ద్వేషం ?
వసుంధర
వీరన్నకు కాస్త జ్వరంగా వుంది. మూలుగుతూ మూలకు జరిగాడు. అక్కడ అప్పటికి వాడొక్కడే వున్నాడు.
అదో పాడుబడిన సత్రం. అక్కడ చాలామంది ఆడుక్కునేవాళ్ళుంటారు. పొద్దున్నంతా అడుక్కుందుకు పోతారు.
"ఎరా -- వీరన్నా- అలా పడుకుని పోయావు -- గంగులు పలకరించాడు.
గంగులు ఆ ఊళ్ళో గూండాలాంటివాడు. చాలామంది బిచ్చగాళ్ళవద్ద వాడు డబ్బులు వసూలు చేస్తుంటాడు. గంగులంటే బిచ్చగాళ్ళందరికీ భయమే --ఒక్క వీరన్నకు తప్ప!
వీరన్న గంగులు కేమీ ఇవ్వనని చెప్పేశాడు. వాడు గంగులుతో దేబ్బలాటకు సిద్దమయ్యాడు. మొండితనంలో గంగుల కేమీ తీసిపోడు వాడు. తానేదిరించడమే కాక బిచ్చగాళ్ళందర్నీ ఓ కట్టులోకి తెస్తానని కూడా బెదిరించాడు వీరన్న.
గంగులు వీరన్న మీద కక్ష సాధించే ఉద్దేశ్యం మానుకున్నాడు. తను వీరన్నతో స్నేహంగా వుండడం మెదలుపెట్టాడు.
"ఒరేయ్ వీరన్నా -- తెలివి తేటల్లో దైర్య సహసాల్లో నువ్వూ నా అంతటి వాడివిరా-- ఎందుకురా యిలా అడుక్కుని బ్రతుకుతావు? నువ్వూ నా దారిలోకి రా ...." అని గంగులు వీరన్నకు చెబుతుండేవాడు.
"ఇతరులను అన్యాయం చేసి బ్రతకడం నాకిష్ట ముండదు. నేను బిచ్చగాడినే అయినా నాకు నీతి వుంది --" అన్నాడు వీరన్న.
ఈ ప్రపంచంలో దొంగాడి కున్న విలువ ముష్టాడికి లేదు. నా మాట విని యిప్పుడే నాలుగురాళ్ళు వేనకేసుకుని ఆ తర్వాత హాయిగా బ్రతకొచ్చు-"అని గంగులు ఎన్నో సార్లు చెప్పి వీరన్న వినకపోగా విసిగిపోయి -- ' అయితే యిలా అడుక్కుంటూనే వుండు. ఏదో ఓ రోజున జబ్బు చేసి నా అన్నవాళ్లు లేక కుక్కచావు చస్తావు...."అన్నాడు.
ఇప్పుడు వీరన్నకు జ్వరంగా వుంది. చూసే వాళ్ళెవ్వరూ లేరు. గంగులు వచ్చి పలుకరించేసరికి వీరన్నకు ప్రాణం లేచి వచ్చి నట్లయింది --" జ్వరం ...." అన్నాడు నీరసంగా.
గంగులు వచ్చి వాడి చేయి చూశాడు. ఆ తర్వాత వాణ్ణి రిక్షాలో ఓ డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. డబ్బు తనే ఖర్చు చేశాడు.
సాయంత్రానికల్లా వీరన్న ఒంట్లో తేలికగా వుంది.
గంగులు మళ్ళీ వాడికి హితబోద చేశాడు.
ఈసారి వాడి బోధన వీరన్న చెవుల కెక్కింది. జ్వరంతో మూల పడుకున్నప్పుడు వాడికి దిక్కులేని చావు చస్తానేమోనని భయం వేసింది. తనూ నలుగురి లా బ్రతకాలని కోరిక కలిగింది.
"ఏం చేయమంటావ్?" అన్నాడు వీరన్న.
"నీకు భయ మేముంది ? ఓ రాత్రి చూసి ఓ యింట్లో జోరబడు . అందినది దక్కించుకుని వచ్చేసేయి. పట్టుబడితే నీకు బాధేమీ లేదు. జైల్లో వేస్తారు. ఈ అడుక్కునేపాటి తిండి అక్కడా పెడతారు. ఒకసారి దొంగ అని పేరు పడ్డాక మనలాంటి వాళ్ళకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందరో పెద్దింటి వాళ్ళు , రాజకీయ నాయకులు, పోలీసులు డబ్బిచ్చి మనచేత పనులు చేయించుకుంటారు ...." అని చెప్పాడు గంగులు.
వీరన్న ఆలోచించాడు. తనూ దొంగతనం చేయాలి ఎక్కడ?
వెంటనే వాడికి అనసూయమ్మ గుర్తుకొచ్చింది. అవిడంటే వాడికి పీకలదాకా కసి వుంది. తను అడుక్కుందుకు వెళ్ళినప్పుడు పెట్టినవాళ్ళు పెడతారు. లేనివారు లేదు. కానీ అనసూయమ్మ మాత్రం తనని నానామాటలూ అంటుంది.
"దుక్కలా వున్నావు. - దున్నపోతు వెధవా ..... నువ్వు అడుక్కోవడ మెందుకూ....పని చేసుకుని బ్రతకలేవూ ...." అని తిట్టేది.
ఆవిడ వాడిని చాలాసార్లు వెధవా అని తిట్టింది. వీరన్నకు చాలా కోపం వచ్చేసింది. వాడూ ఆవిణ్ణి నానా మాటలూ అని కడిగేయాలనుకునేవాడు. కానీ అలా చేస్తే ఆ వీధిలో తనకు చెడ్డ పేరు వస్తుంది. అక్కడింకా కొందరు దయగల తల్లులు ఉన్నారు. వాళ్ళు కూడా బిచ్చం వేయడం మానేస్తారు. అలా జరగడం తన కిష్టం లేదు. అందుకే వాడు తన కోపాన్ని చంపుకున్తున్నాడు.
తనింట్లో ముష్టి వేయకపోవడం అటుంచి - వాడు కనబడితే చాలు -" పోతు వెధవ - వచ్చాడు" అని గట్టిగా అనేది అనసూయమ్మ.
అనసూయమ్మ ఇల్లు దోచేయాలని నిర్ణయించుకున్నాడు వీరన్న.
2
ఆ రాత్రి వీరన్న ఆ వీధిలో చాలాసేపు తిరిగాడు. ఆ తర్వాత కాసేపు అనసూయమ్మ ఇంటి ముందు తచ్చాడాడు. ఆ వీధిలో చాలా మంది వాడి నేరుగుదురు. అందువల్ల అక్కడ వాడి వునికిని ఎవ్వరూ అనుమానించలేదు.
అనసూయమ్మ మధ్యలో ఓసారి ఇంటి తలుపు తెరిచి వీదరుగుల మీదకూ వచ్చి రోడ్డు మీదకూ చూసి మళ్ళీ లోపలకు వెళ్ళిపోయింది.
ఆమె చూసినప్పుడు తను కనబడకుండా ఓ లాంతరు స్థంభం మాటుకు వెళ్ళాడు వాడు. తర్వాత నెమ్మదిగా ఆమె యింటి అరుగున ముందుకు చేరి ఆలోచనలో పడ్డాడు. అనసూయమ్మ యింట్లో తనకేమైనా దొరుకుతాయా ?
అనసూయమ్మ కలిగినదే అయుండాలి. చేతికి బంగారు గాజులున్నాయి. మెళ్ళో గొలుసు లున్నాయి. మనిషి పచ్చగా మిసమిసలాడి పోతూ పుష్టిగా వుంటుంది. చూడగానే గోప్పింటిదే అనిపిస్తుంది.
వాడలా అరుగు మీద కూర్చుని వుండగా ఇంటి ముందు స్కూటరు ఆగింది. స్కూటరు మీంచి అనసూయమ్మ భర్త దిగాడు. దిగుతూనే అయన వీరన్నను చూసి "ఎవడ్రా నువ్వు ?" అన్నాడు.
"వంట్లో బాగోలేదు బాబయ్యా " అన్నాడు వీరన్న.
"వంట్లో బాగోలేకపోతే నా యిల్లే దొరికిందా నీకు - పో - అవతలకు ఫో!" అని అరిచాడు అనసూయమ్మ భర్త.
"ఆయమ్మకు తగిన మొగుడివేలే" అనుకుంటూ అరుగు దిగాడు వీరన్న. వాళ్ళింట్లో దొంగతనం చేయాలన్న కోరిక వాడికి రెట్టింపయింది.
స్కూటర్ చప్పుడు విని అనసూయామ్మ తలుపు తీసి "వచ్చారా ?" అంది.
"త్వరగా దొడ్డి తలుపులు తియ్యి" అన్నాడు భర్త.
ఇల్లు ఇంటికి అరుగులు, అరుగుల మీదకూ వీధి గుమ్మం. ఇంటి నానుకొని ప్రహరి గోడ . ఆ గోడలో ఓ గుమ్మం.
అదే దొడ్డి గుమ్మం.
దొడ్డి గుమ్మం లోంచి స్కూటర్ లోపల పెట్టుకుంటాడతడు.
అనసూయమ్మ వీధి తలుపు అలాగే వుంచి అటువైపు వెళ్ళి దొడ్డి తలుపులు తీసింది. దొడ్డి వైపు స్కూటరు చేర వేసుకుంటుండగా -- వీరన్న వీధి గుమ్మంలోంచి ఇంట్లో చొరబడి చటుక్కున తనకు అనువైన చోట దాక్కున్నాడు.
వాడి గుండె టకటకా కొట్టుకుంది.
3
స్కూటరు దొడ్లో పెట్టాక దొడ్డి తలుపులు వేసింది అనసూయమ్మ.
ఆ తర్వాత వీధి తలుపులు కూడా వేసి వచ్చింది.
వీరన్న ఇంటిని చూసుకుంటున్నాడు. ఇల్లు కాస్త పెద్దదే. పరిశుభ్రంగా వుంది. వాడు దూరిన గది ఒక్కటే కాస్త అపరిశుభ్రంగా వుంది. అందులో పాత సామానులు, చెత్త, చెదారం వున్నాయి.
ఆ గదిలో తప్ప మిగతా యిల్లంతా దీపాలు వెలుగు తున్నాయి.
"వీళ్ళకు బొత్తిగా పొదుపు లేదు. ఇన్ని దీపాలేందుకో!" అనుకున్నాడు వీరన్న చిరాగ్గా. అసలు రాత్రంతా దీపాలార్పరేమోనని వాడికి భయం కూడా వేసింది.
"ఇంత అలస్యమయిందేం?"
"ఆఫీసులో ఓవర్ టైం...."
"రోజూ ఎందుకండీ ఓవర్ టైం చేస్తారు?" అనునయంగా అడిగింది అనసూయమ్మ.
"నీకోసం , మన పిల్లల కోసం...." అన్నాడు భర్త.
అనసూయమ్మ పిల్లలిద్దరూ మగవాళ్ళు, తాతగారింట వుండి కాలేజీలో చదువుకుంటున్నారు.
"వద్దండీ -- మీరు మరీ అంత శ్రమ పడవద్దు ...." అంది అనసూయమ్మ.
భర్త మాట్లాడలేదు.
ఆమె అతడికి వడ్డించింది --"నీ భోజనం అయిందా ?" అన్నాడతను.
"మీరు తిన్నాక తింటాను ...." అన్నదామె.
"వద్దు, నాతోపాటు నువ్వునూ...."
ఇద్దరూ కలిసి భోజనం చేసారు.
"అయిదు నిమిషాల్లో పోయేదానికి వీళ్ళు ఇంతసేపు భోజనా లేమిటో" అని మనసులో విసుక్కున్నాడు వీరన్న.
వాడికి చాలా అసహనంగా వుంది. కానీ తప్పదు....
భర్త ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆమె వుత్సాహంగా వుంది.
మొత్తం మీద ఇద్దరి భోజనాలు అయినాయి.
కొన్ని గదుల్లో దీపాలారాయి.
వీరన్నకా పాత సామానుల గది నుంచి బయటపడే అవకాశం వచ్చింది. భార్య భర్తలిద్దరూ పడక గదిలోకి వెళ్ళిపోయారు.
వీరన్న ఓసారి పడక గది సమీపానికి వెళ్ళాడు. లోపల్నించి మాటలు వినిపిస్తున్నాయి.
"మీరు చేస్తున్న ఓవర్ టైం ఏమిటో నాకు తెలుసు ...." అంది అనసూయమ్మ.
"ఏమిటది ?"
"దీప -- దానితో తిరుగుత౮ఉన్నారు మీరు ...."
"ఎవరు చెప్పారు నీకు ?"
"నేనే చూశాను ."
"ఎప్పుడూ ?"
