Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 22


    "నీతో అబద్ధం చెబుతానా?" అన్నాడతను.
    "అయితే ఎల్లుండికి నాకు రవ్వల నెక్లెస్ కావాలి." అంది రీటా.
    "చూద్దాం-"
    "అదేమిటి-రాజకీయ నాయకుల్లాగ...."
    "డబ్బొస్తున్నది కదా - ఇంకా నేను రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి..."
    "మీరు రాజకీయాల గురించి ఆలోచించవద్దు. అప్పుడు నన్ను అలక్ష్యం చేస్తారు. మన మెప్పుడూ ఇలాగే ఉండాలి-" అంది రీటా.
    "చూద్దాం-" అన్నాడు ముత్యాల్రావు.
    "అదిగో-మళ్ళీ చూద్దాం అంటున్నారు-" అంది రీటా.
    "నువ్వంటే ఎంత మోజులేకపోతే నేను ఇలా పగలు నీకోసం వస్తానో చెప్పు-" అన్నాడు ముత్యాల్రావు.
    రీటా మరి మాట్లాడలేదు.
    ముత్యాల్రావు తిన్నగా రీటా యింటినుంచి ఇంటికి వెళ్ళాడు. శైలజ అతణ్ణి చూసి ఆశ్చర్యపడుతూ-"అరే-అన్న ప్రకారం వచ్చేశారే-" అంది. అతడి వెంట రీటా లేకపోవడం ఆమెకు ఎంతో సంతోషంగా ఉన్నది.
    "ఇంక నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి-" అన్నాడు ముత్యాల్రావు.    "నా మాట నేనూ నిలబెట్టుకున్నాను-" అంది శైలజ.
    "మరి-నాకు కబురు పెట్టలేదేం?" అన్నాడు ముత్యాల్రావు.
    "మీకు కబురెందుకు?" ఆశ్చర్యంగా అడిగింది శైలజ.
    "బాగుంది-డిపాజిట్ నా పేరున మార్చినపుడు నా సంతకాలు అవసరపడతాయికదా-" అన్నాడు ముత్యాల్రావు.
    "నేనలాగనుకోలేదు-" అంది శైలజ.
    "మరి-...."
    "మీరు కోరిన దేమిటి? నేను మీకంటే ఎక్కువ ఆస్తిని కలిగివుండరాదని.....అందుకని...."
    "అందుకని...." కంగారుగా అడిగాడు ముత్యాల్రావు.
    "ఆ అయిదు లక్షలూ కిషోర్ కిచ్చేశాను..."
    "ఆఁ" ఉలిక్కిపడి నోరు తెరిచాడు ముత్యాల్రావు.
    "నేను మీ నీడలో బ్రతకాలనుకుంటున్నాను. మీరు నాకు నీడ ఇవ్వాలనుకుంటున్నారు. నా డబ్బు మిమ్మల్ని విలాస జీవితంవైపు దృష్టి మళ్ళించింది. అలాంటప్పుడా డబ్బు నాకు ఉండకపోవడమే మంచిదనిపించింది. ఈ రోజు కాకపోయినా మరో రోజైనా నేను చేసిన పనికి మీరు హర్షిస్తారు. మనం మానంగా బ్రతకడం కోసం నేనీ నిర్ణయానికి వచ్చాను...." అంది శైలజ.
    "ఎందుకు చేశా వీ పని?"
    "మన సుఖం కోసం...."
    శైలజ చెంప చెళ్ళుమంది.
    "ఇప్పుడు సుఖంగా వుందా?"
    శైలజ ఏదో అనబోయింది. మళ్ళీ ఆమె చెంప చెళ్ళుమంది.
    "ఎవడా కిషోర్? వాడికి నువ్వు అయిదులక్ష లెందుకిచ్చావ్? ఏదో నాటకమాడుతున్నావు.....చెప్పు...."
    శైలజ ఏదో చెప్పబోతోంది. కానీ అతఃడు జవాబు కోసం ప్రశ్నలడగడంలేదు. అయిదు లక్షల రూపాయలు అనామకుడికి పోయాయన్న కడుపు మంట అతడిలో ఇంతా అంతా అనలేని ఆవేశాన్ని కలిగించింది. అతడామెను చావగొడుతున్నాడు. కాసేపు ఆమె మౌనంగా భరించింది. చివరకు అరవడానికి సిద్దపడింది. అరవకుండా అతడామె గొంతు పట్టుకున్నాడు.
    ఆవేశంలో అతడి చేతులు ఆమె గొంతుచుట్టూ బిగుసుకుంటున్నాయి. అతడినుంచి విడిపించుకొనడానికామెకు బలం చాలలేదు.
    కొద్ది క్షణాల్లోనే ఆమె నిర్జీవంగా తలవాల్చేసింది. అప్పుడు ముత్యాల్రావు ఆవేశమూ తగ్గింది.
    ముత్యాల్రావు పట్టు సడలించి. శైలజ నేల కూలింది.
    అతడు మామూలు మనిషయ్యాడు. చటుక్కున ఆమె మీదకు వంగి-"శైలూ!" అన్నాడు.
    శైలజ కదలలేదు.
    ముత్యాల్రావుకి అనుమానం వచ్చింది. అతడామె నాడి, శ్వాస పరీక్షించాడు. ఆమె చనిపోయినట్లు గ్రహించడాని కతడి కెంతోసేపు పట్టలేదు.
    "శైలజ చచ్చిపోయింది...." అన్న భావన అతణ్ణి ఆపాదమస్తకమూ కదిలించింది.
    శైలజ ఎలా చచ్చిపోయింది?.....తనే చంపేశాడు...తను....తను హంతకుడు.....
    బాబూరావు తనకు సలహా యిచ్చాడు. ఓ పాడు స్లో పాయిజన్ కూడా ఇచ్చాడు, ఎవరూ అనుమానించని పద్ధతిలో శైలజను చంపవచ్చునని! కానీ తను అంతకాలం ఆగలేక పోయాడు. ఆవేశపడి చేజేతులా ఆమెను చంపేశాడు.

                                       7

    ముత్యాల్రావు దొంగకాదు, రౌడీ కాదు. గూండా కాదు. నడమంత్రపు సిరి పట్టిన ఓ సామాన్యుడు. తను హత్య చేశానన్న నిజాన్ని అతడు జీర్ణించుకోలేకుండా ఉన్నాడు.
    ఇప్పుడేం చేయాలి?
    అతడికి బాబూరావే గుర్తు కొచ్చాడు, వెంటనే ముత్యాల్రావు లేచి-శైలజను ఎత్తి మంచంమీద పడుకోబెట్టాడు. తలుపులు దగ్గరగా వేసి బైటకు వచ్చాడు. ముందు ఇంటికి తాళం వేయాలనుకున్నాడు. శైలజ ఇంట్లో వుండగా తను తాళం వేయడం ఇరుగు పొరుగు లెవరైనా చూస్తే బాగుండదు. సాధారణంగా ఈ సమయంలో ఇరుగుపొరుగు లెవరూ ఇంటికి రారు. అందుకని తాళం వేయకూడదనే అతడు నిశ్చయించుకున్నాడు.
    అతడు బాబూరావు ఇల్లు చేరాడు. బాబూరావు ఇంటి తలుపులు సాధారణంగా తెరిచే ఉంటాయి, ఆ రోజవి ఓరవాకిలిగా వేసి ఉన్నాయి. లోపల్నుంచి బాబూరావు మాట వినబడుతోంది. అతడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో!
    "హలో! రేపటికి అన్న ప్రకారం పదివేలూ కట్టి తీరాల్సిందే.....ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగడానికి వీల్లేదు.....నేను రీటాను ప్రయోగించి నిన్ను మోసగించానంటావా?....నిన్నెవడు మోసపొమ్మన్నాడు?.... నేను వెళ్ళి గంగలో దూకమంటాను.....దూకతావా?.....నీ సుఖం కోసం నువ్వు తప్పుచేసి ఆపైన నన్ను తప్పు పట్టడమెందుకు?....నీ రహస్యం దాచడానికి అన్న ప్రకారం రేపు పదివేలూ ఇచ్చేయాల్సిందే-ఈ విషయమై మరి మాటల్లేవు. ఫోన్ పెట్టేస్తున్నాను...."
    బాబూరావు ఫోన్ పెట్టేసేలోగా ముత్యాల్రావు వెనుదిరిగాడు.
    బాబూరావు బ్లాక్ మెయిలర్! ఈ విషయం తనకు తెలుసు. తన కతడు ఎన్నోసార్లు సగర్వంగా చెప్పుకున్నాడు కూడా!
    "ప్రతి మనిషికీ కొన్ని రహస్యాలుంటాయి. అవి మనం తెలుసుకోవాలి. రహస్యాలు లేనివాళ్ళుంటారనుకో. అప్పుడు మనం సృష్టించాలి. ఆ తర్వాతనుంచి ఆ రహస్యాలే మనకు కనక వర్షం కురిపిస్తాయి. ఈ రహస్యం నువ్వు గుర్తుంచుకో-" అని బాబూరావు తొలి పరిచయంలో ముత్యాల్రావుకి చెప్పుకున్నాడు.
    బాబూరావు బ్లాక్ మెయిలర్ తను హంతకుడన్న విషయం అతడికి తెలిస్తే-తప్పకుండా బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తాడు బాబూరావు. తన్ను బికారిని చేస్తాడు. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియనివ్వకూడదు. ఈ రహస్యం తనలోనే ఉండిపోవాలి.....
    ముత్యాల్రావు బుర్రలో పథకం మెరుస్తోంది.
    తనిప్పుడు శవాన్ని మాయం చెయ్యాలి. ఆ తర్వాత సెలవుమీద ఊరు వదిలిపెట్టాలి. తిరుగుదారిలో ముత్యాల్రావు పోస్టాఫీసువద్ద ఆగాడు. అది అన్నివేళలా పనిచేసే పోస్టాఫీసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS