Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 10


    "అరుణని రానియ్" అన్నాడు బావ.
    "దానితో ఏమిటి? ఏ సినిమాకెళ్ళిందో ఏమో" అంది.
    మరి కాస్సేపు కూర్చుని లేచి స్నానం భోజనం కానిచ్చి నిద్ర వస్తూంటే అరుణ గదిలోకి వెళ్ళిపోయాను. తీరిగ్గా గదంతా పరికిస్తూ కూర్చున్నాను. నేలంతా పూల తివాచీలు పరిచి వుంది. పందిరిమంచానికి దోమతెరవేసి వుంది. టేబుల్ మీద రేడియో అమర్చివుంది. కిటికీ దగ్గర్లో రెండు సోఫాలు సర్ది వున్నాయి. అద్దాల బీరువా నిండా బట్టలున్నాయి. గోడలోపలి అలమారులో పుస్తకాలున్నాయి.
    "ఇటువంటిచోట మసిలే మనిషికి చిన్న ఇళ్ళలో తిరగటం ఇబ్బందిగా వుంటే వుండొచ్చు" అనిపించింది.
    ఎనిమిది కావస్తూంటే మెట్లమీద స్లిప్పర్సు చప్పుడు విన్పించింది. అరుణ గదిలో కొచ్చింది. నా దగ్గిరగా వచ్చి కూర్చుంది. దగ్గిరికి తీసుకున్నాను - రాణీగారికిప్పటికీ ఇల్లు గుర్తువచ్చిందా? నీకోసం......."
    "నయం, సినిమాకెళ్దాం అనుకునే మానేశాను. లేకపోతే పదిదాటిపొయ్యేది" అంది నవ్వి - అరుణనే చూస్తూ వుండిపోయాను.
    "ఏం వుత్తరాలు రాయటం మానేశారు?" అంది.
    "నువ్వు రాశావా నేను రాయటానికి?" అన్నాను.
    "జవాబు లివ్వటం లేదని వూరుకున్నాను."
    "పోనీగానీ నీలో చాలా మార్పు కన్పిస్తోంది అరుణా! కాస్త బొద్దుగా - మరీ పచ్చగా వున్నావు. ఇప్పుడే బావున్నావ్ నాకు." అన్నాను.
    "సరే! ఆకలేస్తోంది. మళ్ళా వస్తాను" అంటూ ఒళ్లోంచి లేవబోతే ఆపుజేస్తూ - "నిన్ను వదల్లేను అరుణా!" అన్నాను.
    "మరి ఆకలేస్తోంది. అన్నం మానెయ్యమంటారా?" అంది.
    "ఏం? నాకోసం మానలేవా?"
    "బావుంది మీకోసం నేనెందుకు ఆకలితో మాడాలి?" అంటూ నవ్వి లేచి వెళ్ళిపోయింది-అరుణ మానసికంగా కూడా చాల మారినట్లే తోచింది. నాకెంతో సంతోషమైపోయింది.
    అర్ధగంటసేపటికి వచ్చింది. మళ్ళా కబుర్లేసుకున్నాను. తనంత ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుర్తువచ్చినట్టు ఒక్కోమాట మాట్లాడుతుంది.
    "మరిచాను. లక్ష్మి నిన్ను అడిగినట్టు మరీ చెప్పమంది"
    "ఈసారి నేనూ అడిగానని చెప్పండి. మీ అమ్మగారు బావున్నారా?" అంది-"మీ అమ్మగారు అనకపోతే అత్తయ్య అనకూడదూ? ఏం? మా అమ్మని అత్తయ్యని పిలవటం నీకు నామోషియా?"
    "అదేమోనబ్బా! నాకలవాటు లేదు." అంది అలక్ష్యంగా.
    నేను నెమ్మదిగానే అన్నాను - "అరుణా! ఈ నిర్లక్ష్యం పెంకితనం పోయిన పొడుగునా పెంచుకొంటూ రాకు సుమా! పెళ్ళికిముందే అత్తలూ - ఆడబిడ్డలూ ఎవరికీ వుండరు. తర్వాత కలిసినవాళ్ళని దూరంగానే వుంచుకోరు. ఏం? మీ వదిన మీ అమ్మని అత్తయ్యా అని పిలవటంలేదా? నువ్విదే ధోరణిలో సాగుతూంటే నాకు చాల చిరాగ్గా వుంటుంది మరి."
    అరుణ మాట్లాడకుండా విని ఊరుకుంది. మళ్ళా ఆ ప్రసక్తి నేనట తేలేదు. బేగులో వుండిపోయిన పూలగుత్తి తీసి అందించాను. అరుణ తల్లో పూలువున్నాయి.
    "ఉంచండి. రేపు పెట్టుకుంటాను. తల్లో వున్నాయికదా? అంత ఎక్కువ పెట్టుకొంటే మోటుగా వుంటుంది" అంది. నేను మరేం అనలేదు గానీ ప్రేమతో ఇచ్చిన పూలు అరుణ తీసుకు ముడుచుకుంటే నాకు తృప్తిగా వుండేది.
    "నీకో చక్కటి వస్తువు తెచ్చాను. చెప్పుకో" అన్నాను.
    "ఏమిటో అది! మీరే చెప్దురూ!" అంది.
    "అయ్యో! అంతమాత్రం ఆలోచించలేవా? లేక ఆలోచించటం బద్ధకమా?" అన్నాను.
    ఓ క్షణం ఆలోచన అభినయించింది. నాకేసి చూస్తూ-"నెక్లెస్! అంతేనా?" అంది కళ్ళు విశాలం చేసి నేను మాట్లాడలేకపోయాను. మనసు చివుక్కుమంది. ఆవిడ చూపంతా అంత స్థుల మీదే. నెక్లెస్ లు వూహించుకొంటున్న మని షితో చీరసంగతేం చెప్పను?    
    "ఏం? మాట్లాడరూ?" అంది.
    "ఏం లేదులే. నెక్లెస్ మాత్రంకాదు."
    "నేను అనుకొంటూనే వున్నాను మీరు నెక్లెస్ తేలేరని."
    "అరుణా!" - శూలంతో పొడిచినా అంత బాధపడను. నా లేమిని ఎత్తిచూసి దెప్పటం కాదూ అది? ఉన్నంతలోనే బ్రతుకుదామని ఓదార్చవలసిన ఆడదికాదూ?
    "నేనేమన్నాననీ కోపం? ఏం తెచ్చారో చెప్పండీ" అంది.
    "ఏం లేదులే. నువ్వనుకునేంత గొప్పదేం కాదు. అసలు నీవంటి దానికా వస్తువు తగదుకూడా."
    అరుణ మళ్ళా మాట్లాడలేదు. కొంతసేపు పోయాకైనా అదేమిటో తప్పక చూపించుదామని అడిగితే చూపించేవాణ్ణి. ఏ విషయంలో కూడా బ్రతిమాలడటం - సంతోషపెట్టటం అనేది ఆవిడకు అర్ధమే కాదు. ఆరాత్రి నేను తెచ్చిన చీరలోనే అరుణని దగ్గిరికి తీసుకోవాలని అనుకున్నానుగానీ నేననుకున్నది ఏది జరిగింది గనకా?
    తెల్లారి మెలుకువచ్చేసరికి ఏడుదాటింది. పక్కన అరుణలేదు. క్రిందకిగాని వెళ్ళిందేమో అనుకొని ఓ పావుగంటసేపు అలానే పడుకున్నాను. గోపీ పైకివచ్చాడు - "లేచారా బాబూ! బాత్ రూం కొస్తారా?" అన్నాడు.
    "చిన్నమ్మగార్ని పిఁవ్వోయ్!" అన్నాడు బద్ధకంగా పడుకొని. "ఎక్కడికో వెళ్ళారండి. మీరు లేవగానే కావలసినవన్నీ నన్ను చూడమన్నారు. వెంటనే వచ్చేస్తామన్నారు. రాముబాబుగారు కూడా లేచి కాఫీ తీసుకున్నారు." అన్నాడు.
    "సరేలే నువ్వెళ్ళు" అని వాన్ని పంపేశాను. లేచి కూర్చున్నాను. తెల్లారిందోలేదో అప్పుడే తిరుగుడా? ఇంట్లో నేను వున్నాననే ధ్యాసైనా వుందా? కావలసినవేవో చూడమని పనిమనిషితో చెప్పిపోయిందన్నమాట. సరే! చూద్దాం - ప్రశాంతంగానే లేచినా తిరిగి మనసు అల్లకల్లోలమై పోయింది-టూత్ బ్రష్ తీసుకొని బాత్ రూంలోకి నడిచాను. వేడినీళ్ళు రెడీగా వున్నాయి. టవల్ తీసుకొని స్నానం చేశాను. ఆపనులన్నీ అరుణ వెంట తిరుగుతూ చేస్తే ...? స్నానం చేసిరాగానే బట్టలందించాలనీ-అరుణ చేతుల్తో తలదువ్వించుకోవాలనీ -ప్రతి క్షణం అరుణని అంటిపెట్టుకు తిరగాలనీ కోరే కోరికలన్నీ తీరని కోరికలుగానే వుండిపోతూ వచ్చాయి. ఎప్పటి కైనా తీరుతాయంటే కూడా నమ్మకంలేదు.
    నిలువుటద్దం ముందు నించుని తల దువ్వు కొంటూంటే గోపి ట్రీలో ఫలహారం కాఫీ తీసుకొచ్చాడు.
    "ఇప్పుడేం వద్దు తీసికెళ్ళవోయ్." అన్నాను చిరాగ్గా. వాడు విన్పించుకోకుండా ట్రే ని టేబుల్ మీద పెడుతూ-"బాబుగారు హాల్లోనే వున్నారు. కేకలేస్తారండీ." అన్నాడు.
    "సరే! ఉంచి వెళ్ళు." అంటూంటే అరుణ వచ్చింది. గోపీ వెళ్ళిపోయాడు-"ఇంకా కాఫీ తీసుకోనేలేదా?" అంది దగ్గిరకొస్తూ.
    నేనేం మాట్లాల్లేదు.
    "అదేం? అలా వున్నారు?" అంది.
    "ఎలా వున్నా ఒకటేగానీ-మరెక్కడి కైనా వెళ్ళిరా! తెల్లారిందిగా?"
    "బావుంది వెళ్ళాల్సి వచ్చి వెళ్లాను. ఓ ఫ్రెండ్ నేనూ ఓ చోటుకి వెళ్దామనుకున్నాం. నాకివ్వాల వీలుకాదని చెప్పటానికెళ్ళాను."
    "నీకెందుకు వీలుకాదు? వస్తానని గంపెడాశతో వుత్తరం రాస్తే నీ ఫ్రెండ్స్ తో ప్రయాణమానుకున్నావా? ఇవ్వాళమాత్రం ఎందుకు వీలుకాదు?"
    అరుణ మాట్లాల్లేదు.
    "ఫోన్లో చెప్తే సరిపోయేదిగా?"
    దానికీ మవునం.
    "అరుణా! నీధోరణి శృతిమించిపోతోంది. నాకేం నచ్చలేదు."
    "నేనేం కాని పనులు చెయ్యటంలేదు మీకనచ్చకపోటానికి."
    "నోర్ముయ్! అయినపనంటూ ఏదిచేశామ్ గనక? నువ్వు చేసే ప్రతిపనీ కానిపనే. ఆడది' వుండాల్సిన తీరులోనే నువ్వులేవు. ఇదే ధోరణిలో సాగిపోతానంటే మాత్రం నాదగ్గిర వీల్లేదు.'
    "స్వయంగావెళ్ళి మాట్లాడాల్సిన సంగతి కాబట్టి వెళ్ళివచ్చాను. ఈమాత్రానికి మీకేం లోటు వచ్చింది? అన్నీ గోపీతో ...."
    అరుణా! నన్నింకా రెచ్చగొట్టకు. చేసింది చాలక సమర్ధించుకోబోతావేం? మహా లోటు లేకుండా అమర్చివెళ్ళావ్. టిఫిన్లకీ - కాఫీలకీ మొహంవాచి వచ్చాననుకున్నావా? ఎందుకొచ్చాను? ఎవరికోసం వచ్చాను? కావలసినవేమిటో గోపీ చూస్తే నిండిపోతుందనుకున్నావా? అసలు నేను వచ్చానని నీకేమైన సంతోషంగా వుందా?"
    అరుణ జవాబెమీ చెప్పకుండా టిఫిన్ ప్లేటు తీసుకొచ్చి ముందిది "తినండి చల్లారిపోతుంది" అంది.
    "చాల్లే మమకారం. ఇంకా ఫలహార మెందుకు? నీ అనురాగంతోనే కడుపంతా నిండివుంది." అంటూ ప్లేటు తోసివేశాను.
    ఓక్షణం ఆగి- మీకింత కోపం వస్తుందని అనుకోలేదు." అంది నెమ్మదిగా.
    "కోపం కాదు అరుణా! కోపమైనా కొంత సేపటికి పోతుంది. గుండెల్లో పేరుకొంటున్న బాధ ఏనాటికీ కరగదు. ఒకప్పుడు నిన్ను తల్చుకుని ఎంతో మురిసిపోయాను. నా మురిపెం అంతా ముక్కలైపోయింది. నేను కోరుకొంటూన్న దాంపత్య జీవితాన్నే పొందలేకపోతున్నాను. జీవితానికి ఆలోటు చాలు-నువ్వు ఆర్డర్ చేసి వెళ్ళే టిఫిన్లూ, కాఫీలూ కాదు నాకు కావల్సింది. నామనసు సంతోషపెట్టాలని నీకెందుకు తోచదో నాకర్ధం కాదు." అనుకోకుండానే ఆనాలుగు ముక్కలూ వెల్లడించాను శాంతంగా.

                           *    *    *

    ఇంతలో -"ఏం బావా! కాఫీ ఐందా?" అంటూ బావ గదిలో కొచ్చాడు.
    "లేదన్నయ్యా! మీబావగారు బెట్టుచేస్తున్నారు. కాస్త బ్రతిమాలుదూ!" అంది అరుణ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.
    "నువ్వే నీ మొగుణ్ణి బ్రతిమాలి తిన్పించలేక పోతే ఇక నేనెంత?" అన్నాడు. ఆ మాటల్లో ఎంతో అర్ధం కన్పించింది నాకు. అరుణ మవునం దాల్చింది-"ఐనా ఏం బావా? ఏమిటీ అలక?" అన్నాడు తిరిగి.

                                          
    "ఛ! నాకేం అలక? నేనలిగితే ఎవరు ఖాతరు చేస్తారు గనకా?" అన్నాను నవ్వుతూనే.
    "సరే! నీ నిష్ఠూరాలకేంలే ముందు టిఫిన్ తీసుకో నేనాఫీసుకు పోతున్నా వస్తావా? కాస్సేపు మాట్లాడుకుందాం. ఓ గంటలో పంపేస్తాలే. ఈ లోపులో అరుణ కూడా ఇంకెక్కడికైనా వెళ్ళి  వస్తుంది." అన్నగారి మాటలు వింటూనే అరుణ మొహం కందగడ్డయి పోయింది. నాకు నవ్వొచ్చింది. బావకూడా నవ్వుతూ -"ఎందుకే అంత కోపం? బావగారెందుకలిగారో తెలిసిందా?" అన్నాడు. నేను ఫలహారం చేస్తూంటే బావగారి ఆర్డర్ తో గోపీ మళ్ళా వేడి వేడి కాఫీ తీసుకొచ్చాడు.
    బావతో కాస్సేపలా తిరిగి రావాలనిపించింది. "ఓగంటలో వచ్చేస్తాను. ఇంట్లోనే వుంటావుగా?" అన్నాను అరుణతో హాస్యానికి.
    "చాల్లే బావా! దాన్ని మరీ అమాయకంగా చేసి ఆడిస్తే నేను లేనూ?" మా ఇంటికది ప్రాణం తెలుసా?" అన్నాడు బావ మెట్లకేసి నడుస్తూ.
    ఆఫీసు గదిలో కూర్చోబెట్టి నాకర్ధంగాని బిజినెస్ వ్యవహారాలేవో చాలా చెప్పాడు-" అంతా చూసుకోటం నాకు చాలా కష్టంగా వుంది బావా! నీది నువ్వు స్వంతం చేసుకొంటే నాకు సగభారం తగ్గుతుంది." అన్నాడు నవ్వి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS