Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 6


    చాలాసేపు నమ్మనట్టు చూసి "నిజం చెప్తున్నావా?" అంది.
    "అవును రేణూ! నాకు వారం రోజుల క్రిందటే రాశాడు. అప్పుడు నీ సలహా తీసుకుని ఖచ్చితంగా ఉత్తరం రాశాను కదా? ఇదీ జవాబు. కానీ వాళ్ళిద్దరిలో భార్యాభర్తలనుకునే భావనే లేదట"
    "వూహుఁ ప్రయోజకుడేనన్న మాట. ఇక్కడితో ఆగిపోయినందుకు సంతోషించు. "రేణుకి చాలా కోపం వచ్చింది.
    నేను మవునంగానే కూర్చున్నాను.
    కొంతసేపయాక "ఇన్నాళ్ళూ ఎందుకిలా నాటకం ఆడాడటా? ఇవతలి వాళ్ళేం ఆలగామూక అనుకున్నాడా? సిగ్గువచ్చేలా జవాబు వ్రాయక పోయావ్" అంది కోపంతోనే.
    'ఏదో రాశాను. అన్నాను"
    తర్వాత చాలాసేపు వున్నా ఆవిషయం మాట్లాడుకో బుద్ది కాలేదు. ఆనాడు క్రింద హాల్లో నాన్నగారితో మాట్లాడుతుండగా పోస్ట్ వచ్చింది. నాకో కవరు బేరింగుతో వుంది. - ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. దాన్ని చూస్తూనే ఆమనిషిని చూసినంత కోపం వచ్చింది. తీసుకోకూడదనుకున్నాను. కాని అలా చెయ్యటానికి వీల్లేకపోయింది. నాన్నగారు అక్కడే వున్నారు. తీసుకోకపోతే ఆరావస్తుంది. "ఎందుకు తీసుకోవమ్మా? ఎవరు రాసింది?" అని తప్పక అడుగు తారు. కలం స్నేహితుడంటే బాధేం లేదు. కాని తీసుకోనంటే కారణం వుండాలి కదా? ఇష్టంగానో, అయిష్టంగానో తీసుకుని పోస్టు మాన్ కి నాన్నగార్ని డబ్బులిమ్మని చెప్పి పైకి వచ్చాను. - పూర్తిగా అయిష్టమైతే దాన్నిచూడకుండానే చించి పారెయ్యొచ్చు. లేదా వేరే కవర్లో వుంచి వచ్చిన దారినే సాగనంపవచ్చు. కాని అలా ఎందుకు చెయ్యలేకపోయానో నాకే తెలీదు. నా యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చేతులు ఉత్తరాన్ని బయటికి తీసి కన్నులముందు హాజరు పెట్టాయి. ఆతృతతో కన్నులు అక్షరాల బారుల వెంట పరుగులు సాగించాయి.
    ప్రియమైన
    కృష్ణవేణీ!...... ఆశీస్సులు.......
    వారం రోజుల క్రిందట ఒక ఉత్తరం రాశాను. యీ క్షణం నుంచి నీకు అన్నీ - నా బ్రతుకులో అన్ని సంగతులు విపులంగా రాసుకోవాలని నీకు పూర్తిగా చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను వివాహితుడనని క్రిందటి సారే తెలియ జేశాను. నీపట్ల దాని పరిణామం ఎలా వుంటుందో వూహించుకోగలను కృష్ణవేణీ! నన్ను క్షమించు. మనసులో ఎటువంటి కోపమూ వుంచుకోక నిష్కపటమైన మనసుతో నా ఉత్తరాలు చదువు చింపక నా యీ కోరికమన్నిస్తావనే నమ్ముతాను.
    నేను యిప్పుడు భాగ్యవంతుణ్ణి కాకపోయినా కలిగిన కుటుంబంలోనే పుట్టాను. పుట్టటం వరకే సిరిసంపదలతో. వూహ తెలిసి అనుభవించ వచ్చే సరికి అన్నిటికీ కరువై పోయింది. దానికీ కారణం సర్వస్వతంత్రులైన నాన్నగారి దుర్వ్యసనాలు మాత్రమే. సిరి తరిగి పోగానే ఆయనా అంతరించి పోయారు. స్వగ్రామంలో కొంత పొలం - స్వంత యిల్లూ అందులో వుండడానికి అమ్మా, నేనూ, చెల్లెలు లక్ష్మీ మిగిలాం. మేనమామ ఒద్ధికలో తోటి కులం వాళ్ళలో పల్లె టూర్లో మా కుటుంబం వెలితంటూ లేకుండా జరిగింది. చిన్నతనం నుంచి శ్రద్ధగా - భవిష్యత్తు మీద ఆశతో తెలివిగానే చదువుకున్నానని చెప్పుకోటానికి గర్వపడతాను. నాకు జయమే జరుగుతూ వచ్చింది. నాలుగేళ్ళ క్రిందట ఉద్యోగస్తుడనై ఇంజనీరుగా యిక్కడ స్థిరపడ్డాను. అమ్మా - చెల్లీ నావెంటనే వుండాలి ఎప్పుడూ చెల్లి స్కూలు ఫైనల్ చదువుకుంది. అమ్మని యీనాటికైనా కన్న కొడుకుగా నేను సుఖ పెడుతున్నాననే అనుకొంటున్నాను.
    సాఫీగా సాగిపోతూన్న దారిలో చాల పెద్ద మలుపు వచ్చింది. మలుపు తిరుగుతున్నప్పుడు వెళ్ళేదారిలో స్వర్గమే ఎదురవుతుందని అనుకోక పోలేదు. కానీ నడిచి నడిచి నిజం తెలుసుకున్నాను. తిరిగి వెనక్కు వెళ్ళటానికి వీలులేని పరిస్థితి అయింది.
    ఆనాడు ఆఫీసునుంచి వచ్చేసరికి మామయ్య అమ్మతో కబుర్లాడుతూ కూర్చున్నాడు-ఆయనంటే నాకు గౌరవం వుంది. ప్రేమ వుంది. అన్నిటినీ మించి కృతజ్ఞత కూడా.
    ఆ రాత్రి అమ్మ నా దగ్గర కూర్చుని అన్నం పెట్టేటప్పుడు ఆ వార్త అందజేసింది. "అరుణని నీకిస్తారటరా! మామయ్య అందుకే వచ్చాడు" అని.
    క్షణం నాకేం అర్ధం కాలేదు. అయోమయంగా అమ్మ మొహంలోకి చూశాను అంతా వివరంగా చెప్పింది. నేను నిజంగా నమ్మలేక పోయాను. ఆశ్చర్యపడ్డాను. అరుణ! అరుణని నాకిచ్చి పెళ్ళిచేస్తారా? అరుణ బి.ఎ. మావయ్యకి అత్తవారి వైపు బంధువులు కలిగిన వాళ్ళు. ఒక్క అరుణ పేరనే లక్ష రూపాయల ఆస్థి వుంది. అరుణ అందానికి మా బంధువుల్లో గొప్ప పేరు వుంది. పైగా చదువుకుంది. అలాంటి అరుణ నా భారీగా యీ యింటి కోడలుగా నమ్మశక్యమేనా?
    "ఏం మధూ మాట్లాడవ్?"
    కొంచెం తేరుకొని "చూద్దాంలే అమ్మా' అనేసి లేచి వెళ్ళి గదిలో కూర్చున్నాను. నేను విన్నది నాకే నమ్మకంగా లేదు. అరుణని నా కెందుకిస్తారు? ధనవంతుడికి - ఇంకా చదువుకున్న వాడికీ - గొప్ప ఉద్యోగస్థుడికీ ఇచ్చి పెళ్ళి చెయ్యొచ్చునే. నేనెలా వాళ్ళ కళ్ళలో పడ్డాను. అని తర్కించుకున్నాను. నన్ను నేను చిన్నబరచుకోను. వ్యక్తిగతంగా అరుణకి నేను తగనని అనుకోను. కాని అంతటి ఆస్థితో వున్న అరుణకి నేను తగను.... కాదు.... అరుణని భరించలేను. లక్షాధికారిణి అరుణ యీ బీదవాణ్ణి భర్తగా గౌరవించి ప్రేమిస్తుందా?
    "అరుణ నా భార్య!" అనుకుంటూంటే ఎందుకో నాకు నిండు తృప్తి లేదు, మరెవరినైనా సామాన్యమైన అమ్మాయిని పక్కన వూహించుకుంటే హాయిగా తోచింది.
    "ఒద్దు. అరుణ నాకొద్దు" అనుకున్నాను గబగబా.
    నా ఆలోచనలన్నీ అమ్మకి చెప్పాను. అమ్మ నవ్వింది. "ఎంత పిచ్చిరా నీకు! మనకై మనం యాచించామా? అసలు అడగాలంటే మాత్రం అడగతగ్గ వాళ్ళమా? వాళ్ళే ఏరి కోరివస్తే ఎందుకు కాదనాలి? వాళ్ళ డబ్బుంటే వాళ్ళకే వుంటుంది. కోడలిక్కడికి రాకపోతుందా? చిన్న తనం నుండి కలిగిన కుటుంబంలో గారంగా పెరిగింది. నిజమే కాని పెళ్ళయి మొగుడంటూ వుంటే మంచి చెడ్డా తెలుసుకోలేక పోతుందా? నామాట విను. నీకెందుకురా భయం?" అంటూ చెప్పుకొచ్చింది - నాకేమిటో సంతృప్తిగా లేదు.
    మామయ్య వెళ్తూ వెళ్తూ తిరిగి కదలేశాడు.
    "ఆఁ చిన్నవాడు. వాడికీ నాకు ఏం తేలుస్తుందన్నయ్యా? నీయిష్టం వచ్చినట్లుచెయ్యి" అంది అమ్మ.
    "అబ్బే! అదెలాగే? యీకాలం వాళ్ళకి చిన్న తనమేమిటి? వాడే చెప్తాడు. ఏం రా మధూ! ఏమంటావ్?" అన్నాడు నాతో.
    కాసేపు తటపటాయించి "నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు. తర్వాత ఉత్తరం రాస్తాను అప్పుడే వాళ్ళకి మాటివ్వకు' అన్నాను.
    మామయ్య ఫెళ్ళుమంటూ నవ్వాడు.
    "ఓరినీ! ఏం బెట్టురా బాబూ! నీ పెళ్ళికొడుకు దర్జా అంతా నా దగ్గిరా? మరి వస్తానే అమ్మాయ్" అంటూ మామయ్య నిర్లక్ష్యంగా కదిలిపోతుంటే నాకు మండింది.
    "హాస్యంగాదు మామయ్య! నేను ఉత్తరం రాసేవరకు ఏం మాట్లాడకు." అన్నాను సీరియస్ గా.
    మామయ్య వెళ్ళిపోయాడు. అమ్మ మొహం ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. నావల్ల అమ్మకి కష్టమంటూ కల్గితే అదే మొదటిసారి. నాలుగు రోజులైంది. అమ్మ ముభావంగా ఉంటూ వచ్చింది. నాకు చాలా బాధగా వుంది. అదీగాక నా ఆలోచనలు మరో విధంగా కూడా సాగాయి. అరుణేం చిన్న పిల్లకాదు-నన్ను చేసుకోవటం యిష్టం లేకపోతే అయిష్టంగా ఎంత మాత్రం ఒప్పుకోదు కదా? అరుణ నన్నిష్టపడినప్పుడు నేనెందుకు కాదనాలి? అందాల అరుణ నాదైతే ....... అవును. అంతకన్నా ఏం కావాలి? యీ వరుసలో - నా చేతుల్లో అరుణ వుంటే ఉంటుంది. తప్పక వుంటుంది. నేను ఒప్పుకుంటే అరుణ నా సొత్తే అవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS