అయితే రమాకాంతం పెళ్ళయిన పిల్ల వస్తువులు వాడుకొనే మనస్తత్వం గలవాడు కాదు. ఆ యింట్లో ఆడపిల్లలందరికీ వడ్డాణాలున్నాయి. అవి తాకట్టుపెడితే ఇరవైవేలు తెచ్చుకోవడం పెద్ద కష్టంకాదు-
"మళ్ళీ వాటిని విడిపించేదెప్పుడు?"
"ఎప్పుడేమిటి? రెండు మూడు నెలల్లో విడిపించుకుందాం...."
రమాకాంతం పద్దులు రాయడంలో నిపుణుడు. గొప్ప గొప్ప వాళ్ళ కాయన పద్దులు రాయడంలో సలహాలిచ్చి డబ్బు సంపాదిస్తూంటాడు. ఆ ఊళ్ళోనేకాక ఆ చుట్టుపక్కల పొరుగూళ్ళనుంచి కూడా ఆయనకు బేరాలు వస్తూంటాయి.
ఆ విధంగా ఆయన డబ్బు చాలా సంపాదిస్తున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆయన అప్పులిచ్చి పుచ్చుకొనేది చాలా తక్కువమందికి, వసూళ్ళు చేసే సామర్ధ్యం ఆయనకు లేదు. అందుకని ఆయనకు అప్పులివ్వడం ఇష్టముండదు. ఆదాయం జస్టిఫై చేసుకోవడం కోసం తనింట్లో కూడా ఆయన దొంగ ఋణ పత్రాలూ, దొంగపద్ధులూ నడుపుతున్నాడు.
ఆ విధంగా యెందరినో ఇన్ కంటాక్సు బారినుండి రక్షిస్తూ తను రక్షించబడుతూ వుండే రమాకాంతం తన డబ్బును ఎక్కువగా బ్యాంకుల్లో వుంచడు. ఇంట్లో కొంత రహస్యపుటరల్లో క్యాషుగానూ, మిగతాది నగల రూపేణా దాస్తున్నాడు. ఇన్నాళ్ళకు ఆయనకు కష్టాలొచ్చి పడ్డాయి. బంగారాన్ని తాకట్టు పెట్టే దుష్టజీవితంలో మొట్టమొదటిసారిగా కలిగింది.
రమాకాంతం బాధ వేరు....ఇంతవరకూ వచ్చిన కష్టాలు తను ఏదో విధంగా తట్టుకొన్నాడు. ఇలాగే కొనసాగితే నిజంగానే తను అన్నీ పోగొట్టుకొని నడిబజార్లో నిలబడాల్సిన ఆగత్యం పడుతుంది.
8
డబ్బు పోస్టు పార్శిల్ గా పంపించి రమాకాంతం యింటికొచ్చేసరికి ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా వున్నారు. శ్యామలరావు యింట్లో వున్నాడు.
"ఎక్కడున్నావురా? ఆ శతమానంగాడు ఇన్నాళ్ళూ నిన్నేం చేశాడు రా?" అని రమాకాంతం కంగారుగా అడిగాడు. శ్యామలరావు ఉత్సాహంగా - "ఆయన చాలా మంచివాడు నాన్నా - ఈ వేళ వెళ్ళిపొమ్మన్నాడుకానీ నాకింకా రావాలని లేదు-" అన్నాడు.
శతమానం శ్యామలరావుని వదిలిపెట్టిన యింట్లో అతడీడువాళ్ళు అయిదారుగురు పిల్లలున్నారట. ఆ ఇంట్లో పిల్లలాడుకునేందుకు ఎన్ని రకాల గేమ్సున్నాయో లెక్క లేదుట. వాటికి మించి కార్టూన్ ఫిలిమ్స్ చూసుకునేందుకు మంచి ప్రొజక్టరు, బోలెడు ఫిలిమ్సూ వున్నాయట. రోజు క్షణంలా గడిచిపోయిందిట.
"నన్ను మళ్ళీ ఆయనతో పంపించండి నాన్నా!" అన్నాడు శ్యామలరావు.
"ఛ!-నోర్ముయ్-" అంటూ లోపలకు వెళ్ళి పోయాడు రమాకాంతం. జరిగిన నష్టానికి ఆయన గుండె మండిపోతోంది.
ఇప్పుడు తనేం చేయాలి? ఆ శతమానం, మాథవరావులపైన ఎటువంటి ప్రతీకారం తీసుకోవాలి? అసలు ప్రతీకారం తీసుకోవడం ఎలా? వాళ్ళెక్కడున్నారో తెలియదు. తెలుసుకొనే అవకాశం లేదు.
రమాకాంతం ముఖ్యంగా మాధవరావుని దృష్టిలో ఉంచుకొన్నాడు. అతడు కూడా ఈ వ్యవహారంలో తోడుదొంగ అని ఆయన అనుమానం. అయితే ప్రొఫెసర్ కర్మ సంగతేమిటి? ఆయన వెనుక దెయ్యంగా వెళ్ళి పోయిన ఆ పిల్ల.....
ఆ పిల్ల ఈ వ్యవహారంలో ఉందనుకుందుకు లేదు. ఎందుకంటే ఆమె తన కళ్ళముందే శవం రూపంలో పడివుండగా చూశాడు. మీదు మిక్కిలి పోలీసులామెను పరీక్షించారు. పోస్టుమార్టం గురించి తీసుకుని వెళ్ళారు.
రమాకాంతానికి అంతా అయోమయంగా వుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, మోసం ఎక్కడ జరిగిందో ఆయనకు తెలియడంలేదు. పోనీ ఇదంతా కలిపి మొత్తం మోసమా అనుకుందామా అంటే-మనసంగీకరించడం లేదు.
అయితే ఒక అనుమానం ఆయన్ను వేధిస్తోంది. తన ఇంట్లోని హత్యా విశేషం పేపర్లలో రాలేదు. పోలీసులు మళ్ళీ తనింటికి రాలేదు-ఆనందరవుని తీసుకొని వెళ్ళడం అయ్యాక ఈ కేసు ఏమయింది? ఆనందరావు ఏమయ్యాడు?
రమాకాంతం ఆత్రుత చంపుకోలేక ఒకో పోలీసు స్టేషనే వెళ్ళాడు. ఎవరో చెప్పుకుంటూండగ విన్నట్లు ఆనందరావు గురించి వాకబుచేశాడు. ఆయన నలుగు రోజులు తిరిగాక తెలుసుకున్నదేమిటంటే పోలీసు రిజిష్టర్సులో యెక్కడా ఆ కేసు నమోదవలేదు. తను చూసిన ఇన్స్ పెక్టర్ ఆ ఊళ్ళో లేడు.
అప్పటికి రమాకాంతానికి అనుమానం వచ్చింది. హత్యతో సహా మొత్తమంతా మోసమేనా? ఇలా ఆలోచించాక ఆయన మొత్తం కథను మననం చేసుకున్నాడు.
ఎలాగో ఒక యువతి తన యింట ప్రవేశించి గదిలో చచ్చినట్లు పడుకున్నది. ఆమె ముఠాకు చెందిన వ్యక్తి ఇల్లద్దెకు కావాలని వచ్చి శవాన్ని తన కళ్ళబడేలా చేసి పరుగెత్తాడు. అతడే పోలీసుల్ని పంపించాడు. ఆ పోలీసులూ ముఠా వ్యక్తులే! వారు వచ్చి కాసేపు శవాన్ని పరీక్షచేసి ఆ యువతిని తీసుకుపోయారు. అప్పుడు ఆనందరావు వచ్చాడు. అతడూ ఆ ముఠాలోని వ్యక్తియే! అతనూ, ఇన్స్ పెక్టర్ వేషధారీ కలిసి తన్ను బుట్టలో వేశారు. అంతవరకూ బాగానే వుంది. పది వేలతో పోయింది.
ఆ తర్వాత మాధవరావు, కుసుమ యింట్లో ప్రవేశించారు. వారి ముఠాలోని వ్యక్తి అయిన ప్రొఫెసర్ కర్మకు అయిదువేలు యిప్పించారు. చనిపోయినట్లు నటించిన యువతి దెయ్యంలా నటించి ప్రొఫెసర్ కర్మతో వెళ్ళిపోయింది.
అప్పటికీ వాళ్ళు తనని వదల్లేదు. శతమానం రంగంలోకి ప్రవేశించి ఇరవైవేలు పట్టుకుపోయాడు. అసలు పోస్టాఫీసులో రిజిష్టరు పార్సిలు చేసినప్పటికీ కౌంటర్లోని మనిషి కూడా ఆ ముఠావాడే అయుంటాడు. అంటే వాళ్ళు తన దగ్గర మొత్తం ముఫ్ఫైఅయిదువేలు కొట్టేశారు. కానీ ఆ ముఠాలో ఎంతమందున్నారు?
తన అనుభవాలు పురస్కరించుకొని చూస్తూంటే ఈ ముఠాలోని వాళ్ళు పది పదిహేనుమందయినా వుంటారు. అంటే తన దగ్గర కొట్టేసిన డబ్బు మనిషికి మూడువేలు కూడా రాదు. వాళ్ళు పడ్డ శ్రమ, తీసుకొన్న రిస్కు సామాన్యమైనది కాదు. మనిషికి మూడువేల కోసం ఇంత శ్రమపడ్డారంటే నమ్మశక్యంగా లేదు.
