Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 9


    వీర్రాజు కథ విని ఇన్స్ పెక్టర్ నవ్వాడు. ఆ నవ్వు చూడగానే వీర్రాజు పైప్రాణాలు పైనే పొయ్యాయి. అసలే పోలీసులు తనపై పగబట్టి వున్నారు. ఈ అవకాశంతో తనను హంతకున్ని చేసి కోర్టులో నిలబెడతారు. తను సంపాదించిన యింత డబ్బూ వృధా!
    "ప్రస్తుతానికి మీ కధ నమ్ముతున్నాం. కానీ రికార్డు చెయ్యడంలేదు. యింతకంటే మంచి కధేదైనా ఆలోచించి వుంచండి - రేపు వచ్చినపుడు చెబుదురుగాని. మేమింక శవాన్ని పోస్టుమార్టంకు తీసుకువెళ్ళాలి!" అన్నాడు పోలీసు ఇన్స్ పెక్టర్.
    శవాన్నీ, ఆ గదినీ వివిధ కోణాల్లో ఫోటోలు తీయడం అయింది. శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించేక వీర్రాజు ఇన్స్ పెక్టర్ని పిలిచాడు....
    "నేను నిజంగా నిర్దోషిని. కానీ చట్టానికి కళ్ళు లేవు. ఈ పరిస్థితుల్లో నన్ను నేను కాపాడుకోవడానికి నా దగ్గర డబ్బు తప్ప ఏమీలేదు. అది ఎంతైనా ఖర్చు పెట్టగలను. నన్ను రక్షించే ఉపాయం చెప్పండి!" అన్నాడు వీర్రాజు.
    ఇన్స్ పెక్టర్ అదోలా నవ్వి-"హంతకుడు దొరక్కపోతే మా ఉద్యోగాలే పోతాయి. మిమ్మల్నొదిలిపెడితే మాకీ కేసులో హంతకుడు దొరకడు. ఇది ఆత్మహత్య కాదనీ, హత్య అనీ డాక్టరు ధృవపరిచాడు. డాక్టరు రిపోర్టు మార్చడం చాలా ప్రమాదకరం. ఈ విషయంలో నేనో సాయం చేయగలను. ఆనందరావని ఒకతనున్నాడు. డబ్బు తీసుకుని ఎదుటివాళ్ళ నేరాలు తనమీద వేసుకుంటాడతను. ఛార్జి చాలా ఎక్కువ. దొంగతనాలకైతే వేలల్లోనూ హత్యలకైతే లక్షల్లోనూ ఛార్జిచేస్తాడు. అతన్నీ నేరానికి ఒప్పించగలిగితే అప్పుడు మేమూ మీ దగ్గర తృణమో, పణమో తీసుకుంటాము-" అన్నాడు.
    వీర్రాజు కాసమయంలో ఇంకేమీ తెలియడంలేదు. ఆయన అర్జంటుగా ఆనందరావు అడ్రసు తీసుకున్నాడు.

                                       10

    మొత్తం వ్యవహారమంతా రమాకాంతం రహస్యంగా కనిపెడుతూనే వున్నాడు. ఆయన అతిథి గదిలోంచి బయటపడి ఆ పోలీస్ జీపునూ, అంబులెన్స్ నూ రహస్యంగా వెంటాడాడు ఓ టాక్సీ సహాయంతో అవి ఒకచోట ఆగాయి. అందులోంచీ ఆ యువతితోసహా అంతా దిగి తలోవైపు నడిచారు.
    రమాకాంతం ఈ అవకాశాన్నుపయోగించుకున్నాడు. ఆయన ఆ యివాతిని అనుసరించాడు. ఆమె పూర్తిగా ఒంటరిదనీ తనకేమీ ప్రమాదంలేదనీ ధృవపర్చుకొని ఒకచోట ఆమెను అటకాయించి-తన గడ్డం, మీసాలు పీకి "నా పేరు రమాకాంతం! నువ్వు నా యింట్లో దెయ్యంలా నటించావు. నీ గుట్టంతా తెలుసుకొన్నాను-" అన్నాడు.
    ఆ యువతి వణికిపోతూ - "మీరిందాకా వీర్రాజు గదిలో వున్నారు కదూ-అప్పుడు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు..." అంది.
    "కానీ నేను నిన్ను గుర్తుపట్టాను. మీ నాటకమంతా చూశాను. రేపు దీనికి స్వస్తివాచకం పలుకుతాను...." అన్నాడు రమాకాంతం.
    అప్పటికాయువతి కాస్త తేరుకొని - "అది మీకే ప్రమాదం. మా ముఠా చాలా ప్రమాదకరమైనది. మా రహస్యం తెలుసుకున్నవారు బ్రతికుండరు..." అంది.
    "ముందు నీ బ్రతుకు చూద్దాం-" అన్నాడు రమాకాంతం.
    ఆమె ఇంకా నిబ్బరంగా-"రమాకాంతంగారూ-మీది పెద్ద కుటుంబం. మా ముఠా మిమ్మల్ని ముఫ్ఫై అయిదు వేలతో వదిలిపెట్టింది. డబ్బుతో తృప్తిపడిన మమ్మల్ని రక్తం కోసం ఆత్రపడేలా చేయకండి. మేము చుక్క రక్తం లేకుండా మా కార్యక్రమాలనమలు జరుపుకుంటాము. మీ కారణంగా అది మారకూడదు.." అంది.
    ఆమె గుండె నిబ్బరాన్నీ ఈ హెచ్చరికనూ విని రమాకాంతం భయపడ్డాడు. ఆమె తన మాటలతో ఆయన్నింకా భయపెట్టింది. తనవంటివారు ఇలాంటి ముఠాకు ఎదురుతిరగడం మంచిదికాదని రమాకాంతం గ్రహించాడు.
    "కానీ మీరు ఇప్పటికే మా రహస్యం తెలుసుకొన్న వారయ్యారు. మా ముఠా మిమ్మల్ని వేటాడుతుందో ఏమో!" అందా యువతి.
    ఆమె ఓ మోసగత్తె! రమాకాంతం ఆమెవల్ల మోసపోయి ఈ నాటికి పట్టుకున్నాడు. కానీ పట్టుబడ్డ ఆ మోసగత్తె ఆయన్నే బెదిరిస్తోంది.
    "తప్పించుకొనే దారిలేదా?" అన్నాడు రమాకాంతం.
    "నేను వాళ్ళకు చెప్పను. వీర్రాజు దగ్గర మా ప్లాన్ సక్సెస్ అయితే మీ గురించి నేను వాళ్ళకు చెప్పవలసిన అవసరమూ ఉండదు. ఫెయిలయిందా మీకు మూడింది."
    రమాకాంతం తేలిగ్గా నిట్టూర్చి-"వీర్రాజు దగ్గర్నుంచి ఎంత లాగాలనుకుంటున్నారు?" అనడిగారు.
    "వీలునుబట్టి పదో, పదిహేనో లక్షలు...." అందాయువతి.
    అప్పుడు రమాకాంతానికో అనుమానం వచ్చింది "మీది చాలా పెద్ద ముఠా! మీవి చాలా పెద్ద ఎత్తులు అలాంటప్పుడు ముఫ్ఫైఅయిదువేల కోసం నాలాంటి పేదవాడి మీద ఎందుకు పడ్డారు?"
    ఆ యువతి నవ్వి -- "మేము తీసుకొనే రిస్కు సామాన్యమైనది కాదు. ప్రాణాలు పోవచ్చు. శాశ్వతంగా జైలుపాలు కావచ్చు....ఒకరు కాదు.....ఇద్దరు కాదు.....ఎందరో ముఠా వ్యక్తుల రహస్యాలు బయటపడవచ్చు."
    "అయితే?" అన్నాడు రమాకాంతం.
    "అందుకని మేము ఎప్పుడే పెద్ద కార్యక్రమం తలపెట్టినా ముందుగా రిహార్సల్సు వేసి చూసుకుంటాము..."
    రమాకాంతం అవాక్కయిపోయాడు. ఆ యువతి దర్జాగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

 

                                -:ఐపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS