"నీకు మా సంస్థలో ఉద్యోగమిస్తాం...." అన్నాడక్కడి అధికారి.
సుకుమార్ ఆశ్చర్యంగా -- "అప్లికేషన్ పెట్టాక వేలకు వేలు లంచాలిచ్చినా ఉద్యోగాలు దొరకని యీ రోజుల్లో-- ఏ అప్లికేషనూ లేకుండా మీరు నాకిస్తామనడం చాలా ఆశ్చర్యంగా ఉంది...." అన్నాడతను.
"ఈ ఉద్యోగానికి నిన్ను జగదీష్ రికమండ్ చేశాడు."
"ఆశ్చర్యంగా ఉందే?" అన్నాడు సుకుమార్.
"ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సంస్థలో పని చేసే ప్రతి ఒక్కడూ సచ్చీలతకూ ,దేశభక్తి కీ మారు పేరుగా వుండాలి. నీ సచ్చీలతను జగదీష్ అంచనా వేశాడు.సచ్చీలత ఉన్నవాడికి దేశభక్తి ఉండి తీరుతుంది..."
తన సచ్చీలతను జగదీష్ యెలా అంచనా వేశాడో సుకుమార్ కి అర్ధం కాలేదు. కానీ వచ్చిన ఉద్యోగన్నతడు వదులుకోనూలేడు.
సుకుమార్ ఉద్యోగంలో చేరాడు. ఆర్నెల్ల పాటు మామూలు ఫైల్ వర్క్ చేశాడు. తర్వాత ఒకరోజున పై అధికారి అతడిని --"నువ్వు ట్రయినింగ్ కు వెళ్ళాలి" అని చెప్పాడు.
ట్రయినింగోక పల్లెటూళ్ళో. అదీ అతి సామాన్య మైన పల్లెటూరు.
సుకుమార్ ఒక్కడూ అడ్రసు పట్టుకుని పల్లెటూరు వెళ్ళి తనక్కావలసిన యిల్లు చేరుకున్నాడు. ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఆమె వయసు ముప్పై అయిదుండవచ్చు. అమె అతడిని సాదరంగా ఆహ్వానించింది.
"నేను శ్రీధరరావు గారిని కలుసుకుందుకు వచ్చాను" అన్నాడతను.
"వారు పొలానికి వెళ్ళారు. ఓ గంటలో వస్తారు...." అంటూ ఆమె అతడితో కబుర్లు మొదలు పెట్టింది. మాటల మధ్య ఆమె అతడి వివరాలు చాలా అరా తీసింది. అసలు సంగతేమిటంటే ఆమెకు పట్నంలో చదువుకుంటున్న పదిహేడేళ్ళ కూతురుంది. ఆమె అక్కడ బంధువిలింట్లో ఉంటున్నప్పటికీ ఈమె కెప్పుడూ ఆ పిల్ల పెళ్ళి ధ్యేసే!
సుకుమార్ వివరాలా మీకంత సంతృప్తి ని కలిగించకపోగా ఆమె భారంగా నిట్టూర్చింది. ఈలోగా శ్రీధరరావు రానే వచ్చాడు.
అతడిని చూసీ చూడగానే యెక్కడో చూశాననిపించింది సుకుమార్ కి. అయితే గుర్తించడాని కెంతో సేపు పట్టలేదు. అతడు జగదీష్!
"మీరా?' అన్నాడు సుకుమార్ ఆశ్చర్యంగా.
జగదీష్ అతడినింకేమీ మాట్లాడవద్దని వారించి డాబా మీదకు తీసుకొని వెళ్ళి - "కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఈమె నా అసలు భార్య....." అన్నాడు.
"అంటే?" అన్నాడు సుకుమార్ ఆశ్చర్యంగా.
"ఇప్పుడు నువ్వు చూస్తున్నది నా అసలు వేషం కూడా!" అన్నాడు జగదీష్.
"నాకేమీ అర్ధం కావడం లేదు....' అన్నాడు సుకుమార్.
అప్పుడు జగదీష్ వివరించాడు.
గూడచారి సంస్థకు పటిష్టమైన పధకాలు మాత్రమే కాదు -- అసలు గూడచారు లెవరో తెలియకపోవడం చాలా ముఖ్యం. దేశంలో పలుచోట్ల జగదీష్ వంటి గూడచారులున్నారు. ఒకోపనికి అవసరమైనప్పుడు వారిని ప్రత్యేకంగా నియమించడం జరుగుతూంటుంది. మామూలుగా అయితే శ్రీధరరావు -- పల్లెటూళ్ళో వ్యవసాయం పనులు చూసుకుంటూ ఆ చుట్టూ పక్కలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రభుత్వానికందజేస్తుంటాడు.
జడ్-17 టెక్నాలజీ రహస్యం తెలుసుకుందుకు పాకిస్తాన్ గూడచారులు రంగంలోకి దిగారని తెలియగానే వారిని మొత్తం ముఠాగాపట్టుకోవడం కోసం -- జగదీష్ పేరిట శ్రీధరరావు అపాయింట్ చేయబడ్డాడు. ఇది చాలా కీలకమైన వ్యవహారం , విద్రోహులెంతకైనా తెగించినవాడు. వాళ్ళు సాధారణంగా గూడచారుల అధికారిని పట్టుకునేందుకతడి కీలకాలను వెతుకుతారు. జగదీష్ భార్య బిడ్డలే ప్రాణమన్న భ్రమ వారిలో కలిగేలా జీవించాడతను.
అప్పుడు విద్రోహులు వారినుపయోగించి జగదీష్ తమ చేతుల్లో కీలుబొమ్మను చేసుకోవాలనుకుంటారు. అటువంటప్పుడు నిజం భార్య బిడ్డలయితే -- ఎటువంటి అధికారి కైనా గుండె నిబ్బరం దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి చోట్ల నకిలీ సంసారాలతో వ్యవహరిస్తారు. విద్యోహులు పిల్లల్నే ఎత్తుకు పోయారు. వాళ్ళు తన పిల్లలు కారు కాబట్టి -- మనసున్న మనిషిగా మానవత్వంతో జగదీష్ వారిని కాపాడుతాడు తప్ప కన్న తండ్రి గా మనో నిగ్రహాన్ని కోల్పోడు.
భార్యకు మానభంగం జరిగే విపత్కర మేర్పడింది. ఆమె తన భార్య కాదు కాబట్టి జగదీష్ అందుకు తట్టుకోగలడు. విద్రోహులకీ విషయం తెలియదు . తను వారి జాలంలో ఇరుక్కున్నట్లు నటిస్తూ జగదీష్ వారిపై జాలం పన్నాడు. తనవారి గురించి ఏమాత్రం పట్టింపు లేకున్నా వారి గురించే వ్యధ చెందుతున్నట్లు నటించి- విద్రోహుల పై తన మనుషుల పూర్తీ నిఘా వుంచి వారందర్నీ మొత్తం బంధించగలిగాడతడు. పైకి మాత్రం జీవితంలో దెబ్బతిన్న వాడికిలా వుద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయాడు.
"ఈ కేసులో నువ్వు మా డిపార్ట్ మెంటు కు లభించడమొక అదృష్టం...." అన్నాడు శ్రీధరరావు.
"కానీ నా సచ్చీలత మెచ్చుకోదగ్గది కాదు . వివాహీతురాలని తెలిసీ జ్యోత్స్న పై వాంఛ పెంచుకున్నాను. ఆ సమయంలో యెందుకు తటపటాయించానో నాకే తెలియదు" అన్నాడు సుకుమార్.
"తప్పు చేయాలనుకోని వాడు అరుదు. కానీ తప్పు చేయాలన్నా కాంక్ష ణనుచుకోవడం గొప్ప విశేషం. అవకాశ మొచ్చినా తప్పు చేయని వాడి సంస్కారం గొప్పది!"
"ఈ పల్లెటూళ్ళో మీరు నాకు శిక్షణ ఏమిస్తారు?" అన్నాడు సుకుమార్ మాట తప్పిస్తూ. పొగడ్తల నెవరి కైనా వినడం బాగానే వుంటుంది కానీ సంస్కారవంతులకు మొహమాటం అడ్డొస్తుంది.
"నాతొ మాట్లాడేవు కదా! అదే శిక్షణ నీకు. అయితే ఒక విషయం గుర్తుంచుకో. ఏదో ఒకరోజున నువ్వూ నాకులా నకిలీ సంసారం నడపాల్సోస్తుంది. ఆరోజున నగ్నంగా వున్న జ్యోత్స్న ను- ఏకాంతంలో వుండి కూడా వదలగలిగావు. అదేవిధంగా నీ నకిలీ భార్యతో -- ఒకే గదిలో పడుకుంటూ - కనీసం కొద్ది మాసాలు నీ సంస్కారం చూపగలగాలి. నేనలా జీవించాను. నువ్వూ అలాగే వుండాలి. ఇలాంటి సంస్కారమే -- మనకూ మనదేశానికి శ్రీరామ రక్ష...." అన్నాడు శ్రీధర రావు.
సుకుమార్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు.
:----అయిపొయింది :--------
