Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 9

 

                             జబర్దస్తీ చుట్టం

                                                                   వసుంధర
    

    "నేనమ్మా --- సూరపరాజుని !" అన్నాడాయన.
    తెల్లటి గ్లాస్కో పంచె, పెద్దాపురం సిల్కు లాల్చీ గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలు, సుమారు యాభై ఏళ్ళ వయసు --- పెద్దమనిషి తరహ చూపులు -- ఇవీ ఆయన్ను చూడగానే నాకు అగుపడినది. కానీ సూరపరావేవరో నాకు తెలియలేదు. ఇబ్బందిగా చూశానాయనవంక .
    "అయినా.....నీకేం తెలుస్తుందిలే ----పెళ్ళి తర్వాత మళ్ళీ ఇదేగా రావడం -- అబ్బాయి వచ్చేదాకా లోపలికి రానిస్తావా?" అన్నాడాయన.
    నేను నొచ్చుకున్నా సంకోచిస్తూనే --"అయ్యో ! ఎంత మాట --- రండి, లోపలికి " అన్నాను.
    అయన లోపలికి వచ్చి సోఫాలో నడుం వాలుస్తూనే కాఫీ కావాలన్నాడు.
    కాఫీ తాగేవాళ్ళు అంటే నాకు వళ్ళు మంట. నాకు భయపడి అయన కూడా రోజుకి ఇంట్లో ఒక పూటే తాగుతారు కాఫీ. ఇంట్లో పాలు కూడా లేవు. కానీ ఆపద్దర్మంగా కొన్న పాల పొడి వుంది. పాలపొడి కాఫీ ఈయన తాగుతాడో తాగడో నని అనుమానిస్తూనే అడిగాను.
    "అయ్యో -- కాఫీ పొడి అన్నది వాడితే -- చన్నీళ్ళలో కలిపినా తాగేస్తాన్నేను " అన్నాడాయన.
    సరే --- తప్పేముంది -- అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాను, ఇంకా నయం --- గ్యాసుంది . గ్యాసై పోయిందంటే పదిరోజులు కిరసనాయిలతో అవస్థ పడాలి. స్టవ్ ఇబ్బందులు ఒక ఎత్తు. కిరసనాయిల్ సంపాదించే యిబ్బందులింకో ఎత్తు --- కాఫీ కలిపి పట్టుకెళ్ళాను.
    అయన అలవోకగా కాస్త చప్పరించి "ఎమ్మా -- మీది కోటా పంచాదారా, బ్లాకు పంచదారా " అనడిగాడు.
    "కోటాయేనండి " అన్నాను వినయంగా.
    "మీ కోటా నాకు చలాదమ్మాయ్....ఓ రెండు చెంచాలు తీసుకురా " అన్నాడు అధికార స్వరంతో.
    నాకు ఒళ్ళు మండింది. మనిషికి బొత్తిగా మోహమాటం ఉన్నట్లు లేదు. ఈ రోజుల్లో పదిరూపాయలు బదులడిగినా ఇస్తున్నాం కానీ చెంచాడు పంచదార కూడా అప్పివ్వడం లేదు. ఈయనిప్పుడు రెండు చెంచాలు ఎక్స్ ట్రా అడిగాడు. అసలేన్నాళ్ళు వుంటాడో ఏమిటో!....ఏమైనప్పటికీ తప్పదు కదా --- వెళ్ళు రెండు చెంచాల పంచదారా తెచ్చాను.
    "నిన్ను చాలా శ్రమ పెట్టాను" అంటూ అయన ఒక్కగుక్కలో నేనిచ్చిన కప్పుడు కాఫీ తాగేసి -- "ఈ వెధవ ప్రాణానికి గంట గంటకీ కాపీ కావాలి" అని విసుగ్గా అన్నాడు.
    నేను మర్యాదకు నవ్వుతూ "గంట గంటకీ కాఫీ కావాలనుకుంటేనే వెధవ ప్రాణమైపొతుందాండీ" అన్నాను.
    "మంచి ముక్క చెప్పావమ్మా?" అన్నాడాయన తృప్తిగా నా వంక చూసి నవ్వుతూ.
    నేనాయనకు ఎదురుగా కూర్చున్నాను. ఆయనెవరో వారి కెలాంటి బంధువో తెలియదు. చనువు బట్టి చూస్తుంటే బాగా దగ్గర బంధువుల్లాగే వున్నాడు.
    'పడుకుంటారాండీ" అని "మిమ్మల్ని ఏ వరస పెట్టి పిలవాలో తెలియడం లేదు. బాబాయిగారూ అంటానండీ" అన్నాను వినయంగా.
    "ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం ? నీకు తోచిన వరస పెట్టి పిలవొచ్చు. పడుకోవాలనే వుంది , కానీ మీ యింట్లో అలారం టైం పీసు వుందా?" అన్నాడు సూరపరాజు.
    "ఉండండి, దేనికి?"
    "గంట గంటకీ కాఫీ తాగాలి కదా -- నిద్ర పట్టిందంటే నాకు మెలకువ రాదు. అలారం పెట్టుకుని లేచి కాఫీ తాగి మళ్ళీ పడుకుంటాను. అది సరే -- నీకు జీడిపప్పు పకోడీలు చేయడం వచ్చా " అన్నాదు సూరపరాజు.
    ఆయనేం అడగబోతున్నాడో తెలిసి -- "రాదండీ ?" అన్నాను.
    "పోనీ మెత్తటి పోకోడీలు ?" అన్నాడాయన.
    "వచ్చునండి" అన్నాను -- రాదంటే బాగుండదని.
    సూరపరాజు గలగలా నవ్వి -- "మెత్తని పకోడీలు వేయడం కూడా ఓ విద్యేనా -- జీడిపప్పు పకోడీలు రావంటే అవమానం కదమ్మా -- పోనీలే -- నీకు రాకపోయినా నాకు వచ్చునులే ! నేను దగ్గరుండీ నీకు అన్నీ చెప్పి చేయిస్తాను . సాయంత్రం మీ ఆయనకు సర్ ఫ్రైజ్ గా వడ్డిద్దువుగాని..." అన్నాడు.
    నేను కంగారు పడి ---"జీడిపప్పు పకోడీలు అయన తినరు" అన్నాను.
    "నువ్వెప్పుడైనా వండి పెడితే కదా అయన తినరని తెలుస్తుంది ?" అన్నాడు సూరపరాజు.
    నేను గతుక్కుమని -- "అయన తినరనే నేను నేర్చుకోలేదు" ఆని సర్దుకున్నాను.
    "ఆ మాట పకోడీ ఒకటి రుచి చూసేక అనమను. దాచడమెందుకూ --- జీడిపప్పు పకోడీలను మా ఆవిడా క్కూడా నేనే దగ్గరుండి పాల్లెయించాలు -- నేను చెప్పినట్లు చేయి ఈరోజు నుంచి మీ అయన కూడా వాటిని ఇష్టప్దడమే కాక రోజూ చేయమని వేధించుకు తింటాడు" అన్నాడు సూరపరాజు.    
    "ఇంట్లో జీడిపప్పు ల్లెవండి" అన్నాను. అది నిజం కూడా.
    "నువ్వు నచ్చేవమ్మా నాకు. అలా చెప్పాలి. ఇల్లే మన్నా కిరాణా దుకాణమా అన్ని సరుకులూ అస్తమానూ వుండడానికి. అందులోనూ నువ్వు కలగనవు కదా నేనోస్తానని! ఈ వీధిలో ఏదైనా కిరణా దుకాణమువుంటే చెప్పు . అవసరమైన సరుకులన్నీ లిస్టు రాసి తీసుకోచ్చేస్తాను. ఎటొచ్చీ మీ యింట్లో వుండడాని కొచ్చి నా డబ్బులు ఖర్చు చేస్తాననుకోకు. డబ్బు నువ్వే ఇవ్వాలి!" అన్నాడాయన నిర్మొహమాటంగా.
    ఇంట్లో వందరూపాయల నోటు మాత్రం వుంది. చిల్లర లేదు. నమ్మి ఈయన కేలా ఇచ్చేది! అలాగని ఇల్లీయన మీద వదిలిపెట్టి బైట కేలా వెళ్ళేది? అందుకని -- "బాబాయ్ గారూ -- అయన రాగానే పకోడీలు అంతా కలిసి చేద్దాం. అయన ఇంట్లో ఒక్క పైసా కూడా ఉంచరు...." అన్నాను.
    సూరపరాజు భ్రుకుటి  ముడతలు పడింది. శ్రీవారినాయన కాసేపు విమర్శించారు.
    "అయన తప్పేం లేదు. బాబాయ్ గారూ -- ఈ మధ్య దొంగతనా లెక్కువై పోయాయి. అడ్డమైన వాళ్ళూ ఇళ్ళలో చొరబడిపోతున్నారు" అన్నాను.
    "అలాగైతే నిన్నూ కూడా తీసుకుపోక పోయాడా? ఆడవాళ్ళ మీదా అత్యచారాలు కూడా ఎక్కువయ్యాయి!"
    ఏమనాలో తెలియదు. ఆడవాళ్ళ మీద అత్యాచారాల గురించి ఆయనతో మాట్లాడ్డం దొంగాడా కరవకురా అన్నట్లు అవుతుందని నా భయమూ, అనుమానమూ అందుకని మౌనంగా ఊరుకున్నాను.
    "ఈ వీధిలో కిరాణా దుకాణం లేదా?" అనడిగాడాయన. ఉందని చెప్పాను. అందులో అరువివ్వరా అనడిగాను. అరువు మా కలవాటు లేదని చెప్పాను. అత్యవసర పరిస్థితుల్లో అరువు ఎంత ఉపయోగపడుతుందో ఆయన  సోదాహరణంగా వివరించి -- "నాకు జీడిపప్పు పకోడీల మీద ఎంత మమకారమో నీకు తెలియదు. ఈ అలారం టైం పీసు తీసుకుని దుకాణానికి వెడతాను. మీ పేరు చెబుతాను. వాడు అరువివ్వనంటే ఈ గడియారం వుంచుకోమని చెబుతాను. సరుకులన్నీ తెస్తాను!" అంటూ సోఫాలోంచి లేచాడు అయన.
    ఏం చేయాలో తోచలేదు నాకు. ఆయన్నేలా ఆపాలో తెలియలేదు. అయన లేచినపుడు పర్సు తీసి నా కందించి -- "వీధిలోకి వెడితే డబ్బు ఖర్చు చేయ బుద్ది . అందుకని ఇది ఇంట్లోనే వుంచు. నేను సరుకులు తీసుకొస్తాను. అన్నట్లు ఇంట్లో పచ్చి మిరపకాయలున్నాయా?" అన్నాడాయన.
    "ఉన్నాయండి" అన్నాను. అయన జీడిపప్పు పకోడీలు వేయడానికి ఏమేం కావాలో నాకు చెప్పి ఇంట్లో లేనివి -- కాగితం మీద నోట్ చేసుకుని అలారం టైం పీసు తీసుకుని బైటకు వెళ్ళాడు. పకోడీలు చేయడంలో అయన పరిజ్ఞానం చాలా గొప్పదని గ్రహించాను నేను. అయన వెళ్ళిపోగానే ఆత్రుతగా పర్సు తెరిచి చూశాను. అందులో డబ్బేమీ వుండదని నా అనుమానం. అయితే నా అనుమానం నిజం కాదు. అందులో అయిదువందల రూపాయలపై చిలుకు వుంది.
    అందులోని అసలు నోట్లేనా అని అనుమానం వచ్చింది. ఎందుకంటె అయన అంత దర్హగా డబ్బు వదిలేసి పోతాడా? ఇంట్లో ఉన్న వందరూపాయల నోటు తెచ్చి అందులో ఉన్న రెండు వంద రూపాయలు నోట్లనీ పరీక్షించాను. అన్నీ ఒక్కలాగే వున్నాయని పించింది. అవి దొంగనోట్లు అయి వుండవు.
    అయితే సూరపరాజు ఎలాంటి మనిషి?
    తన దగ్గర ఇంత డబ్బుంచుకుని పైసా కూడా ఖర్చు పెట్టకుండా నా యింట్లో పకోడీలు వేయించుకుని తినాలనుకుంటున్నాడు. మనిషికి బొత్తిగా సిగ్గు, మొహామాటం అభిమానం వున్నట్లు లేదు. ఇలాంటి పని చేయడానికి నేనైతే సిగ్గుతో చచ్చిపోతాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS