నిన్ను చంపేస్తా!
వసుంధర
రిసీవర్ ఎత్తి -- "హలో !" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
"వెంకన్న గారూ! మీరోసారి మా ఇంటికి రావాలి?"
"ఎవరు మీరు?"
"నాపేరు సూర్యారావు. మీతో నాకు చాలా అర్జంటు పని వుంది. వెంటనే మీరోసారి మా యింటికి రావాలి...." అంటూ అవతలి వ్యక్తీ తన ఇంటి చిరునామా చెప్పాడు.
"ఏమిటా పని?' అన్నాడు వెంకన్న.
"అది మీకు ఫోన్ లో చెప్పలేను...." అంది అవతలి కంఠం.
"సరే - వస్తున్నాను..." అని ఫోన్ పెట్టేశాడు వెంకన్న.
వెంకన్నతో పాటే - ఫోన్ కాల్ విన్న అతని అసిస్టెంట్ సీతమ్మ, రాజమ్మ అతని వంక ప్రశ్నార్ధకంగా చూశారు. సీతమ్మ -- "బాస్ -- యిప్పుడు పదిన్నరయింది. అక్కడ ఎంతసేపు పడుతుందో ఏమో భోం చేసి వెళ్ళండి" అంది.
"పదిన్నరకే భోజనమా? అందులోనూ నా దేవి చేసిన టిఫిన్ తిన్నాక!" అన్నాడు వెంకన్న.
"కానీ మీరు ఒంటి గంటకల్లా భోం చేయాకుండా ఉండలేరేమో గదా!" అంది రాజమ్మ.
"ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు నాకు భార్య ఉంది. మీ పని వేరే వుంది. ఎవరైనా క్లయింట్స్ వస్తే పాయింట్స్ నోట్ చేసుకుని వుంచండి. అది మీ డ్యూటీ" అంటూ వెంకన్న లోపలకు వెళ్ళాడు.
అప్పుడు పద్మావతీ దేవి వంకాయలు తరుగుతోంది.
"ఓహ్- ఈ వేళ వంకాయ కూర నేన్నుకున్నావా?" చచ్చాను ఒంటిగంట దాకా ఆగలేనే!' అన్నాడు.
"ఒంటిగంట దాకా కాకపోయినా కనీసం ఇంకో గంట ఆగితే కాని కూర తయారవదు" అంది పద్మావతీ దేవి నవ్వుతూ.
"ఒక్క క్షణం కూడా అగనవసరం లేనిది మరోటుంది" అంటూ వెంకన్న చటుక్కున వంగి ఆమె నుదిటిని పెదవులతో స్పృశించి "పనిమీద బయటకు వేడుతున్నాను. వంకాయ కూర కోసమైనా ఒంటిగంట లోగా వచ్చెయడానికి ప్రయత్నిస్తాను--" అన్నాడు.
"రాత్రయితే ఏమో గానీ -- పగలైతే మీరోచ్చేది వంకాయ కూర కోసమే లెండి!" అంది పద్మావతీ దేవి.
"దేవి గారి జోక్ కి అప్పీలు లేదు --" అంటూ వెంకన్న అక్కణ్ణించి కదిలాడు.
2
వెంకన్న అ యింటి ముందు ఆగాడు.
అది చిన్న డాబా యిల్లు. ఇల్లు సెపరేట్ గా వుంది. చుట్టూ ప్రహరీ గోడ , ఓ గేటు . గేటు తీసి లోపలకు వెడితే ఇంటి చుట్టూ తోట.
వెంకన్న వెళ్ళి కాలింగ్ బెల్ మ్రోగించాడు.
లోపల్నుంచి యే విధమైన చప్పుడు కాకుండానే తలుపులు తెరుచుకున్నాయి. తనను పిలిచిన ఆ సూర్యారావు ఎలా ఉంటాడో నని వెంకన్నకు చూడాలని వుంది. అయితే తలుపు తీసింది సూర్యారావు కాదు . అందమైన ఓ పాతికేళ్ళ యువతి. అందమంటే సామాన్యమైన అందం కాదు. కళ్ళు జిగేల్ మనిపించే సౌందర్యం అమెది.
"నమస్కారమండీ -- సూర్యారావు గారున్నారా?'అన్నాడు వెంకన్న.
"లేరండీ --" అందామె. అందానికి ఏమాత్రమూ తీసిపోదు ఆమె గొంతు.
వెంకన్న వాచీ చూసుకుని -- "ఆశ్చర్యంగా వుందే! నన్ను రమ్మనమని సరిగ్గా ఇరవై నిమిషాల క్రితం ఫోన్ చేశారాయన. ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళాడు?" అన్నాడు.
ఆమె చటుక్కున తలుపులు బార్లా తెరిచి "లోపలకు రండి!" అంటూ ఆహ్వానించింది.
వెంకన్న ఆశ్చర్యంగా -- "అయన లేరన్నారు!" అన్నాడు.
"ఆయనింట్లో లేరు. ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నారంటే కొద్ది సేపట్లో ఆయనిక్కడికి వస్తారన్న మాట. మా యింట్లో ఫోన్ లేదు...." అందామె.
వెంకన్న లోపలకు అడుగు పెడుతూ -- "మీరు సూర్యారావు గారి...." అని అర్ధోక్తిలో ఆగిపోయాడు.
"భార్యను....." అంటూ అతణ్ణి హల్లో కూర్చోబెట్టి తను లోపలకు వెళ్ళిందామె.
వెంకన్న కుర్చీల్లో కూర్చుని హాలుని పరీక్షించాడు. మంచి అభిరుచికి ఉదాహరణగా ఉన్నది హాల్లోని అలంకరణ! అతను ఆలోచనల్లో ఉండగానే కప్పులో కాఫీతో వచ్చిందామే.
వెంకన్న ఆశ్చర్యంగా -- "అప్పుడే మీరు కాఫీ కలిసి తెచ్చారా?' అన్నాడు.
"లేదు. మా యింట్లో కాఫీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. అయన కాఫీ గత ప్రాణి. అందుకని ఎప్పుడూ ఓ ఫ్లాస్కు నిండా కాఫీ పోసి ఉంచుతాను--' అందామె.
"ఫ్లాస్కు లో కాఫీ వుంటే చూస్తూ మీరూరుకోగలరా?" అన్నాడు వెంకన్న నవ్వుతూ.
"ఎండుకూరుకోలేను? నాకు కాఫీ వాసన కూడా కొట్టదు కదా--" అందామె.
"మీరు కాఫీ తాగరా?" అన్నాడు వెంకన్న.
"పాలు తాగుతాను. అదీ రోజు కొక్కసారి...." అందామె.
"మీరేనా కాఫీ అలవాటు చేసుకోవాల్సింది. అయన చేతైనా ఆ అలవాటు మనిపించాల్సింది--" అన్నాడు వెంకన్న.
"లేకపోతె చేసుకోవాల్సిన మంచి అలవాటు కాదది. అలవాటైతే మానుకోవదమూ అంత సులభం కాదు. అలాగని అది ప్రమాదకరమూ కాదు. ఎందుకంటె ప్రపంచంలో కాఫీ తాగని వాళ్ళ సంఖ్య బహు స్వల్పం . అందుకని మేము దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆమాట కొస్తే అయన అలవాటు చూసినేనే డబ్బు నిలవేసి నూట యాభై పెట్టి ఆ ఫ్లాస్కు కొన్నాను--" అందామె.
"మీవారు ఏం చేస్తుంటారు?' అడిగాడు వెంకన్న.
"ఆయనకుద్యోగం లేదు, పెద్దలిచ్చిన ఈ ఇల్లూ, ఓ పదికరాల భూమి ఉన్నాయి. పొతే ఏదో కమిషన్ వ్యాపారం లాంటిది చేస్తున్నారు. అయన బుర్ర చాల గట్టిది. సలహా కోసం చాలామంది వ్యాపారస్తులయన దగ్గరకు వచ్చి వెడుతుంటారు. ఆ విధంగా బాగా డబ్బు సంపాదిస్తున్నారు...." అందామె.
'అలాంటప్పుడు మీ యింట్లో ఫోనెందుకు పెట్టుకోలేదు?" అనడిగాడు వెంకన్న.
ఆమె ఒక్క క్షణం సిగ్గుపడ్డట్లు కనబడింది. "నేనే వద్దన్నాను...." అంది.
"ఎందుకు?"
"మాది ప్రేమ వివాహం కాదు- కానీ జన్మజన్మల అనుబంధం అనుకుంటాను. ఇంటికి వచ్చే పోయే వాళ్లేలాగూ ఉంటూనే వుంటారు. ఫోన్ ఉంటె ఆ బాధ చెప్పక్కర్లేదు. క్షణమాయాన్ని స్థిమితంగా వుండనివ్వరు. ధన సంపాదన మాకు ముఖ్యం కాదు. నాకసలు డబ్బు మీద ఆసక్తి లేదు..." అందామె.
"అదృష్టవంతుడ్నీ , ఆయనుండగా వచ్చి వుంటే మీరు విసుక్కుని ఉండేవారేమో-" అని వెంకన్న ఉలిక్కిపడి - 'అవును.....అన్నట్లు నేనోచ్చింది అయన కోసం గదా -" ఆయనింకా రాలేదేం?" అన్నాడు.
ఆమె కూడా సాలోచనగా - "మీకు ఏ సూర్యారావు ఫోన్ చేశాడో ఏమో-"అంది.
"లేదు. ఈ ఇంటి చిరునామా ఆయనిచ్చిందే!" అన్నాడు వెంకన్న.
"ఆయనకు లక్ష పనులు. మికెలా ఫోన్ చేయగానే ఎవరో పార్టీ తగిలుంటుంది. మీకు ఫోన్ చేసి చెప్పడానికి వీలుపదలేదేమో ...."అందామె.
వెంకన్న లేచి నిలబడి -- "మీ ఆయన్ను కలుసుకో లేకపోయినా మీ పరిచయం కలిగినందుకు చాలా సంతోషంగా వుంది. ఉన్న కాసేపటి లోనూ మీరొక ఆదర్శ మహిళ అని నాకు తోచింది--"అన్నాడు.
"కాసేపు కూర్చోండి --" అందామె.
"అవతల నాకు చాలా పనులున్నాయి. మీ ఆయనతో నేను వచ్చి వెళ్ళినట్లు చెప్పండి...." అన్నాడు వెంకన్న.
ఆమె గుమ్మం దాకా వచ్చి అతణ్ణి సాగనంపి-- అతడు గుమ్మం దాటగానే తలుపులు వేసుకుంది.
3
వెంకన్న తోట దాటుకుని గేటు తీసి బయటకు రాగానే ఓ యువకుడతన్ని పలకరించి - "మీరు వెంకన్న గారు కదూ!" అన్నాడు.
"అవును-- మీరెవరు?" అన్నాడు వెంకన్న.
"నా పేరు సూర్యారావు ...."అన్నాడతను.
"అరే - మీకోసమే అరగంట నుంచి నేను ఎదురు చూస్తున్నది.....పదండి లోపలకు వెడదామా!" అన్నాడు వెంకన్న మరోసారి వాచీ చూసుకుంటూ.
"వద్దు లెండి, మీరు లోపలకు వెళ్ళినప్పట్నించి నేనిక్కడే వున్నాను. మీరు వెళ్ళడం, రావడం నేను చూస్తూనే వున్నాను...." అన్నాడు సూర్యారావు.
వెంకన్న ఆశ్చర్యంగా -- "అయితే మీరు నన్నెందుకు పిల్చినట్లు?" అన్నాడు.
"నేను లేకుండా మీరు నా యింట్లోకి వెళ్ళడమూ, నా భార్యతో కాసేపు మాట్లాడడమూ మాత్రమే నాక్కావలసింది...." అన్నాడు సూర్యారావు.
వెంకన్న కు కోపం వచ్చింది --"ఈ విషయం ముందే చెప్పవచ్చుగా...." అన్నాడు.
"ముందు చెబితే నా భార్యతో మీ ప్రవర్తన మరొకలా వుంటుంది. అందుకే చెప్పలేదు...." అన్నాడు సూర్యారావు వెంకన్న వంక అదోలా చూస్తూ.
"మిస్టర్ సూర్యారావ్! యూ ఆర్ అప్టూ వాట్!" అడిగాడు వెంకన్న.
"కోపగించుకోకండి. ఇప్పుడు మీతో నేను చాలా మాట్లాడాలి. పదండి -- అలా వెడదాం...." అంటూ సూర్యారావు రెండడుగులు ముందుకు వేసి వెంకన్న కారును సమీపించాడు.
ఇద్దరూ కారులో కూర్చున్నారు.
వెంకన్న కారు స్టార్టు చేయగానే -- "నా భార్య మీద మీకు కలిగిన అభిప్రాయమేమిటి?" అనడిగాడు సూర్యారావు.
వెంకన్న కాస్త కోపంగా వుందేమో "మిమ్మల్నిద్దర్నీ పక్కపక్క చూసిన ప్రతివాడూ ఆమె నీకు భార్య అని తెలియగానే ఆమె దురదృష్టానికి విచారిస్తారు....'అన్నాడు.
సూర్యారావు కోపగించుకోలేదు. నవ్వేసి -- "సరిగ్గా చెప్పారు. అయితే నేను పెస్సిమిస్టూని కాదు. ఆప్టిమిస్టుని. అందువల్ల నా అదృష్టానికి సంతోషిస్తాను. ఆదలాగుంచి మరి కాస్త వివరంగా చెప్పండి ...." అన్నాడు.
