"ఈ వేళే ....సాయంత్రం అదీ మీరూ కలిసి మొదటాట సినిమాకు వెళ్ళారు. నేను కళ్ళారా చూశాను ."
'సరే - వెడితే వెళ్ళాను? ఇంట్లో సుఖం లేకపోతె మగాడి లాంటి పనులే చేస్తాడు. తప్పేముంది ?"
"తప్పు కాకపోతే ,మీరు నా దగ్గరే విషయ మెందుకు దాస్తున్నారు?"
"నీ మీద ప్రేమ కొద్దీను "
"నా మీద ప్రేమ వుంటే ఇంకో ఆడదాని గురించి ఎందుకాలోచిస్తారు ?"
"ఇంకో ఆడదీ అనడానికి నువ్వసలు ఆడదాని వైతే కదా ...." అన్నాడు అనసూయమ్మ భర్త.
'అయితే నాకు విడాకులిచ్చి దాన్ని పెళ్ళి చేసుకోండి. అప్పుడూ నేనూ ఇంకో పెళ్ళి చేసుకుంటాను...." అంది అనసూయమ్మ.
"ఓహ్ - మీ నాన్న నీ పేరున ఆస్తి రాశాడు. గదా అని నీకు ధైర్యం కదూ - ఇలాగే వాగుతావు. అందుకే నేను నీకు విడాకు లివ్వను. అయినా నేను మగాణ్ణి . నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. పరాయి ఆడదానితో తిరిగినంత మాత్రాన పెళ్ళానికి విదాకులివ్వనక్కర లేదు నీకు నేను లోటు చేసినప్పుడు గదా ...."
"మీరు దీప తో తిరగడమే నాకు పెద్ద లోటు ...."
"దాంతో తిరక్కపోదును- నువ్వూ దీపలా వుంటే ?"
"ఆ దీప కంటే నేనేం తక్కువయ్యాను ?"
అనసూయమ్మ భర్త గొంతు పెంచాడు.
"ముండకానా -- నీకూ ఆ దీపకూ పోలికేమిటి - నోరు మూసుకుని పడుకో --"
అనసూయమ్మ నోరు మూయలేదు.
భర్త ఆమెను యిష్టం వచ్చినట్లు తిట్టాడు. కోపంలో ఎన్నో బూతు పదాలు కూడా ఉపయోగించాడు.
ఆ తిట్లన్నీ వీరన్న వింటున్నాడు. వాడికి అర్ధమైన కధ ఇది.
అనసూయమ్మ, దీప ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు, దీప మితాహారం భుజిస్తూ , వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని నిత్యనూతనంగా వుంచుకుంటుంది. ఆడదంటే దీపలా వుండాలి.
వీరన్న తిట్లు వింటున్నాడు. దీపనూ, అనసూయమ్మను అంగాంగాన్నీ పోల్చి తిడుతున్నాడు. ఆ తిట్లకు అనసూయమ్మ కుమిలి కుమిలి ఏడుస్తోంది. వాడికి చాలా సంతోషంగా వుంది. అనసూయమ్మ తనను రోజూ దారుణంగా తిడుతుంది. ఆమెను తిడుతున్న భర్త మీద వాడికి ....అపరిమితమైన ప్రేమ కలిగింది.
"పది కాలాలపాటు నువ్విలాగే వర్ధిల్లు...." అని మనసులో వాడు అనసూయమ్మ భర్తను దీవించాడు.
తిట్టి తిట్టి అలసిపోయి ఆమె భర్త పడుకున్నాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అనసూయమ్మ పడుతున్నది.
వీరన్న చప్పుడు చేయకుండా ఇల్లంతా తిరగనారంభించాడు.
ఓ గదిలో బీరువా కనపడింది. బీరువాకు తాళాలు తగిలించి వున్నాయి. తలుపులు కూడా పూర్తిగా వీసి లేవు. వీరన్న బీరువా తలుపులు తెరిచాడు. తలుపు తీయగానే వాడికి కొన్ని నోట్ల కట్టలు కనిపించాయి. బహుశా అవన్నీ కలిపి - మొత్తం రెండు వేల రూపాయలుండోచ్చు. పక్కనే ఓ నెక్లెస్ వుంది.
వీరన్న తన అదృష్టాన్ని తలచుకుని మురిసి పోయాడు.
మొదటి రోజునే దొంగతనం వల్ల బోలెడు డబ్బు ....
వాడు గదిలోంచి బయటకు వచ్చాడు.
సరిగ్గా గదిలోంచి బయటకు వచ్చాడు.
సరిగ్గా అప్పుడే నడవ లో దీపం వెలిగింది.
వీరన్న భయపడుతూనే భుజం మీద గుడ్డ ముఖం మీదికి లాక్కొన్నాడు. తన పని అయిపోయినట్లే వాడు భావించాడు.
వాడికి ఎదురుగా కాస్త దూరంలో అనసూయమ్మ వున్నది. ఆమె బాత్రూం కని లేచి నడవలో దీపం వేసింది.
వీరన్నకు ఒక చేతిలో నెక్లెస్ ! మరో చేతిలో డబ్బు.... ఇదే మొదటిసారి దొంగతనం . అందువల్ల వాడి కాళ్ళు గడగడా వణుకుతున్నాయి.
అనసూయమ్మ వాడిని చూసింది --"ఎవర్నువ్వు !" అంది.
వీరన్న ముఖం మీద గుడ్డ జారిపోయింది.
"నువ్వా?" అన్నదామె వాడిని గుర్తుపట్టి.
వీరన్న కింకా కదిలే శక్తి రాలేదు.
"నా మొగుడు వున్నదంతా తాగుడుకూ ఆడవాళ్ళ కూ తగలేసి దుబారా చేస్తున్నాడు. అయన చాలక నువ్వోక్కడివా నా ప్రాణానికి ...." అంది అనసూయమ్మ.
వీరన్నకు శరీరంలోని ఏ అవయవమూ సహకరించడం లేదు.
"నువ్వింట్లోకి ఎలా వచ్చావ్ ?" అంది అనసూయమ్మ .
వాడు మాట్లాడలేదు.
అనసూయమ్మ వాడిని సమీపించింది.
"నేను దొంగ దొంగ అని అరిచి గోల చెయ్యను. నీ చేతిలోని డబ్బే కాదు, నెక్లెస్ కాదు. నా మెడలోని గోలుసు కూడా ఇచ్చే స్తాను. నువ్వెలా వచ్చావో చెప్పు ."
వీరన్నకు కాస్త ధైర్యం వచ్చింది. తానెలా లోపల ప్రవేశించిందీ చెప్పాడు.
"నీకీ దొంగబుద్ది ఎప్పట్నించి ?" అన్నదామె.
"ఇదే నా మొదటి దొంగతనం ...."
అనసూయమ్మ మెడలోంచి గొలుసు తీసి వాడి చేతిలో వేసింది -- "నేను నా మాట నిలబెట్టుకున్నాను. నువ్వు పారిపో. మళ్ళీ ఎప్పుడూ యిలా దొంగతనాలు చేయకు. గౌరవంగా బ్రతుకు...."
అది కలో నిజమో తెలియలేదు వీరన్నకు. వాడు చరచరా వీదులోకి నడిచాడు. వాడి గుండె దడదడ కొట్టుకుంటున్నది. తన వద్దనున్న డబ్బునూ, నగలనూ మూట గట్టుకుని పాడుబడిన సత్రానికి వెళ్ళాడు.
అనసూయమ్మ అలా ఎందుకు చేసింది?
ఆమెలో దయాగుణం ముందా? వుంటే అది ఒక్కసారిగా ఎందుకు బయట పడింది? ఎప్పుడూ తనను చూడగానే మండిపడే మనిషి ఈరోజు శాంతంగా మసిలింది. చాలా ఆశ్చర్యంగా వున్నదీ విషయం.
ఓ పట్టాన వీరన్నకు నిద్ర పట్టలేదు.
ఇప్పుడు తన దగ్గర డబ్బుంది. నగలున్నాయి. వీటిని ఎలా మార్చుకోవాలి ? నీటి సాయంతో ఎలా గౌరవంగా జీవించాలి ?
వాడికి గంగులు గుర్తుకొచ్చాడు. గంగులుకు చెబితే మొత్తం డబ్బంతా జల్సా చేసేయాలంటాడు. తన కది ఇష్టం లేదు.
ఎప్పుడో తెల్లవారు జామున వాడికి నిద్ర పట్టింది.
4
ఉదయం మెలకువ వచ్చాక వీరన్న తన దగ్గరున్న మూటను జాగ్రత్తగా దాచుకున్నాడు. అందులోంచి రెండు రూపాయలు మాత్రం తీసుకుని బయట బజార్లో తనక్కావలసినవి కొనుక్కుని తిన్నాడు.
బజార్లో వాడికి గంగులు కనిపించి -- "హుషారుగా వున్నావే - నేను చెప్పినట్లు నీదారి మార్చుకున్నావా, లేదా అనడిగాడు.
'ఇంకా లేదు ....' అన్నాడు వీరన్న. తన అనుభవం గంగులుకు చెప్పకూడదనే వాడు నిర్ణయించుకున్నాడు.
'అయితే నీకో సలహా ...." అన్నాడు గంగులు.
"ఊ చెప్పు ...."
'దొంగతనం చేసి దొరికిపోయినా ఫరవాలేదు. కానీ హత్య మాత్రం చేయకు. కత్తి చూపించినా మనిషి బెదిరించడానికే గానీ చంపదానికీ ఉపయోగించకూడదు. ఎప్పుడయినా ఒక హత్య చేశావో -- దాంతో నీ జీవితం అంతమైనట్లే లెక్క ...."
'అసలు దొంగతనానికే భయపడేవాణ్ని , హత్యలు కూడా ఎందుకు చేస్తానూ? ఇదంతా నాకెందుకు చేబుతావూ ?" అన్నాడు వీరన్న విసుగ్గా.
'అందుక్కారణ ముంది. నిన్నో దొంగ వెధవ రెండు గొలుసుల కోసం, రెండు వేల రూపాయల కోసం నిష్కారణంగా ఓ మనిషిని చంపేశాట్ట. పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు...." అన్నాడు గంగులు.
"రెండు గొలుసులా ......రెండు వేల రూపాయలా?' అన్నాడు వీరన్న ఆశ్చర్యంగా.
"అవును ఆకాస్త డబ్బు కిప్పుడు వాడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి ..."
"పోలీసులు వాణ్ణలా పట్టుకుంటాను ?" వీరన్న ఆశ్చర్యంగా అడిగాడు.
"వాడు ముందు పాతసామన్ల గదిలో దూరాడట....ఆ తర్వాత డబ్బున్న బీరువా తలుపులు ముట్టుకున్నాట్ట. పడక గది గుమ్మం ముందు కూడా కాసేపు నిలబడ్డట్ట. వాడి వేలిముద్రలు ఇంట్లో చాలాచోట్ల ఉన్నాయట."
"వేలిముద్రలతో వాణ్ణి పట్టేసుకోగలరా ?" అన్నాడు వీరన్న.
"ముందు పాత నేరస్థులందరినీ చూస్తారు. ఆతర్వాత అనుమానితు లందరినీ చూస్తారు. ఎవరివో ఒకరికి సరిపోతాయి- కొత్తగా ఏ నీలాంటి వాడో దొంగతనదానికి వెడితే తప్ప ఆ హంతకుడు పట్టుపడడం కాయం ...." అన్నాడు గంగులు.
"అంటే నేను పట్టుబడనన్న మాట...." అనుకున్నాడు వీరన్న. పైకి మాత్రం -- "ఇంతకీ చచ్చినామే ఎవరు ?" అన్నాడు.
"చచ్చింది అడమనిషని నే నన్నానా? ఆ యింట్లో మొగుడూ, పెళ్ళాం -- ఇద్దరే వుంటున్నారు. ఓ రాత్రి వేళ మొగుడు దొంగాడి చేతిలో వచ్చాడు. కత్తి పుచ్చుకుని పొడిచాడు దొంగాడు. సరిగ్గా గుండెల్లోకి వెళ్ళిపోయింది కత్తి. పెళ్ళాం లేచి వీధంతా గోల చేసింది ...."
వీరన్నకు అంతా అర్ధమయింది.
అనసూయమ్మ మొగుణ్ణి చంపేసింది. తనకు పీడగా తయారైన మొగుణ్ణి శాశ్వతంగా వదుల్చుకుంది.
అసలామె మొగుణ్ణి చంపాలని ముందుగా అనుకుని వుండదు. తిట్లన్నీ వినివిని విసిగిపోయి ద్వేషం పెంచుకుంది ఏం చేయాలా అనుకుంటూ -- ఇంట్లోకి ప్రవేశించిన దొంగను చూసి - వాడు వస్తువులు, డబ్బు పట్టుకు పోయినా బాధ లేదు -- ఈ హత్యా నేరాన్ని కూడా మోసుకుని పోతాడు అనుకుంది.
ఒక భార్య , భర్తను చంపేందుకు అవసరమైన పరిస్తితులు, అవకాశాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ -- ఆమె భర్తను స్వయంగా చంపుతుందన్న ఆలోచన కూడా ఎవ్వరికి రాదు.
వీరన్న మారు ఆలోచించలేదు. వాడు గంగులు తన దగ్గర్నుంచి వెళ్ళాక తిన్నగా పోలీసు స్టేషను కు వెళ్ళాడు. తన దగ్గరున్న నగలు, డబ్బు ఇనస్పెక్టరు ముందు వుంచాడు. అయన ఆశ్చర్యపోయి వింటుండగా -- రాత్రి తను దొంగతనం చేయబోయి దొరికి పోవడమూ -- అనసూయమ్మ తనను కరుణించి ఇంకో గొలుసు కూడా ఇచ్చి పంపెయడమూ చెప్పాడు.
"మీరు నన్ను పట్టుకోలేరని నాకు తెలుసు. కానీ మీరు నన్ను హంతకుడని అనుకుంటుంటారు. అందుకే మీ ముందుకు వచ్చి నిజం చెబుతున్నాను. మీరు నన్నే అనుమానించి హంతకుడంటే అది నాకర్మ. కానీ ఆ అనసూయమ్మ చేత నిజం ఒప్పించగలిగితే న్యాయాన్ని నిలబెట్టిన వారౌతారు...." అన్నాడు వీరన్న.
వీరన్న దొరికి పోవడంతో ఆ కేసును పట్టుకుని బాధిస్తున్న కొన్ని సమస్యలు పువ్వులా విడిపోయాయి. ఇంట్లో ఎన్నో ప్రాంతాల కనబడుతున్న వేలిముద్రలు హత్య గదిలో ఎందుకు లేవు ? అన్నిచోట్ల వేలిముద్రలు వదిలిన హంతకుడు కత్తి మీది వేలిముద్రల విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకున్నాడా? హతుడెక్కడా పెనుగులాడిన లక్షణాలు లేవు. అటువంటప్పుడు దొంగకు హతుడిని చంపవలసిన అవసరమేముంది ?
అనసూయమ్మ సులువుగా నేరం ఒప్పుకుంది. చివరిలో ఆమె ఒకసారి వీరన్నను కలుసుకుని మాట్లాడగోరింది.
"స్వయానా భర్తను చంపానంటే అతడితో ఎంతగా విసిగిపోయానో ఊహించుకో, కానీ నువ్వు ....నామీద ఇంతగా ఎందుకు కక్ష కట్టావు? నీ దొంగతనాన్ని క్షమించి కూడా వదిలిపెట్టాను. అయినా -- నిన్ను హంతకుడనుకునే ప్రమాద మున్నదని గ్రహించి కూడా -- నువ్వు నన్ను పట్టిఇవ్వాలని అనుకున్నావు ... నేను నీకేం అపకారం చేశాను?" అన్నదామె.
"నీ యింటికి వచ్చి ముష్టి అడిగితె నేనే మపకారం చేశానని నువ్వు నన్ను నోటికి వచ్చినట్లు తిట్టేదానివి? నిన్ను కసితీరా తిట్టినందుకు నాకు నీ భర్త అంటే ఇష్టం బయల్దేరింది. అతణ్ణి చంపిన నేరానికి నిన్ను క్షమించలేక పోయాను. నువ్వంటే నాకు నరనరాన ద్వేషం , నీ ఇంట్లో దొంగతనం చేయడం వల్ల నీకు సాయం జరిగిందంటే సహించలేక పోయాను. నేను చావనైనా చస్తాను కానీ -- నీకు సాయం చేశానన్న ఆలోచన భరించలేను ....' అన్నాడు వీరన్న.
ఒక ముష్టివాడిన అకారణంగా తిట్టినా కారణంగా ఈ రోజున తను జైల్లో వున్నానన్న సత్యం అనుసూయమ్మకు హరాయించుకోవడం కష్టంగానే వుంది.
కానీ అది నిజం!
***
