గొడుగుల బేరం
వసుంధర
మనుమడి పెళ్ళి చూడకుండా చచ్చిపోతానేమోనని సదానందం తాత బెంగ పెట్టుకున్నాడు. అందుకని బియ్యే పూర్తీ కాగానే సదానందం పెళ్ళి జరిగిపోయింది. కొత్తలో సదానందానికి అంతా బాగానే వున్నదని పించింది. భార్య రాధ అందమైనది , అనుకూలవతి.
చచ్చిపోతానని తొందరపడ్డ తాతగారు నిక్షేపంలా గున్నాడు. కానీ సదానందానికి ఉద్యోగం రావడం లేదు. అతడు బియ్యే ప్యాసై అప్పుడే రెండేళ్ళు దాటిపోయింది. ఇప్పుడా తాత మునిమనుమడిని చూడాలని ఆత్రుతపడుతున్నాడు. కానీ సదానందం రెండోసారి తప్పు చేయ్యదల్చుకోలేదు.
ఈ రెండు సంవత్సరాలలోనూ సదానందం కాళీగా కూర్చోలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. చాలా వరకూ రోజుల లెక్క మీద ఉద్యోగాలే. పద్దులు రాయడం , ప్రయివేట్లు చెప్పడం లాంటివి. ఎవరి బదులో తనా పన్లు చేసి తన వాటా తీసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఓ కవి అచ్చేసిన పుస్తకాలు ఇంటింటా తిరిగి అమ్మి తన కమీషన్ తీసుకున్నాడు.
ఏది ఏమైనా అతడి సంపాదన అంతంతమాత్రం. అన్నింట్లోకి అతడికి బాగా నచ్చిన పని డిటెక్షన్, రెండ్రోజులు ఓ ప్రయివేటు డిటెక్టివ్ కు అసిస్టెంటు గా పనిచేసి యాభై రూపాయలు సంపాదించాడు. ఆయనకు రెండ్రోజులు మాత్రమే అతడి అవసరం వున్నది. తనకు పెర్మనెంటుగా ఉద్యోగంలోకి తీసుకొమ్మని అడిగితె అయన "నీలో టాలెంటు వుంటే, నీ అంతట నువ్వే డిటెక్టివ్ కావచ్చు. అందుకు ప్రయత్నించు" అన్నాడు.
అప్పట్నించీ సదానందం న్యూస్ పేపర్లో వాంటెట్ కాలమ్స్ తో పాటు నేరాల గురించి కూడా చదువుతుండేవాడు.
ఈరోజు అతణ్ణి ఆకర్షించిన వార్త "పట్నంలో మత్తుపదార్ధాల చెలామణీ-----"
ఆ ఉళ్ళో యువకులు మత్తు పదార్ధాల ప్రభావానికి లోనవుతున్నారట. వారికి ఓ సంస్థ ద్వారా మత్తు పదార్ధాల సరఫరా అవుతున్నదట. వారేవిధంగా మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నదీ ప్రభుత్వం కనుక్కోలేక పోతున్నది . ఈ విషయమై మంచి ఆచూకీ సంపాదించిన వారికి తగిన బహుమతి వుంటుంది.
సదానందానికి ఈ కేసు విషయమై పరిశోధించాలనిపించింది. ఈ విషయామై తనేదో సాధించగలనన్న నమ్మకమూ అతడికున్నది. ఒకరోజు వూరంతా తిరిగి మత్తు పదార్ధాల రవాణాకు ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నదీ గమనించాడు. అలా చూడగా అందరూ దొంగల్లా గానూ, అంతా మంచివాళ్ళ గానూ కనిపించారు.
ఎక్కడని వెతికేది? ఏవరినని అనుమానించేది?
అతడిలాంటి సందిగ్ధావస్థలో వుండగా అతడి మరదలు పట్నానికి వచ్చింది. ఆమె పేరు గీత.
సదానందం అతారిది పల్లెటూరే అని చెప్పవచ్చు. గీత యిప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనికి వచ్చింది. ఆమెకు పెళ్ళి కుదిరింది. వరుడిది డిల్లీ! వివాహం కావడాని కింకా ఆరేడు నెలల వ్యవధి వున్నది. ఈలోగా గీతకు పట్నవాసం పద్దతులు బాగా తెలియడం మంచిదని ఆమె తలిదండ్రులు భావించి పెద్దకూతురు రాధ దగ్గరకు పంపించారు. రాధకు అత్తవారిల్లు మ కన్నవారిల్లు లాగానే వున్నది. గీతను ఆ యింట సాదరంగా ఆహ్వానించారు.
గీత రాధ కంటే అందంగా వుంటుంది. కానీ అంత తెలివైనది కాదు. ఆమె అంటే సదానందానికి చాలా యిష్టం. ఒకరకమైన ఆకర్షణ కూడా వున్నది. అందువల్ల అతడామెను పట్నామంతా తిప్పి, చూపాలని కుతుహలపడుతుండేవాడు. రాధ భర్త కుతూహలాన్ని గమనించింది. అయితే ఆమె ప్రమాదాన్ని శంకించలేదు. గీత తెలివైనది కాకపోవచ్చు గానీ పరాయి మగవాడు మీద చేయి వేస్తె అర్ధం చేసుకోగలదు.
రాధ భర్త గురించీ గీత గురించి పెద్దగా పట్టించుకునేది కాదు.
సదానందానికి ఆకర్షణ అయితే ఉన్నది కానీ ఆ ఆకర్షణలో ఓ ఆడపిల్లకు అన్యాయం తలపెట్టే దౌష్ట్యం లేదు. కానీ అతడామెతో ఎక్కువగా కాలం గడుపుతుండేవాడు. అతడి వద్ద గీతకు బాగా చనువు ఏర్పడింది. అన్న వద్ద చెల్లెలు, తండ్రి వద్ద కూతురు చేసే విధంగా ఆమె అతడి వద్ద గారాబం కూడా చేసేది.
అక్కడికి వచ్చిన మూడో రోజునే "బావా! నాకో గొడుగు కొని పెట్టాలి ...." అంది గీత.
'అలాగే" అన్నాడు సదానందం.
"గొడుగంటే మామూలు గొడుగు కాదు. పట్నం గొడుగు ' అంది గీత.
"బాగుంది , పట్నంలో కొనుక్కుంటే అది పట్నం గొడుగు కాక పల్లెటూరి గొడుగు అవుతుందేమిటి?" అన్నాడు సదానందం.
"అది కాదు బావా -- వాటిని చిన్నగా ముడుచుకుని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకునే విధంగా వుండాలి" అంది గీత.
"అదీ సరే !" అన్నాడు సదానందం.
'అంతేకాదు . నాకు ఆటోమేటిక్ గొడుగు కావాలి. అంటే బటన్ నొక్కగానే తనతట తనే తెరుచుకోవాలి. ఆ గొడుగు...."
"సరే, అలాగే - ఎప్పుడు కావాలి?" అన్నాడు సదానందం.
"ఎప్పుడో కావాలంటే ఇప్పుడే ఎందుకడుగుతాను ?" అంది గీత.
"ఇప్పుడే కావాలా?" సందిగ్ధంలో పడ్డాడు సదానందం.
"నా దగ్గర డబ్బుంది ...."
"ఛీ -- నీ డబ్బు నా కొద్దు ....నీకు బహుమతిగా కొంటాను ...."
గీత నవ్వి -- "నీకింకా ఉద్యోగం రాలేదుగా - ఉద్యోగం వచ్చేక బహుమతి తీసుకుంటాన్లే ! మందీ వంద రూపాయలూ తీసుకో ....నాకు గొడుగు తెచ్చిపెట్టు" అంటూ అతడి చేతికో వందరూపాయల నోటు ఇచ్చింది.
సదానందం మొహమాటంగానే ఆనోటు తీసుకున్నాడు. వెంటనే ఇల్లు వదిలాడు.
ఆటోమేటిక్ గొడుగు ఇటీవలే రంగారావు కొన్నాడు. అది తన చెల్లెలి కోసం తనకెంతో నచ్చింది కూడా. ఉద్యోగం వచ్చేక రాధకోసం తనూ అలాంటిది కోనాలను కున్నాడు. అయితే ఆ గొడుగు లెక్కడ దొరుకుతాయో తనకు తెలియదు. రంగారావే చెప్పాలి.
అతడి అదృష్టం కొద్దీ రంగారావు ఇంట్లోనే వున్నాడు. అడగ్గానే షాపు వివరాలు, ధర చెప్పాడు.
ఆడవాళ్ళ గొడుగు అరవై అయిదు రూపాయలట!
సదానందం మరదలి కోసం గొడుగు కొన్నాడు. షాపు వాడు బిల్లు ఇవ్వలేదు. గొడుగు అతడికి నచ్చింది. ఇంటికి తీసుకు వెళ్ళేక రాధ, గీత కూడా మెచ్చుకున్నారు.
"బిల్లేది బావా ?' అంది గీత.
"బిల్లు ఎందుకు ?" అన్నాడు సదానందం.
"బిల్లు లేకుండా ఏం తెచ్చినా మా నాన్నగారు నమ్మరు. కమీషన్ వేశామంటారు. ఇదాయన డబ్బుతోనే కొన్నాను గదా - అందుకని అడిగాను ...." అంది గీత నవ్వుతూ.
సదానందం మనస్సు చివుక్కుమంది. అంటే గీత ఉద్దేశ్యమేమిటి - తను ధర తేడా చెప్పాననా!
"రాధ చెల్లెల్ని మందలిస్తూ 'అలా మాట్లాడతావేమిటే - అంటే బావ కమీషన్ వేశారనా నీ అభిప్రాయం ....." అంది.
'అయ్యో -- నా ఉద్దేశ్యం అది కాదక్కా! నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. అందుకని అలాగన్నాను" అని, "బావా నా మాటల్లో తప్పు అర్ధం ధ్వనిస్తే నన్ను మన్నించు" అంది గీత.
"ఇట్సాల్ రైట్ " అన్నాడు సదానందం.
2
మర్నాడు గీత బజారు ప్రయాణం పెట్టింది. కేవలం తన ఆటోమేటిక్ గొడుగు ఉపయోగించడం కోసం ఆమె అ ప్రయాణం పెట్టింది.
రాధ, గీత సదానందం .... ముగ్గురూ బయలురేరారు.
మెయిన్ బజారులో పుట్ పాత్ మీద ముగ్గురూ నడుస్తున్నారు. గీతకు ఆ బజారు , పుట్ పాత్ దుకాణాలు అన్నీ ఆకర్షణీయంగా వింతగా వున్నాయి. ఆమె ప్రతీదీ శ్రద్దగా గమనిస్తూ నెమ్మదిగా నడుస్తున్నది.
రాధ, సదానందం నాలుగడుగులు ముందుకు వేస్తుండండం మళ్ళీ గీత కోసం ఆగిపోతుండడం....జరుగుతున్నది.
ఉన్నట్లుండి గీత -- "అక్కా ఇక్కడ చూడండి ...." అని కాస్త గట్టిగానే కేక పెట్టింది.
రెండంగల్లో రాధ, సదానందం అక్కడకు చేరుకున్నారు.
అక్కడ ఓ మనిషి నిలబడి వున్నాడు. వాడి ముందు ఒక పెద్ద మూట వంటి సంచి వున్నది. దాని నిండా చీరలు, పంట్లాం గుడ్డలు, చొక్కా గుడ్డలు వున్నాయి.
'అంతా ఫారిన్ సరుకు, కొరియా నుంచి వచ్చింది. కారు చౌక. ఆలస్యం చేశారంటే నిరుత్సాహం చెందుతారు" అని అరుస్తున్నాడా ఆ మనిషి. అక్కడ జనం కూడా బాగానే గుమిగూడి వున్నారు.
ఆ మనిషి చూడ్డానికి నేపాలీవాడిలా వున్నాడు. తెలుగు భాష బాగా యాసగా వున్నది.
"ఏమిటి? చీరలు చూస్తె మతి పోతుందా?" అన్నాడు సదానందం వేళాకోళంగా మరదల్ని చూస్తూ.
'చీరలు కాదు , వాడి చేతిలో చూడు ...." అంది గీత. '
అప్పుడు గమనించారు రాధ, సదానందం...వాడి చేతిలో ఒక గొడుగు వున్నది. బటన్ నొక్కి దాన్నివిప్పుతున్నాడు. మళ్ళీ ముడిచి వేసి మళ్ళీ బటన్ నొక్కుతున్నాడు. అతడా గొడుగుతో జనాలనాకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసిపోతుంది.
"గోడుగెందుకు? మన దగ్గరుందిగా ?' అన్నాడు సదానందం.
"వీడు అన్నీ చౌక అంటున్నాడు. గోడుగెంత కిస్తాడో కనుక్కో" అంది గీత.
సదానందం మనసు మళ్ళీ చివుక్కు మంది. గీత తనను ఇంకా అనుమానిస్తున్నదా ? ఛీ ....వుద్యోగం లేకపోవడం వల్ల ఈగతి పట్టింది. తను ఆమెను తీసుకుని వెళ్లి ఈ గొడుగు కొనాల్సింది. అయినా ఇప్పుడనుకుని ఏం లాభం?
"ఏమోయ్ - ఆ గోడుగెంత కిస్తావు?" అన్నాడు సదానందం .
