అనుకున్న కార్యక్రమం గూర్చి పరిపూర్ణంగా చర్చించడానికి ప్రేమ పది గంటలు దాటిన తర్వాత గీత వద్దకు బయలుదేరింది.
గీత అత్యానందంతో ప్రేమ నాహ్వానించింది. తల్లి వచ్చి, సంసారాన్ని గూర్చి ఒక దాని వెంట మరొక ప్రశ్న వేసింది.
రఘుపతి నిరంజన్ ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు వేశాడు.
"పి, హెచ్. డి చేయాలనుకుంటున్నారు"అంది ముక్తసరిగా.
"ఆ.... మీ నాన్నగారు చదివిస్తారా?"
ప్రేమ కనుబొమలు క్షణం ముడిపడి, మరుక్షణం వీడినై...
"లేదు బాబాయ్, ఆయన కెటూ క్లాస్ వస్తుంది. స్కాలర్ షిప్ కూడా వస్తుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కు వారంటే ఎంతో యిష్టం. మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు కూడా క్లాస్ వస్తే తన సాయం తప్పక వుంటుందన్నారు".
'ఒంటరిగా వుంటావన్నమాట. అత్తగారెక్కడో వేరే కాపురమటగా? నువ్వే వసంతా చూచుకోవాలి కాబోలు?"
ప్రేమకు కోపం వచ్చిందిగాని నవ్వుగా రూపొందింది. "ఇదే హాయిగా వుంది. ఏదో నాకు వచ్చినట్లు నేను వండుకు తినొచ్చు-ఏ భయం వుండదు- అత్తయ్య ముడి సరుకంతా తయారుచేసి పంపుతారు. స్టౌ మీద వండుకు తినటమే మా వంతు."
"ఎక్కడుంటారేమిటి? ఇద్దరు కలిసి చేసుకుంటే హాయి కదా? మా కాలంలో పదిమంది తిరిగే ఇంట్లో..." ఆమె అలా మాట్లాడుకు పోగలదని. గీత తల్లి భుజం చుట్టూ చేయి వేసి ఎడంచేత్తో నోరు మూసింది అది మీ కాలం అమ్మా! ఏదో నాలుగైదు రోజులు సందడి సందడిగా బాగానే వుంటుందిగానీ ఆ తర్వాత విసుగేయదూ? చిన్న చిన్న కలహాలు ప్రారంభమౌతాయి.... ఇలా దగ్గరగా వున్నట్లే వుండి ఎవరికి వారుగానే వుండాలి.... ఇది ఈ కాలం నీతి, వాళ్ళుకూడా దగ్గరే వున్నారుగా.
"ఓహో మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కదు! ఒకరు చేసే దొకరికి ఇష్టం." అంటూ వెకసక్క మాడిందామె.
గీత- ప్రేమ ఫక్కున నవ్వేరు. ఇంతలో లలిత గుడ్డలు ఆరవేసి, తడిసిన చీర కుచ్చిళ్ళను దులుపుకుంటూ వచ్చింది.
"ఏమిటి అంతగా నవ్వుతున్నారు? ప్రేమా బావగార్ని ఒక్కర్నీ వదిలేసి వచ్చావే?" హాస్యం చేస్తూ అంది.
"అంతేలే. ఆ సంగతి నీకూ పెళ్ళయి ఓ మరిదిగారు నాకు దొరికే దాకా జవాబు చెప్పను' అని తిప్పికొట్టింది. ప్రేమ, మీ అమ్మగారు పది మంది వున్న యింట్లో కాపురం చేశారుట. ఈకాలంలో ఎవరికి వారుగా వుండడమే నీతి అని మేమంటున్నాం. మరి నీ ఉద్దేశమేమిటి?"
"అంతగా అడగాలానన్ను- మీ అభిప్రాయానికి డిటో'
కోపంతో లేవబోయిన తల్లిని కూతుళ్ళిద్దరూ చెరొక రెక్కపట్టి కూచుండబెట్టారు. ఆమె నవ్వకుండా వుండలేకపోయింది.
"మీరు పెరిగిన వాతావరణమే వేరు మీరు చదివే చదువులే వేరు. .....పెళ్ళయినా భర్త సమీపంలోకి రావటానికే భయపడే బిడియస్తులం మేము- పదిమందిలో వుంటే ఆ చాయలకే వెళ్ళము. ఇప్పుడు మీకు పర పురుషులతో ఏకాంతంగా ఒంటరిగా మాట్లాడే ధైర్యంవుంది.... కాల ప్రభావంతల్లీ.....మాట్లాడుకోండి. కాఫీ తెస్తాను" అని లేచి వెళ్ళిందామె.
"మా అమ్మ పుట్టి అమాయకురాలు ప్రేమా! పెద్దలుచేసిన పంజరంలో చిలుక.
"మీ అమ్మే కాదు- మా అమ్మకూడా.....వాళ్ళలో తప్పులేదులే"
"ఐరావతమ్మగారిది విశాల హృదయం- అన్నీ మోడర్న్ వ్యూస్...
"విదేశ జీవితం- భర్త- కొడుకులు ఆమె నావిధంగా మలచారు" కొన్నిక్షణాలు నిశ్శబ్దంగా గడిచేయి.
ప్రేమ అటు ఇటు చూచింది. తల్లి కేకవేయటంతో గీత వెళ్ళిపోయింది.
"నేనెందుకొచ్చానో తెలుసా? నీ పెళ్ళిపెత్తనం నామీద పడింది. నరేంద్ర సిద్ధంగా వున్నాడు నువ్వు తయారుగా వుంటే రేపు...
"ఆగుప్రేమా" అన్నది లలిత. మొగం ముడిచి "నేనింకా నిశ్చయించుకోలేదు.....నాకేమో భయంగా వుంది" అని చెంపలు చేతుల్లో పట్టుకుని కూచుంది. ప్రేమనోట మాటరాలేదు.
"అంటే-? నీ కిష్టంలేదా?"
"ఊఁహూఁ"
ప్రేమ అత్యాశ్చర్యంతో చూచింది. దొండపండులాంటి ఆమె పెదాలు సన్నగ అదురుతున్నాయి.
"ఎందుకు?" ఆపైన అడగాలంటే ప్రేమకుకూడా మాటరాలేదు.
"ఎందుకేమిటి? నా కింత ధైర్యం లేదు అతి నిష్ఠగల ఈ కుటుంబంలో పుట్టి పెరిగి అక్కడ ఎలా వుండాలో నాకు తెలియదు. అతను నన్ను చేసుకోవాలని ఎందుకంత ఆత్రపడ్తున్నాడో గ్రహింపుకు రావటంలేదు. ముందు అక్కమాటపై సమ్మతించాను గానీ ఇప్పుడు. ఆలోచించినమీదట నాకు చేతకాదనిపిస్తోంది. నాకి కట్టుబాట్లపై చాలా నమ్మకం వుంది. ముఖ్యంగా అమ్మనీ నాన్ననీ దుఃఖపెట్టటానికి తగినంత కారణం లేదు. అసలు అక్కయ్యకు పెళ్ళి ముఖ్యం అదే చేయలేకపోయామే అన్న వ్యధలో వాళ్ళ హృదయాలు నలిగి మసైపోతున్నాయి. దీనికితోడు ఇలాంటి తెగింపుపని చేసి వారిని ఇంకా బాధపెట్టటం నాకిష్టం లేదు ప్రేమా' అని రెండు చేతులతో మొగం మూసుకొంది లలిత.
"ఇక ఈ మాటకు తిరుగులేదా లలితా? బాగా ఆలోచించుకో-"
లలిత ముఖంలో విచిత్రమైన భావం గోచరించింది "లేదు" అని స్పష్టంగా అంది.
వాతాహవరణం స్తంభించిపోయింది. గాలి బరువుగా మనుష్యుల్ని అణగ్గొడుతోంది. తనెందుకింతగా చలించిపోయిందో-తనలో ఈ అల్లకల్లోలం దేనికి. ఆమె కిష్టంలేదు - ఇంతలో తలదన్నే సంబంధం రాగలదు గానీ....అని ఏమేమో తల పోస్తోంది ప్రేమ.
గీత పళ్ళెంలో కాఫీ గ్లాసులు పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ ఖాళీగా చూస్తున్నారు ఇద్దరివైపు ఆశ్చర్యంగా చూచింది" అలా వున్నారేమిటర్రా"
"గీతా- ఈ సంగతి నాకు ముందుగా చెప్పలేదెందుకని?"
"కోపం వచ్చిందా? బుంగమూతి పెట్టింది గీత!
"కోపం కాదు..."
"ముందు లలిత విషయం తేల్చిన తర్వాత ఆ సంగతి చెబుదామనుకున్నాను"
"ఏ సంగతి గీతా ఏమిటి నువ్వు మాట్లాడేది"
గీత గాభరా పడింది "ఏమిటి ప్రేమా ఏ సంగతినిగూర్చి మాట్లాడుతున్నావు?"
"ముందు నువ్వేదనుకున్నావు? ఏమి చెప్పాలనుకున్నావు?"
"చెబుతాగానీ-నువ్వు చెప్పు- నేను ఇప్పుడు కాదు - మరొకసారి అవసరం వచ్చినపుడు చెప్తాను"
"ఇదేదో తెగే సమస్యగా లేదు!" అంటూ లలిత విరగబడి నవ్వింది.
అంతచేటుగా నవ్వటానికి కారణం కనబడలేదు ప్రేమకు.
"అది సరే గీతా, రిజిష్టర్ మేరేజి చేసుకోటానికి లలితకు ఇష్టం లేదని ముందుగా చెప్పలేదేమి?"
గీత పెదిమలు ఆశ్చర్యంతో ఎడమైనై హఠాత్తుగా వినేసరికి ఆమె నమ్మలేకపోయింది. హృదయం లోతుగా కూరుకు పోతున్నట్లయింది. చురుగ్గా తలతిప్పి లలితకేసి చూచింది.
లలిత ముఖంలో అల్లరి నవ్వు చోటు చేసుకొంది. ఆ కళ్ళలో వెలుగు- ఆ పెదిమలపై నాట్యం చేస్తున్న హాసరేఖ-ఒక్కసారి వెన్నెల వెదజల్లినట్లు నవ్వేసింది.
ఆ నవ్వు చూచి గీత, చెల్లెలి మీద చెయ్యి ఎత్తింది. "అబ్బ- ఎంత గాభరా పెట్టావే?"
అప్పటికి ప్రేమ కర్ధమైంది. ఆనందంతో ముఖం కలువ పూవులా విప్పారింది.
"మీ ఆయన ఏం చెప్పమన్నారు?"
"రేపు పది గంటలకు మీ ఇద్దర్నీ రమ్మన్నారు....ఏమో బాబు- లలిత కిష్టమైతేనే....లేకపోతే వేరే పిల్ల సిద్ధంగా వుంది... లలితా చెల్లి వరసైపోయి- బ్రతికిపోయావు."
"పెళ్ళికూతురి పార్టీ తయారే....మరి ఎవరెవరు వస్తారు?"
"నరేన్ వస్తాడనుకుంటాను" అని చిలిపిగా నవ్వింది ప్రేమ.
"హమ్మయ్య- వస్తాడు కదా-" అని ఆనందించినట్లు ఎకసక్కెం చేసింది లలిత.
23
మరుసటి రోజు లలిత తలంటుకుంటానంటే తల్లికి ఆశ్చర్యం వేసింది. "మొన్ననేగా పోసుకున్నావ్?" అంటూ వారించబోయింది.
"ఎండాకాలం ఎన్నిసార్లు పోసుకున్నా జల్భు చేయదులేమ్మా" అంటూ తలంటుకుంది.
గీత సాధ్యమైనంతవరకు చెల్లికి దూరంగానే వుండిపోయింది. ఆమె హృదయంలో దిగులు. ఇస చెల్లి మళ్ళీ ఈ గృహంలో అడుగు పెట్టధన్న ఆవేదన హృదయాన్ని బ్రద్దలు చేస్తోంది. తల్లిదండ్రులకు కలుగ బోయే దుఃఖానికి తనెంత వరకు కారకురాలు?
పుష్ప చెల్లెలి తల తుడుస్తూ కూచుంది. ఆమె వెంట్రుకలు చిక్కు తీసి పై జడ వేయబోయింది.
"అక్కయ్యా వదులుగా జడవెయ్" అంది.
"ఇంకా ఆరలేదు కదే"
"ఫరవాలేదు"
ఆమె మారు మాట్లాడకుండా వదులుగా జడ అల్లింది.
లలిత అక్కవైపు తిరిగింది. లలిత చెంపల మీదుగా కారుతున్న అశ్రుధారలకు చూచి నిర్ఘాంతపోయింది పుష్ప.
"ఏమిటమ్మా ఏమైంది? బుజ్జగిస్తూ అడిగింది.
లలిత అక్కభుజంమీద వాలిపోయింది. కొంతసేపటికి వూరడిల్లి అంది "అక్కయ్యా -నీకు నామీద కోపం వస్తుంది..."
పుష్ప పేలవంగా నవ్వింది 'పేదవానికోసం పెదవికి..."అక్క నోటిమీద తన చేయివేసి జాలిగా చూచింది. తలవంచుకుని అంది "మరి.....ఈ మధ్యాహ్నం నేను పెళ్ళిజేసుకోబోతున్నాను"
పుష్ప తదేకంగా చెల్లివైపు చూస్తోంది.
"నన్ను క్షమించు....అమ్మానాన్న ఒప్పుకోలేదు. ఇక రిజిస్టర్ పెళ్ళి తప్పని సరైంది.... నువ్వు అర్ధం చేసుకోగలవక్కాయ్... ఇక ఈ యింటికి వచ్చే హక్కును పోగొట్టుకుంటున్నాను...నన్ను ఆశీర్వదించు. ఇంతవరకు నీ నుంచి దాచినందుకు నన్నుక్షమించు' లలిత అక్క ఆశీర్వచనం కోపం భక్తితో తలవంచింది.
"లలితా....నా నుంచి ఏమీదాచలేదు-" చెల్లి తలమీద చేయి వేసింది.

"అక్కయ్యా-నీకు తెలుసా?"
"ఆ..."
"గీత చెప్పిందా?"
"చెప్పింది, అమ్మావాళ్ళు ఒప్పుకోరని మాకు తెలుసు ఒక రాత్రంతా జాగరణతో - ఎలా సాధ్యమౌతుందని ఆలోచించాము. చివరికి నేనే సలహాయిచ్చాను ఈ విధమైన పెళ్ళి తప్పదని," సంభ్రమాశ్చర్యాలతో అక్కను కౌగలించుకుంది లలిత.
"ఔనమ్మా- నేనే చెప్పాను. గీత ముందు తటపటాయించింది."
"అక్కయ్యా-నువ్వు చాలా మారిపోయావు...
"ఔను- కాలంతోపాటు మనం మారాలి; లేకపోతే ఆశించింది లభించక నిరాశాపూరితమైన జీవితం గడుపుతాము.....టెన్నిసన్ ఆ మాట ఎప్పుడో అన్నాడు ... చూడు....గీత విషయమే తీసుకో? ఆమెకు పెళ్ళి చేసే తాహతులేదు.... ఉద్యోగం చేయించి డబ్బు కూడబెట్టి పెళ్ళి చేస్తే బాగుంటుందన్న తలంపుండదు. ఆమెకు నచ్చినవాడిని చేసుకోనివ్వము. ఎవడికో నచ్చితే మనం చెయ్యము.....ఏం చెయ్యాలి? ఇక ఇద్దరు కలసి తనదారి తాము చూచుకోవాలి- దానికి కూడా ధైర్యం కావాలి. మనం పాలు తాగేపిల్లలం కాము. మన బాధ్యతలు మనకు తెలుసు. మననడవడి నిష్కల్మషంగా వున్నంత వరకు మనం దేనికి భయపడనవసరం లేదు.... నువ్వు నిశ్చింతగా వుండు... అమ్మ నాన్నలకు చెప్పివెళ్ళు.... ఎప్పుడైనా మరిదిగారితో ఈ నిర్భాగ్యురాలైన అక్కకు కనబడు..."
పుష్ప కన్నీరు తుడుచుకుంటూ చెల్లిని కౌగలించుకుంది.
లలితకు ఏనుగంత బలం వచ్చింది.
"అక్కయ్యా తప్పకుండా వస్తాము" అంటూ గొణిగింది అక్క మంచితనంలో-గాంభీర్యంలో లలిత తన బాధను విస్మరించింది. నూతన రస జగత్తులో-అనురాగవాహినిలో పయనించబోతుంది. తను వెనుదిరిగి పోలేదు. నెమ్మదిగా లేచి వంటగదిలో కెళ్ళింది.
