Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 8

 

    చాలా మంది వాడిచుట్టూ వున్నారు. అందరికీ వాడు బట్టలు చూపిస్తున్నాడు. బట్టల గురించి ఆకర్షణీయమైన వాక్యాలు చెబుతున్నాడు. సదానందం ప్రశ్నను ముందు వాడు వినిపించుకోలేదు. కానీ ఆ గొడుగును మధ్యమధ్యలో మూస్తూ తెరుస్తూనే వున్నాడు.
    సదానందం రెండు మూడు సార్లడిగితే కానీ వాడా గొడుగు ధర చెప్పలేదు. ఆఖరికి అతడికి సంతృప్తికరమైన సమాధానమే వచ్చింది. వాడా గొడుగు నతడికి అందించి "డెబ్బై అయిదు రూపాయలు" అన్నాడు.
    సదానందం గొడుగును పరీక్షిస్తూ మరదలి వంక గొప్పగా చూసి "చూశావా నా గొప్పతనం !" అన్నాడు.
    గీత స్వరం తగ్గించి "పట్నంలో రోడ్ల మీద సగానికి సగం ధర తగ్గించి బేరమాడాలని మా నాన్నగారు చెప్పారు" అంది.
    "అంటే - ఇప్పుడు దీన్ని నలభై రూపాయల కడగాలా? నా వల్ల కాదు. వాడు తిడతాడు" అన్నాడు సదానందం భయంగా.
    ఇంతలో ఎవరో వాడిని "గొడుగులున్నాయా ?" అని అడిగాడు.
    "బాబూ -- ఆ గొడుగాయాన కివ్వండి" అన్నాడు అమ్మేవాడు.
    సదానందం తటపటాయిస్తూండగా ఆయనే ఆ గొడుగు తీసుకున్నాడు అతడి వద్ద నుంచి -- "ఎంత కిస్తున్నావోయ్...."
    "డెబ్బై అయిదండి...."
    "ఎడిచినట్లుంది , దీని ధర ఇరవైకి మించదు" అన్నాడాయన.
    రాధ, గీత ,సదానందం వెళ్ళి పోబోతున్నవాళ్ళల్లా ఆగి పోయారు.
    "మరీ అన్యాయంగా మాట్లాడకండి బాబూ! పోనీ యాభై చేసుకోండి " అంటూ వాడు. ఆ మనిషిని పట్టించుకోకుండా తన బట్టలు బేరం చూసుకోసాగాడు.
    "యాభై లేదు....నలభై లేదు, పాతిక ....అంతే!"
    బేరం కొద్ది క్షణాలు కూడా నడవలేదు. వాడది ఆయనకు పాతిక రూపాయలకు ఇచ్చేశాడు.
    సదానందం ముఖం వెలవెల పోయింది.
    'అయిందేదో అయిపొయింది లే బావా ...ఇవి ఇంకో రెండు పుచ్చుకుందాం -- పాతిక రూపాయలకు ఆటోమేటిక్ గొడుగులంటే కారు చౌకకదా -- మా ఉళ్ళో ఎవరికైనా ఇస్తాను...." అంది గీత.
    గొడుగు పాతిక రూపాయలంటే ఒకటి భార్యకి పుచ్చుకోవాలని సదానందం మనసులో వున్నది. కానీ తానీ విధంగా మోసపోయాడేమిటి .....అని అతడికి బాధగా కూడా వుంది.
    "నాకో గొడుగు కావాలి " అన్నాడు సదానందం.
    అయితే అలా అరిచిన పది పదిహేను గొంతులకు ఒకటి మాత్రమే అయింది అతడి గొంతు.
    అమ్మేవాడు సంచీలోనికి చేయి పోనిచ్చీ బట్టలన్నీ కెలికాడు. వాడు బయటకు ఏమీ తీసినా గుడ్డలే వస్తున్నాయి.
    "గొడుగులు లేవు బాబూ! అందాకా బట్టలు చూస్తుండండి. పావుగంటలో మళ్ళీ కొన్ని గొడుగులు వస్తాయి" అన్నాడు వాడు.
    సదానందం ఆలోచనలో పడ్డాడు. ఈలోగా అతడికి కాస్త పక్కగా నున్న ఓ మనిషి -- "మీకు గొడుగులు కావాలంటే కాస్త దూరంలో ఇంకొకడున్నాడు. వాడి దగ్గరకు పోయి కొనుక్కోండి " అన్నాడు.
    ముగ్గురూ కాస్త ముందుకు నడిచారు. అక్కడ కూడా మరో అమ్మేవాడున్నాడు. ఇందాకటి వాడికి తమ్ముడిలా గున్నాడు వాడు.
    'ఆటోమేటిక్ గొడుగులున్నాయా?" అనడిగాడు సదానందం.
    "ఇప్పుడే ఆఖరిది అమ్మేశాను. ఓ పావుగంట ఆగితే మరికొన్ని గొడుగులు వస్తాయి. కావాలంటే అందాకా బట్టలు చూడండి. కొరియా బట్టలు. కారుచౌక...."అన్నాడు అమ్మేవాడు.
    ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. ఈలోగా వాళ్ళపక్కనే ఉన్న మనిషి సదానండంతో -- "గొడుగు డెబ్బై అయిదు చెబితే ఎంతకు బెరమాడలా అని తటపటాయిస్తున్నాను. ఈలోగా ఎవడో పాతిక రూపాయలకు బేరమాడి పట్టుకుని పోయాడు. అదే ఆఖరి గొడుగు కావడం నా దురదృష్టం " అయినా ఇదేం పట్నం బెరమో! ఎక్కడి డెబ్బై అయిదు ఎక్కడి పాతిక ...." అన్నాడు.
    అప్పుడు సదానందం దృష్టిని కాస్త దూరంగా అటూ యిటూ సారించాడు. ఈవిధంగా బట్టలమ్ముతున్న వాళ్ళు పది పదిహేను మంది దాకా ఉన్నారు.
    వాళ్ళు ముగ్గురూ గబగబా ఓసారి తిరిగేశాడు. అందర్నీ పలకరించారు. అన్ని చోట్లా కూడా ఆటోమేటిక్ గొడుగులు పాతిక రూపాయలకు అమ్ముడు పోయాయి. కానీ తాము కొందామంటే ఎవ్వరి వద్దా లేదు. అంతా ఓ పావుగంట ఆగమంటున్నారు.
    సదానందం ఒకడి దగ్గర గంటసేపు ఆగాడు. అయిన గొడుగులు రాలేదు-- "ఇంకా ఎంతసేపు నించోవాలి ?" అని అతడు చిరాగ్గా అడిగాడు కూడా.
    "ఏమోనండీ -- ఈపాటికీ రావాల్సిందే మరి" అన్నాడు అమ్మేవాడు. వాడికి సదానందం గురించి పట్టించుకునే వ్యవధి లేదు. ఆగకుండా బట్టలు చూపిస్తున్నాడు. జనానికి బట్టలు త్వరగా అమ్ముడు పోతున్నాయి కూడా!
    "పదండి పోదాం " అంది రాధ.
    "ఏం?" అంది గీత.
    "ఈ గొడుగుల వ్యవహారమంతా ఏదో నాటకంలా కనబడుతున్నది నాకు" అంది రాధ ఆలోచిస్తూ -- "గొడుగు డెబ్బై అయిదు చెప్పాడ మేమిటి? పాతిక్కి ఇవ్వడ మేమిటి? నా ఉద్దేశ్యం ఈ దుకాణాల వాళ్ళు గొడుగులు అమ్మడం లేదు. వాటిని చూపి జనాలను ఆకర్షిస్తున్నారు. గొడుగు పేరు చెప్పి ఇక్కడ జనం చేరుతున్నారు. గొడుగు కోసం ఎదురు చూస్తూ బట్టలు చూస్తున్నారు. అనుకోకుండా ఆకర్షితులై బట్టలు కొంటున్నారు. ఇదీ వాళ్ళ వ్యాపారం...."
    'మరి కొన్ని గొడుగులు అమ్ముతున్నారుగా " అంది గీత.
    "అవి వాళ్ళ వాళ్ళకే అమ్ముతున్నారని నా అభిప్రాయం...." అంది రాధ.
    సదానందం ఆలోచిస్తూ -- "నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. ఇదే వీళ్ళు చేస్తున్నది. వీళ్ళు జనాలని మోసం చేయడం బాగోలేదు. తగిన విధంగా వీళ్ళకు బుద్ది చెప్పాలి" అన్నాడు.
    "పాపం -- వీళ్ళు మోసమేం చేస్తున్నారు?" అంది రాధ.
    ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మోసం చేయడం లేదు. ప్రజలను భ్రమలో వుంచుతున్నారు. అయితే సదానందానికి వాళ్ళ మీద చాలా కోపంగా వున్నది. అసలే తను కొన్న గొడుగు ధర విషయమై మరదలు తనను అనుమానిస్తున్నది. ఆ అనుమానానికి ప్రాణ ప్రతిష్ట చేశారు వీళ్ళు. అందుకై వీళ్ళను తాను ఇబ్బందిలో పెట్టవలసి వున్నది.
    అతడు బాగా ఆలోచించాడు. దారిలోనే ఒకచోట ఆగి జేబులోని కాగితం తీసి అప్పటికప్పుడు ఒక ఉత్తరం రాశాడు.
    "పట్నంలోకి మత్తు పదార్ధాల రవాణా కొరియా బట్టల వర్తకుల ద్వారా అవుతున్నది. వాళ్ళను క్షుణ్ణంగా సోడా చేస్తే ఓ పెద్ద ముఠా బయట పడగలదు."
    క్రింద సంతకం పెట్టలేదు.
    తర్వాత పోస్టాఫీసుకి వెళ్ళి కవర్లో పెట్టి ఓ పోలీసు స్టేషను అడ్రసు రాశాడు. పోస్టు చేశాడు.
    తానెం చేశాడో అతడు ఆడవాళ్ళకు చెప్పలేదు.

                                     3
    రెండు రోజుల తర్వాత అతడు పేపర్లో అద్భుతమైన వార్తను చూశాడు. అది చదివేక కొన్ని క్షణాల పాటు అతడు తనను తాను నమ్మలేక పోయాడు.
    పట్నం లోకి మత్తు పదార్ధాల రవాణా కొరియా బట్టల వర్తకుల ద్వారా జరుగుతున్నది. వారు తమవద్ద ఉండే గొడుగు హేండిల్స్ లో మత్తు పదార్ధాలను దాస్తున్నారు. తమకు సరైన కోడ్ చెప్పిన వారికే వారది అమ్ముతున్నారు. పోలీసులీ విషయం గ్రహించి వుండేవారు కాదు. ఒక అజ్ఞాత వ్యక్తీ ఉత్తరం అందుకు సహకరించింది. ఆ అజ్ఞాత వ్యక్తీ ప్రభుత్వంతో పాటు -- కొన్ని వేల యువకులు కూడా ఋణపడి వున్నట్లు ఆ పత్రికలో వ్రాయబడి వుంది.
    అతడు గీతను, రాధను పిలిచి ఆ వార్త చూపించాడు. ఆ అజ్ఞాత వ్యక్తీని నేనేనని చెప్పాడు.
    'అరె -- వాళ్ళ గురించి నువ్వెలా ఊహించావు బావా! అంది గీత.
    "నేనేమీ ఊహించలేదు. వాళ్ళ మీద కోపం కొద్దీ అలా చేశాను. నాకలాంటి బుద్దీ పుట్టడానికి కారణం నువ్వు . నువ్వు నన్ననుమానించవన్న కోపంతో నేను అప్పటికి తోచిన విధంగా వాళ్ళ మీద పగ తీర్చుకున్నాను" అన్నాడు సదానందం.
    ఆలోగా రాధ పూర్తిగా వివరాలన్నీ చదివి -- "మీ కారణంగా ఓ పెద్ద ముఠా బయట పడుతోందండీ -- మిమ్మల్ని మీరు బయట పెట్టుకుంటే మంచి ఉద్యోగమేదైనా ఇప్పిస్తారేమో ...." అంది.
    "నన్ను నేను బయట పెట్టుకోవాలని నాకూ కోరికగా వుంది. కానీ ఒకటే భయం, ఈ మత్తు పదార్ధాల ముఠాలో పచ్చి నెత్తురు తాగే కసాయి వాళ్ళుంటారు. నేనా సామాన్యుడిని. వాళ్ళు నా మీద పగ బడితే ...?" అన్నాడు సదానందం.
    'అయితే వద్దండీ" అంది రాధ.
    'అయినా నువ్వే ఆ అజ్ఞాత వ్యక్తీవంటే వాళ్ళు నమ్మోద్దూ -- నీకులా చాలామంది వెళ్ళి చెప్పుకోవచ్చు గదా ?" అంది గీత.
    "అదేం పెద్ద కష్టం కాదు. నేను వ్రాసిన ఉత్తరం వాళ్ళ దగ్గరే వుంది. అందులో దస్తూరీ నాదేనని రుజువు చేసుకొనడం చాలా సింపుల్!" అన్నాడు సదానందం.
    "వద్దండీ -- మీకా ఆలోచనే వద్దు. ఈ విషయం బయట పడితే నామీద ఒట్టే!" అంది రాధ.
    'అలాగనకు రాదా! ఇన్నాళ్ళకు మనకో బంగారం లాంటి అవకాశం వచ్చింది. ఈ విషయం నా మిత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాను. నువ్వు మాత్రం అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు ...." అన్నాడు సదానందం.
    "ఈ విషయం మన ముగ్గుర్నీ దాటి బయటకు వెడితే నా మీద ఒట్టేనని మరోసారి చెబుతున్నాను...." అంది రాధ.
    'అయితే ఈ జన్మలో నాకుద్యోగం దొరకదు" అన్నాడు సదానందం. పైకి అలాగంటున్నాడు కానీ భార్య తన్ను వారించడం అతడికి నచ్చింది.
    "ఎందుకు దొరకదండీ . ఎందరో యువకులు మీ కారణంగా రక్షించబడ్డారని పేపర్లో వ్రాశారు. ఆ భగవంతుడి విషయం చూడడనుకుంటున్నారా?" మీకు తప్పక ఉద్యోగం వస్తుంది" అంది రాధ  
    భగవంతుడు పేపరు చూసినా చూడకపోయినా రాధ మాటలు విన్నట్లే వుంది! ఆరోజే సదానందానికి ఆ ఉళ్ళోనే ఓ ప్రయోవేటు కంపెనీలో అపాయింట్ మెంట్ ఆర్డరు వచ్చింది.
    తన తోలి జీతం అందుకున్నాక సదానందం మరదలి చేతిలో అరవై అయిదు రూపాయలు పెట్టి -- "నువ్వు గొడుగు కొనమన్నందువల్లనే నాకీ ఉద్యోగం వచ్చింది. అందుకని నేను నీకిది నా డబ్బుతో ప్రజెంట్ చేస్తున్నాను" అన్నాడు.
            
                                 ---------
    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS