ఆరోవాడైన మోహన్ మాత్రం తను పరిశోధించి-స్కెలిటన్ గ్రూప్ ఉనికి అనుమానాస్పదమనీ-అంత వరకూ మరణించిన అయిదుగురి చావుకీ - స్కెలిటన్ గ్రూప్ కీ ఏ సంబంధమూ లేదనీ నిర్ధారించాడు.
ఇన్ స్పెక్టర్ భానోజీరావు మోహన్ ని కలుసుకోవాలనుకుననాడు. అందుకు ఆహాడికి ఎంతోసేపు పట్టలేదు. మోహన్ చాలా త్వరగా లైన్ లో దొరికాడు.
"హలో మిష్టర్ మోహన్! నేను మీతో చాలా అర్జంటుగా మాట్లాడాలి. మనం యెక్కడ కలుసుకుందాం?-" అన్నాడు భానోజీరావు.
"మా యింటికి రండి-" అన్నాడు మోహన్.
ఇన్ స్పెక్టర్ మోహన్ రాజమండ్రిలో వుంటున్నాడు. భానోజీరావు అతడిల్లు చేరుకునేందుకు మూడు గంటలు పట్టింది.
ఇద్దరూ పరస్పరం పరిచయం చేసుకున్నారు.
"ఏమిటి విశేషం?" అన్నాడు మోహన్.
"నాకు మీరు సహకరించాలి-" అన్నాడు భానోజీరావు.
"ష్యూర్!" అన్నాడు మోహన్.
"బహుశా నేనడిగే ప్రశ్నలు కొన్ని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు-"
"నా ఇబ్బంది సంగతి ఎలా వున్నా అడగడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది-" అన్నాడు మోహన్ నవ్వుతూ.
"అందుకు కారణం స్కెలిటన్ గ్రూప్ -" అన్నాడు భానోజీరావు.
మోహన్ పెదాలపై చిరునవ్వు మాయమయింది-"అదేమిటి?" అన్నాడు గంభీరంగా.
"స్కెలిటన్ గ్రూపు గురించి మీకు తెలిసింది చెప్పాలి-"
"నాకు తెలిసినంతవరకూ అలాంటి గ్రూపు ఏదీ లేదు-"
భానోజీరావు నవ్వి-"స్కెలిటన్ గ్రూప్ గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేశారన్న విషయం మరిచిపోకూడదు-" అన్నాడు.
అప్పుడు మోహన్ నవ్వి-"నేను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నదేగదా - ఇప్పుడు మీకు చెప్పాను-" అన్నాడు.
"అది నాకు తెలుసు. అయితే మరో విషయం నన్నాశ్చర్యపరుస్తున్నది. మీకు ముందు అయిదుగురు పోలీసాఫీసర్లు ఇదే విషయం ఇన్వెస్టిగేట్ చేసి ఆ గ్రూపు ఉనికిని ధృవపరిచారు...." అన్నాడు భానోజీరావు.
"అయిదుగురు పొరపాటుపడినంతమాత్రాన ఒక్కడు తెలుసుకున్న నిజం నిజం కాకుండా పోతుందా? నిజం విషయంలో డెమోక్రసీ పనికిరాదు" అన్నాడు మోహన్.
"మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నేను స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకే విషయంమీద ఆరుగురు పరిశోధించినపుడు-అందులో అయిదుగురిది ఒకటిగానూ, ఒకడిది వేరుగానూ ఉన్నప్పుడు నిజం యెవరిదయే అవకాశముంటుందీ అని యోచిస్తున్నాను...." అన్నాడు భానోజీరావు.
"పరిశోధనకు యోచన అవసరం. అయితే ఆ యోచన వల్లనే పరిశోధన పూర్తి కాదు. సపోర్టింగ్ ఎవిడెన్స్ కావాలి-" అన్నాడు మోహన్.
"ఒప్పుకున్నాను-" అన్నాడు భానోజీరావు-"స్కెలిటన్ గ్రూప్ ఉనికిని నిర్ధారించిన అయిదుగురూ వెనువెంటనే మరణించారు. లేదన్న మీరు బ్రతికారు. లేదని బ్రతికారా, బ్రతికి లేదన్నారా అన్నది మీనుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను-"
మోహన్ ముఖం అదోలాగైపోయింది-"ఈ రకం ప్రశ్న మొదటిసారిగా మీనుంచే వింటున్నాను-" అన్నాడతను.
భానోజీరావు మాట్లాడలేదు.
"స్కెలిటన్ గ్రూప్ గురించి తెలుసుకునే అవకాశం మీకు కలగజేస్తాను. అప్పుడు అన్నీ మీకే అర్ధమవుతాయి-" అన్నాడు మోహన్.
"అయితే ఆ గ్రూపు వుందంటారా?"
"అది మీరే నిర్ణయించుకుందురుగాని...." అన్నాడు మోహన్.
"అంటే?"
"మనం ఇద్దరం కలిసి ఈ కేసు పరిశోధిద్దాం స్కెలిటన్ గ్రూపు గురించి మీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి-"
"పరిశోధించడమంటే ఎలా?"
"ముందు గోపాలం హత్యకేసుతో ప్ర్రారంభిద్దాం.." అన్నాడు మోహన్.
"ఆ కేసు గురించి మీరు విన్నారా?"
"వినడమేమిటి? అది పరిశోధిస్తూనే మీరిక్కడకు వచ్చారని నాకు తెలుసు-" అన్నాడు మోహన్.
భానోజీరావు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
7
యాక్సిడెంట్ చేసిన లారీ దొరికింది. అది చిత్రాడ ప్రాంతాల రోడ్డు పక్కన వదిలిపెట్గబడి వుంది. డ్రైవరు లేడు.
క్షణాలమీద వాకబులు జరిగాయి. లారీ వరాలయ్యది.
భానోజీరావు వరాలయ్యను కలుసుకున్నాడు.
"లారీలో వున్నది డ్రైవర్ రాములు. వాడు రాజమండ్రినుంచి మామిడి పళ్ళు తీసుకుని రావలసి వుంది. ఏ కారణంవల్లనో యాక్సిడెంట్ చేసి ఆ భయంతో పరారీ అయ్యాడు-" అన్నాడు వరాలయ్య.
భానోజీరావు ఆయనకు హత్య జరిగిన స్థలంలో దొరికిన తాళాలగుత్తి చూపించి-"దీని గురించి మీరే మైనా చెప్పగలరా?" అన్నాడు.
వరాలయ్య అది పరిశీలించి చూసి-"ఇది స్కెలిటిన్ గ్రూపుకి చెందివుండవచ్చు-" అన్నాడు.
స్కెలిటిన్ గ్రూపు అన్న పేరు వరాలయ్య నోటి నుంచి వింటానని భానోజీరావు ఊహించలేదు - "ఆ గ్రూపు గురించి మీకు తెలుసా?" అన్నాడు ఉత్సాహంగా.
"ఆ గ్రూపుకూ నాకూ ముడి వున్నట్లు జనం చెప్పుకుంటారని కూడా నాకు తెలుసు-" అన్నాడు వరాలయ్య.
"అయితే అది నిప్పులేకుండా వచ్చిన పొగఅంటారా?"
"కాదు-" అన్నాడు వరాలయ్య-"నేను వ్యాపారాస్థున్ని. అన్నీ న్యాయమార్గాన చేయడం కావాలన్నా నాకు సాధ్యపడదు. కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు నన్ను బలవంతపెట్టి నాకిష్టంలేని పనులు చేయిస్తూంటారు నాచేత. నా మనుగడను దృష్టిలో వుంచుకుని నేనందుకు ఒప్పుకోవలసి వస్తూంటుంది....
"అలాంటివారి కొందరి పేర్లు చెప్పగలరా?"
"చెబితే బ్రతకను...."
భానోజీరావు గంభీరంగా-"మీ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది-" అన్నాడు.
"మీకు తెలుసో తెలియదో-స్కెలిటన్ గ్రూపు గురించి పరిశోధనకు దిగి అయిదుగురు పోలీసాఫీసర్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు-" అన్నాడు వరాలయ్య.
భానోజీరావుకు ఏమనాలో తోచలేదు. కొద్దిక్షణాలు ఆలోచించి-"పోనీ-మీరెలాంటి ఇష్టంలేని పనులు చేశారో చెప్పగలరా?" అన్నాడు.
"ఆ మధ్య విశాఖపట్నంలో స్టేట్ బ్యాంకునుంచి ఇరవై లక్షలు దోపిడీ చేయబడ్డాయి. ఆ దొంగకు నేను ఒకరోజు మా యింట్లో రక్షణ కల్పించాను. ఆ ఇరవై లక్షల్లో ఒక్క రూపాయికూడా నాకు దక్కలేదు. నా బాధ్యత ఆ దొంగలను ఒకరోజు కాపాడ్డం మాత్రమే. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నా జోలికి రాకుండా వుండడం మాత్రమే!"
"అంటే?"
"వ్యాపారస్థుల్ని బాధించడానికి ప్రభుత్వానికి లక్షాతొంభై మార్గాలున్నాయి. ప్రతిఒక్కటీ మాకు ప్రాణాంతరమే-" అన్నాడు వరాలయ్య.
