Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 18


                                 స్లో పాయిజన్
                                                     ---జొన్నలగడ్డ రామలక్ష్మి


    "మీరు రాత్రి రెండింటికి ఇంటికొచ్చారు-" అంది శైలజ.
    "టైము చూడలేదు. కానీ ఆలస్యంగా వచ్చానని తెలుసు-" అన్నాడు ముత్యాల్రావు అలక్ష్యంగా.
    "ఆలస్యం ఎందుకయింది?"
    "క్లబ్బులో పేకాడుతున్నాను. స్నేహితుల బలవంతంమీద చాలాసేపుండిపోయాను. టైము తెలియలేదు-"    
    "మీరు క్లబ్బునుంచి రాత్రి పదింటికే బయల్దేరారు" అంది శైలజ తాపీగా.
    ముత్యాల్రావు తడబడుతూ-"ఏమో-నేను టైము చూడలేదు-" అన్నాడు.
    "టైము చూసినా చూడకపోయినా క్లబ్బునుంచి ఇంటికి రావడానికి పావుగంట చాలు కానీ మీకు నాలుగు గంటలు పట్టింది-" అంది శైలజ.
    "అయితే ఏమంటావ్?"
    "మీరు రీటా యింటినుంచి మనింటికి వచ్చారని నాకు తెలుసు-"
    ముత్యాల్రావు కంగారుగా - "రీటా యెవరు?" అన్నాడు.
    "క్లబ్బునుంచి మనింటికి రావడానికి నాలుగ్గంటలు పట్టడానికి కారణమేమిటీ అని ఆలోచించండి. రీటా ఎవరో గుర్తుకు వస్తుంది-"
    "నువ్వు నామీద డిటెక్టివుల్ని నియమిస్తున్నావా?"
    "రీటా ఎవరో గుర్తుకొచ్చిందా?" అంది శైలజ.
    "ఇంతకీ నీ ఉద్దేశ్య మేమిటి?" అన్నాడు ముత్యాల్రావు.
    "ఇంకా అర్ధం కాలేదా?" అంది శైలజ.
    భార్యాభర్తలిద్దరూ ఒకరివంక ఒకరు చూసుకున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్ధులు అనుకోకుండా ఒకరి కొకరు ఎదురుపడితే బహుశా అలాగే చూసుకుంటారేమో!
    "అర్ధంకాలేదు-" అన్నాడు ముత్యాల్రావు.
    "అర్ధమయ్యేలా చెప్పమంటారా?" అంది శైలజ.
    "వద్దు-" అన్నాడు ముత్యాల్రావు.
    "నా మనసులోని మాటను క్లుప్తంగా ఒక్కమాటలో అదీ రెండక్షరాల్లో చెప్పారు. చాలా థాంక్స్!" అంది శైలజ.
    "ఏమన్నావ్?"
    "మీరు క్లబ్బుకు వెళ్ళవద్దు రీటా దగ్గరకు వెళ్ళవద్దు. వద్దు అంటే అర్ధమిదే!" అంది శైలజ.
    "ఎందుకని వెళ్ళకూడదు?"
    "ఎందుకు వెళ్ళాలి?"
    ముత్యాల్రావు అదోలా ఆమెవంక చూసి-"ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. తర్వాత నీ ప్రశ్న సంగతి ఆలోచిస్తాను-" అన్నాడు.
    "మీరు ఆఫీసునుంచి ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూంటాను. నాకోసం మీరు తిన్నగా ఇంటికి రావాలి. మనం కలిసి తిరగాలి. కష్టసుఖాలన్నీ కలిసి అనుభవించాలి-" అంది శైలజ.
    "కష్టాలన్నీ నేను ఎప్పుడో అనుభవించేశాను. నాకు సుఖాలమీదనే మోజు-...."
    "పోనీ మనిద్దరం ఎప్పుడూ కలిసివుంటే-అదే సుఖం కాదా!"
    "నేను సుఖాలను వెతుక్కుంటున్నాను. నీ నుంచి దూరంగా పోవడంలో నాకు సుఖం కనబడుతోంది. క్లబ్బులో సుఖం కనబడుతోంది. రీటాలో సుఖం కనబడుతోంది-...." తెగించి అన్నాడు ముత్యాల్రావు.
    "ఈ విషయం మీరు నాకు పెళ్ళికిముందు చెప్పలేదు-"
    "పెళ్ళికి ముందు ఈ విషయం నాకు తెలియదు...."
    "నాలో సుఖం ఎందుకు కనిపించదు మీకు?" అంది శైలజ.
    "అది నేనేం చెప్పగలను?"
    "నేను మీ జీవితానికో అర్ధాన్నిచ్చాను...."
    "అర్ధం అంటే డబ్బు అయితే నీ మాట నిజమే!"
    శైలజ క్రూరంగా అతడివంక చూసింది-"పెళ్ళికి ముందు ఎన్ని కలలు కన్నాను? అయిన వాళ్ళందరినీ ఎదిరించి ఒప్పించి మిమ్మల్ని చేసుకున్నాను. చివరికిలాగయింది-"
    "పెళ్ళయ్యాక బయట సుఖాలను వెతుక్కోవడం మగవాడికి సహజం. క్లబ్బులో నా స్నేహితులందరూ ఇదే పని చేస్తున్నారు...."
    "అందుకే మిమ్మల్ని క్లబ్బుకి వెళ్ళొద్దంటున్నాను..."
    "నేను వెడతాను...."
    "వీల్లేదు...."
    "నువ్వెవరు నన్ను శాసించడానికి?"
    "కట్టుకున్న భార్యను. ఈ రోజునుంచీ మీరు నేను గీచిన గీటు దాటడానికి వీల్లేదు...."
    "దాటడం సంగతి అటుంచు. నిన్నసలు గీత గియ్యనివ్వను....."
    "అయితే ఏం జరుగుతుందో తెలుసా?"
    "నీ బెదిరింపులకు నేను లొంగను...."    
    "నేను లొంగదియ్యగలను మిమ్మల్ని...."
    ఉన్నట్లుండి ముత్యాల్రావు అదోలా నవ్వాడు. అతడు చటుక్కున వీధి గుమ్మంలోకి వచ్చాడు. అలా దారిన పోతున్న ముష్టివాడొకడు కనిపించాడు. "ఒరేయ్-ఇలా రా!" అని ముత్యాల్రావు వాణ్ణి పిలిచాడు.
    వాడు వెంటనే గుమ్మంలోకి వచ్చాడు. వాడి కళ్ళలో ఆశ మెరుస్తోంది.
    ఆ ముష్టివాడి వయసు పాతికేళ్ళకు మించదు. మనిషి దృఢంగానే ఉన్నాడు. రంగు మరీ అంత నలుపు కాదు. గెడ్డం బాగా మాసి వుంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఆ కళ్ళలో ఆకలి....
    ముత్యాల్రావు జేబులోంచి ఓ రూపాయనోటు తీశాడు. "ముష్టివాడు ఆశగా చేతులు చాపాడు.
    ముత్యాల్రావు వాడికా నోటు అందించాడు. ముష్టి వాడికి కలిగిన ఆనందమింతా అంతా కాదు. తనకు చేతనైనంతగా ముత్యాల్రావును పొగిడి వెనక్కు తిరిగాడు వాడు.
    అప్పుడు ముత్యాల్రావు వాడిని ఫెడీమని తన్నాడు.
    అనుకోకుండా దెబ్బ తగలడంవల్ల ముష్టివాడు బోర్లా ముందుకు పడిపోయాడు. వాడు మళ్ళీ లేవడానికి కొద్ది క్షణాలు పట్టింది.
    "ఏంటి బాబూ ఇది!" అన్నాడు వాడు.
    ముత్యాల్రావు వాణ్ణి సమీపించాడు. ముష్టివాడు భయంగా తన చేతిలోని రూపాయినోటును గట్టిగా పట్టుకుని - "ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకోడం అన్యాయం బాబూ!" అన్నాడు.
    ముత్యాల్రావు నవ్వి - "నేను డబ్బు తీసుకుందుకు రాలేదు. నేను నిన్ను అకారణంగా తన్నాను కదా-అందుకు నీకు కోపం వచ్చిందో లేదో తెలుసుకుందామని!" అన్నాడు.
    "ముష్టి వెధవని-నాక్కోపమేమిటి బాబూ!" అన్నాడు వాడు.
    "అయితే రోజూ ఇదే టైముకి ఇక్కడకు రా! ఓ రూపాయిచ్చి ఓ తాపు తంతుంటాను-" అన్నాడు ముత్యాల్రావు.
    ముష్టివాడు చటుక్కున అతడి పాదాలమీద వాలి-"తప్పకుండా వస్తాబాబూ!" అన్నాడు.
    ముత్యాల్రావు వెనక్కు తిరిగాడు. గుమ్మంలో నిలబడి శైలజ ఇదంతా చూస్తోంది. అతడామెను సమీపించి-"అర్ధమయిందా?" అనడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS