"మీకెలా తెలుసు?"
"అనుభవంమీద చెబుతున్నాను...."
"అంటే?"
"మీరనుకునేది నిజం, దుర్గ ఏనాడో నాదయింది.."
"ఆమె మీమీద ప్రేమకొద్దీ మీకు లొంగిపోయిందేమో..." అన్నాడు భానోజీరావు. అయితే ఈ కొత్త విశేషం అతడిని ఆశ్చర్యపరుస్తున్నది.
"నిజం చెబుతున్నాను. నాకు చాలామంది ఆడవారితో పరిచయం వున్నది. దుర్గ నామీది ప్రేమతో నాకు లొంగిపోలేదు. అటువంటి ఏకాంతం లభిస్తే ఏ మగవాడికైనా ఆమె లొంగిపోయి వుండేది-" అన్నాడు సత్యం.
భానోజీరావు అతఃడివంక ఆశ్చర్యంగా చూశాడు. సత్యం కళ్ళలో నమ్మకం కొట్టవచ్చినట్లు కనబడింది.
"మీ అభిప్రాయం తప్పని నా ఉద్దేశ్యం-" అన్నాడు భానోజీరావు.
"తన బలహీనత గురించి దుర్గకు కూడా తెలుసు-" అన్నాడు సత్యం-"అందుకే ఆమె మగవాళ్ళను సాధ్యమైనంత దూరంగా వుండడానికి ప్రయత్నిస్తుంది. ఏకాంతానికి పయత్నించినా సాధ్యపడనివ్వదు. నిన్న రాత్రి ఆమె గోపాలంతో మాట్లాడుతూంటే ఆమె కనులు చూశాను. ఆ కళ్ళలో అతడిపట్ల జాలి కనబడింది. ఆ జాలి దేనికి దారితీస్తుందో నాకు తెలుసు....."
"ఆమె కారణం ఏమిటో అతడికి చెప్పలేదా?"
"అతడికి ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. నిజం చెప్పాలంటే ఆ ప్రమాదం నావల్ల వున్నదని అతడికి చెప్పిందామె-" అన్నాడు సత్యం.
భానోజీరావు తెల్లబోయి -"ఏమన్నారూ?" అన్నాడు.
"మీరా విషయం సీరియస్ గా తీసుకోకండి. దుర్గకు గోపాలాన్ని ఏకాంతంగా కలుసుకుని మాట్లాడాలని పించింది. అందుకామె నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. విశేషమేమిటంటే ఆమె అతఃడిని ప్రమాదం గురించి హెచ్చరించింది. అది నిజంగానే జరిగింది-...." అన్నాడు సత్యం.
భానోజీరావు ఆలోచనలో పడ్డాడు. సత్యం తీరికూర్చుని తన ప్రాణం మీదకు వచ్చే విషయమొకటి చెప్పాడు. ఎందుకు? అతడు నిజంగా నిర్దోషా? లేక....
దుర్గ గోపలంతో ఏం మాట్లాడిందో అతఃడు విన్నాడు. ఈ విషయం తనకు తెలిసింది కాబట్టి తను మళ్ళీ దుర్గను ప్రశ్నించవచ్చు. అప్పుడామె ఈ విషయం చెప్పవచ్చు. ఆ విషయం పసిగట్టి ముందుగానే తనే ఈ విషయం చెప్పేశాడా?
భానోజీరావు ఆలోచిస్తూ-"గోపాలం ప్రమాదవశాత్తూ మరణించలేదనీ-ఒక పథకం ప్రకారం హత్య చేయబడ్డాడనీ నేననుకుంటున్నాను. నా అభిప్రాయంతో ఏకీభవించమని మిమ్మల్ని అడగడంలేదు. ఈ హత్య ఎవరు చేసివుండవచ్చునని మీరు అభిప్రాయపడుతున్నారు?" అన్నాడు.
"నేనేమీ చెప్పలేను-" అన్నాడు సత్యం.
"పోనీ-ఈ హత్యవల్ల లాభంపొందే వారెవరైనా వున్నారా?"
ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు సత్యం.
ఈ హత్యవల్ల లాభం పొందేవాడు సత్యం మాత్రమే! అదైనా ఎటువంటి లాభం? తన్ను ప్రేమించి తనకు శరీరాన్నర్పించిన ఓ అమ్మాయిని గోపాలం పెళ్ళిచేసుకోకుండా ఆపడం....ఏమిటో-హత్యకు ఇదే కారణమంటే నమ్మబుద్ధి కావడంలేదు.....
"ఇది హత్య అని నేనలేను. కానీ గోపాలం చావు వల్ల ప్రయోజనం పొందే వ్యక్తి ఎవరో నాకు తెలుసు-" అన్నాడు సత్యం.
"ఎవరు?" అన్నాడు భానోజీరావు.
"గోపాలం బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. తను సంపాదించిందంతా అతను ఈ ఊళ్ళోని ఎకౌంట్ కు మెయిల్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు. అయిదారేళ్ళ తర్వాత ఇక్కడే పెద్ద వ్యాపారం ప్రారంభించాలని అతడి ఆలోచన-"
"అయితే?"
"ఆ అకౌంట్ కు నామినీ శేఖరం-" అన్నాడు సత్యం.
అంటే-గోపాలం చనిపోతే ఆ డబ్బు శేఖరానికి వస్తుందన్నమాట-అనుకున్నాడు భానోజీరావు. అతగాడి పోలీసు బుర్ర చురుగ్గా పనిచేయసాగింది-"ఆ అకౌంట్లో డబ్బెంత వుండవచ్చు?"
"లక్షరూపాయలున్నా నేనాశ్చర్యపోను-" అన్నాడు సత్యం.
"మీ మనసులో ఏదో వుంది. వివరంగా చెప్పగలరా?"
సత్యం గొంతు సవరించుకుని - "దుర్గకూ, నాకూ శారీరక సంబంధం ఏర్పడిన సంగతి శేఖరానికి తెలుసు. అందుకే నేను కట్నం గురించి పట్టుబడుతున్నానని అతడి అనుమానం. అయితే దుర్గను అన్యాయంచేసే ఉద్దేశ్యం నాకు లేదు. మా నాన్నకు నిజంగా డబ్బు అవసరం వుంది. ఆ డబ్బు రాబట్టడానికి నా పెళ్ళి ఒక్కటే ఆయనకు దారి. ఆయన నామీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించాడు. ఆయనను నేనెలా నిరుత్సాహపర్చగలను. పోనీ అంటే శేఖరం లేనివాడు కాదు....." అన్నాడు.
"శేఖరానికి భూములున్నాయా?" అన్నాడు భానోజీరావు.
"లేవు-"
"తండ్రి ఇచ్చిన ఆస్తి వుందా?"
"లేదు-"
"మరి అతడు ఆస్తిపరుడెలాగయ్యాడు?"
సత్యం చిన్నగా తగ్గి-"శేఖరం అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు-" అన్నాడు.
"అక్రమంగా అంటే?"
"అందరూ లోపాయికారీగా స్కెలిటన్ గ్రూప్ నాయకుడని చెప్పుకుంటుండే వరాలయ్యతో శేఖరానికి మంచి దోస్తే వుంది-" అన్నాడు సత్యం.
భానోజీరావు తెల్లబోయాడు.
స్కెలిటన్ గ్రూప్ తో సత్యానికి సంబంధముందని శేఖరం అన్నాడు. శేఖరానికి ఆ గ్రూప్ తో సంబంధముందని సత్యం అంటున్నాడు.
అసలు ఈ స్కెలిటన్ గ్రూపు గురించి ఆరాతీసే దాకా ఈ యింట్లో వాళ్ళనింకేమీ అడక్కూడదని అతడనుకున్నాడు.
ఇన్ స్పెక్టర్ భానోజీరావు స్టేషన్ కు వెళ్ళగానే స్కెలిటన్ గ్రూప్ కు సంబంధించిన ఫైల్సు తిరగేశాడు.
రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమయింది ఆ గ్రూపు. అయిదు బ్యాంకు దోపిడీలకు ఆ గ్రూపుతో సంబంధమున్నదని అనుమానం. సుమారు ఇరవై హత్యలకు ఆ గ్రూపు కారణమని అనుమానమున్నది.
అఫీషియల్ గా ఇంతే తెలిసినప్పటికీ-రాష్ట్రంలో జరిగే అనేక ఘోరాకూ, నేరాలకూ ఈ గ్రూపు ప్రోత్సాహమున్నదని చెప్పుకుంటారు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో ఈ గ్రూపు నడుస్తున్నట్లు అంతా అనుకుంటూంటారు. కాకినాడకు సంబంధించినంత వరకూ వరాలయ్యమీద కొంత అనుమానమున్నది. అయితే ఏ అనుమానానికీ సరైన ఆధారాలు లేవు.
పుర్రె ఆ గ్రూపుకు గుర్తు అని చెప్పుకుంటారు. అయితే ఆ గుర్తును ప్రత్యేకంగా ఏ నేరం చేయడానికి గానీ, వ్యక్తులను బెదిరించడానికిగానీ వాడలేదు, అంతవరకూ లభించిన ఆధారాలనుబట్టి చూస్తే-అసలు స్కెలిటన్ గ్రూప్ అనేది ఉన్నదా లేక అది కేవలం ఊహాజనితమా అని కూడా అనుమానం కలుగుతుంది.
రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రూపు ఉనికి గురించి అనుమానం తగిలినప్పుడు పోలీస్ డిపార్టుమెంట్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ విజయ్ ను అందుకు నియమించింది. రెండు వారాల్లోనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నా నంటూ అతడినుంచి రిపోర్టు అందింది. రిపోర్టు అందిన ఇరవై నాలుగు గంటల్లో అతడో యాక్సిడెంట్లో మరణించాడు. దానిపై దర్యాప్తు చేయడానికి ఇన్ స్పెక్టర్ సత్యారావు నియమించబడ్డాడు. అతడూ స్కెలిటన్ గ్రూప్ ఉనికిని నిర్ధారించి-ఆ వెంటనే ప్రమాదవశాత్తూ మరణించాడు. అలా అయిదుగురయ్యారు.
