"ఏమిటి?" అంది శైలజ.
"నీ భర్త నువు గీచిన గీటు దాటకూడదనుకుంటే-అదిగో ఆ వెళ్ళిపోతున్నాడే-అలాంటి వాణ్ణి పెళ్ళాడాల్సింది నువ్వు...." అన్నాడతను.
శైలజ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె చటుక్కున చప్పట్లు కొట్టి ఆ ముష్టివాణ్ణి పిలిచింది. వాడు భయం గానే వెనక్కు వచ్చాడు.
"పదకొండింటికిరా-అన్నం పెడతాను-" అన్నదామె.
ముష్టివాడి మొఖం సంతోషంతో వెలిగిపోయింది.
ముత్యాల్రావు కామె మాటలు అర్ధమయినట్లు లేదు. అర్ధం చేసుకోవాలని ప్రయత్నించనూ లేదు. అయితే అతడికి కోపం మాత్రం వచ్చింది.
2
"ఈ రోజు మా ఆవిడతో పోట్లాడాను-"
"ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడా?" అన్నది రీటా.
"అంటే?"
"మీరు నా వద్దకు రావడం ప్రారంభించి రెండు నెలలు దాటింది. పోట్లాట ఎప్పుడో రావలసింది-..." అంది రీటా.
"మిగతా వాళ్ళకూ నాకూ చాలా తేడా వుందిగా.." అన్నాడు ముత్యాల్రావు గర్వంగా. అతడి అభిప్రాయంలో రీటా వద్దకు వచ్చే మిగతావాళ్ళు రహస్యాలను దాచిపెట్టలేరు.
"వాళ్ళకూ మీకూ మరో తేడా కూడా ఉంది!"
"చెప్పు...."
"నా వద్దకు వచ్చేవాళ్ళు కొంతమంది బ్రహ్మచారులు. పెళ్ళికి ముందు మీరు నా వద్దకు రాలేదు. అదొక తేడా! పెళ్ళయిన వాళ్ళెవ్వరూ పెళ్ళయిన ఒకటి రెండేళ్ళ దాకా నా వద్దకు రాలేదు. మీరైతే పెళ్ళయి ఆర్నెల్లయినా తిరక్కుండా...."
"ఇంకా ఏమైనా తేడాలుంటే చెప్పు...." అన్నాడు ముత్యాల్రావు.
"చెప్పను-" అంది రీటా.
"ఎందుకని?" అన్నాడు ముత్యాల్రావు.
"అది నా వృత్తి రహస్యం-" అని రీటా నవ్వి-"కానీ ఒక్క విషయం చెప్పగలను. నా వద్దకు వచ్చే వాళ్ళందరిలోనూ మీరంటేనే నాకు ఎక్కువ ఇష్టం-" అంది.
"ఈ పొగడ్త కూడా నీ వృత్తికి సంబంధించినదేనా?"
రీటా నవ్వి"మీ రెలాగనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా మనసులోని మాట చెప్పాను-" అంది.
ఉన్నట్లుండి ముత్యాల్రావు టైము చూసుకుని-"అబ్బా-అప్పుడే ఒంటి గంటయింది-" అన్నాడు.
"అప్పుడే ఒంటి గంటయిందా-మనిద్దరం ఒకచోట ఉన్నామంటే టైము తెలియదు...." అంది రీటా.
ముత్యాల్రావు లేచాడు.
"ఇంటికి వెళ్ళగానే పోట్లాట తప్పదేమోనూ!" అంది రీటా మళ్ళీ.
"పోట్లాటా-మరోటా? కుక్కిన పేనులా పడుంటుంది. అది పెళ్ళాం. నేను మొగుణ్ణి-" అన్నాడు ముత్యాల్రావు.
"నేను ఎవరికీ పెళ్ళాన్ని కాకపోవడం నా అదృష్టమనిపిస్తోంది మీ మాటలు వింటూంటే-" అంది రీటా.
"అసలీ లోకంలోని ఆడవాళ్ళంతా నీకులాగే ఉండి పెళ్ళాలన్నవాళ్ళు లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది-" అన్నాడు ముత్యాల్రావు. తన కోరిక తీరేది కాదన్న దిగులు కూడా అతడి కళ్ళలో కనబడుతోంది.
"ఈ విషయమై మీ భార్యా అభిప్రాయం కూడా అడిగి తెలుసుకోండి-" అంది రీటా.
ముత్యాల్రావు అదోలా నవ్వాడు. ఆ నవ్వులోనే ఆ యిల్లు వదిలాడతను. సరిగ్గా పావుగంటలో ఇల్లు చేరాడతను.
ఆ రోజు ఆశ్చర్యం.....
రోజూ అయితే అతడు కాలింగ్ బెల్ మ్రోగించాల్సి వచ్చేది. ఆ రోజు తలుపులు తెరిచే ఉన్నాయి.
అతడు గుమ్మంలో అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న శైలజ కనబడింది. ఆమెకు ఎదురుగా ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ఇద్దరి చేతుల్లోనూ పేకముక్కలున్నాయి.
ఎవరా యువకుడు? అన్నది ముత్యాల్రావు మెదడులో మొదటిసారిగా మెదలిన ప్రశ్న!
ఆ యువకుడి ముఖం అతడికి స్పష్టంగా కనబడుతున్నది. ఇంట్లో ఆ గదిలో ట్యూబ్ లైట్ ప్రకాశం పగలును మరిపించేలాగుంది.
అడుగుల చప్పుడు విని శైలజ చటుక్కున లేచి నిలబడి-"అరే-వచ్చేశారే-" అంది.
ముత్యాల్రావు మాట్లాడలేదు. ఆమె వంకా ఆ యువకుడి వంకా ఓసారి మార్చి మార్చి చూశాడు.
"అరే-మరిచేపోయాను-మీట్ మై ఫ్రెండ్ కిషోర్!" అంది శైలజ.
ఆ యువకుడు పేకముక్కలు బల్లమీద పడేసి-"నమస్తే!" అన్నాడు. ముత్యాల్రావు కూడా అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి - "నమస్తే!" అన్నాడు.
"కిషోర్-నువ్వింక వెళ్ళవచ్చు. మళ్ళీ రేపు రాత్రి పదింటికిరా-"అంది శైలజ. అతడు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆ యువకుడు తనకంటే అందంగా వున్నాడు. తన కంటే బలంగా ఉన్నాడు. తనకంటే ఆకర్షణీయంగా ఉన్నాడు. తనకంటే చలాకీగా ఉన్నాడు. అన్నింటికీ మించి తను లేనప్పుడు ఇంట్లో వున్నాడు. తను రాగానే వెళ్ళిపోయాడు.
"అలా అనుమానంగా చూడకండి. వచ్చినప్పట్నించీ కిషోర్ ఆ సోఫాలోనే ఉన్నాడు. వీధి తలుపులు అలా తీసే ఉన్నాయి. మీరు చెడిపోతున్నారని నేనూ చెడిపోవడం నా అభిమతం కాదు...." అంది శైలజ.
"ఎవరా కిశోర్?" అన్నాడు ముత్యాల్రావు.
"ఈ ప్రశ్నకు నేను చెప్పే జవాబు మీకు నచ్చదు. అసలు కిశోర్ ని పావు తక్కువ రెండుకల్లా పంపించేద్దామనుకున్నాను. మీరు రెండింటికి వస్తారు కదా మీ కళ్ళబడడు అనుకున్నాను. కానీ మీరు పెందరాళే వచ్చేశారు. రేపు కూడా ఇలాగే ఒంటిగంటం పావుకు వచ్చే మాటయితే ముందే చెప్పండి. కిషోర్ ని కాస్త ముందుగానే పంపించివేస్తాను....." అంది శైలజ.
"వాడు రేపు కూడా వస్తాడా-ఎందుకు?" అన్నాడు ముత్యాల్రావు.
"నా ఒక్కర్తికీ ఇంట్లో తోచడంలేదు. కాలక్షేపం కోసం అతన్ని రమ్మన్నాను-...." అంది శైలజ.
"తెగించావా?" అన్నాడు ముత్యాల్రావు.
శైలజ మాట్లాడలేదు.
"మాట్లాడవేం?" ముత్యాల్రావు రెట్టించాడు.
"ఏం మాట్లాడాలి?" అంది శైలజ.
"తెగించావా అనడిగాను. ఆ ప్రశ్నకు బదులివ్వాలి."
"అయ్యో-ఆ ప్రశ్న మీరడిగారా-ఇంకా నేనే అడిగానేమో మీరు బదులు చెబుతారేమోనని యెదురుచూస్తున్నాను...." అంది శైలజ.
ముత్యాల్రావుకు ఇంతా అంతా అనరాని కోపం వచ్చింది. పళ్ళ బిగువున దాన్ని అణుచుకుని-"కాల క్షేపానికి ఏ పక్కింటి అమ్మాయినో రమ్మనొచ్చుగా-" అన్నాడు.
"అలా అడక్కపోవడానికి రెండు కారణాలున్నాయి-" అంది శైలజ.
ముత్యాల్రావు వినడానికి సిద్దంగా ఉన్నాడు. మాటల్లో భార్య చాలా తెలివైనదని అతడికి తెలుసు. అందువల్ల అతడికి కాస్త భయంగా కూడా ఉన్నది.
"మనింటికి మంచి పేరు లేదు. అర్ధ రాత్రిపూట ఆడపిల్లల్ని ఎవ్వరూ మనింటికి పంపరు-అది మొదటి కారణం-" అంది శైలజ.
"రెండో కారణం కూడా చెప్పు, విని సంతోషి స్తాను...." వెటకారంగా అనాలనుకున్నప్పటికీ కాస్త ఇబ్బందిగానే అతడామాట అన్నాడు.
