"నిజంగా?" అన్నాడు ముత్యాల్రావు ఆశ్చర్యంగా.
"దీని ఖరీదు ఇరవై వేలు. ఒక్కసారిగా ఈయనవసరంలేదు. వాయిదా పద్ధతులలో తీర్చుకొనవచ్చును. నోటు రాసిచ్చి చెల్లువేసుకుంటే చాలు....." అన్నాడు బాబూరావు.
"సరే-అయితే ఆ సీసా ఇలా ఇవ్వు...." అన్నాడు ముత్యాల్రావు.
5
"అరే-ఈ రోజు పన్నెండింటికే వచ్చేశారే...." అంది శైలజ.
ఆమె కిశోర్ ని వెళ్ళిపొమ్మంది. కానీ ముత్యాల్రావు ఆగమన్నాడు. కిశోర్ అతడివంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
"రోజూ-మా యింట్లో ఎందుకుంటావ్?" అన్నాడు ముత్యాల్రావు తీవ్రంగా. కిశోర్ ఏదో బదులిచ్చేలోగా-"ఈ యింటికి నేను యజమానిని. నా అనుమతి లేనిదే నువ్వీ యింట్లో అడుగుపెట్టడానికి లేదు. ఇంకెప్పుడూ ఇలా రాకు-" అన్నాడు మళ్ళీ.
కిషోర్ మాట్లాడకుండా వెనుదిరిగాడు. ముత్యాల్రావు అతడిని వెనుకనుంచి ఫెడీమని తన్నాడు. ఊహించని ఈ దెబ్బకు కిషోర్ బోర్లాపడిపోయాడు.
శైలజ కూడా ఇది ఊహించినట్లు లేదు. ఆమె మ్రాన్పడి ఈ దృశ్యాన్ని చూస్తోంది. ముత్యాల్రావు భార్యవంక తిరిగి-"నువ్వు ఎలాంటి మనిషిని ఎలాంటి స్థాయికి తెచ్చినా నా దృష్టిలో వాడి విలువ పెరుగదు" అన్నాడు.
కిశోర్ నెమ్మదిగా లేచాడు. అతడి పెదాలు చిట్లినట్లు న్నాయి. కొద్దిగా రక్తం కనబడుతున్నది.
ముత్యాల్రావు అతడి వంక రూపాయినోటు తీసిఆడించాడు.
కిషోర్ అతణ్ణి సమీపించదువు. ఆ రూపాయినోటు అందుకున్నాడు. ఓసారి ముత్యాల్రావు కళ్ళలోకి చూశాడు. తర్వాత ఉన్నట్లుండి ముత్యాల్రావు చెంప చెళ్ళుమనిపించాడు.
ఇలా జరుగుతుందని ముత్యాల్రావు ఏ మాత్రమూ ఊహించినట్లు లేదు.
కిశోర్ శైలజ వంక తిరిగి - "శైలజగారూ! నా తఃరఫున మీరతడికి అయిదు రూపాయలివ్వండి-" అని చరచరా వెళ్ళిపోయాడు.
ముత్యాల్రావు కొద్దిక్షణాలలాగే ఉండిపోయాడు.
"చూశారా-వాడే స్థాయికి ఎదిగాడో!" అంది శైలజ.
"వాడు నన్నెందుకు కొట్టాడో తెలుసా?" అన్నాడు ముత్యాల్రావు చెంప తడుముకుంటూ.
"తెలుసు...." అంది శైలజ.
"నువ్వనుకుంటున్న కారణం సరైనది కాదు. నీకు డబ్బుంది. నాకు లేదు. అందుకే వాడు నీ ఆదేశం మీద నన్నుకొట్టాడు...."
"డబ్బున్నది నాకేననీ-మీక్కాదనీ నిజంగా మీ రనుకునే పక్షంలో నా డబ్బును మంచినీళ్ళలా ఖర్చుపెట్టరు-" అంది శైలజ.
"అంటే?" అన్నాడు ముత్యాల్రావు.
శైలజ చటుక్కున అతడి చేతిలో అయిదు రూపాయలు పెట్టి-"ఇకమీదట మీరు డబ్బు ఇలాగే సంపాదించుకోండి-" అని వెళ్ళిపోయింది. ముత్యాల్రావు మళ్ళీ దెబ్బతిన్నాడు.
శైలజ తన భార్య.....ఆమె తన్ను ఎంతమాటన్నది?
అతడికి ఆవేశంతో శరీరం వణికింది. శైలజను అప్పటి కప్పుడు నరికిపోగులు పెట్టాలన్న ఆలోచన కలిగింది.
ముత్యాల్రావు ఆవేశాన్ని అణుచుకున్నాడు.
శైలజ బాత్రూముకు వెళ్ళింది. అతను బెడ్రూంలోకి దారితీశాడు. అక్కడ గ్లాసు గ్లాసులో నీళ్ళు. రోజూ రాత్రి శైలజ మంచినీళ్ళు తాగుతుంది. ఈ రోజింకా తాగలేదన్నమాట! ముత్యాల్రావు చప్పున తన జేబులోని సీసాలోని మాత్రలు రెండు ఆ నీళ్ళలో వేశాడు. వెంటనే కరిగిపోయాయని.
అతడు వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. కొద్ది క్షణాల్లో శైలజ పడక గదిలోనికి వచ్చింది. వస్తూనే అతణ్ణి సమీపించింది. అతడు కళ్ళు మూసుకుని వున్నాడు.
"మీరు నిద్రపోవడం లేదని నాకు తెలుసు-" అన్నదామె.
ముత్యాల్రావు మాట్లాడలేదు.
"కోపం వచ్చిందా?" అన్నదామె. అతడు మాట్లాడకపోగా నుదుటిమీద చేయివేసి-"మీమీద నాకూ కోపంగానే ఉంది. అందుకు కారణం మాత్రం ప్రేమ" అన్నది.
ముత్యాల్రావు చప్పున కళ్ళు తెరిచాడు-"నీకు నా మీదప్రేమలేదు. ప్రేమ ఉంటే ఆస్తంతా నీ పేరున ఉంచుకోవు-" అన్నాడు.
"ఆస్తి నా పేరున వున్నా అనుభవంమీదే! నా తదనంతరం నా ఆస్తి మీకే చెందుతుంది. ఆ విధంగా మీకు నన్ను హత్యచేసే అవకాశం కూడా ఇస్తున్నాను. ఇంకా ఏం కావాలి?" అంది శైలజ.
ముత్యాల్రావు ఉలిక్కిపడి-"అయితే నేను నిన్ను హత్య చేస్తానని అనుమానిస్తున్నావా?" అన్నాడు.
"అలా చేసినా బాగుండును. అప్పుడిలా రోజూ చావాల్సిన అవసరముండదు-" అని శైలజ కళ్ళు తుడుచుకుంది.
ముత్యాల్రావు నెమ్మదిగా-"నీకు చచ్చిపోవాలనుందా?" అనడిగాడు.
"నా విషయంలో మీరు తీర్చగల కోరిక అదొక్కటే నని నాకు తెలుసు. అదొక్కటీమాత్రం మిమ్మల్ని అడగను....." అంది శైలజ.
"అడక్కుండానే నీ కోరిక తీర్చగలనులే-' అనుకున్నాడు ముత్యాల్రావు.
ఉదయం లేచేసరికి అక్కడ గ్లాసులో నీళ్ళు లేవు. ఎందుకో ముత్యాల్రావు శరీరం వణికింది.
ఆఫీసుకు వెడుతూ ముత్యాల్రావు భార్యతో-"ఈ రోజు రీటాను ఇంటికి తీసుకుని వస్తాను....." అన్నాడు.
శైలజ తెల్లబోయి భర్త వంక చూసింది.
"ఈ కిషోర్ వ్యవహారం నాకు నచ్చలేదు. అందుకని...."
"మీరు తప్పు నామీదకు నెట్టాలని చూస్తున్నారు. అసలు మీరు రీటాతో తిరగాల్సిన అవసరమేమిటో చెప్పండి...."
"రీటా నేను చెప్పినట్లు వింటుంది. నువ్వు ణ మాట వినవు. నాకంటే డబ్బెక్కువున్నదన్న గర్వం నీకుంది."
"నాకు గర్వంలేదు...."
"అది నేను నమ్మాలంటే నువ్వా అయిదు లక్షలూ వదులుకోవాలి. అప్పుడు నేను నీకంటే ఆస్తిపరున్నవుతాను...."
"అంతేనా మీక్కావలసింది...."
"ఎస్.......అప్పుడు రీటా ఈ యింటి గడపతొక్కదు."
"మీరూ రీటా యింటి గడప తొక్కకూడదు...."
ముత్యాల్రావు కొద్ది క్షణాలు ఆలోచించి-"ఓ.కే-" అన్నాడు.
"నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరీరోజు రాత్రికి పెందరాళే యింటికి రండి-" అంది శైలజ.
"రాత్రికి కాదు. సాయంత్రానికే వచ్చేస్తాను. ఈ రోజు క్లబ్బుకు కూడా వెళ్ళను...." అన్నాడు ముత్యాల్రావు.
6
"అరే-ఈ రోజు పగలు వచ్చారేమిటి?" అంది రీటా.
"రాత్రికి పెందరాళే వస్తానని నా భార్యకు మాటిచ్చాను....."
"భార్యకు మాట ఇవ్వడమూ-అది నిలబెట్టుకోవాలనుకోవడమూ-.....అంటే మీలో రాకూడని మార్పు వచ్చినట్లే లెక్క!" అంది రీటా.
"ఈ మార్పువల్ల నాకు అయిదు లక్షలు లాభం-" అంటూ ముత్యాల్రావు జరిగినదామెకు చెప్పాడు. స్లో పాయిజన్ గురించి మాత్రం చెప్పలేదు.
"నిజంగా-" అంటూ బలంగా కౌగలించుకుందామె అతణ్ణి.
