Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 15


    "ఈ తాళాలు మీ లారీ డ్రైవర్ వయుండాలి. అవి మీకు తెలియకుండా అతడి వద్దకు వచ్చాయా-లేక...."
    వరాలయ్య నవ్వి-"ఇవి మా లారీ డ్రైవర్ వని నే ననుకోవడం లేదు. వాడు అత్యంత సామాన్యుడు. స్కెలిటన్ గ్రూపులాంటి ప్రమాదకర సంస్థల్లో పనిచేసే మనిషి కాడు-" అన్నాడు.
    "మరయితే హత్యా ప్రదేశంలోకిదెలా వచ్చిందంటారు?"
    వరాలయ్య నవ్వి - "మీకు తెలియకే నన్నడుగుతున్నారా? ఈ తాళాలగుత్తి హతుడిది కావచ్చు. హత్య జరిగిన ఇంట్లో యెవరిదైనా కావచ్చు-" అన్నాడు.
    "ఛీ-నేను నిజంగా ట్యూబ్ లైట్ నే-"అనుకున్నాడు భానోజీరావు. అతడికి మిత్రవర్గంలో ట్యూబ్ లైటు అన్న పేరుంది. ఆ పేరు పోగొట్టుకోవాలని అతడెన్నో ప్రయత్నాలు చేశాడు. డిపార్టుమెంట్లో సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ మిత్రవర్గంలో మాత్రం అతడీ పేరు పోగొట్టుకోలేక పోతున్నాడు.
    "స్కెలిటన్ గ్రూపు గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు?" అన్నాడు భానోజీరావు.
    "చెప్పడం నాకుగానీ, తెలుసుకోవడం మీకుగానీ మంచిదికాదు. స్కెలిటన్ గ్రూపు లేదనే అనుకోండి. మీకూ నాకూ చాలా మంచిది-" అన్నాడు వరాలయ్య.
    "పోలీసు డిపార్టుమెంటంటే చాలామందికి భయం పోయింది-" అనుకున్నాడు భానోజీరావు. వరాలయ్య ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకు కారణం?
    "నా మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. మీకు తెలిసింది చెప్పండి-" అన్నాడు భానోజీరావు కాస్తకోపంగా.
    "హోటల్ యశ్వంత్ తెలుసా మీకు?" అన్నాడు వరాలయ్య.
    హోటల్ యశ్వంత్ ప్రారంభమై రెండు సంవత్సరాలయింది. కాకినాడలో న్యూయార్క్ లో వుండవలసిన హోటల్ వెలిసిందని అంతా దానిగురించి చెప్పుకుంటారు. భానోజీరావు ఆ హోటల్ కెప్పుడూ వెళ్ళలేదు. డ్యూటీ మీద వెళ్ళవలసిన అవసరం యెన్నడూ రాలేదు. మామూలుగా వెళ్ళేస్తోమతులేహ్డు. ఒకరోజుకని సరదాగా వెళ్ళినా అంతా అనుమానిస్తారు. ఒక మామూలు పోలీసాఫీసరు అందులోకి వెళ్ళగలగడాన్ని డిపార్టుమెంట్లో హర్షించలేరు.
    "తెలుసు-" అన్నాడు భానోజీరావు.
    "ఆ హోటల్ ప్రొప్రయిటర్ శంకరానంద్ కీ, స్కెలిటన్ గ్రూపుకీ ఏమైనా సంబంధముండి వుండవచ్చునని నా అనుమానం. అయితే ఇద కేవలం అనుమానం మాత్రమే!"
    భానోజీరావు లేచి నిలబడి-"మీ డ్రైవర్ రాములు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. మీ సహకారం తప్పక వుంటుందని ఆశిస్తున్నాం-" అన్నాడు.
    "తప్పకుండా -" అన్నాడు వరాలయ్య.
    
                                     8

    భానోజీరావు హోటల్ యశ్వంత్ కు వెళ్ళలేదు. అతడు తానెక్కడ బయల్దేరానూ ఎక్కడకు చేరుకుంటా న్నానూ అని ఆలోచిస్తున్నాడు.
    గోపాలం చచ్చిపోయాడు. వీధిలో ఓ పక్కగా మడత మంచం వేసుకుని పడుకుంటే లారీ గుద్దింది.
    అది హత్యా? లేక యాక్సిడెంటా?
    ఈ ఆలోచనతో పరిశోధన ప్రారంభించి స్కెలిటన్ గ్రూపులో అడుగుపెట్టాడు. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మోహన్ ని కలిశాడు. వరాలయ్యని కలిశాడు. ఇప్పుడు హోటల్ యశ్వంత్ గురించి విన్నాడు.
    ఇందువల్ల తనేం సాధిస్తాడు?
    స్కెలిటన్ గ్రూపు గురించి ఏమీ తెలియడం లేదు. అంతకంతకూ అయోమయమై పోతోంది. ముందు గోపాలం హత్య గురించి ఆలోచించాలి.
    ఆ హత్య ఎలా జరిగింది?
    ఆ హత్యకూ స్కెలిటన్ గ్రూపుకూ సంబంధమున్నదా?
    భానోజీరావు తలపట్టుకున్నాడు.
    అప్పుడు ఎవరో-"సార్!" అన్నాడు.
    భానోజీరావు తలెత్తి చూశాడు.
    "నా పేరు జగన్నాధమండి-" అన్నాడతను.
    భానోజీరావు మాట్లాడకుండా అతడివంకే చూశాడు.
    "మిమ్మల్ని అర్జంటుగా ఓ చోటుకు తీసుకుని వెళ్ళాలి-"
    "ఎక్కడకు?"
    "గుడి వీధికి-"
    "ఎందుకు?"
    "అక్కడొకాయన మిమ్మల్ని కలుసుకుంటారట-"
    "ఎవరాయన?"
    "పేరు తెలియదండి. కానీ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మోహన్ చెప్పగా ఆయన మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారుట...." అన్నాడు జగన్నాధం.
    భానోజీరావు ఠక్కున లేచాడు-"పద!" అన్నాడు.
    ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు.
    అక్కడో అంబాసిడర్ కారుంది. ఆకుపచ్చరంగు. కారులో వేరెవ్వరూ లేరు.
    "నేనే డ్రైవ్ చేస్తానండి-" అన్నాడు జగన్నాధం.
    భానోజీరావు వెనక సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది.
    భానోజీరావు ఆలోచిస్తున్నాడు. ఎవరతడు? తన కెలాంటి సమాచారం అందించాలని అనుకుంటున్నాడు.
    ఉన్నట్లుండి కారు ఆగింది.
    భానోజీరావు బయటకు చూశాడు. అది గుడివీధి కాదు.
    "చిన్న ట్రబుల్ సార్-" అన్నాడు జగన్నాధం.
    కార్లోంచి డిగాడతను.
    భానోజీరావు చుట్టూ చూశాడు. వీధి నిర్మానుష్యంగా వుంది.
    జగన్నాధం ముందుకు వెళ్ళి బోనెట్ తెరిచాడు. భానోజీరావు అటే చూస్తున్నాడు.
    అప్పుడిద్దరు వచ్చారు-కారుకు అటూ ఇటూ!
    వాళ్ళను భానోజీరావు చూడలేదు. చూసేలోగా రెండుపక్కలనుంచీ ఇద్దరూ కార్లోకి మత్తుమందు స్ప్రే చేశారు. ఆ విషయం భానోజీరావుకు తెలిసిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమయిపోయింది. అతడు తల పక్కకు వాల్చేశాడు.
    జగన్నాధం బోనెట్ కిందకు దించాడు.
    అతడు ముందుసీట్లో కూర్చున్నాడు. మత్తుమందు స్ప్రే చేసిన ఇద్దరూ వెనుక సీట్లో భానోజీరావుకు అటూ ఇటూ కూర్చున్నారు.
    కారు కదిలింది.
    
                                                          9

    "వెల్ కం మిష్టర్ భానోజీరావు-" అన్నాడతను.
    భానోజీరావు కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. ఆ ప్రదేశం అతడికి చాలా కొత్తగా వుంది.
    "నేనెక్కడున్నాను?"
    "రావలసిన చోటుకే వచ్చావు!" అన్నాడతను.
    "ఎవర్నువ్వు?"
    "నువ్వు చూడాలనుకుంటున్న వ్యక్తిని....."
    "అంటే?"
    "స్కెలిటిన్ గ్రూపు....."
    భానోజీరావు తెల్లబోయి-"నువ్వు లీడరువా-" అన్నాడు.
    "అలాగే అనుకోవచ్చు-" అన్నాడతను.
    "నీ పేరు...."
    "స్కల్!" అన్నాడతను.
    "స్కల్!" అని తనలోతనే గొణుక్కున్నాడు భానోజీరావు.
    "ఏమిటి?" అన్నాడు స్కల్.
    "స్కల్-అదేం పేరు-" అన్నాడు భానోజీరావు.
    "అదీ ఒక పేరు-" అన్నాడు స్కల్ తాపీగా.
    "నీ తల్లిదండ్రులు నీకా పేరు పెట్టివుండరు-" అన్నాడు భానోజీరావు.
    "తల్లిదండ్రుల పేరు చెప్పగలవాళ్ళీ దౌర్భాగ్య భారతదేశంలో ఎందరున్నా రంటున్నావు?" అన్నాడు స్కల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS