వెంకన్న చిరాగ్గా -- "అంగాంగవర్ణన చేయాలా?" అన్నాడు.
"అసాధ్యం. ఆమెను చూడగానే భర్తనైనా నాకే పవిత్ర భావాలు కలుగుతాయి. ఏ మగావాడూ -- అందులోనూ మీవంటి సచ్చీలుడు అమేనా దృష్టిలో చూడగలరని అనుకోను--" అన్నాడు సూర్యారావు.
"సరిగ్గా చెప్పారు. ఆమె పవిత్రమూర్తి. ఆదర్శ మహిళ...." అన్నాడు వెంకన్న.
"జానకిని చూసిన ప్రతి మగవాడూ ఇదే ముక్క అంటున్నాడు...." అంటూ నిట్టూర్చాడు సూర్యారావు.
"ఏం? అది నిజం కాదా?' అనడిగాడు వెంకన్న.
"వెంకన్న గారూ ....మీరు పేరు పొందిన డిటెక్టివ్ లు. అరగంట ఆమెతో మాట్లాడి వచ్చారు. నాకు భార్యగా ఆమె ఏవిధంగా వుంటున్నదో ఏమత్రమైనా ఊహించగలరా?' అన్నాడు సూర్యారావు.
వెంకన్న తమ మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు.
సూర్యారావు అదోలా నవ్వి - "నలుగురిలోనూ ఆమె నా గురించి చాలా గొప్పగా చెబుతుంది. నిజానికి నేను యింట్లో కొరగాని వాణ్ని. బియ్యే ఫెయిలయ్యాను. మా యింట్లో నన్నంతా పనికి రానివాడివని అన్నారు. వారసత్వపు ఆస్తి ఇచ్చేటంత గోప్పావాడు కాదు మా నాన్న. నాకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా వున్నారు. వాళ్ళ బాధ్యత కూడా నాకు లేదు. ఇంట్లోంచి బైటకు పోయి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే చాలునని నాన్న అన్నారు. ఎక్కడా నాకుద్యోగాలు దొరకలేదు. అలాంటి సమయంలో జానకి తండ్రి నన్ను పిలిచాడు. ఏదో దూరపు వరుసలో బంధువుతాడాయన నాకు. జానకిని పెళ్ళి చేసుకుంటావా అనడిగాడు. ఆమెను చూడగానే ఒప్పుకున్నాను. ఇల్లరికం వస్తావా అనడిగాడు. వస్తానన్నాను! అంతకుమించి గత్యంతరం లేదు నాకు. ఓ ఏడాది వాళ్ళింట్లో వున్నాను-- పెళ్ళి చేసుకుని. ఆ యింట్లో నాకు గౌరవం లేదు. జానకి మాత్రం నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది. ఏడాది గడిచాక ఆమె నాతో - "ఈ యింట్లో మీకు గౌరవం లేదు. ఇలాంటి చోట మన ముండలెం . వేరే పోదాం--" అంది. నేను అంగీకరించాను. ఏర్పాట్లన్నీ ఆమె చేసింది. ఇక్కడుంటున్న బంగళా అమెది. ఆమె పేరున పదెకరాల భూమి వుంది. లక్షో, రెండో డిపాజిట్లున్నాయి. ఆమెకు షేర్ మార్కెట్ గురించి చాలా తెలుసు. ఎంత చెప్పినా అది నాకర్ధం కాదు. పేపర్లు చూసి చదివి ఆమె నాకేవేవో చెబుతుంది. ఆమె చెప్పిన ప్రకారం చేస్తాను. లాభాలు బాగానే వస్తాయి. నేను మగవాడినే కావచ్చు. కానీ ఆమె నాకు భర్త. నేనామెకు భార్యను...." అన్నాడు.
"చాలా విచిత్రంగా వుంది మీ కధ!" అన్నాడు వెంకన్న.
"అసలు విశేషం అది కానే కాదు. ఆమెకు ఏమాత్రం అతిశయం లేదు. అన్నింటికీ నన్నే పొగుడుతుంది. అందరితోనూ ఈ ఆస్తి అంతా తన భర్తదేనని చెబుతుంది. తన విజయాలన్నీ నా గోప్పతనంగా చెబుతుంది. ఆమె చెప్పిన పనుల గురించి బయట తిరగడం తప్పితే వేరే నాకు పనేమీ లేదు. నేను ఎందుకు పనికిరాని వాణ్ని . ఏమీ చేతకాని వాణ్ని. కానీ నాకు ఆమె మూలంగా నలుగురిలో అపురూపమైన గౌరవ స్థానం లభిస్తోంది...." అన్నాడు సూర్యారావు.
"మీరు చాలా అదృష్టవంతులు...." అన్నాడు వెంకన్న.
"చూస్తూ చూస్తూ ఇలాంటి అదృష్టం ఎవరైనా వదులుకోవాలనుకుంటారా? ఒకవేళ వదులుకోవాలనుకుంటే అందుకేదైనా బలమైన కారణముండదంటారా?"
వెంకన్న క్షణం అలోచించి --"ఇలాంటి పరిస్థితుల్లో ఒకరకం మనస్తత్వం ఏర్పడుతుంది. మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడి, క్రమంగా బలపడి మీరామేను ద్వేషించవచ్చు--"
సూర్యారావు నవ్వి -- "నాకలాంటి కాంప్లెక్సు లు ఏమీ లేవు. ఆమె నాకు దేవత. నన్నభిమానించి గౌరవించే ఆమెను నేను ఏవో మానసిక బలహీనతలతో ద్వేషించలేను.....కానీ...." అని ఆగాడు.
"కానీ...." అన్నాడు వెంకన్న.
"నేనామెను చంపాలను కుంటున్నాను...." అన్నాడు సూర్యారావు.
అప్రయత్నంగా సడన్ బ్రేక్ వేశాడు వెంకన్న . కారు ఆగింది.
"ఏమైంది? ఆశ్చర్యపడుతూ షాక్ తిన్నారా?' అన్నాడు సూర్యారావు.
"లేదు. కబుర్ల సందడిలో మా యిల్లు రావడం చూసుకోలేదు. అందుకే సడన్ బ్రేక్ వేసి ఆపాల్సి వచ్చింది--" అన్నాడు వెంకన్న.
4
ఇద్దరూ ఆఫీసు లో కూర్చున్నారు -"ఇప్పుడు చెప్పండి!" అన్నాడు వెంకన్న.
"నేను నా భార్యను చంపాలనుకుంటున్నాను...." అన్నాడు సూర్యారావు.
'అయితే నన్నెందుకు పిలిచారు? హత్యలు చేయడానికి సాయపడను నేను...." అన్నాడు వెంకన్న చిరాగ్గా.
"ఆ సంగతి నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ముందుగా యింటికి వెళ్ళమన్నది..."
"వెళ్ళి నేను సాధించినదేమిటి?"
"నా భార్య గురించి మీకు కొంత అయిడియా వస్తుందని...."
"అయిడియా అంటే...."
"నా భార్య ఆదర్శ మహిళ అని మీరే గ్రహించారు. అలాంటి ఆమెను చంపాలనుకున్నానంటే అందుకు బలమైన కారణమే ఉండి వుంటుందని మీరూహించగలరు. నన్ను సానుభూతితో అర్ధం చేసుకోగలరు...." అన్నాడు సూర్యారావు.
"ఎంత బలమైన కారణమున్నా హత్యల పట్ల నాకు సానుభూతి వుండదు. మీమీద సానుభూతి కలిగినప్పటికీ సులభంగా హత్య చేసే విధానాలు సూచించలేను...." అన్నాడు వెంకన్న.
"నేనందుకు కాదు మీ దగ్గరకు వస్త! నేను చేయబోయే హత్యను ఎవరైనా అపగలిగితే సంతోషిస్తాను."
వెంకన్న ఆశ్చర్యంగా -- "మీరు చేయబోయే హత్యను ఆపాలని మీరు అనుకుంటే -- అందుకు అందరి కంటే సర్వ సమర్ధులు మీరే అవుతారు...." అన్నాడు.
"కావచ్చు , కానీ .... నేను కాదు...." అన్నాడు సూర్యారావు.
"అంటే?"
"కొన్ని పరిస్థితుల్లో నా మనసు నా వశం తప్పుతోంది. నన్ను నేను నిగ్రహించుకోవడం కష్టమవుతోంది. ఏ క్షణాన్నయినా నేనామెను చంపవచ్చు. ఆమెను చంపడం నిజానికి నాకిష్టం లేదు. హత్యంటూ జరిగితే అది క్షణికావేశంలోనే జరగాలి...."
"క్షణికావేశమా? అది మీ యింటిలో!" అన్నాడు వెంకన్న-- అది అసాధ్యమన్న ధ్వనితో.
"మా యింటిలో ప్రతిరోజూ నాకు ఆవేశం కలుగుతోంది-- ఆమె నోటి వెంట కిషోర్ అన్న పదం వినిపించి నపుడల్లా నన్ను నేనే మరిచిపోతాను...." అన్నాడు సూర్యారావు.
"కిషోర్ ఎవరు?' వెంకన్న అడిగాడు.
"అది నా భార్య ముద్దుగా నన్ను పిలిచే పేరు...."
"చిత్రంగా వుందే!" అన్నాడు వెంకన్న.
"మీకది చిత్రంగా వుండవచ్చు. కానీ నన్నది చిత్రవధ చేయిస్తోంది. మే మిద్దరమూ ఒకరికొకరు ఎంతో దగ్గరగా వున్నప్పుడు ఆమె -- "ఓహ్- కిషోర్!" అంటూ పరవశిస్తుంది...." అన్నాడు సూర్యారావు.
"కిషోర్ అన్నది మీకామే పెట్టుకున్న ముద్దు పేరని మీరే కదా --- అన్నారు...." అన్నాడు వెంకన్న.
"అవును, వివాహమైన తొలిరోజుల్లో ఆమె నాతొ మిమ్మల్ని ముద్దుగా కిషోర్ అని పిల్చుకుంటాను . మీకు అభ్యంతరమా? అనడిగింది. నన్ను కూడా తన్ను తన కిష్టమైన పేరుతొ పిల్చుకో మంది. కానీ నేనామె పేరు మార్చలేదు. నన్నామే కిషోర్ అని పిలిస్తే అభ్యంతరం పెట్టలేదు....' అన్నాడు సూర్యారావు.
"ఇప్పుడు మాత్రం మీకు అభ్యంతర మెందుకు?" అన్నాడు వెంకన్న.
"నాకు సూర్యారావు నని పేరుండగా ఆమె నన్ను కిషోర్ అని ఎందుకు పిలవాలి?"
"ఆడాళ్ళ విషయంలో ఇది కొత్తేమో కానీ - మగాళ్ళ కిది మామూలే. పెళ్ళి కాగానే పద్మావతి, సుబ్బాయమ్మ, అనురాధ, రామలక్ష్మీ వసుంధర.....కావడం నాకు తెలుసు. మీ యింట్లో మీ ఆవిడే మీకు భర్తని మీరే చెప్పారు గదా -- అందుకని అవిడకూ అలాంటి సరదాలుండి ఉంటాయి...." అన్నాడు వెంకన్న.
'అలాగే నేనూ అనుకున్నాను. కానీ అది నిజం కాదు. ఆమె కిషోర్ అనేవాణ్ణి ప్రేమించింది. ఆమె మనసు నిండా వాడె వున్నాడు. నిర్భయంగా నా ఎదుట వాడి నామోచ్చారణ చేసే అవకాశం కోసం ఆమె నన్నా కోరిక కోరింది. నేను తెలివి తక్కువగా అంగీకరించాను...."
"అలాగని మీరనుకుంటున్నారా?"
"అనుకోవడం కాదు . అది నిజం. అందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి...." అన్నాడుసూర్యారావు.
"భార్యాభర్తల మధ్య వ్యవహారాల్లో సాక్ష్యంగా రావడానికి సిద్దపడ్డ ఆ వెధవ ఎవరు?" అన్నాడు వెంకన్న తీవ్రంగా.
"మీరు కోప్పడకండి. ఇందులో బయటి వారి ప్రమేయం లేదు. సాక్ష్యాలన్నీ నా భార్య దగ్గరే ఉన్నాయి...."
