Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 16


    "అంటే?"
    "భారతదేశం జనాభా ఎనభైకోట్లు అనుకోవచ్చు. ఇందులో ఎంతమందికి తల్లిదండ్రుల పేర్లు తెలుసూ అంటున్నాను-" అన్నాడు స్కల్.
    సంభాషణ తప్పుతున్నదని గ్రహించాడు భానోజీరావు-"నన్నిక్కడికి ఎందుకు పిలిపించావు?"
    "డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మోహన్ నీ గురించి చెప్పాడు...."
    "మోహన్-" అనుకున్నాడు భానోజీరావు మనసులో. అతడు తన డిపార్టుమెంట్లోని వ్యక్తి. కానీ అతడికి స్కెలిటన్ గ్రూపుతో సంబంధముంది. లేకపోతే ఈ విధంగా తానిక్కడికి రప్పించబడి వుండేవాడుకాదు.
    "ఏమని చెప్పాడు?"
    "నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావని!"
    "నేను నిన్ను చూడాలనుకోలేదు. పట్టుకోవాలనుకున్నాను...." అన్నాడు. భానోజీరావు.
    "పోనీ-అందుకే.....నిన్ను పట్టుకున్నాను....."
    "అందుకే అంటే?"
    "నీకు తెలుసో తెలియదో - ఇంతవరకూ ఏడుగురు పోలీసు ఇన్ స్పెక్టర్సుని నేను పట్టుకున్నాను. నువ్వు ఏడో వాడివి...."
    అందులో అయిదుగురు పోయారన్న విషయం భానోజీరావుకు స్ఫురించగా అతడి వళ్ళు జలదరించింది. ఎంత సులభంగా వీళ్ళు తనని పట్టుకున్నారు?    
    "తెలుసు....."
    "మేము పట్టుకున్నవారిలో ప్రాణాలతో వున్నవాడు మోహన్. ఆ తర్వాత అలాంటి అవకాశం నీకే వుంది."
    "అవకాశం వున్నదా, సంపాదించుకోవాలా?"
    "తెలివైన ప్రశ్న-" అని నవ్వాడు స్కల్.
    భానోజీరావు మాట్లాడలేదు. అతను చుట్టూ చూస్తున్నాడు.
    అది అత్యంత ఆధునికంగా అలంకరించబడిన గది. అందులో ఎదురెదురుగా రెండు సోఫాలు. ఓ సోఫాలో స్కల్. రెండో సోఫాలో తను!
    "నీకు నేనేమీ చెప్పను. అంతా నీ అదృష్టంమీద ఆధారపడి వుంటుంది. నువ్వు మాతో ఇక్కడ కొంత సేపు గడుపుతావు. కొన్ని విచిత్రాలు చూస్తావు. పవిత్రభారతదేశం గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటావు. ఆ తర్వాత ఇక్కన్నించి బయటపడతావు. ఆపైన అదృష్టముంటే బ్రతుకుతావు...." అన్నాడు స్కల్.
    భానోజీరావు అంతా మౌనంగా విన్నాడు.

                                 *    *    *

    "ఇది దియేటర్!" అన్నాడు స్కల్. అక్కడ చలనచిత్ర ప్రదర్శనకు అనువైన ఏర్పాట్లన్నీ వున్నాయి.
    ఓ పాతిక కుర్చీలు కూడా వున్నాయి.
    కుర్చీల్లో స్కల్, భానోజీరావు కూర్చున్నారు.
    ఎదురుగా వెండి తెర!
    ఉన్నట్లుండి గది చీకటైపోయింది. వెండితెర మరింత ప్రకాశవంతమైంది.
    భానోజీరావు సినిమా చూస్తున్నాడు.
    ముందు ఏదో సబ్బుల కంపెనీ అడ్వర్టయిజ్ మెంట్! ఓ ప్రముఖ చలనచిత్ర తార ఆ సబ్బు తన సౌందర్యాన్నెలా పెంచిందో వివరించింది. ఆమె స్నానంచేస్తున్న దృశ్యాలు ఎక్కడా అసభ్యత లేకుండా చిత్రీకరించబడ్డాయి. అది ముగియగానే-"ఇది ప్రజలకోసం అన్న వాక్యాలు వచ్చాయి. ఆ తర్వాత తెరమీద ఓ ముఖం కనబడింది. తెర వెనుకనుంచి వ్యాఖ్యానం వినబడసాగింది.
    "ఈయన ప్రముఖులు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరు. చలనచిత్రాల్లో అసభ్యతను ఏమాత్రమూ సహించరు. వీరి కారణంగా భారతీయ చలనచిత్రాల్లో నైతిక విలువల స్థాయి పడిపోకుండా ఆగిపోయింది.....ఏదైనా చలనచిత్రం చూసినపుడు వీరు కొన్ని అభ్యంతరాలు చెప్పుతూంటాడు. ఆ అభ్యంతరాలు చెప్పుకోదగ్గవి కాదని నిర్మాతలు వారిని కన్విన్స్ చేయాలి. అదెలాగంటే?"
    వ్యాఖ్యానం ఆగిపోయింది.
    ఫిలింసెన్సార్ బోర్డు మెంబరు యిప్పుడు నడుస్తున్నాడు. ఆయన ఓ గదిలో ప్రవేశించాడు. ఆ గదిలో.....
    ఇందాకా సబ్బు గురించి ప్రచారం చేసిన తారవున్నది.
    ఇద్దరూ పరస్పరం చూసుకున్నారు.
    మళ్ళీ వ్యాఖ్యానం ప్రారంభమయింది. వ్యాఖ్యానం తెరమీది నటుల నటనకు అనుగుణంగా వున్నది.
    "సిద్దమేనా-అంటున్నారు గౌరవసభ్యులు. సిద్దమే అంటున్నది తారామణి. నా చిత్రంలో మీకు కనబడిన అభ్యంతరాలేమిటి-అంటున్నది నటీమణి. నిన్ను చూస్తే ప్రజల మనసులో ఎలాంటి సంచలనం కలుగుతుందో చూడాలని వచ్చాను-అంటున్నారు గౌరవ సభ్యులు.."
    వ్యాఖ్యానం కొనసాగుతున్నది. భానోజీరావు చూస్తున్నాడు.
    అతడు.....ఆమె....
    ఇద్దరూ పక్కనే వున్న స్నానాల గదిలో ప్రవేశించారు.
    అదే గది....
    ఇందాకా సబ్బుల కంపెనీ అడ్వర్టయిజు మెంటు కుపయోగపడిన స్నానాల గది.....
    తార స్నానానికి సిద్దపడుతున్నది.
    సెన్సారు బోర్డు సభ్యుడు చూస్తున్నాడు.
    ఆమె బట్టలు విడిచింది. షవరు తిప్పింది. స్నానం చేస్తున్నది.
    ఆమె చేతిలో సబ్బు. అదే సబ్బు! ఇందాకా ప్రచారాని కుపయోగపడిన సబ్బు.....ఆ సబ్బుతో ఆమె వళ్ళు రుద్దుకుంటున్నది.
    ఇందాకటి చిత్రానికీ ఈ చిత్రానికీ తేడాలేదు. ఎటొచ్చీ ఇందులోని కొన్ని సన్నివేశాలు మాత్రమే అందులోకి తీసుకోబడినాయి.
    నటీమణిపై కెమేరా వేగంగా తిరుగుతున్నది. ఆమె సభ్యంగా కనబడినపుడు-ఇది ప్రజలకోసం.....అనీ అసభ్యంగా కనబడినప్పుడు-ఇది గౌరవసభ్యునికోసం.....అనీ వ్యాఖ్యాత చెబుతున్నాడు.
    తార స్నానం ముగిసింది.
    తెరమీద చీకటి....
    గదిలో వెలుగు....
    "తర్వాతేం జరిగిందో నీవు తెలుసుకోనవసరం లేదు. ఆ తార నటించిన సినిమా సెన్సారయిందని గ్రహిస్తే చాలు...." అన్నాడు స్కల్.
    "ఏమిటిదంతా?" అన్నాడు భానోజీరావు.
    "కొందరు తమ పదవుల నెలా దుర్వినియోగం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇదో మచ్చుతునక...." అన్నాడు స్కల్.
    "ఇది నువ్వు బయటపెట్టవా?" అన్నాడు భానోజీరావు.
    "బయట పెట్టడంవలన ప్రయోజనం?"
    "ఒక దోషి నిరూపించబడతాడు....."
    "దోషి ఒక్కడే అయినప్పుడు నీవు చెప్పింది నిజం."
    "అంటే?"
    "దోషికి పదవి వచ్చిందని నీవనుకుంటున్నావు. పదవి వచ్చిన ప్రతివాడూ దోషిగా మారుతున్నాడని నేను గ్రహించాను...."
    "అయితే ఏం చేస్తావు?"
    "దోషిని బయటపెట్టి నేను చేయగలిగిందేమీ లేదు. అందుకే దోషిని అదుపులో వుంచే సాధనాలకోసం వెతుకుతున్నాను నేను. ఆ గౌరవ సభ్యుడు కూడా తను నటించిన ఈ చిత్రం చూశాడు. నేనంటే అతడికిప్పుడు భయం!"
    భానోజీరావు ఆలోచనలో పడ్డాడు.
    "లైట్సాఫ్!" అన్నాడు స్కల్.
    మళ్ళీ గదిలో చీకటి.
    తెరమీద వెలుగు.....
    ఆ వెలుగులోంచీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు.
    వ్యాఖ్యానం ప్రారంభమయింది.
    "దేశానికి ప్రధానమంత్రి కావాలన్నది ఈయన కల. అది తీరడం కోసం ఏమైనా చేయాలన్నది ఈయన సంకల్పం. ఈయన సంకల్పబలం అసామాన్యం. ఈయన ఇప్పుడెవరితో మాట్లాడుతున్నారో చూడండి...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS