Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 9


    వారంరోజులు శలవు పెట్టాను. జీతమందిని ఆ సాయంత్రమె సిల్కు బట్టలషాపు కెళ్ళాను లక్ష్మిని తీసుకొని లక్ష్మి చూపించిన చీరలు నాకేం నచ్చలేదు. నేను చెప్పే రంగులు లక్ష్మికి గిట్ట లేదు. గంటన్నర అవస్థపడి అద్దాల బీరువాలన్నీ తిరగదీసి ఇద్దరికీ నచ్చిన ఓ చీరకి ఆర్డర్ చేశాను. వినీలాకాశం వంటి లేతనీలం చుట్టూ మబ్బులు పట్టినట్టు కారునీలం అంచు. పల్చగా మెత్తగా పాము కుబుసంలా జారిపోతోంది చేతుల్లోంచి. అంతటి మెత్తటి బట్టలు నేనెక్కువ ఇష్టపడను. కానీ ఎందుకో అది అరుణకి బావుంటుదని అనిపించింది. ఆచీరలో అరుణ కాదు ... కాదు అరుణశరీరం మీద ఆ చీరకే కాంతి వస్తుంది. ఆ చీర కట్టుకొని అరుణ నాకు శాంతి ఇస్తుంది.
    ఎనభై రూపాయల బిల్లును చూసి అమ్మ నవ్వి వూరుకుంది.
    "ఈ చీర అమ్మాయికి చాల నిండుగా వుంటుంది. జరీ చూశావ్ ఎంత కాంతిగా వుందో" అంది.
    కోడలంటే అమ్మకెందుకో అంత ప్రేమ!
    అరుణకి వస్తున్నట్టు తెలీచెయ్యలేదు. హఠాత్తుగా వెళ్ళి ఆశ్చర్యపర్చాలి - లక్ష్మి స్టేటస్ కొచ్చింది. వదిన్ని అడిగానని చెప్పమంది.

                             *    *    *

    మేడముందు రిక్షా దిగేసరికి సాయంత్రం ఆరైంది. కాంపౌండ్ లో ఓ పనికుర్రాడు తిరుగుతూ నా దగ్గరి కొచ్చాడు. వాణ్ణి పెళ్ళిలో చూశాను చాలాసార్లు. నన్నుచూస్తూనే వాడు నవ్వుతూ నమస్కారం చేసి పెట్టీ బెడ్డింగూ తీసుకున్నాడు.
    "అయ్యగారు లేరోయ్?" అన్నాను మెట్లెక్కుతూ.
    "ఓ అరగంటలో వచ్చేస్తారు బాబూ! చిన్నమ్మ గారు షయిరెళ్ళారు. పెద్దమ్మగారు పైనున్నారు పిలవమంటారా?" తఃనకు తానే అన్ని సంగతులూ చెప్పాడు.
    "వూఁ చెప్పిరా!" అన్నాను ముక్తసరిగా.
    హాల్లో సోఫాలో కూర్చున్నాను. సంతోష మంతా చచ్చినట్టయిపోయింది. రాగానే అరుణ ఎదురొచ్చి చిరునవ్వుతో పైకి తీసికెళ్తుందని అనుకున్నానేమో అలా జరగనందకు బాధనిపించింది. కాని నిజానికి అరుణ నని లాభం లేదు. నేను వస్తున్నట్టు కలగంటుందా ఏమిటి?    
    పనికుర్ర్రాడు క్రిందికొచ్చి - "కూర్చోండి బాబూ! టీ తెస్తాను, అమ్మగారు వస్తామన్నారు" అంటూ లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఐదు నిముషాలు ఎదురు చూశాను. ఒంటరిగా కూడా కూర్చోటం దుర్భరంగా వుంది. అత్తగారైనా వస్తే మాటా మంచీ! కొంత కాలక్షేపం పని కుర్రాడు టీ తెచ్చాడు. తాగాలనిపించలేదు. అక్కర్లేదన్నాను. తీసికెళ్ళిపోయాడు. ఆవిడ అప్పటికీ రాలేదు. కొత్తల్లున్ని మొట్టమొదటి సారిగా తొమ్మిదినెలలకి అత్తావారింటికొచ్చాను. ఆ సంగతి తెలిసికూడా ఆవిడంత అలక్ష్యంగావుండిపోయింది. నాలో మాత్రం అభిమాన మున్నా ఆ విషయం తేలిగ్గా తోసివేయగలనా?
    "సరే! నేను అరుణ కోసం వచ్చాను." అనుకున్నాను.
    కాంపౌండులోకి కారు దూసుకొచ్చింది. నాదగ్గిరే కూర్చున్న కుర్రాడు వీధిలోకి పరిగెత్తాడు. బూట్లు టకటక లాడించుకొంటూ అరుణా వాళ్ళన్నయ్యా హాల్లోకొచ్చాడు. వస్తూనే నన్నుచూచి -
    "ఓ బావగారా? ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి? ఇప్పటికి దయకలిగిందా? ఏం బావా మాట్లాడవ్? ఎంతసేపైంది వచ్చి? ఏరా గోపీ! అల్లుడుగారికి టీ ఇచ్చావా? అరుణమ్మ గారింకా రాలే?" అంటూ ఉక్కిరి బిక్కిరిగా మాట్లాడేస్తూ సోఫాలో నాపక్కనే కూర్చుని నాచెయ్యి పట్టుకొన్నాడు.
    "టీ తెచ్చాను బాబూ! వద్దన్నారు." అన్నాడు గోపి.
    "అది అల్లుడు బెట్టురా! వద్దన్నా బ్రతిమాలి ఇస్తూండాలి. ఈసారి తీసుకురా! ఎందుకు వద్దంటాడో చూస్తాను." అన్నాడు బావ.
    గోపీ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేనూ నవ్వాను.
    "ఏమిటోయ్ మాట్లాడవ్? ఇంకా కొత్త పెళ్ళికొడుకువేమిటి?"
    "ఏం మాట్లాడను బావా? అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావ్ మరి"    
    "ఎక్కడో ఓ చోట సందుచేసుకొని జొరబడాలి బావా!" అన్నాడు.
    ఇద్దరం నవ్వుకొన్నాం.
    "అత్తయ్యా-మరదలూ వాళ్ళు కులాసా కదూ?"
    అవునన్నాను.
    "ఎన్నిసార్లు రాసినా వచ్చావేకాదు. ఎందుకు బావా కోపం?" అన్నాడు.
    "ఛ! కోపమేముంది? వీల్లేకపోయింది. అంతే సరేకాని ఇక్కడి విశేషాలేమిటి?"
    "కొత్తవేమున్నాయి? మీ చెల్లాయి మొన్ననే పుట్టింటికెళ్ళింది. ఇక నా విషయం తిండికి రావడం కూడా ఇబ్బందిగానే వుంటుంది. ఈ బిజినెస్సేమిటో ఒక్కడికీ చాల కష్టంగానే వుంది. ఇక అరుణాదేవి మాటా? ఎంతసేపూ కొత్త కార్లూ! ఇంగ్లీషు సినిమాలూ!
    "ఆవిడినలా గాలికి తిప్పకపోతే ఆఫీసుపని చూడమనరాదూ? చదువైనా సార్ధకమవుతుంది"
    "దాని మొహం. స్నేహితులూ-షికార్లూ తప్ప దానికేం పట్టదు."
    "నాకు అరుణ ధోరణి చిత్రంగా వుంటుంది బావా! అన్నీ తెలిసిన నువ్వుకూడా దాన్నెందుకు మందలించవు?"
    "ఏం మందలించమంటావ్? నాన్నగారి గారాబంతో దానికింత పెంకితనం అలవాటైంది. ఆయన పోయేక్షణంలో కూడా నాకదే చెప్పారు-"చెల్లిని ప్రాణంలా చూడమని" 'ఏమన్నా అంటే ఏడుస్తుంది. అమ్మ బాధపడుతుంది. ఏం చెయ్యాలో నాకే అర్ధంగాదు. కారు మార్చి ఆరునెలలు కాలేదు. మళ్ళా ఇది బావులేదట. ఏదో కొత్త మోడలుందట. కొనమంటుంది. "మీ ఆయనకు రాసి కనుక్కో, నాకేం తెలీదన్నాను. నీకు రాసిందా?" "మాటలు ఆపాడు, నాకేసి చూస్తూ.
    "మీ చెల్లాయి నాకు వుత్తరాలుకూడా రాస్తుందీ?"
    బావ ఆశ్చర్యపోతూ అన్నాడు - "ఏమిటీ? నీకు లెటర్సు రాయదూ? రోజూ రెండు మూడైనా రాస్తుందే!"    
    "నాకన్నా కావలసిన వాళ్ళావిడకు కొల్లలు." బావ క్షణం మవునంగా నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు.
    "నీకన్నీ తెలుసు బావా! ఈ పెంకితనం తప్ప అరుణలో మరో చెడ్డగుణం లేదు పరాయివాడైతే చాలా చిక్కులే వచ్చేవి. మనం కావలసిన వాళ్ళం. దాన్ని నవ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు చెప్పు. అదే వుద్దేశ్యంతో అరుణని నీ చేతుల్లో అప్పగించాను. దాని ప్రవర్తన నీకు కష్టంగానే ఉండొచ్చు. కొన్నాళ్ళు ఓర్చుకో బావా! అరుణ తప్పక మారుతుంది. కనీసం నాకోసమైనా....." బావ కంఠం బొంగురు పోయింది.
    "ఛ! ఏమిటిది? నేను వేరే వుద్దేశ్యం పెట్టుకొంటే ఇక్కడి కెందుకొస్తాను?" అన్నాను.
    గోపీ టీ తీసుకొచ్చాడు. ఇద్దరం తాగుతూ కూర్చున్నాం.
    "అరుణంటే చిన్నది. క్షమించమంటావు. నేనువచ్చి అరగంట కావొస్తూంది. రాగానే గోపీ వెళ్ళి చెప్పాడు. మీ అమ్మగారితోటి. ఇప్పటికైనా ఆవిడొచ్చి పలకరించారా? నీకు తప్ప నేనంటే ఎవరికీ గురిలేదు బావా?" అన్నాను-
    బావ బాధపడ్డాడు - "వీళ్ళ ధోరణే ఇంత కూర్చొనే మళ్ళా వస్తా." వారిస్తున్నా విన్పించుకోకుండా విసురుగా మెట్లకేసి వెళ్ళిపోయాడు.
    ఆవిడే దిగి వచ్చింది - "బాగున్నావా అబ్బాయ్?" అంటూ పల్కరించింది. నేను మవునంతోనే జవాబిచ్చాను.
    "అమ్మా వాళ్ళంతా క్షేమమే కదూ?" అంది మళ్ళా.    
    "ఆ అంతా బాగానే వున్నారండీ" అన్నాను ముభావంగా. ఆవిడ అలాగే కాస్సేపు ఏవేవో అడిగి - "రామం. స్నానానికి లేవండిద్దరూ. భోంచెయ్యచ్చు తొందరగా." అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS