అది పురాణయుగం కాబట్టి కధ అక్కడితో ఆగిపోకుండా హరిశ్చంద్రుడి మెడలో పూలమాలలు పడ్డాయి. ఇప్పుడు మనిషి తప్ప తాను అమ్ముకోవడంతో కధ ముగిసిపోతుంది.
తమ కుటుంబానికి హరిశ్చంద్రుడి జీవితమే రాసిపెట్టి వున్నదని అతడు వ్యధ చెందసాగాడు. తరచుగా అతడా మాటలు చెల్లెలు కుసుమ వద్ద అనేవాడు.
"నువ్వు దిగులుపడకు. మంచికి సమాజం సన్మానం చేయదు. కానీ మంచికి చేసినవాడికి తప్పక మేలు జరుగుతుంది. ఎందుకంటె వారికి దేవతల దీవెన లుంటాయి -" అనేది కుసుమ అతడితో.
"దేవతల క్కూడా ప్రచారం కావాలి చెల్లాయ్! ఎవరి వల్ల తమకు ప్రచారం లభిస్తుందో వారినే దేవతలు దీవిస్తారు. మంచి పనులు చేస్తే సరిపోదు. మనం చేసే పనులు మనకు మించి దేవతలకు పేరు తీసుకురావాలి. మన మాలాంటి పని ఒక్కటీ చేయలేదు. ఏ దేవతా మనను దీవించదు -" అనేవాడు సూర్యారావు.
అతడి అభిప్రాయాల్లో నిజమెంతుందో చెప్పలేం కానీ, అతడొక కారు యాక్సిడెంట్లో మరణించాడు. అది యాక్సిడెంటు కాదనీ -- నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకున్నాడనీ కొండరనుకున్నారు.
ఎవరేమనుకున్నా చెట్టంత కొడుకు దుర్మరణం జగన్నాధాన్ని బాగా కృంగదీసింది. అయన బెంగతో మంచం పట్టాడు. అప్పుడాయన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు. వారిలో సదాశివం కూడా వున్నాడు.
సదాశివానికి ఒకప్పుడు తల్లీ తండ్రి లేక నా అన్నావాళ్ళేవ్వరూ అదుకోకుండా వదిలేసిన సమయంలో జగన్నాధం అతడికి ఆశ్రయమిచ్చి బియ్యే వరకూ చదివించి ఉద్యోగం వేయించాడు. ఆ ఉద్యోగరీత్యనే అతడు నిలదొక్కుకుని క్రమంగా స్టూడియోల్లో ప్రవేశించి స్వశక్తితో ఇంత వాడయ్యాడు.
ప్రస్తుతం జగన్నాధమున్న పరిస్థితుల గురించి తనకేమీ తెలియదన్నట్లుగా మాట్లాడినప్పటికీ -- అయన పరిస్థితికి సదాశివం చలించిపోయాడు.
"ఇది చాలా అన్యాయం -- మేమంతా ఏమైపోయామనుకున్నాడు? ఒక్కమాట నా చెవిన వేస్తె మిమ్మల్ని హంస తూలికా తల్పాల మీద పడుకోబెట్టి అప్సరసల చేత పరిచర్యలు చేయించేవాణ్ణి కదా-" అంటూ అలవాటైన సినిమా డైలాగు చెప్పేశాడతను.
"నాకు హంసతూలికాతల్పాలు , అప్సరసలు అవసరం లేదు. ఒకరికి సాయపడడమే కానీ ఒకరి సాయమడిగిన యెరుగును నేను. ఇప్పటికీ నాకు జీవితం గురించి యే బెంగా లేదు. అమ్మాయి కుసుమ గురించే నా బాధంతా!" అన్నాడు జగన్నాధం.
"మీబెంగేమిటో చెప్పండి. అమ్మాయికి పెళ్ళి చేయాలా -- అది నా బాధ్యత అనుకోండి --" అన్నాడు. సదాశివం. అయన అందుక్కూడా అంగీకరించడని సదాశివం నమ్మకం. అందుకే దైర్యంగా ఆ మాటలనగలిగాడు.
ఎవరైనా పైకి రావడానికి ఎందరో కారణభూతులవుతారు. అందర్నీ గుర్తుంచుకుని ఋణం తీర్చుకోవాలనుకున్నవాడు. మళ్ళీ క్రిందకు రాక తప్పదు. పైకి పోతున్న వాడికి కింద చూపుండకూడదన్నది సదాశివం సిద్దాంతం.
వెంటనే కుసుమ ఆ సంభాషణ లో కలగజేసుకుని -- "నాన్నకున్న ఏకైక ఆలంబన నేను. నాకు పెళ్ళి జరిగితే నాన్న ఏకాకి అయిపోతాడు. ఇప్పట్లో నేను పెళ్ళి చేసుకోను...." అంది.
"అయితే మా యింటికి వచ్చి మా కుటుంబసభ్యుల్లో ఒకరుగా వుండండి - " అన్నాడు సదాశివం లోపల భయపడుతున్నా పైకి తడకుండా .
"నా కాళ్ళ మీద నేను నిలబడే అవకాశ మిప్పించండంకుల్! ప్రస్తుతానికి కదోక్కటే మీరు మాకు చేయగల ఉపకారం --" అంది కుసుమ.
'అందుకు నేనేం చేయగలనో కూడా నువ్వే చెప్పు!" అన్నాడు సదాశివం.
"నాకు సినిమాల్లో అవకాశ మిప్పించండంకుల్ !"అంది కుసుమ.
కుసుమ కను, ముక్కు తీరు బాగుంటుంది. ఏ అలంకరణ లేకుండానే అందంగా వుంటుందామె. అటుపైన తీయని గొంతు. జగన్నాధం కుటుంబసంస్కారం వలన ఆమెలో రాచఠీవి కూడా వుంది. చిత్రసీమకు అరుదైన నటి అవుతుంది.
సినీ పీల్డనగానే జగన్నాధం అంగీకరించలేదు. అది స్త్రీలు ప్రవేశించాల్సిన రంగం కాదని అయన అభ్యంతరం చెప్పాడు.
కళాసేవలో అటువంటి భావన వుండరాదనీ -- స్త్రీ లెందరో సినీ రంగంలో వున్నారనీ వారందరికీ దేశం నిండా గౌరవ ప్రతిష్టలున్నాయనీ సదాశివం జగన్నాధానికి నచ్చ జెప్పాడు. అప్పుడు కుసుమ కలగజేసుకుని -- "నాన్నా! సినీ రంగంలో డబ్బు కోసం , పేరుకోసం -- ఎందరో ఆడవాళ్ళు ప్రవేశిస్తున్నారు. అందుకోసం వారేమైనా చేయవలసి వచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ మన విషయంలో అలా కాదు. మనకు అవసరానికి మించిన డబ్బాక్కర్లేదు. పేరు గురించి బాధలేదు. నాలో నటనా సామర్ధ్యముంది పాత్రల కోసం నేను కాని పనులు చేయనవసరం లేదు. మనకు అంకుల్ ద్వారా పాత్రలు లభిస్తాయి. ఆ విధంగా ఎంతో గౌరవంగా బ్రతకొచ్చు " అంది.
'అమ్మాయి పరిస్థితి నర్దం చేసుకుని చక్కగా చెప్పింది అన్నాడు సదాశివం.
ఏమనుకున్నాడో జగన్నాధం అందుకంగీకరించాడు.
సదాశివం రికమెండేషన్ వల్ల కుసుమకు అయిదారు చిత్రాల్లో పాత్రలువచ్చాయి. ఆ పాత్రలు చిన్నవే అయినప్పటికీ సమర్ధులైన నటిగా అమెకు కొంత పేరు వచ్చింది.
చూసి చూసి కుసుమ లాంటి అమ్మాయికి పెద్ద పాత్రనివ్వలేడు. తన చిత్రాల్లో చిన్న పాత్రలకు బుక్ చేస్తే బాగుండదు. అందుకే సదాశివం ఆమెకు ఇతరుల చిత్రాల్లో అవకాశ మిప్పించాడు. అయినప్పటికీ ఆయనకు బోలెడు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఒకనాడు తన నాదుకున్న వ్యక్తిని గుర్తుంచుకుని కష్ట కాలంలో ఆదుకున్న సదాశివం ఔదార్యాన్నీ , కృతజ్ఞతా భావాన్నీ పత్రికలు పలురకాలుగా ప్రశంసించాయి. ఈ విశేషం ప్రచారం కావడానికి సదాశివం కూడా తెర వెనుక నుంచి కృషి చేశాడు.
మంచినటిగా కుసుమకు కాస్త పేరు రాగానే సదాశివమే ఆమెకో మంచి అవకాశ మివ్వచ్చుగదా అని నలుగురూ అనుకోసాగారు. అయన అవకాశ మివ్వకపోతే అమెకిక భవిష్యత్తు ఉండదన్న టాక్ కూడా వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లో సదాశివం తన చిత్రంలో కుసుమను బుక్ చేశాడు. అదీ అయన పరమశివుడు చిత్రం నడుస్తుండగానే ప్రారంభించాలనుకున్న సాంఘిక చిత్రంలో. అందులో హీరో మనోహర్ , హీరో చెల్లెలి పాత్ర కుసుమది. ఆ పాత్రకు చిత్రంలో హీరోయిన్ కు మించిన ప్రాధాన్యత ఉంటుంది.
అయితే ఇక్కడే అనుకోని ఇబ్బంది వచ్చింది.
3
మనోహర్ సదాశివాన్ని కలుసుకుని -- "మీరు నాకు గురతుల్యులు. మీవల్ల నేనీ స్థితికి వచ్చాను. కానీ ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు బుక్ చేయబడిన కుసుమ అంటే నాకు ఎలర్జీ. సినిమా అంతా ఆ పాత్ర పట్ల ప్రేమాభిమానాలనూ అత్మీయతనూ నేను ప్రదర్శించవలసి వుంది. ఆమెను తొలగించి వేరేవరినైనా ఆ పాత్రకు ఎన్నుకుంటే తప్ప నేను నా పాత్రకు న్యాయం చేకూర్చలేనని భయంగా వుంది -" అన్నాడు.
సదాశివం దెబ్బతిన్నాడు. ఇదాయనకూహించని పరిణామం. మాములుగా అయితే ఇదంత పెద్ద సమస్య కాదు. కుసుమ మంచి నటే కానీ ప్రముఖ నటి కాదు. ఆమెకు తప్పించడం వల్ల చిత్రానికేం కష్టముండదు. ఉన్న బాధల్లా ఆమె జగన్నాధానికి కూతురు కావడం!
సినీ ఫీల్డు లో అంతా గాలివాటం. అదృష్టం బాగున్నవారి చుట్టూ అందరూ తిరక్క తప్పదు. మనోహర్ సదాశివాన్ని గురుతుల్యుడనవచ్చు. కానీ కుసుమను చిత్రం నుంచి తొలగించకపోతే వారిద్దరికీ చెడి పోవడం తద్యం. ఒక్క కుసుమ కోసం వ్యవహారాన్నంత దూరం వెళ్ళనివ్వడం సదాశివాని కిష్టం లేదు.
అయన బాగా అలోచించి కుసుమను తన చిత్రంలోంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు. జాప్యం చేయకుండా ఆ విషయమామెకు తెలియబరిచాడు.
కుసుమ దెబ్బతిని --" ఈ పాత్ర మీదా, ఈ చిత్రం మీదా చాలా ఆశలు పెట్టుకున్నాను మీవల్లనే నాకు సినీ నటీ అయ్యే అవకాశం వచ్చింది. మీ చేతుల్తోనే నా భవిష్యత్తును నాశనం చేయకండి" అంది.
"ఇందులో నేనేమీ చేయగలిగింది లేదు"అన్నాడు సదాశివం.
కుసుమ తండ్రి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పుకుని -- "ఓ గొప్ప అవకాశం వచ్చినాట్లే వచ్చి నా చేయి జారిపోతుంది. ఇది పోనిచ్చానంటే అధఃపాతాళానికి కృంగిపోతాను. మీరు చెబితే అయన కాదనడు. ఎలాగో ఆయనకు నచ్చజెప్పి నా భవిష్యత్తు కు బంగారు బాట వేయండి -" అంది.
జగన్నాధం ముందు నిర్లిప్తంగా ఉన్నా కూతురి బాధలో అర్ధముందన్న విషయం తర్వాత గుర్తించాడు. అయన కుసుమను తీసుకుని సదాశివం ఇంటికి వెళ్ళాడు. సదాశివం ఆయనకు సకల మర్యాదలూ చేసి -- "మీ రాకతో ఈ యిల్లు పావనమైంది. నేను మీ దాసుణ్ణి ఆజ్ఞాపించండి --" అన్నాడు.
'ఆజ్ఞాపించడమే ఎప్పుడూ నా అలవాటు. కానీ ఈ రోజు నిన్నర్దిస్తున్నాను. నా కూతురికి నీ సినిమాలో ఆవకాశం ఇప్పించు" అన్నాడు జగన్నాధం.
"నన్ను మన్నించి ఇంకేదైనా అడగండి ." అన్నాడు సదాశివం.
"దానికి అందముంది. నటనా సామర్ధ్య ముంది. మంచి విగ్రహముంది. శ్రావ్యమైన గొంతుంది. నీ కేమిటి అభ్యంతరమా ?" అన్నాడు జగన్నాధం.
"దయచేసి వివరాలాడగోద్దు. నేను అసహాయుడిని."
'అలాగనవద్దు నిన్నింతవాణ్ణి చేసినందుకు కృతజ్ఞతగా నాకీ సాయం చేసిపెట్టు " అన్నాడు జగన్నాధం.
ఆదాయన చేసిన పొరపాటు ఫలితాన్ని కోరే మంచి తనం గౌరవాన్ని కోల్పోతుంది. అయన మాటలు సదాశివం ధైర్యాన్ని పెంచాయి. అతడు సంకోచిస్తున్నట్లుగానే తాననదల్చుకున్నది అన్నాడు.
"ప్రాజ్ఞులు మీరు. మీకు నేనేం చెప్పగలను? మీరు విత్తనం నాటారు. అంతవరకే మీరు చేయగలిగింది కూడా! మీరు నాటిన విత్తనం మామిడి అయితే మామిడి మొక్క మొలుస్తుంది. చిక్కుడు అయితే చిక్కుడు పాదు లేస్తుంది. నా జీవితం మీవల్ల నిలబడ్డ మాట నిజం. అటుపైన నేను నా స్వశక్తి తో పైకి వచ్చాను. మీచేత సాయపడిన ప్రతి ఒక్కడూ నా దశకు చేరుకోలేకపోయాడు కదా! ఆ విషయ మలాగుంచండి. ఆర్ధికంగా మీకు నేను సాయపడుతూనే వున్నాను. మీ అమ్మాయిని సినిమాల్లో నేనే నిలబెట్టాను. ఒకసారి నేను నిలబెట్టాక ఎంతసేపూ నా ఆసరా మీదే నిలబడాలని ఆమె అనుకుంటే .... భవిష్యత్తు ఉండదు ..."
"నువ్వన్నది నిజమే! కానీ నువ్వే యిప్పుడు నా కూతుర్ని నిలబడకుండా తోసేస్తున్నావు కాదంటావా?" అన్నాడు జగన్నాధం.
"కాదు....." అన్నాడు సదాశివం.
'అయితే దానికి నీ చిత్రంలో పాత్ర ఇవ్వడానికి ఏమిటి నీ అభ్యంతరం ?"
"మీ అమ్మాయికీ మా హీరో కి పడడం లేదు. అతడు వద్దనడం వల్లనే ఆమెను తొలగించవలసివచ్చింది. ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు. ఆ హీరో ఒప్పుకుంటే ఇప్పుడైనా నాకే అభ్యంతరమూ ఉండదు...." అన్నాడు సదాశివం.
జగన్నాధం ముఖం ఎర్రబడింది. "మనోహర్ తో కుసుమకు గొడవెందుకొచ్చిందో నీకు తెలుసా?"
"జగన్నాధంగారూ -- మీరు ప్రాజ్ఞులని మళ్ళీ మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఇది చలనచిత్ర రంగం. మడికట్టుక్కూర్చోవాలనుకునే వాళ్ళిందులో అడుగు పెట్టకూడదు. ఈ విషయం మనం ఎంతసేపు చర్చించినా ప్రయోజన ముండదు. మీరింకా మాట్లాడాలను కుంటే కాసేపు నాకు సెలవు ఇప్పించక తప్పదు. నా అభివృద్ధి కి కారకుడైన పరమశివుడి కిది పూజా సమయం" అన్నాడు సదాశివం.
"నువ్వెళ్ళి పూజ చేసుకో -- ఇంకేం మాట్లాడక్కర్లేడు." అంటూ లేచాడు జగన్నాధం.
అయన కుసుమతో - "నువ్వు సదాశివం మాటలు విన్నావు కదా - ఇంకా నీకు నటిగా నిలబడాలని వున్నదా?" అన్నాడు .
"ఉంది " అంది కుసుమ నెమ్మదిగా.
జగన్నాధం ఆశ్చర్యంగా --"నిజంగానా?" అన్నాడు.
"నాన్నా! ఈ ప్రపంచం డబ్బును దేవుడిగా భావించి నమస్కరిస్తుంది. ఆ డబ్బును మీరలక్ష్యం చేశారు. చిత్రరంగంలో నాకు మంచి భవిష్యత్తు ఉందని అంతర్వాణి చెబుతోంది. మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి లభించాలంటే అందుకు చిత్రరంగమే దారి చూపగలదు. ఇందులో లాభబడ్డానికి నేనేమైనాసరే చేయాలనుకుంటున్నాను...." అంది కుసుమ.
జగన్నాధం కోపంగా "నీ ఆలోచనలు నిన్ను అధఃపాతాళానికి తీసుకుని వెడతాయి." అన్నాడు.
"నాన్నా! మీరన్నీ మంచి పనులే చేశారు. అవి మిమ్మల్నేక్కడకు తీసుకుని వెళ్ళాయి? తన లక్ష్యం తనకు తెలియనప్పుడు తన గమ్యం తానెరుగనప్పుడు మంచి చేసినా చెడు చేసినా మనిషికి పతనం తప్పదు. నాకు నా లక్ష్యమూ తెలుసు. నా గమ్యమూ తెలుసు. అందువల్ల నాకు పతనముండదు" అంది కుసుమ.
"ఇంత తెలిసినదానివి నీకింకేమీ చెప్పలేను. నీకెలా తోస్తే అలా చేయి...." అన్నాడు జగన్నాధం.
"నేను మనోహర్ని కలుసుకుని మాట్లాడతాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి " అంది కుసుమ.
జగన్నాధం ఆమెను ఆశీర్వదించాడు. మనసులో మాత్రం ఏమేమో గొణుక్కున్నాడు.
4
"నేనంటే ఎందుకు నీకు ఎలర్జీ?" అంది కుసుమ.
'అందని ద్రాక్ష లు పులుపని నీకు తెలియదా ?" అన్నాడు మనోహర్.
"నన్ను మన్నించు మనోహర్. నాకు నీ చిత్రంలో నీ పక్కన చెల్లెలి పాత్ర వేయాలనుంది. పరమశివుడి పాత్ర కోసం పరమ నిష్టను వహించిన అపురూప నటుడివి నువ్వు. నేనా పాత్ర వేయడానికి మనమేం చేయాలో చెప్పు ...." అంది కుసుమ.
"ఇలారా ?" అన్నాడు మనోహర్.
కుసుమ అతడికి దగ్గరగా వెళ్ళింది.
"నేను చెప్పినట్లు వింటావా?" అన్నాడు మనోహర్.
కుసుమ తల ఊపింది.
"తెరపై నీవునా చెల్లివి. ఇక్కడ నీవు నా చెలివి.... అంటూ అతడామెను దగ్గరగా తీసుకున్నాడు.
"నేనంటే ఎలర్జీలేదా?" అంది కుసుమ.
'అందిన దాక్ష తీయన ...." అన్నాడు మనోహర్ ఆమెను బలంగా తన కౌగిలిలో బందిస్తూ , కుసుమ అభ్యంతరం చెప్పలేదు.
సదాశివం చిత్రంలో కుసుమకు మనోహర్ చెల్లెలి పాత్ర లభించింది. ఆ చిత్రంలో అన్నా చెల్లెళ్ళుగా మనోహర్ కుసుమలు అత్యంత సహజంగా నటించినట్లు ప్రేక్షకులు భావించారు. ఆ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని వారిద్దర్నీ అన్నా చెల్లెళ్ళ పాత్రల కెన్నిక చేసి చాలా చిత్రాలు తయారవుతున్నా యిప్పుడు.
కుసుమ నటిగా నిలదొక్కుకుంది.
సదాశివం ఇప్పుడు మళ్ళీ మరో పౌరాణిక చిత్రం తీయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనోహర్ బిజీ స్టార్ అయినప్పటికీ -- మూడు నెలల పాటు నిష్టగా వుండి కేవలం సదాశివం చిత్రం లోనే నటించడం కోసం తన కాల్ షీట్లు అడ్జస్ట్లు చేస్తున్నాడు. అదే సమయాన్నుపయోగించుకోవడం కోసం మరికొందరు చిత్ర నిర్మాతలు పౌరాణిక చిత్రాలను ప్లాన్ చేయసాగారు.
దేవతలకొకనీతి మనుషుల కోకనీతి పాటించడం ఒక్క చలనచిత్ర రంగంలోనే కాదు. అన్ని రంగాల్లోనూ వుంది. ఎందుకంటె మనుషులు అసహయులు. దేవతలైతే శపించగలరు. దీవించగలరు. మనోహర్ సదాశివం వంటి నిష్టాగరిష్టులను, పరమ భక్తులను వారు సదా దీవిస్తూనే ఉంటారనడానికి ఈనాటి పవిత్ర భారతదేశమే సాక్ష్యం!
***
