బాగా తెగించిన వాళ్ళు తప్ప ఇలాంటి పధకాలు వేయరు. అంతలా తెగించినవారు ఇంత స్వల్ప ఆదాయం కోసం ఇంతగా శ్రమపడరు. అదీకాక ఈ ముఫ్ఫై అయిదు వేలకోసం వాళ్ళు కొన్ని వారాలపాటు శ్రమపడవలసి వచ్చింది.
రమాకాంతం ఆలోచనలు మరికాస్త దూరం వెళ్ళేసరికి తన ఆలోచనలు తప్పుదారిలో పడుతున్నాయని పించింది. హత్య జరిగే ఉంటుంది. పోలీసులా ఆ శవాన్ని తీసుకుపోయే ఉంటారు. ఆనందరావు ఇప్పుడు జైల్లోనే ఉండివుంటాడు. చనిపోయిన ఆ యువతి దెయ్యమయ్యే ఉంటుంది.
రమాకాంతం ఆలోచనలు అక్కడ ఆగాయి.
వికృతంగా మారిన ఆ యువతి రూపం క్షణమాత్రంలో ఆయనకు వణుకును తెప్పించింది. ఐతే ఆ వికృత రూపం....
ఆలోచన ఆపి ఆయన రఘుని పిలిచాడు. రాగానే- "ఏరా ఆ పిల్లను దెయ్యంగా నువ్వు కూడా చూశావు. అది వికృత రూపంలో వున్నప్పుడు నీకేమనిపించింది? బాగా ఆలోచించి చెప్పు. ఆమె మాస్కుగానీ వేసుకోలేదుకదా!" అన్నాడు.
రఘు ఆలోచించి-"ఏమో నాన్నా- ఇప్పుడు చెప్పడం కష్టం. అప్పుడు భయంలో ఇంకేమీ తెలియలేదు. అందులోనూ దగ్గరకు వచ్చి నాకేసి చూడగానే ఏదో మానవాతీత శక్తి అనిపించింది. అది దెయ్యమే అనిపించింది-" అన్నాడు.
"కొంతమందికి హిప్నాటిక్ పవర్ ఉంటుంది. దాంతో వాళ్ళు మనుషుల్ని విబ్రాంతుల్ని చెయ్యగల్గుతారు. మనని వాళ్ళు చాలా తెలివిగా మోసగించారని నా అనుమానం" అన్నాడు రమాకాంతం. రఘు తండ్రి వంక ఆశ్చర్యంగా చూశాడు.
అప్పుడు రమాకాంతం మొత్తం తన అనుమానాలన్నింటినీ వివరించి కొడుక్కు చెప్పాడు. రఘు అదంతా విని-"మనింటికొచ్చిన ఇన్స్ పెక్టర్ ఈ ఊళ్ళో లేడు. ప్రొఫెసర్ కర్మ మనకు మళ్ళీ దొరకలేదు. దీన్నిబట్టి చూస్తూంటే మీ ఊహ సరైనదేననిపిస్తోంది. అయినా కొద్ది వారాల శ్రమకు, రిస్కుకు మనిషికి మూడువేలతో తృప్తిపడే ముఠా యిలాంటి కార్యక్రమం తలపెట్టదు. బహుశా ఆనందరావు, ప్రొఫెసర్ కర్మ, శతమానాలకు లాగే ఇంకా ఎవరైనా మనింటికి డబ్బుకు వస్తారేమో! మనం చాలా జాగ్రత్తగా వుండాలి!" అన్నాడు.
కొడుకిలా అనగానే రమాకాంతం బెంగపెట్టుకొన్నాడు. అతడు చెప్పిందాంట్లో వాస్తవముంది. ఆ ముఠా తననుంచి లక్షదాకా రాబట్టుకోవాలంటే తన పని అయిపోయినట్లే! ఇంతవరకూ వచ్చిన నష్టాన్నెలా కూడదీసుకకోవాలా అని తను ఆలోచిస్తున్నాడు. ఇంక ఎట్టి నష్టాన్నీ ఊహలో కూడా భరించలేడు.
"నేను వీర్రాజుగారిని కలుసుకొని వస్తాను-" అన్నాడు రమాకాంతం.
రఘు తండ్రివంక ఆశ్చర్యంగా చూశాడు.
వీర్రాజు గారికి రమాకాంతంతో ముఖ్యమైన పనివుంది. ఆయన డబ్బు కూడా బాగా ముట్టజెపుతాడు. అయితే ఆయనతో వ్యవహరంలో చాలా చక్కులున్నాయని రమాకాంతం ఓ పట్టాన ఆయన పని చూడడు. సాధ్యమైనంత వరకూ తప్పించుకు తిరుగుతాడు. వెతుక్కుంటూ రమాకాంతం, వీర్రాజు దగ్గిరకు వెళ్ళాడంటే ఆయన ఎగిరి గంతేస్తాడు.
9
ఏ వేళలో న్యాయం కావాలనుకున్నా ప్రభు దర్శనం కలిగించే న్యాయ గంట కొన్ని రాజ్యాల్లో ఉండేదట. వీర్రాజు ప్రభువు కాకపోయినా, రాజ్యాలు లేకపోయినా ఆయనకూ న్యాయగంట అవసరముంది. ఆ న్యాయ గంట పేరు గంటయ్య.
రమాకాంతం గంటయ్యనే కలుసుకొన్నాడు.
"మంచి టైములో వచ్చారు బాబూ-అయ్యగారు మంచి మూడ్ లో వున్నారు-" అన్నాడు గంటయ్య.
మూడ్ అనగానే రమాకాంతం గుండెల్లో రాయి పడింది. వీర్రాజుకి మంచి మూడ్ అందమైన కొత్త ఆడపిల్ల దొరికినప్పుడేనని ఆయనకు తెలుసును. అందుకు రమాకాంతం అభ్యంతరమేమీలేదు. ప్రపంచంలో సత్ప్రవర్తన తరపున ఆయన వకాల్తానామా ఏమీ తీసుకో లేదు. ఆడవాళ్ళ విషయంల కాస్త ముడి కట్టుకున్నా డబ్బు విషయంలో అంతో యింతో గడ్డికరుస్తూ నే వున్నాడు. కాబట్టి తనో ఆదర్శపురుషుడనుకుందుకు వీల్లేదు. ఇబ్బంది అల్లా ఏమిటంటే వీర్రాజుకో సరదా వుంది. తనలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళతో అసభ్యంగా సరసాలాడ్డం ఆయన హాబీ.
తన యిబ్బంది నాయన పట్టించుకోడు. ఆయన, ప్రియురాలు - మూడో మనిషినట్లే చనువుగా ప్రవర్తిస్తారు. ఆయన తనతో వ్యాపార విషయాలు చర్చిస్తూంటే ఆమె డిస్టర్బు చేస్తూంటుంది. ఆ ప్రియురాలు తన ఉనికిని గుర్తించదు. అతడిని రకరకాలుగా రెచ్చగొడుతూ తనవైపు దృష్టి మరల్చుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెను మృదువుగా అనునయిస్తూ సంభాషణ కొనసాగిస్తాడు వీర్రాజు.
ఈ విధంగా రమాకాంతం చాలామార్లు ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది పలురకాలు. అందులో మనసు చలించడం కూడా ఒకటి.
ఇప్పుడూ వీర్రాజు నుంచి మూడ్ లో వున్నాడంటే తన ఇబ్బంది తనకు తప్పదు. కానీ ఇప్పుడు డబ్బు అవసరం.
తన ఇబ్బందిని రమాకాంతం వీర్రజుకు చెప్పలేదంటే అందుకు మొహమాటం ఒక్కటే కారణంకాదు. వీర్రాజు కోటీశ్వరుడు!
రాత్రి ఎనిమిది గంటలకు ముహూర్తం పెట్టాడు గంటయ్య.
రమాకాంతానికి మంచి భోజనం ఏర్పాటయింది. భోం చేశాక గంటయ్య ఆయనకు స్వయంగా మారువేషం వేశాడు. గంతయ్య హస్తకౌశలంతోపాటు, గెడ్డం మీసాలు కూడా తోడ్పడగా రమాకాంతం రూపం పూర్తిగా మారిపోయింది.
వీర్రాజు విలాసమందిరం ఊరి మధ్యలోనే వుంది. డబ్బుంటే ఆహిరంగంగా తప్పులు చేయొచ్చుననడానికి ఆ విలాసమందిరం ఒక చిహ్నం.
వీర్రాజుకు డబ్బున్నా సమాజంలో మరీ అంత గౌరవ ప్రతిష్టలు లేవు. పోలీసుల కన్ను ఆయనపై వున్నది. ఆయనతో దగ్గరగా తిరిగే సామాన్యులను పోలీసులు వేధిస్తూంటారు కూడా. రమాకాంతం వీర్రాజును మారువేషంలో కలుసుకొనే కారణం కూడా అదే! పోలీసులు వీర్రాజును పట్టుకొనే అవకాశం కోసం వేచివున్నారని కూడా చెప్పుకుంటారు. తనకు వ్యతిరేకంగా ఉండే సాక్ష్యాలను నిర్ధాక్షిణ్యంగా అణచి వేయగల సామర్ధ్యం, దౌష్ట్యం-రెండూ ఉండడంవల్ల వీర్రాజు ఇంకా జైలుకు వెళ్ళలేదని చాలామంది అనుకుంటూంటారు.
ఏది ఏమైనా పోలీసుల సానుభూతి పొందని ధనవంతుల్లో అతడొకడని చాలామందికి తెలిసినట్లే-రమాకాంతానికీ తెలుసు.
రమాకాంతం వీర్రాజు విలాస మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో వీర్రాజుకో అంతఃపుర మందిరమున్నది. అందులోనికి తప్ప అందులోనికి తప్ప ఎందులోనికైనా వెళ్ళాలని రమాకాంతం అనుకుంటాడు. కానీ ఎప్పటిలాగే ఈ రోజూ ఆ మందిరంలోకే వెళ్ళవలసి వచ్చింది.
ఆ గదిలో నాలుగు గోడలకూ శృంగారభరితమైన తైలవర్ణ చిత్రాలు తగిలించి వున్నాయి. గదిలో అడుగు పెట్టగానే మత్తెక్కించే పరిమళం. గది మధ్యలో అందమైన పాన్పు. పాన్పుమీద వీర్రాజు. పాన్పుకు దగ్గర్లో సుఖంగా కూర్చోడానికో సోఫా. అది రమాకాంతంకోసం. సోఫాముందొక చిన్న బల్ల. బల్లమీద పద్దు పుస్తకాలు. పోలీసులు పట్టుకొన్నా అర్ధం చేసుకోలేదని ఆ పుస్తకాలకు భాష్యం చెప్పి మార్పులూ, చేర్పులూ చేయగల సామర్ధ్యం రమాకాంతంలాంటి కొద్దిమందికే ఉంటుంది.
గదిలో స్త్రీలు లేకపోవడం చూసి రమాకాంతం తేలికగా నిటూర్చాడు. ఈ రోజు తన అదృష్టం బాగుంది.
