సంతోషం ఆపుకోలేక పోయాను కప్పుకున్న దుప్పటి తన్ని పారేసి లేచి కవరు తీసుకుని మామయ్యకి నాలుగే ముక్కలు ఉత్తరం రాశాను.
"వాళ్ళంతా-అరుణ కూడా మనస్పూర్తిగా అంగీకరిస్తే నాకేం అభ్యంతరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి"
వెంటనే లక్ష్మిని పిలిచి ఆ వుత్తరం అమ్మకు చదివి విన్పించమన్నాను. నేను తిరిగి దుప్పట్లో దూరి పడుకున్నాను అరుణని తల్చుకుంటూ.
* * *
బ్రహ్మాండమైన పూలమండపంలో పెళ్ళి పీటల మీద నా పక్కన పెళ్ళి కూతురై కూర్చున్న అరుణని చూసి కళ్ళు మరల్చలేకపోయాను. ఎంత అందం? ఇదంతా ఎవరిదీ? అరుణదా? కాదు. నాదే కదూ? అరుణ ఒక్కసారినా చూస్తుందేమోనని క్షణక్షణం చూస్తూనే వున్నాను. శ్రమ ఫలించి ఒక్కసారి దొరికిపోయింది. కాని ఆ చూపులో ఏదో భావం! -నాకు అక్కర్లేనటువంటిది- దాన్నే నిర్లక్ష్యమో, నిరసనో-ఏమంటారో మరి. నేనే తప్పుగా అర్ధం చేసు కున్నానేమో! అంతేగాక పోతే ఏమిటి?
నా ఆలోచనలతో పెద్దల ఆశీర్వాదాలతో పవిత్రమైన మాంగల్యధారణ జరిగింది. అరుణ మెడలో ఆ మూడు ముళ్ళూ వేస్తూన్నప్పుడు ఎందుకో నా చేతులు గజగజ లాడాయి. "సాహస మైన పని చేస్తున్నానేమో" అనుకొన్నాను. ఆ బ్రహ్మముళ్ళు కాస్తా పడిపోయాయి. నా ఆలోచనల కన్నిటికీ స్వస్తి జరిగింది.
అరుణ నాది! అందాల అరుణ- లక్షాధికారిణి. అరుణ నాది -నాకేం లోటు? మనసు వుల్లాసంతో తేలిపోయింది.
ఆ గది - మేడమీద అరుణ పడక గది కాబోలు - స్వర్గ సీమా? అనిపించింది. పూల చెండులూ! సిల్కు పరుపులూ! ముహమల్ దిళ్ళూ అరుణాదేవి కోసం క్షణం యుగంలా ఎదురు చూస్తూ రాకుమారుడిలా దిండు నానుకుని కూర్చున్నాను. అబ్బ! నాకు విసుగనిపించింది.
ఎప్పుడో అరుణ వచ్చింది! తలుపులు మూసి అక్కడే నిలుచుంది. క్షణం కన్నార్పకుండా చూశాను. రతీదేవిలా అలంకరించుకు వస్తుందనుకున్నాను - సామాన్యంగానే తోచింది-నామనసు చివుక్కుమనిపించినా ఆ భావం ఎంతోసేపు నిలిచి పోలేదు. అరుణ ఎలా వున్నా అలంకరించుకున్నా లేకున్నా రతీదేవే! అందాల అరుణకి వేరే ఏం అలంకారాలు కావాలి?-అరుణ దగ్గరికి ఎప్పుడెళ్ళానో, అరుణని చేతులోకి ఎప్పుడు తీసుకున్నానో నాకు గుర్తు లేదు.
అరుణ మవునంగా నిల్చుంది.
"అరుణా!" అన్నాను.
"ఇటు చూడు" అంటూ గడ్డం ఎత్తి కళ్ళల్లోకి చూడబోయాను.
"జడకి పూలు కుట్టుకోలేదేం?" అన్నాను నెమ్మదిగా.
ఒక్కసారి కళ్ళెత్తి చూసి "నాకిష్టం వుండదు అంది.
అరుణ మాట్లాడింది. అదే చాలు-"పోనీ నీకిష్టమైందే చెయ్యి" అన్నాను దగ్గిరగా చేర్చుకుంటూ.
నన్నొదిలించుకుని రెండడుగులేసింది.
వెంబడించి అరుణని పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఏం అడిగినా మాట్లాడింది కాదు. ఎంతో సేపు నేనే కబుర్లు చెప్పాను అరుణ మవునంగా వున్న సంగతి ఎప్పటికోగాని తెలుసుకోలేక పోయాను. ఒక మవునమే కాదు పరాగ్గా చిరాకుగా వున్నట్టు తోచింది.
"ఏం అరుణా? మాట్లాడవ్?" అన్నాను లాలనగా.
"అబ్బ! నన్ను విసిగించకండి. నాకు తలనొప్పిగా వుంది" అంది మొహం చిట్లిస్తూ నే నెంతో సిగ్గుపడ్డాను. అంత కర్కశంగా మాట్లాడిందేమా అని బాధపడ్డాను. క్షణం మవునంగా ఆలోచించాను. పాపం తలనొప్పి ఎక్కువగా వుంది కాబోలు. రాత్రికూడా నిద్ర లేదు. అందుకే చిరాకుగా వుంది అనుకున్నాను. మృదువుగా అరుణ నుదురు రాస్తూ "చాలా బాధగా వుందా? క్రిందికి వెళ్ళి అమృతాంజనం తెమ్మంటావా? చెప్పు అరుణా!" అన్నాను.
అరుణ నుదుటి మీదనుంచి నాచేయి తీసివేస్తూ -నాకె మందూవద్దు నన్ను పడుకోనివ్వండి చాలు" అంటూ దిండు మీదకు జరిగి అటు తిరిగి పడుకుంది, నేనెంతో సేపు నిశ్శబ్దంగా కూర్చోలేక పోయాను. అరుణ పక్కన జేరి దిండుకానుకు కూర్చున్నాను.-"మీరు వేరే పడుకోండి. నాకు రెస్టు కావాలి. అంది విసురుగా ఆమాటలు వింటూనే నాకు కోపం వచ్చింది. వెంటనే పక్కమీద నుంచి లేచిపోయి పచార్లు సాగించాను గదిలో.
ఎంత ఆలోచించినా యీ ధోరణి ఏమిటో అంత పట్టడం లేదు. అరుణకి నేనంటే ఇష్టం లేదా? అలా జరగడానికి మాత్రం వీల్లేదు. ప్రాణానికి ప్రాణంలా చూసుకునే అన్నగారు కన్న తల్లీ అరుణ ఇష్టాలకి వ్యతిరేకంగా ఏదీచెయ్యరు. ఎందుకో చిరాకుగా వుంది. ఇంతమాత్రానికి ఇష్టం - అయిష్టం అనుకోవటం మంచిది కాదు. కొంత సేపయ్యాక తిరిగి వెళ్ళి అరుణ పక్కలో కూర్చున్నాను. అరుణ కళ్ళు మూసుకుని పడుకుంది. మూసివున్న ఆ కళ్ళు మరీ విశాలంగా వున్నాయి. నున్నని చెక్కిళ్ళూ తెల్లని నుదురూ ముద్దు పెట్టుకున్నాను. చురుకు తగిలి నట్లు అరుణ కళ్ళు తెరచిచురుగ్గా చూసింది. మొహం దిండుకేసి తిప్పుకుంటూ "దయచేసి వెళ్ళండి. నాకేం బావులేదు." అంది.
అంతులేని కోపంతో లేచి నిలబడ్డాను. "అరుణంటే ఏమిటీ నీ ఉద్దేశం?" అన్నాను తీవ్రంగా అరుణ కళ్ళు తెరిచి చూచి ఊరుకుంది.
"వచ్చిన దగ్గర్నుంచీ చూస్తున్నాను." ఒకటే విసురు. నేనేం పశువుననుకున్నావా? నీకు ఒంట్లో బావుండకపోతే అర్ధం చేసుకోలేనా? నీకెందుకంత చిరాకు?"
అరుణ దానికీ మాట్లాడలేదు.
"వెళ్ళండి. వెళ్ళండి. ఒకటే పాట. బయటికి పోవటానికె ఇక్కడి కొచ్చానా? అంత రెస్టు కావలసిందానివి ఇక్కడికెందుకొచ్చావు?"
"నేనేం కొత్తగా ఎక్కడికీ రాలేదు. నాపడక గదే యిది."
నాకు చెళ్ళుమని చరచినట్లయింది. క్షణం అరుణకేసి చూస్తూ వుండిపోయాను.
తక్షణం ఆగదిలోంచి బయటికి పోవాలనిపించింది. విసురుగా మెట్లకేసి నడిచాను. క్రింది హాల్లో జనం యింకా మాటు మణిగినట్టులేదు. ఆడవాళ్ళ కబుర్లు, చిన్న పిల్లల ఏడుపులు మెట్ల దగ్గరికి వినిపిస్తున్నాయి. దిగి వెళ్తే హాల్లోంచి వెళ్ళాలి. అంతా చూస్తారు. మొదటి రోజే ఇదేమిటని చిత్రంగా చెప్పుకుంటారు. దానివల్ల నాకే అగౌరవం తప్ప మరేం లేదు. అందరిలో నవ్వులపాలు కావడం దేనికి? అదే కారణంగా క్రిందికి వెళ్ళి పోలేకపోయాను. తప్పని సరిగా గదిలోకే వెళ్ళాల్సి వచ్చింది. రెండో మంచం అవసరం అప్పుడే బోధపడింది.
కానీ ఆరాత్రి జీవితంలో తొలిసారిగా కంట నీరు తిరిగింది. అనుమానించినట్టే జరిగింది. నూరేళ్ళ బ్రతుకూ నాశనమైంది. చేతనైతే ఓర్చుకోవటం, లేకపోతే ఏడవటం తప్ప ఏమీ దారి లేదు. ఎప్పుడో నిద్ర పట్టింది.
రెండో రాత్రి మళ్ళా ఆ గదిలోకెళ్ళడం నాకిష్టం లేదు. కాని మొదటి రోజు నేను కాపాడుకోటానికి వెళ్ళక తప్పింది కాదు అరుణ నాకన్న ముందే వచ్చి వుంది. నేను మంచం మీద కూర్చున్నాను. చాలాసేపు తనకేసి చూడనైనా లేదు.
ఎప్పటికో మళ్ళా అరుణతో మాట్లాడాలని బుద్ది పుట్టింది. అగ్ని సాక్షిగా వేసిన ముళ్ళు విప్పుకుంటే విడేవి కాదు కదా? అరుణ నాకన్నా చిన్నది. చిన్నతనం నుంచి గారంగా ఆడింది ఆటగా పెరిగింది. పెంకితనం జాస్తీ అని ముందే ఎరుగుదును. కదా? పంతాలతో రోజులు గడుపుకుంటామా?
"అరుణా! కాసిని మంచినీళ్ళున్నాయా?"
వెంటనే లేచి కూజాలో నీళ్ళు వెండి గ్లాసుతో తెచ్చి దగ్గర నిలబడింది. గ్లాసుతోపాటు అరుణ చేతినికూడా తీసుకున్నాను. అరుణ వారించ కుండా మవునం వహించింది.
"చాలా మారింది అనుకున్నాను."
"మంచినీళ్ళు వద్దు నువ్వేకావాలి." అంటూ అరుణని దగ్గరికి తీసుకున్నాను మంచి మనసుతో. అదే తొలి రాత్రి అయింది.
* * *
మూడో రోజు కూడా చెప్పుకోదగ్గ విశేషాలు లేకుండా గడచింది- నాలుగోనాటి వుదయం మావూరు ప్రయాణం. ఇక్కడికి రావటానికి అరుణ అయిష్టంగానే అంగీకరించింది. ఇక్కడ వున్న మూడు రోజులు ముళ్ళమీద వున్నట్టు బాధ పడింది. తప్పదు కాబట్టి ఓర్చుకుంది. పది గదుల్లో మసలటానికి మేడలూ, షికార్లు కొట్టటానికి కార్లూ లేవుకదా నాకు? ఎవరికి ఎలా వున్నా రోజులు ఆగిపోవుగా? తిరిగి అరుణని తీసుకెళ్ళడానికి ఒకాయన వచ్చాడు. అరుణ సంతోషంగా కన్పించింది. నన్ను అరుణ మరీమరీ రావాలని ప్రేమగా పిలిస్తే వెళ్దామనే అనుకున్నాను- "ఆచార ప్రకారం మీరు కూడా రావాలటగా? రాకూడదూ?" అంది పొడిపొడిగా.

"అయ్యో! ఎందుకు రాకూడదూ? నువ్వింత ఆప్యాయతగా పిలుస్తూన్నందుకైనా వస్తాను" అన్నాను వెటకారంగా.
"బావుంది. ఇంకెలా పిలుస్తారేమిటి? నాకు చేతరాదు. "అంది ఓ గంటలో వెళ్ళిపోతున్న అరుణతో వాదం పెట్టుకోటం ఇష్టం లేకపోయింది. కాస్త సంతోషానికి - "అరుణా వెళ్ళిపోతావుకదూ? ఒక్కసారి నా తల దువ్వవ్? ఎప్పుడూ దువ్వుతానని అనవు" అంటూ మారాం చేశాను- అరుణ బుజ్జగిస్తుందని అనుకోక పోయినా.
"ఏమోనబ్బా! నాకు చేతరాదు" అంది తనకు పట్టనట్టు. ఆ వారం రోజులుగా అరుణని చూస్తూ అరుణ మాటల్ని వింటూనే విన్నాను కదా? ప్రతీ విషయంలోను అదే తీరు! అదె ధోరణి నేనే శాంతంగా సమర్ధించుకోవాల్సి వచ్చింది.
"పెళ్ళికి ముందులా పెళ్ళయ్యాక ఎలా జరుగుతుంది? రానివన్నీ నేర్చుకోవాలి అరుణా! నీతో జుట్టు దువ్వించు కోవాలని......"
"ఉండండి. నేను జడ వేసుకుంటున్నాను" అంది.
