"మీరు ఓ బిచ్చగాడిని ఉదయం కాలితో తన్నారు. అదే బిచ్చగాడికి నా ప్రాపకం లభించగానే రెండు చేతులూ జోడించి నమస్తే చెప్పారు. ఎంతటి సామాన్యుడికైనా సమాజంలో ఎటువంటి స్థానం కల్పించగలనో తెలుసుకుంటారని ఈ పని చేశాను...." అంది శైలజ.
"అంటే వాడు...." ముత్యాల్రావుకి నోట మాట రాలేదు.
"వాడి సంగతి తర్వాత.....ముందు మీ సంగతి ఆలోచించండి......"
3
ఏడాది క్రితం-
పరీక్ష ఫీజు కట్టడానికి ముత్యాల్రావు వద్ద డబ్బు లేదు. అన్నేళ్ళ చదువూ వృధా పోతుందని అతడికి బెంగగా వుంది. ఆ సమయంలో అతణ్ణి శైలజ కలుసుకుంది. ఫీజు తను కట్టింది.
"కృతజ్ఞతతో మీకు నేను కట్టుబడి పోయాను-" అన్నాడతను.
"కృతజ్ఞత అనకుండా మరో పేరు ఆలోచించండి-" అంది శైలజ.
అప్పటికే వారివురి మధ్యా కొంత ప్రేమ ఏర్పడిఉన్నది. అది ప్రేమ అని ఇద్దరికీ తెలియదు.
ముత్యాల్రావు మంచి వక్త. అతడి ఉపన్యాసాల్లోని ఆదర్శాలు విని ముగ్ధురాలైంది శైలజ. తనకు తెలియకుండానే అతణ్ణి అభిమానించసాగింది. ఆమె మొదటిసారి కలుసుకుని మాట్లాడినప్పుడు ముత్యాల్రావు వివరాలు సేకరించాడు. అంతస్థులో ఆమె తనకు అందనిదని గ్రహించి చాలా దూరంగా వున్నాడు. కాలేజీ ఫీజు కట్టేక వారి చనువు పెరిగింది. చివరికది వివాహానికి దారి తీసింది.
శైలజ తండ్రి ఈ వివాహాన్ని వ్యతిరేకించాడు. శైలజ మొండి పట్టు పట్టింది.
ఆఖరికి ముత్యాల్రావుకో మంచి ఉద్యోగంతోపాటు శైలజ దొరికింది. శైలజకు తండ్రి అయిదు లక్షలిచ్చాడు.
ముత్యాల్రావు దశ మారిపోయింది. దానితోపాటే అతడి బుద్ధీ మారిపోయింది.
* * *
"ఆ బిచ్చగాడి సంగతి తర్వాత......ముందు మీ సంగతి ఆలోచించుకోండి....."
శైలజ అన్న మాటలు ముత్యాల్రావు చెవుల్లో గింగురుమంటున్నాయి. శైలజ తన భార్య ఆమె తనను ఎంత మాటన్నది?
శైలజ అండ తనకు లేకపోయి ఉన్నట్లయితే తనూ గుర్తింపులేని బికారిగా తిరుగుతూండేవాడు. ఆ బిచ్చగాడికి మంచి వేషం వేసేసరికి తనకంటే డాబుగా తయారయ్యాడు.
ఉదయం తనన్నాడు-"భర్త పూర్తిగా నీ చెప్పుచేతల్లో ఉండాలనుకుంటే ఆ బిచ్చగాడిని చేసుకోవలసింది-" అని.
ఆ బిచ్చగాణ్ణి తను చేసుకుంటే యెలా ఉంటాడో శైలజ చేతల్లో చూపించింది.
తెల్లవారుఝాముదాకా ముత్యాల్రావుకి నిద్రపట్టలేదు. అప్పుడు మాత్రం గాఢంగా నిద్రపట్టింది. టైము ఎనిమిది దాటేక శైలజ అతణ్ణి లేపింది.
అతడు ఉలిక్కిపడి లేచి టైము చూసుకున్నాడు.
"రాత్రి మీకు సరిగ్గా నిద్రపట్టలేదా?" అంది శైలజ.
అతడు ముందు ఉలిక్కిపడ్డాడు. ఆపైన తడబడ్డాడు. జవాబు మాత్రం ఇవ్వలేదు.
"నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాను. అభిమానిస్తున్నాను. గౌరవిస్తున్నాను. అది నా అసమర్ధత కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. నా సహనానికి పరీక్షను పెట్టకండి-" అంది శైలజ.
ముత్యాల్రావు ఆలోచిస్తున్నాడు. శైలజ అందమైన యువతి. ధనికురాలు తనను ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తానంటోంది. ఆమెను తానెందుకు అలక్ష్యం చేస్తున్నాడు? ఆమె మనసు కష్టపెట్టాలని తానెందుకనుకుంటున్నాడు?
అతడికి బాబూరావు గుర్తుకొచ్చాడు.
4
ఆ రోజు ముత్యాల్రావు ఆఫీసుకు వెళ్ళలేదు. బాబూరావింటికి వెళ్ళాడు. సాయంత్రం నాలుగింటి వరకూ బాబూరావు ఇంటివద్దనే ఉంటాడు. అతడు బ్రహ్మచారి అయితే ఆడవాళ్ళ గురించి అతడికి వివాహిత పురుషుల కంటే చాలా ఎక్కువ తెలుసుకుని అనుభవ పూర్వకంగా ముత్యాల్రావు తెలుసుకున్నాడు.
ముత్యాల్రావు వెళ్ళేసరికి బాబూరావు ఇంట్లోనే ఉన్నాడు. గది తలుపులు సగం తెరిచి ఉన్నాయి. గది ఊడుస్తున్న పనిమనిషితో అతడు సరసాలాడుతున్నాడు. సిగ్గుపడుతూనే ఆ పిల్ల పనిచేసుకుని పోతున్నది. ముత్యాల్రావును చూస్తూనే-"రా-రా-కూర్చో-" అన్నాడు బాబూరావు.
ముత్యాల్రావు వెళ్ళి కూర్చున్నాడు.
"ఏమిటి విశేషం - ఈ సమయంలో వచ్చావ్!" అన్నాడు బాబూరావు.
"నీ సలహా కావాలి-అర్జంటుగా-" అన్నాఉ ముత్యాల్రావు.
"దేనికి?" అనడిగాడు బాబూరావు.
ముత్యాల్రావు జరిగింది చెప్పి౦"ఇప్పుడు నేనేం చేయాలి? నాకు తప్పు చేశానన్న అనుభూతి కలుగుతున్నది-" అన్నాడు.
బాబూరావు నవ్వాడు-"నీ భార్యకేదో అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు. కనీ రీటా గురించి నువ్వాలోచించడం లేదు. నీ భార్యకు వచ్చిన లోటేమిటి? సమాజంలో గౌరవస్థానమున్నది. ఆమె బిడ్డలకు రక్షణ ఉన్నది. రీటాకు అటువంటివేమీ లేవు. కొందరు మగవాళ్ళ సుఖం కోసం ఆమె తన జీవితాన్నే త్యాగం చేస్తున్నది. అయినా ఆమె నీ ఆలోచనల్లోకి రాలేదు. మన సమాజపు తీరే అంత! త్యాగమూర్తుల్ని గుర్తించదు. స్వార్ధపరులకు హారతి పడుతుంది-"
"నన్ను పెళ్ళి చేసుకోవడం ద్వారా నా భార్య మాత్రం త్యాగం చెయ్యలేదా?" అన్నాడు ముత్యాల్రావు.
"అని నేననుకోను. అయిదులక్షలు కూడా తీసుకురాగలిగిన ఆడదానికి నీకంటే మంచి మొగుడు దొరకలేదంటే అందుక్కారణమెదైనా ఉండదా? ఆమె వలవేసి నీ వంటి అమాయకుణ్ణి ఒకణ్ణి పట్టింది-"
ముత్యాల్రావు ఆవేశపడుతూ-"నా భార్య గురించి తప్పుడు మాటలు అనవద్దు. నేను సహించలేను-" అన్నాడు.
"నేనేమీ అనడంలేదు. ఆలోచించమంటున్నాను. నీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినో చెప్పమంటావా?" అన్నాడు బాబూరావు.
"ఊఁ."
"మన పూర్వీకులు చాలా తెలివైనవారు. ఆడదానికి మగవాడు మినహాయించి మరో రక్షణ ఉండకూడదన్నారు. ఆస్తికి, అధికారానికి అనర్హురాలన్నారు. ఎందుకు? డబ్బు, అధికారం చేతిలో ఉండే ఆడది నైతికంగా పతనమవుతుంది. అందుకేమాత్రమూ సందేహం లేదు. నా భార్య కనుక అయిదు లక్షలతో వస్తే ముందు ఆ డబ్బును నా పేరుకు మార్చుకుంటాను. ఆ తర్వాత ఒక సంవత్సరంలోగా ఆమెను ఫినిష్ చేస్తాను. రీటాలాంటి వాళ్ళను వెతుక్కుని హాయిగా కాలం గడుపుతాను-"
ముత్యాల్రావు ఆలోచనల్లో పడ్డాడు.
"ఏమిటాలోచిస్తున్నావ్?" అన్నాడు బాబూరావు.
"ఫినిష్ చేయడం అంత సులభమా!" అన్నాడు ముత్యాల్రావు.
"ఎంత సులభమో చెబుతాను....." అంటూ బాబూరావు లేచి గదిలోని బీరువా ఒకటి తెరచి ఓ చిన్న సీసా తీశాడు.
"ఇందులో చిన్న మాత్రలు వందకు పైగా వున్నాయి. వారానికి రెండు చొప్పున ఇవి తీసుకుంటే ఏడాది తిరక్కుండా చచ్చిపోవచ్చు. ఇది స్లో పాయిజన్. ఇది తీసుకుంటూండగా మధ్యలో డాక్టరు వద్దకు వెళ్ళేటంత సీరియస్ కంప్లయింట్సూ ఉండవు. ఉన్నట్లుండి ఓ రోజున ప్రాణం పోతుంది....."
