ఉన్నట్లుండి తెరమీద ఓ విదేశీయుడు కనిపించాడు. వ్యాఖ్యాత అతడు సీఐఏ ఏజెంట్ అని చెప్పాడు.
ఆ నాయకుణ్ణి భానోజీరావు గుర్తించాడు. అతఃడు ఒక్కోసారి కూడా ప్రధానమంత్రి కాకపోయినా-అయే అవకాశమున్నదని కూడా ఎవరూ అనుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా అతడి పేరు ప్రచారంలో లేదు.
సీఐఏ ఏజంటుకు అతడు భారతదేశానికి సంబంధించిన కొన్ని రహస్యాలు చెబుతున్నాడు. అతడు వింటున్నాడు. వినడం పూర్తయ్యాక అతడో కాగితం ఇచ్చాడు. నాయకుడు దానిమీద ఓ అంకెవేశాడు.
ముఫ్ఫైవేల డాలర్లు.
అవి స్విస్ బ్యాంకులోకి వెడతాయి.
వ్యాఖ్యాత కొనసాగిస్తున్నాడు - "ఈ నాయకుడి వెనుక అసలైన మరో ప్రముఖనాయకుడున్నాడు......వీరిద్దరూ కలిసి....."
మళ్ళీ తెరమీద చీకటి.....
గదిలో వెలుగు.
"ఇదీ మన దేశాన్నేలే ప్రజానాయకుల కథ...." అన్నాడు స్కల్.
"అంటే?" అన్నాడు భానోజీరావు.
"దేశభక్తి ప్రజలకోసం. దేశం నాయకుల కోసం. నీ దగ్గరున్న బంగారాన్ని నువ్వు అమ్ముకోవచ్చు. తాకట్టు పెట్టుకోవచ్చు. యేమైనా చేయవచ్చు....." నాయకులు దేశాన్ని స్వంత ఆస్తిలా వాడుకుంటున్నారని చెప్పడానికి ఇదో మచ్చుతునక మాత్రం...."
భానోజీరావు మనసేదోలాగైపోయింది.
"మిష్టర్ భానోజీరావు! ఇలాంటి ఆధారాలు నావద్ద కోకొల్లలు...."
"ఎలా సంపాదించావివన్నీ...." అన్నాడు భానోజీరావు.
"అది నీకు అనవసరం. కానీ నేను నిన్నో విషయం అడగదల్చుకున్నాను. నావద్దనున్న ఆధారాలలో కొన్ని నీకిస్తాను. ఏమైనా చర్య తీసుకోగలవా?" అన్నాడు స్కల్.
"ష్యూర్!" అన్నాడు భానోజీరావు ఉత్సాహంగా.
"అప్పుడే మవుతుందో తెలుసా?"
"బహుశా నాకు ప్రమోషన్ వస్తుంది...." అన్నాడు భానోజీరావు.
"అవును ప్రమోషనే.....మోహన్ కు ముందు అయిదు గురు ఇన్ స్పెక్టర్సుకు ఈ లోకంనుంచి ఆ లోకానికి ప్రమోషన్ వచ్చింది....." అన్నాడు స్కల్.
"ఏమిటీ?" అన్నాడు భానోజీరావు.
"వాళ్ళకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను. దేశభక్తి అనే ఆవేశానికి లోనై తప్పటడుగులు వేయవద్దని! వాళ్ళు వినలేదు. ఫలితాలకు భయపడకుండా దోషుల్ని బయట పెడతామన్నారు. ఫలితంగా సాక్ష్యాలతోసహా దగ్ధమై పోయారు. కావాలంటే అందుకూ ఋజువులు చూపించగలను...." అన్నాడు స్కల్.
మళ్ళీ గదిలో చీకటి....
తెరమీద వెలుగు.....
ఈ పర్యాయం భానోజీరావుకూ జ్ఞానోదయమైంది.
"లైట్సాన్....." అతడే అరిచాడు.
* * *
"మరీ ఇంత ఘోరమా? అన్నీ తెలిసికూడా...."
"ఈ దేశంలో అన్నీ అందరికీ తెలిసే జరుగుతున్నాయి. అయినా ప్రజలు తెలిసి కూడా దోషులకే పట్టం కడుతున్నారు...." అన్నాడు స్కల్.
"ఇంతకీ నీ ఆశయం ఏమిటి?"
స్కల్ నవ్వి-"మనిషి అసలు స్వరూపం అస్థిపంజరం. దానిచుట్టూ రక్తమాంసాలు పోగై చర్మం కప్పితే మనిషి అవుతున్నాడు. ఆరంభంలో వున్నదీ, చివరకూ మిగిలేదీ అస్థిపంజరం మాత్రమే! మానవ జీవితానికి సంబంధించిన యథార్ధనికీ హెచ్చరికగా వుండే స్కెలిటన్ పేరును నేను స్వీకరించాను. అందులో స్కల్ ను నేనయ్యాను. అస్థిపంజరం భయంకరంగా అసహ్యంగా వుండవచ్చు. ప్రతి మనిషిలోనూ అటువంటి యధార్దాలుంటాయి. ఆ యధార్దాల విషయంలో హెచ్చరిస్తూ-వారిని అదుపులో వుంచడం కోసమే స్కెలిటిన్ గ్రూపు ప్రారంభమైంది-" అన్నాడు.
"ఇంత పకడ్బందీగా వ్యవహారాలు నడుపగలుగుతున్న నువ్వు ఆ నేరాలను నువ్వెందుకు బయట పెట్టలేకపోతున్నావు?" అన్నాడు భానోజీరావు.
"దీనికి జవాబు ముందే చెప్పాను...." అన్నాడు స్కల్ -"దేశ నాయకులందరూ ఇంచుమించు దోషులే అయినప్పుడు అది బయటపెట్టడం వల్ల దేశంలో అరాచక మేర్పడుతుంది-"
భానోజీరావు ఆలోచిస్తూ-"అదీ నిజమే! అయితే మీ స్కెలిటన్ గ్రూపుకు చెడ్డపేరు రావడానికి కారణం?" అనడిగాడు.
"అసలు మా గ్రూపు ఎక్కడా దేశవిద్రోహకర కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అయితే దేశ విద్రోహకర శక్తులు పాలకవర్గంలో ప్రముఖ స్థానాలు వహించి వుండడంవల్ల ఏదోవిధంగా మా గ్రూపును దెబ్బతీయాలని చాలామంది చూస్తున్నారు. ఎక్కడ ఎటువంటి నేరం జరిగినప్పటికీ మా గ్రూపును ఇరికించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా మాపై చర్య తీసుకునే దమ్ములెవరికీ లేవు. అందుకని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతివారూ మా పేరు ఉచ్చరిస్తూంటారు. ఇందువల్ల ఎన్నో కేసులు తప్పుదారినిబట్టి పరిష్కరించబడకుండా వుండిపోతున్నాయి-" అన్నాడు స్కల్.
"ఇప్పుడు నేనేం చేయాలి?" అన్నాడు భానోజీరావు.
"అది నీ అదృష్టం నిర్ణయిస్తుంది-" అన్నాడు స్కల్.
10
భానోజీరావుకు మెలకువ వచ్చేసరికి ఓ గదిలో మంచం మీద వున్నాడు. అతడు గది పరిశీలించి చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ గది ఎక్కడో చూసినట్లుంది.
"నేనిప్పుడెక్కడున్నాను?" అన్నాడు భానోజీరావు అప్రయత్నంగా.
"మనింట్లోనే-"ఓ గొంతు వినిపించింది.
"అరే-ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్లుందే" అన్నాడతను.
"ఎక్కడో వినట్లుండడమేమిటండీ - నేను మీ భార్యనైతే....."
"భానోజీరావుకు మత్తు పూర్తిగా విడిపోయింది. తనిప్పుడు తన యింట్లో తన భార్య సమక్షంలో వున్నట్లు గుర్తించాడతను.
"నేనిక్కడికెలా వచ్చాను?"
"ఇద్దరు కాన్ స్టేబుల్సు మిమ్మల్ని స్పృహలేని స్థితిలో ఇంట్లో అప్పగించి కంగారేమీ లేదని చెప్పి వెళ్ళారు. అసలేం జరిగిందండీ-" అన్నదామె.
భానోజీరావుకు ఆశ్చర్యంగా వున్నది. తను చూసింది కలా, నిజమా అన్న సందిగ్ధంలో పడ్డాడతను. బార్యతో ఏమీ చెప్పకుండా కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నాడతడు. అతడు తీవ్రాలోచనలో వున్నాడని గుర్తించి శ్రీమతి కూడా అతన్నింక మాట్లాడించలేదు. అయితే కొద్దిక్షణాల్లోనే ఆమె రావలసి వచ్చింది. అతన్ని మాట్లాడించవలసీ వచ్చింది.
"మీకోసం ఎవరో వచ్చారు!"
"పేరు....."
"మోహన్....."
భానోజీరావు చటుక్కున లేచాడు. అతఃడికి మోహన్ తో మాట్లాడవలెనని ఆత్రుతగా వున్నది.
తను కొందరు ప్రముఖుల రహస్యాలు తెలుసుకున్నాడు. ఇప్పుడేం చేయాలి?
మోహన్ కి కూడా తనకులాంటి అనుభవమే ఎదురయిందా?
స్కెలిటన్ గ్రూప్ విషయమై ఏం చేయాలి?
అతను హాల్లోకి వెళ్ళాడు.
"హల్లో భానోజీరావ్! నీ కేసు నేను పూర్తి చేశాను...." అన్నాడు మోహన్.
"నా కేసు ఏమిటి?"
"గోపాలం హత్యకేసు...."
భానోజీరావు ఆ విషయమే మరిచిపోయాడు. గోపాలం పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు.
"పూర్తి చేశావా-అది యాక్సిడెంటేనా?"
"కాదు-హత్య....."
"హంతకుడెవరు?"
"డ్రైవర్ రాములు...."
"మోటివ్...."
"డబ్బు...."
భానోజీరావు కుర్చీలో కూలబడి-"కాస్త వివరంగా చెప్పు-" అన్నాడు.
"పదివేలకోసం రాములు ఈ హత్య చేశాడు...." అన్నాడు మోహన్.
"ఊఁ" అన్నాడు భానోజీరావు.
"దుర్గ సత్యాన్ని ప్రేమించింది. సత్యమంటే శేఖరానికి ద్వేషం. అందుకని చెల్లెల్ని గోపాలానికిచ్చి చేయాలనుకున్నాడు. అయితే అప్పటికే వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటైనారని తెలియడంతో శేఖరం అప్సెట్టయ్యాడు. అతడివద్ద డబ్బేమీలేదు. గోపాలం అకౌంట్లో జతపడిన లక్షయాభైవేలూ శేఖరం స్వంతం అవాలంటే గోపాలం చావాలి. ముగ్గురూ కలిసి పథకం వేశారు. సత్యం డ్రైవర్ రాముల్నిపట్టాడు. అంతా కలిసి హత్య జరిపించేశారు. గోపాలం పోగానే నువ్వు రంగంలోకి దిగావు. సగం నిజం, సగం అబద్ధం చెప్పి ముగ్గురూ నిన్ను కన్ ఫ్యూజ్ చేశారు. పరస్పర ద్వేషం వున్నట్లుగా వాళ్ళు నటించినా అది నటన మాత్రమే! డ్రైవర్ రాములు తో సహా అందరి దగ్గర్నుంచీ వాంగ్మూలాలు తీసుకుని రికార్డు చేశాను-" అన్నాడు మోహన్.
"సత్యాన్నీ, శేఖరాన్నీ ఎలా అనుమానించావ్!" అన్నాడు భానోజీరావు.
"అనుమానించడమెందుకు-కేసు స్పష్టంగా కనబడుతూంటే! కేవలం స్కెలిటన్ గ్రూపు కారణంగా నీ బుర్ర పెడదారి పట్టింది...." అని-"మైడియర్ ఫ్రెండ్ ఒకే విషయం గుర్తుంచుకో నువ్వు. ఎప్పుడైనా ఎవరైనా ఇద్దరు ఒకే కేసులో నీ అనుమానాన్ని స్కెలిటిన్ గ్రూపుమీదకు తోయడానికి ప్రయత్నించారో-వాళ్ళిద్దరూ లాలూచీ అని గ్రహించు-" అన్నాడు మోహన్.
"మెనీ-మెనీ-థాంక్స్...." అన్నాడు భానోజీరావు ఓ నిర్ణయానికివస్తూ.
-:అయిపోయింది:-
