మంచంమీద వీర్రాజు, సోఫాలో రమాకాంతం కాసేపు వ్యాపార విశేషాలు చర్చించారు. సమస్య లొకొక్కటే చెప్పుకుపోతున్నాడు వీర్రాజు. ఒకటి కాదు-రెండు కాదు-అరవై లక్షల బ్లాక్ మనీ బైటకు తియ్యాలి.
రమాకాంతం రకరకాల స్కీములు చెప్పాడు. వాటన్నింట్లోనూ ఆయన బ్లాకు మనీ ఎప్పుడో పెట్టాడు. ఈ డబ్బు బైటకొచ్చే ఉపాయం చెబితే రమాకాంతానికి యాభై వేలు ఇస్తానన్నాడు వీర్రాజు. అందులో ఆశ్చర్య మేమీలేదు. ఆ పూట తిండి ఎలాగా అని ఏడ్చేవాళ్ళున్న ఈ దేశంలోనే ఓ చిన్న పనికి యాభైవేలు పారితోషికంగా ఇవ్వగల పౌరులూ ఉన్నారు. ఇలాంటి బేరం అయన దగ్గరున్నదని రమకాంతానికి తెలుసు. అయితే రావడానికి సంకోచించాడు.
తను ఇచ్చే సలహాల్లో రిస్కులుంటాయి. ఒకోసారి ఆ సలహా ఫెయిలైపోవచ్చు. వీర్రాజు బహుమానం ఎంత ఘనంగా వుంటుందో, శిక్ష కూడా అంత క్రూరం గానూ ఉంటుంది. అందుకే భయపడ్డాడు. కానీ ఇప్పుడు డబ్బు అవసరం రావడంతో అన్ని రిస్కులూ తీసుకోదలిచాడు.
ఇంతవరకూ ఎవ్వరికీ ఇవ్వని సలహా అది!
రమాకాంతం చెప్పింది వింటూనే అప్రయత్నంగానే "శభాష్!" అన్నాడు వీర్రాజు-"యూ ఆరే జీనియస్-" అంటూ వందరూపాయల కట్టలు రెండు ఆయనమీదకు విసిరి-"ఇది అడ్వాన్సు...." అన్నాడు.
తర్వాత పద్దులు గురించి చర్చ ప్రారంభమయింది.
సరిగ్గా అప్పుడే గదిలో వీణనాదం వినిపించింది. అది కాలింగ్ బెల్ అని రమాకాంతానికి తెలుసు. వీర్రాజు మంచంమీది ఒక స్విచ్ నొక్కాడు.
తలుపులు తెరచుకొని ఎవరో గుమ్మంలోకి అడుగుపెట్టిన శబ్దమయింది. రమాకాంతం వీపు తలుపువేపు వుంది. ఆయన వెనక్కు తిరగలేదు!
"ఇలా దగ్గరగా-రా!" అన్నాడు వీర్రాజు.
రమాకాంతం మనసు బాధగా మూలిగింది. ఆయన శరీరంలో వేడిమి కూడా హెచ్చింది. ఒక గంటసేపు అవస్థ.....వీర్రాజుకో వినోదం.....
"ఇంకెవరో ఉన్నారు....నాకు సిగ్గు...." ఆ కంఠ స్వరం ఎంతో తీయగా వీణ మీటినట్లుగా ఉన్నది.
"ఫరవాలేదు......రా..." అన్నాడు వీర్రాజు.
"రాలేను....నాకు సిగ్గు...." అందా కంఠస్వరం.
"సిగ్గంటే కుదరదు....నృత్యం చేస్తానని మాటిచ్చావు."
"చేస్తాను....కానీ.....నృత్య మొక్కటే!" అందా కంఠస్వరం.
"ఇప్పట్నించీ బేరాలెందుకు? ముందు నృత్యం చేయి" అంటూ మంచంమీది పలుచటి దుస్తులు ఆమె వైపుగా విరిసి-"ఇవి వేసుకో!" అన్నాడు.
"బట్టలు మార్చుకోనా-నాకు సిగ్గు!" అందామె.
"సిగ్గుపడడానికా నీకు డబ్బిచ్చింది!" అన్నాడు వీర్రాజు.
"మీరైతే ఫరవాలేదు.... కానీ ఇంకెవరో?" అందామె.
"మీరు వెనక్కు తిరకండీ - నా ప్రియురాలు బట్టలు మార్చుకుంటుంది...." అన్నాడు వీర్రాజు.
రమాకాంతం వెనక్కు తిరగలేదు.....కానీ ఓ నగ్న సుందరి అతడికి నలువైపులా కనిపిస్తోంది. అది చాలదన్నట్లు వీర్రాజు కామెంటరీ ప్రారంభించాడు. ఆమెను అతడు వర్ణిస్తున్నాడు. ఏం చేస్తున్నదో, ఎలా ఉన్నదో....
ఆమె బట్టలు మార్చుకోవటం అయినట్లుంది.....వీర్రాజు నృత్యం ప్రారంభించమన్నాడు. అతడు మంచంమీద కూర్చునే ఓ స్విచ్ నొక్కగానే గదిలో పాశ్చాత్య సంగీతం ఆరంభమయింది. ఆమె రమాకాంతం ముందుకు రాకుండా వెనుకనే ఉండి నృత్యం చేస్తోంది. ఆమె శరీరాన్నెలా కదపాలో వీర్రాజు సూచనలిస్తున్నాడు. రమాకాంతం పుస్తకాలు చూస్తున్నాడేకానీ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. వీర్రాజు కిదేం ఆనందమో! తన ముఖ్యమైన పని అయిపోగానే ఆయన ఏదో వంకపెట్టి గంటైనా తననలా కూర్చోబెడతాడు. ఆయన వెళ్ళమనే దాకా తను వెళ్ళడానికి లేదు.
అయితే ఈ యువతి ఎవరోగానీ నెరజాణలా వుంది. అరగంటలోనే రమాకాంతానికి వెళ్ళిపోవడానికి అనుమతి లభించింది. అంటే దాని అర్ధం - వీర్రాజు ఆ యువతి పొందుకోసం తహతహలాడుతున్నాడన్న మాట!
రమాకాంతం లేచి వెనుదిరిగాడు. వీర్రాజు నంతగా తహతహలాడిస్తూ అంతసేపూ తనకు కనబడకుండా నర్తించిన ఆ యువతి ముఖం చూడాలని ఆయనకు కుతూహలంగా వుంది. అప్రయత్నంగా ఆయన ఆమెను చూశాడు. అదే కుతూహలం ఆమెను కూడా వేధించినదేమో-అదే సమయంలో ఆమె కూడా తలెత్తి ఆయన వంక చూసి-వెంటనే తల దించుకుంది.
అప్సరసలా మిసమిసలాడిపోతున్న ఆ యువతి ముఖం చూసి రమాకాంతం ఆశ్చర్యపోయాడు. ఆమెను ఇది వరలో చూశాడు. తన యింటినుంచి ప్రొఫెసర్ కర్మ వెనుక దెయ్యం రూపంలో నడిచి వెళ్ళిపోయిన వనిత రూపం ఇలాగే ఉంటుంది.
హతురాలిగా పడివున్న, దెయ్యంలా గదిలో తిరిగిన, ప్రొఫెసర్ కర్మ వెనుక నడిచిన ఆ రూపం - తన హృదయంలో చెరగని ముద్రవేసుకుంది.
అయితే ఇదెలా సాధ్యం? ఆమె ఇక్కడికెలా వచ్చింది? తను మోసపోవడం సంగతి సరే - ఆమె ఇక్కడేం చేస్తుంది? వీర్రాజును కూడా మోసగించి బ్రతకగలదా ఆమె!
ఆమె తనను గుర్తుపట్టిందా! పట్టివుండదు. తను మారువేషంలో ఉన్నాడు, ఈ వేషంలో తనను తన భార్య కూడా గుర్తించలేదు.
ఆమె గురించి తను వీర్రాజుకు చెప్పాలా? చెబితే ఆయనిప్పుడు వింటాడా? ఈ విలాస మందిరంలో వీర్రాజు కెదురులేదు. ఆయన మంచి మూడ్ లో వున్నాడు ఇప్పుడాయనకు రసభంగం చేయడమెందుకు?
ఎటొచ్చీ తనే ఈ యువతి ముఠా గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఎలా? తనకు ముఫ్ఫైఅయిదువేలు క్షవురం చేసిన ఈ ముఠాను అంత సులభంగా వదలకూడదు. వాళ్ళ ఉనికి తెలుసుకొనే అవకాశం వచ్చింది.
రమాకాంతం గదిలోంచి బయటకు వచ్చాడు. అయితే ఆయన వెంటనే విలాసమందిరంనుంచి వెళ్ళిపోలేదు. అక్కడేం జరుగుతుందోనన్న కుతూహలం ఆ యువతి వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయన్ను అక్కడే వుండేలా చేశాయి.
విలాసమందిరంలో అతిథుల కోసమని ఒక గదివుంది. రమాకాంతానికి అందులో ఉండాలని వుంది. అదృష్ట వశాత్తూ అది కాళీగానే వుంది. వెంటనే ఏర్పాటు జరిగింది.
అప్పుడు టైము పదికావస్తోంది. రమాకాంతానికి నిద్రపట్టలేదు. ఆయన ఆలోచనంతా అంతఃపుర మందిరం మీదనే వున్నది. ఆ యువతి ఎప్పుడు బైటకు వస్తుంది? ఆమె ఆచూకీ ఎలా తీయాలి?....ఇవే ఆలోచనలతడిని వేధిస్తున్నాయి.
సరిగ్గా పదిన్నరకు కాబోలు....విలాసమందిరంలో కలకలం బయల్దేరింది. ఎవడో దొంగ.....వాడిని పోలీసులు తరుముతున్నారు. వాడు పారిపోతూ విలాసమందిరంలో దూరాడు. పోలీసులు వాడిననుసరించారు. వాడెక్కడ మాయమయ్యాడో తెలియదు. కానీ పోలీసులు అంతఃపుర మందిరంలో ప్రవేశించారు.
వారక్కడ ప్రవేశించేసరికి గదిలో వీర్రాజు ఓ శవం ముందు నిలబడి వున్నాడు. పోలీసుల్ని చూస్తూనే ఆయన తడబడినా తమాయించుకొని-"ఈమె ఆత్మహత్య చేసుకుంది!" అన్నాడు.
"దొంగను వెంటాడుతూ వస్తే - హత్య కేసు దొరికింది-" అన్నాడు ఇన్స్ పెక్టర్ ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ వీర్రాజును ప్రశ్నలు వేయసాగాడు. తర్వాత తన మనిషిని పంపించి అప్పటికి వ్రేలిముద్రల నిపుణుడు, డాక్టరు, ఫోటోగ్రాఫర్ వగైరాలను రప్పించాడు.
వీర్రాజు జరిగిందంతా నిజమే చెప్పాడు.
తనకు స్త్రీ వ్యసనముంది. డబ్బిచ్చి ఆడవాళ్ళను రప్పించుకున్నాడు. అలాగే ఈమెను రప్పించుకున్నాడు. మొదట్నుంచీ ఆమె నృత్యం మాత్రం చేస్తానంది. ఆమె అందానికి మోజుపడి రప్పించుకున్నాడు. వచ్చేక డబ్బుకు లొంగదా అనుకున్నాడు. లొంగలేదు. బలవంతం చేయబోయాడు. బ్రతిమాలింది. వినలేదు. వెంటనే తన బొడ్లోంచి బాకుతీసుకొని పొడుచుకొని చనిపోయింది.
