Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 8


     ఏమీ అనలేక చూస్తూ కూర్చున్నాను. అప్పుడే లక్ష్మిపూల మాల యిచ్చి వెళ్ళింది. దాన్ని నేను చేతుల్లో తీసుకుని అరుణ జడలో పెట్టబోయాను.    
    "ఇటివ్వండి మీకు తెలీదు" అంది నన్ను వారిస్తూ.    
    నాకు తగని చిరాకేసింది- "ఛీ! నువ్వాడదానివా?" అంటూ ఆ దండ నేలకేసి కొట్టి బయటకు పోయాను. అంతే మళ్ళా అరుణతో మట్లాడలేదు. వాళ్ళు స్టేషన్ కి వెళ్ళే టైంకి ఇంట్లోనే లేను.
    అలా అలా తిరిగి రాత్రికి యింటికి వచ్చాను. అరుణా వాళ్ళు లేరు. ఎప్పటిలా ప్రశాంతంగా వున్నట్లు తోచింది.
    అన్నం తింటున్నప్పుడు- "కోడలు కోడలంటూ కలవరించావు. ఎలా వుందమ్మా కోడలు" అన్నాను సామాన్యంగా.
    అమ్మ నవ్వింది - "కోడలికేంరా? లక్షణంగా వుంది" అంది.
    "అన్నయ్యా! వదిన....." అంటూ లక్ష్మి ఏదో చెప్పబోతే అమ్మ కళ్ళు ఎర్రచేసి చూసి "చాల్లే వూరుకో" అంది. లక్ష్మి తలవంచుకుని వూరుకుంది. ఏమిటో అడగాలని వుంది నాకు. అడిగిన లాభం వుండదు. గబగబా తినేసి వెళ్ళి పోయాను. ఓ గంట కానిచ్చి "లక్ష్మీ! కాసిన్ని మంచి నీళ్ళు తెచ్చిపెట్టు" అంటూ పిలిచాను. లక్ష్మి నీళ్ళు తీసుకొచ్చింది. చెయ్యి తీసుకుని దగ్గిర కూర్చో బెట్టుకున్నాను-"ఇందాకేదో చెప్పబోయావ్ ఏమిటదీ" అన్నాను.
    "ఏంలేదన్నయా!" అంది.
    "నాదగ్గరా దాపరికం? వదినన్నావేమిటి? ఏం చేసింది? నాకు చెప్పవు మరీ. చెప్పు లక్ష్మీ."
    "అమ్మా కేక వేసింది. ఐనా చెప్పటానికే మంత పెద్ద సంగతేం కాదన్నయ్యా!" అంది.
    "అసలదేమిటో చెప్పుమరి. అమ్మకి నే చెప్పనులే చెప్పు లక్ష్మీ. అంటూ ఎంతోసేపు అడిగితే లక్ష్మి అంది. "వదిన నాతోగాని అమ్మతో గాని ఇష్టంగా మాట్లాడేది కాదన్నయ్యా! ఒకటి రెండు సార్లు ఏవో మాటల సందర్భంలో అమ్మని "ఏమండీ" అని పిలిస్తే "నేనేం నీకు తెలియని దాన్నా అమ్మాయి? అత్తయ్యా అని పిలువమ్మా అంది అమ్మ "నా కలవాటు లేదండీ!" అనేసింది వదిన. అమ్మ ఏమీ అనకుండా వూరుకుంది. వదిన నాతోనైనా ఎప్పుడు మాట్లాడలేదు."    
    "అది మాట్లాడనప్పుడు దాంతో నువ్వెందుకు మాట్లాడాలి." అన్నాను.
    "బావుంది నువ్వు చెప్పేది. వదినెకి సిగ్గేమో. నాకేమిటి? ఐనా అన్నానికి రా వదినా! స్నానానికి లేవదినా! అనేకదా నేనైనా అన్నది?"
    "ఆవిడకి అత్తయ్యా అని పిలవటానికి అలవాటు లేదుగాని నీకు వదినా అని పిలిచే అలవాటేప్పట్నుంచేమిటి?" అన్నాను చిరాకుగా "పోనీ అన్నానయ్యా! యీ సారి వస్తే ఆవిడే పిలుస్తుంది." అంది లక్ష్మి నవ్వి. కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయింది.
    నాతో గానీ, అమ్మతోగానీ, ఇష్టంగా మాట్లాడేది కాదన్నయ్యా!" లక్ష్మి మళ్ళా మళ్ళా అంటున్నట్టే తోచింది. నేను మాత్రం ఏం చెయ్యను? నాతో ఒకటి మాట్లాడుతోందా? నేనెవరికి చెప్పుకోను లక్ష్మీ? అనుకున్నాను - అరుణ అరుణ అనుకున్నంతకాలం పట్టలేదు. అరుణేమిటో తెలుసుకోటానికి అరుణకి తగని నిర్లక్ష్యం. పెంకితనం. అని మాత్రం నిర్ధారణ చేసుకున్నాను. బ్రతుకులో అతిముఖ్యమైన ఘట్టం గడిచి పోయింది. పెళ్ళి చేసుకున్నాను. రాబోయే భార్య మీద కోటి కోరికలు వుంచుకున్నాను. రాబోయే ప్రతీక్షణం మాధుర్యాన్నే చవిచూస్తాననుకున్నాను. అనుకున్న వన్నీ ఎంతవరకూ అనుభవించానోతెలుసుగా!
    పెళ్ళయిన సంగతే మర్చిపోయినట్లు మూడు నెలలు గడిచాయి. ఈలోపులో పండుగలవీ ఏమీ రానందున నాఆరా వాళ్ళకీ లేకపోయింది. అప్పటికి అరుణ మీద కోపం చల్లారిపోయింది. ఒక్కసారి అరుణని చూడాలని అనిపించ సాగింది. అరుణ వంటి భార్యని వుంచుకునికూడా మూర్ఖంగా పంతాలతో సౌఖ్యాన్ని దూరందూరం చేసుకొంటున్నానేమో అనుకున్నాను.
    అరుణా!
    నిన్ను చూడాలని నామనసెంతో తహతహలాడు తోంది. వూహలలో నువ్వు రోజూ నా దగ్గిరికే వస్తున్నా వాస్తవంగా ఓసారి నీదగ్గిరికి నేనే వచ్చి వెళ్ళాలనుకొంటున్నాను. నీ జవాబు చూసుకొని బయల్దేరుతాను. ఇన్నాళ్ళూ నేనింత మవునంగా వుండిపోయినందుకు నాకే చిత్రంగా వుంది. అరుణా? ఎంత తొందరగా వచ్చి నీ చేతుల్లో వాలి పోతానా అని క్షణం యుగంలా ఎదురు చూస్తాను నీ క్షేమం రాయి.
                                                                                          నీ మధు!


    ఏదో తోచిన విధంగా కవరు రాశాను. తొందర లోనే జవాబు వచ్చింది. కార్డుమీద నాలుగే నాలుగు ఇంగ్లీషు వాక్యాలు.
    డియర్ మధూ!........నమస్తే!
    మీరు వస్తానని రాశారు. సారీ! ఇప్పుడు వీలు లేకపోయినందుకు విచారిస్తున్నాను. మీ లెటర్ రాకముందే ఫ్రెండ్సంతా ఓ ప్రోగ్రాం వేసుకున్నాం. అజంతా ఎల్లోరాలు చూడాలని చాన్నాళ్ళుగా అనుకొంటున్నదే. అంతా రెడీ అయిపోయింది. బయల్దేరేముందు మీ లెటర్ వచ్చింది గానీ నేను ఆగిపోవడం బావుండదు. ఫ్రెండ్సంతా నిరుత్సాహ పడిపోతారు.
    ఫ్రెండ్సంతా మిస్టర్స్ తో వస్తున్నారు. మీరూవుంటే బావుందేది. నాలెటరందిన వెంటనే బయల్దేరినా రాగలుగుతారు. ఈట్రిప్ నుంచి రాగానే కారు మార్చెయ్యాలనుకొంటున్నాను. ఇప్పుడున్నది కొని ఏడాదిపైనే అయింది. కాని అన్నయ్యకిష్టం లేదు మరి.
    పదిరోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అరుణ!
    ఆ కార్డు చదివిన క్షణం నేనెలా ఫీలయ్యానో ఎలా చెప్పను? పగవాడికైనా అటువంటి క్షణాలు సంభవించకూడదని మాత్రం అంటాను. నేనెంత తహతహతో ఎన్ని ఆశలతో వుత్తరం రాశాను! ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్భయంగా జవాబిచ్చిందీ! తను ఆగిపోతే ఫ్రెండ్స్ నిరుత్సాహపడిపోతారు. కట్టుకొన్న మొగుడి కష్టసుఖాలక్కర్లేని మనిషికి ఫ్రెండ్స్ విషయం కావల్సివచ్చింది. వాళ్ళంతా మిస్టర్స్ తో వస్తున్నారు కాబట్టి నేనూ వస్తే బావుంటుందట. నయం. కారు డ్రైవరుగా రమ్మంది కాదు. తిరిగి రాగానే కొత్తకారు కొంటుందట. కారులోవెళ్ళి సముద్రంలో దూకరాదూ?
    "కట్టుకున్న మనిషిని ఉసూరుమనిపించి స్నేహితుల్లో షికార్లు కొట్టే నువ్వూ ఆడదానివేనా?" అనుకున్నామను కసిగా.
    ఆ కార్డు అప్పుడే చించి పారేశాను.
    లక్ష్మి అప్పుడప్పుడు అడుగుతూనే వుంటుంది. "పదినేమైనా వుత్తరాలు రాస్తోందా అన్నయ్యా? ఎప్పుడు తీసుకొస్తావేమిటి?  అని.
    "మన పాపం పండితే అదే వస్తుంది" అన్నాను ఓసారి. అమ్మకేకలేసింది. ఎప్పటి నా ఆలోచనలూ, నా నిరాశలూ మామూలే. నాకళ్ళని నేనే తుడుచుకోవాలి. నాకెవరూ లేరు.
    మరో నాలుగైదు నెలలు గడిచాయి. ఈ లోపులో అరుణ అన్నయ్యా, అరుణా కూడా నాలుగైదు వుత్తరాలు రాశారు. మరిచాను. అరుణ ఆ వెంటనే అజంతా, ఎల్లోరాలు చూసివచ్చి-ఈ ట్రిప్ చాల హేపీగా గడిపాం. ఎక్కడా శ్రమని పించలేదు. మీరూ వుంటేబావుండేది-అన్నట్టు కారుమార్చేశాను. అన్నయ్య ఎలానో ఒప్పుకొన్నాడు మీరువస్తారని అనుకొంటున్నాను" అని రాసింది. మరి రెండుసార్లు రాసినా అంతకుమించి ఆప్యాయతేమీ నాకు కనిపించలేదు. నేను ఆ ఉత్తరాలకి జవాబే ఇవ్వలేదు. వాళ్ళన్నయ్యకి మాత్రం "శలవు దొరకని కారణంగా రాదల్చుకోలేదని" రాశాను. అరుణ తరుపున వాళ్ళలో అతనంటెనే నాకు ప్రేమ, గౌరవం. చిన్నప్పుడు మా స్వగ్రామంలో ఇద్దరం కలిసి చదువుకొన్నాం. మళ్ళా కాలేజీలో ఒకే క్లాసుకాకపోయినా కలిసే తిరిగాం. నేనంటే అతనికీ ఎంతో ఇష్టం. అసలీ పెళ్ళికి అదే కారణం అనుకుంటాను.
    కాలగర్భంలో ఎన్నికలతలైనా కలిసిపోతాయనేది కల్పితంకాదు. పెళ్ళి జరిగి తొమ్మిదో నెల. అంటే అరుణని చూసి తొమ్మిది నెలలైంది. పెళ్ళి లో కలిసి వున్న ఆరురోజులూ చనువుగా మాట్లాడిందీ లేదు. ఇంకా అరుణకి దూరంగా వుండటం సాధ్యం గాదు. ఒక్కసారైనా చూసిరావాలి-అదేకోరిక రాత్రింబవళ్ళూ బాధ పెట్టింది. దానికి జతగా అమ్మసాధింపు ఎక్కువైంది-" అమ్మాయిని తీసుకురావాలంటే నోరు విప్పి జవాబు చెప్పవ్, తొమ్మిది నెలలు కావస్తోంది. ఇంకా పంపమని అడగకపోతే ఏం బావుంటుంది? నేను రాసినట్టు మీ అత్తగారికీ బావమర్దికి వుత్తరాలు రాయమంటే నామాట చెవిన పెడుతున్నావా! లేకపోతే ఓసారి వెళ్ళిరారాదూ? అమ్మాయిని చూసినట్టూ వుంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే తీసుకు రానూవచ్చు" -ఆ సాధింపు భరించలేక ప్రయాణానికి నిర్ణయించుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS