Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 10


                                వింత వృక్షం
                                                                   --వసుంధర

    
    "ఏమండీ!" అంది శారద.
    "ఊఁ" అన్నాడు రఘు.
    "నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. మీకోసం కన్న తండ్రిని ఎదిరించాను. లక్షల ఆస్తిని తృణప్రాయంగా చూశాను. ఆఖరికి మన ప్రేమ గెలిచి మన వివాహం జరిగింది. కానీ..." అని ఆగింది శారద.
    "చెప్పు...." అన్నాడు రఘు.
    "మీరు కూడా నన్నలాగే ప్రేమించాలని కోరుకుంటున్నాను-" అంది శారద.
    రఘు నవ్వి-"అది నువ్వు నన్ను వేరే అడగాలా-జామచెట్టు జామకాయ కాయడం ఎంత సహజమో-నేను నిన్ను ప్రేమించడమూ అంత సహజం-" అన్నాడు.
    "కానీ చెట్టు కాసిన కాయలు ఒక్కనికే దక్కవు. ఎందరో వాటిని పంచుకుంటారు-" అంది శారద.
    "అంటే?"
    "మీ ప్రేమ నాకు మాత్రమే పరిమితం కావాలి. కలలో కూడా మీరు మరో స్త్రీ గురించి తలవకూడదు. అది నేను సహించలేను. భరించలేను-" అంది శారద.
    "మై గాడ్-నీ కసలు అలాంటి అనుమానం ఎందుకొచ్చింది?" అన్నాడు రఘు.
    "మనసెప్పుడూ ప్రేమించిన వారినే అంటిపెట్టుకుని ఉంటుందని మీకు తెలుసుగదా!"
    "ఊఁ"
    "అలా అంటిపెట్టుకున్న మనసు నాకేమని చెప్పిందో తెలుసా?"
    "చెప్పు!"
    "నిన్న మీరు ఒక స్త్రీని దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకున్నారని!"
    "వాట్!" ఉలిక్కిపడ్డాడు రఘు.
    "ఇది మీరు కాదనలేని నిజం!" అంది శారద.
    రఘు ముఖం గంభీరంగా అయిపోయింది-"నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు నమ్మకమేనా?"
    "ఊఁ"
    "అయితే నా మనసు కూడా నిన్నంటిపెట్టుకునే ఉంటుంది కదా!" అన్నాడు రఘు.    
    "ఉండాలన్నది నా కోరిక!" అంది శారద.
    "అలా అంటిపెట్టుకున్న నా మనసేం చెప్పిందో తెలుసా?" అన్నాడు రఘు.
    "చెప్పండి!" అంది శారద.
    "నువ్వొక పరాయి పురుషుడివి బలంగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నావని-" అన్నాడు రఘు.
    "ఏమండీ-మీరేమంటున్నారో తెలుసా?" అంది శారద కంగారుగా.
    "ఏం-బాధగా వుందా?"
    "ఇలాంటి మాటలు భర్త నోటివెంట వినడం ఏ భార్యకు బాధకలిగించదు?"
    "నీ నోట అలాంటి మాటలు వింటే నాకు సంతోషంగా ఉంటుందా?"
    "ఏమండీ-మీరు నా మనసును మభ్యపెట్టలేరు. మీరు ఇల్లుదాటిన క్షణంనుంచీ ఏం చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుస్తూంటుంది. కావాలంటే మీకు టైము కూడా చెప్పగలను. నిన్న మీరు చేసిన ఆ దౌర్భాగ్యపు పని-సాయంత్రం మూడుగంటల ఇరవై నిముషాలకు!" అంది శారద.
    రఘు ఉలిక్కిపడి-"నామీద చారులను నియమిస్తున్నావా?" అన్నాడు.
    "చారులెందుకు నాకు? నా మనసుండగా-" అంది శారద.
    రఘు ఆమెవంక చిత్రంగా చూసి-"ఊహాలోకాల్లో తేల్చే పుస్తకాలు చదవకు-" అన్నాడు.
    "ఈ సలహా కోసం నేనిది చెప్పలేదు. ఈ రోజైనా మీ నడవడిక సరిగ్గా వుంటుందని హెచ్చరికగా చెప్పాను-"
    "ప్లీజ్ శారదా! అలా అనొద్దు. నేను నీ వాణ్ణి. నువ్వు నన్ననుమానిస్తున్నావన్న ఆలోచనే నాకు స్థిమితం ఉండనివ్వదు. ఒక్కసారి ఎప్పటికిలా నవ్వి నన్ను ఆఫీసుకు సాగనంపు-" అన్నాడు రఘు.
    "నేను ఎప్పటికిలా నవ్వాలంటే - అందుకు మీ కృషి కూడా ఉండాలి. నటించి లాభంలేదు-" అంది శారద.
    "ఎవరో నీకు చెప్పుడుమాటలు..."
    "నేను చెప్పుడు మాటలు వినే రకంకాదు. అదే నిజమైతే మన వివాహం జరిగివుండేది కాదు. మా నాన్న స్నేహితులందరిచేతా మీ గురించి చెడుగా చెప్పించాడు" అంది శారద.
    "అప్పుడు నీకు రవంతైనా అనుమానం కలగలేదా?"
    "లేదు మీ విగ్రహం నాకు నచ్చింది. మీ మాటలు నాకు నచ్చాయి. మీ ముఖంలో మోసం కనబడలేదు నాకు. మిమ్మల్ని వదులుకోలేననిపించింది. మీలో ఏ లోపమున్నా నేను సరిదిద్దుకోగలనన్న నమ్మకముండేది. అందుకే ఎవరెన్ని చెప్పినా వినలేదు. ఏడుస్తూ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు నాన్న-" అంది శారద.
    ఈ కధంతా రఘుకి తెలిసినదే. అతను వాచీ చూసుకుని-"టైమయింది. కాఫీ తీసుకురా!" అన్నాడు.
    "కాఫీ ఇవ్వకుండా మిమ్మల్ని ఆఫీసుకు పంపుతానా?" అంది శారద. ఆమె లోపలకు వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది.
    రఘు కాఫీ తాగి స్కూటరెక్కాడు.
    
                                         2

    సీట్లో కూర్చున్నాడు రఘు.
    అది చల్లని ఎయిర్ కండిషన్ గది. తనకొచ్చే రెండు వేల అయిదొందల రూపాయల జీతంకంటే-ఈ చల్లదనమే ఎక్కువ హాయినిస్తుంది రఘుకి. ఆ గదిలో అతనొక్కడే! పిలిస్తే తప్ప ఎవ్వరూ లోపలకు రారు. పిలవకుండా రాదల్చినవారు ముందుగా ఇంటర్ కామ్ లో అనుమతి తీసుకుని మరీ వస్తారు.
    ఆ గదిలో మరో చిన్న అపార్ట్ మెంట్ ఉంది. అందులో అతడి పర్సనల్ సెక్రటరీ పరిమళ ఉన్నది.
    ఆమెను అతడు పిలిస్తే ఎవ్వరికీ తెలియదు. ఆమెనతడు ఏం చేసినా ఎవ్వరికీ తెలియదు-తనో, ఆమో చెబితే తప్ప!
    పరిమళ కు రఘు తననేం చేసినా అభ్యంతరం లేదు. అసలామెను చూడగానే యేదో చేయాలనిపించేలాగునే ఉంటుంది. అందుకే కంపెనీ ఆమెను ఎన్నికచేసింది. సమర్ధుడైన ఆఫీసరు కు ఆకర్షణగా ఉండడం కోసమే కంపెనీ అతడికి సెక్రటరీనిచ్చింది.
    రఘుకు ఉద్యోగం పెద్ద ఆకర్షణ. డ్యూటీ అంతకంటే ఆకర్షణ.
    పరిమళ నవ్వితే నవ్వినట్లుండదు. ముద్దుకు ఆహ్వానిస్తున్నట్లుంటుంది.
    నిన్న రఘు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆ విషయం తనకూ, ఆమెకూ తప్ప తెలియదనుకున్నాడు. కానీ శారదకు తెలిసిపోయింది. అదీకాక ఆమె కచ్చితంగా టైము కూడా చెప్పింది.
    ఆ టైము సరైనదే!
    యెందుకంటే ఆమెను దగ్గరగా లాక్కోవడంలో ఒకరి వాచీ ఒకరికి తగిలింది.
    "అద్దం బద్దలయిందేమో-" అంది పరిమళ. అప్రయత్నంగా తను వాచీ చూశాడు. టైము మూడూఇరవై అయింది.
    ఈ విషయం బైటకు యెలా వెళ్ళింది.
    తనకూ, పరిమళకూ ఉన్న సంబంధం మరెవరైనా కనిపెడుతున్నారా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS