని పురుషుడు గౌరవించగలిగినప్పుడు, భార్యను భర్త ప్రేమించగలిగినప్పుడు, ఈ శరీరాలలో అధికారదాహం అంతరించి పోయినప్పుడు, ప్రతి సనాతన రక్తబిందువూ ఇగిరి గాలిలో కలిసిపోయినప్పుడు, నీ నా ఎక్కువ తక్కువలు అంతరించినప్పుడు, గృహాలన్నీ శాంతి నిలయాలయినప్పుడు, ప్రతి స్త్రీ హృదయమూ సంతోష వదనమైనప్పుడు, మనిషి మనిషిగానే బ్రతుకుతున్నప్పుడు అప్పుడు నాకు స్త్రీగా జన్మించాలని ఉంది. అంతటి పరిణామానికి నీవంటి పసిపాపలు లక్షలాది శ్రమించాలి. అవసరమైతే చిరునవ్వుతో బలి కావాలి.
నాన్నా! జీవితం అనుభవించటానికి ప్రసాదించబడిందేగానీ ఇలా చేతులారా నాశనం చేసుకోవటానికి కాదు. కాని జీవితాన్ని అనుభవించాలంటే జీవించిఉండటం ఒక్కటే ముఖ్యం కాదు. ఈ శరీరాన్ని నడిపించే హృదయం పాడు కాకూడదు. ఒక్క మర చెడితే యంత్రం పనిచేస్తుందా?
అమ్మను నువ్వు అర్ధం చేసుకోవటానికి ఒక్క విషయం చెప్తాను. నేను చిన్నదాన్నిగా ఉన్నప్పుడు నాకు జడ వెయ్యటానికి మాఅమ్మ బంగారు కుచ్చులు తెచ్చి కిటికీలో పెట్టింది. అంతలోనే చెల్లి ఏడిస్తే పాలు కలపటానికి వెళ్ళిపోయింది. నేను జుట్టు విరబోసుకునే ఆడుకోవటానికి పరిగెత్తాను. తర్వాత జ్ఞాపకం వచ్చి చూస్తే కిటికీలో కుచ్చులు లేవు. అమ్మ దిగాలు పడి కూర్చుంది. నాన్నకు తెలిసి నవ్వి ఊరుకున్నారు. అమ్మ మరెప్పుడూ అంత నిర్లక్ష్యంగా ఉండలేదు. అటువంటి అనురాగాల మధ్య పెరిగిన నేను-కొత్త జీవితంలో అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు బ్రతికి ఉన్నాను. దుఃఖంతో, కన్నీళ్ళతో, భయంతో, నిరాశతో, విరక్తితో, జీవచ్చవాన్నై ఈ క్షణం వరకూ ఊపిరి పీల్చుకొంటున్నాను.
నేను లేనని నువ్వు బాధ పడకు. మరో స్త్రీని బ్రతక నివ్వటానికే ప్రయత్నించు. నేను ఏడిచానని విచారించకు. మరో వ్యక్తి కన్నీటికి నువ్వు కారణం కావద్దు. నేను ఖైదీగా గడిపానని ఆవేశపడకు. మరో వ్యక్తి స్వాతంత్ర్యాన్ని నువ్వు అపహరించకు. నేను భయంతోనే బ్రతికానని సిగ్గుపడకు. మరో వ్యక్తిని జీవితంలో భయపడ నివ్వకు. అప్పుడే నువ్వు మానవుడివి.
ఈనాటి స్త్రీ పొందలేని న్యాయాన్ని, ఆనాటి స్త్రీని అనుభవించ నియ్యి. ఈ నాటి కాలిదారిని నువ్వు రాజబాటగా మార్చి వెయ్యి. అప్పుడే నువ్వు సంస్కర్తవు.
నాన్నా! నానీ! నీకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను. ఇక ముగిస్తాను. బాబూ! నువ్వెందుకు ఈ రాత్రి ఇంత గాఢంగా నిద్రపోతున్నావు? నా యీ సాహసాన్ని నీవు ఆమోదిస్తున్నావా? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఈ మనసు అంగీకరించటంలేదు ఉదయా! కాని ఇది తప్పదు నాన్నా! నన్ను వెళ్ళనియ్యి! నువ్వు మామయ్యతో సుఖంగా ఆడుకో. మరి వెళ్ళిపోనా?
నా చిట్టితండ్రీ, నీకు నా ఆశీస్సులు! తల్లిగా నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. నీకీ జన్మ యిచ్చిన నీ కన్నతండ్రిని ఎన్నడూ ద్వేషించకు. నామాట పాటిస్తావు. నాకు తెలుసు.
ప్రేమతో,
అమ్మ!'
