మనసులు జ్వలించిపోతున్నాయి.
సృష్టిలో ఇంకేమీ లేని, యింకేమీకాని యింకేమీ అక్కర్లేని, తమ లోతుల్లోకి, మైకంలేని అసలులోకంలోకి, తాము తెలుసుకుంటోన్న నిజం లోకి, అహాన్ని మరిచి, అమాయకంగా, భయంగా, సుకుమారంగా, ఆబగా ఆర్తిగా, తపనగా, తమకంగా, బాధగా, మూగగా.....
హరిణి.....హరిణి......హరిణి....
కళ్ళలోంచి కళ్ళు దూసుకుపోతున్నాయి.
4
మహేష్ ఎమ్.బి.బి.ఎస్. ఫస్టియర్ చదివే రోజులు.
ఓ రోజు యథాప్రకారం అతను తెల్లవారుఝామునే లేచి తబలా సాధన మొదలు పెట్టాడు. ఆ గదిలో ఒకే మంచముంది. చంద్రం దాని మీద పడుకుని వళ్ళు తెలీకుండా నిద్రపోతున్న వాడల్లా ఆ శబ్దానికి అటూ యిటూ కదిలాడు. కాస్సేపు దుప్పటి మొహంమీదకు లాక్కుని నిద్రా భంగం కాకుండా వుండటానికి ప్రయత్నించాడు. చివరకు విధిలేక లేచి కూర్చుని "గురూ! యిది నీకు తగదు" అన్నాడు.
మహేష్ వినిపించుకోలేదు, తన ప్రపంచంలో తాను వున్నాడు.
"గురూ!" అన్నాడు చంద్రం గట్టిగా.
మహేష్ ఉలికిపడి తబలా ఆపకుండానే కాస్త శబ్దంతగ్గించి "ఏమిటి?" అన్నాడు తాపీగా.
"ఇలా నా నిద్రని డిస్టర్బ్ చెయ్యటం న్యాయంకాదు."
"కాదని తెలుసు."
"మరి ఎందుకిలా నన్ను బాధపెడుతున్నావు?"
"కళోపాసన."
"నీ కళోపాసన కోసం నా అందమైన కలలకు ఉద్వాసన చెప్పమంటావు."
"చంద్రం!" అన్నాడు మహేష్ చలించనట్లు. "రేపట్నుంచీ ఒక పనిచెయ్యి. నువ్వు కనే కలలన్నీ తెల్లవారుఝాము నాలుగు గంటలకు ముందే కనెయ్యి."
"అప్పటిదాకా వాటికి మూడ్ రాదు గురూ!" అన్నట్టు నీ మంచికోసమే చెబుతున్నాను. మంచి కలను మధ్యలో విరగ్గొట్టేశావు. ఎంచక్కా నువ్వు రన్నింగ్ కి వెడుతున్నావు. అందమైన అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి ఎవరో రౌడీలు తరుముకొస్తోంటే నీకు తారసపడింది. అప్పుడు నీ కండబలం ప్రదర్శించి వాళ్ళని ఎడాపెడా తన్ని రక్షించి యిక్కడకు తీసుకొచ్చావు. మా బాబువిగా, తొందరగా లేచి రన్నింగ్ కి వెళ్ళవూ? అవతల, అందమైన...."
ఇహ అతని షోరు భరించటం కష్టమని మహేష్ లేచి షార్ట్స్ వేసుకున్నాడు. తలుపులు దగ్గరగావేసి రోడ్డుమీదకు వచ్చాడు.
రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. చీకట్లు విడిపోయేందుకు యింకా చాలా సమయముంది.
మహేష్ రన్నింగ్ మొదలుపెట్టాడు.
ఓ పదినిమిషాలు గడిచివుంటుంది. జనసంచారంలేని ఓ వీధిలో అతను పరుగిడుతున్నాడు.
ఉన్నట్లుండి కాళ్ళకు బ్రేక్ పడినట్లయింది.
మెరుపు తీగెలాంటి అమ్మాయి. పదహారు పదిహేడేళ్ళ వయసుకంటే ఎక్కువున్నట్టు తోచదు. చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకుని త్వరగా నడుస్తోంది. వెనక యిద్దరు రౌడీలు వెంటబడి అల్లరిచేస్తున్నారు.
మహేష్ కు ఆవేశం పొంగి వచ్చింది. వాళ్ళకు దగ్గరగా వెళ్ళి "వొరేయ్ ఎవర్రా మీరు?" అన్నాడు.
"ఏమిట్రా? వొరేయ్ గిరేయ్ అంటున్నావు. మాటలు జాగ్రత్తగా రానీయ్" అన్నాడు వాళ్ళలో ఒకడు.
మహేష్ కు కోపమొచ్చింది. ఆ కోపంలో వొళ్ళూ పైనా తెలీలేదు. గాల్లోకిలేచి ముందుకు దూకుతూ ఆ వ్యక్తి మొహం పగిలిపోయేటట్లు తన్నాడు. అతను క్రిందపడిపోయి, రెండోవాడు మీదకు వస్తూన్నంతలో అటుకేసి తిరిగి అతనికీ అదేపని చేశాడు. ఇద్దరికీ మొహాలు పగిలి నెత్తుర్లు కారుతున్నాయి. వాళ్ళు క్రిందపడి అటూ యిటూ కదిలే ప్రయత్నం చేసే సరికి మరో అయిదారు కిక్కులిచ్చాడు. నడుములు విరిగిపోయి- కుప్పకూలిపోయినట్లు కదలకుండా వుండిపోయారు.
ఆ అమ్మాయి రెక్కపుచ్చుకొని "పద" అన్నాడు.
"అమ్మో నేను రన్నింగ్ చెయ్యలేనండీ." అన్నదా అమ్మాయి అతనివంక పరీక్షగా చూస్తూ.
"రన్నింగ్ అక్కర్లేదు నడు" అన్నాడు. కఠినంగా మాట్లాడుతున్నట్లు కనబడేందుకు ప్రయత్నిస్తూ.
"అంత కోపమెందుకండీ? మెల్లగా చెప్పవచ్చుకదండీ" అన్నదా అమ్మాయి అతన్తోపాటు అడుగులువేస్తూ.
"చెప్పు ఎవరు నువ్వు?"
"నేనో ఆడపిల్లనండీ."
"అదికాదు. నేనడిగింది. ఈవేళకానివేళ సమయంలో రోడ్డు మీద కొచ్చి ఎందుకు పచార్లు చేస్తున్నావు."
"పచార్లు చెయ్యటంలేదండీ. రైలు దిగి ఎటు వెళ్ళాలో తెలీక అటూ యిటూ తిరుగుతున్నాను."
"ఎటు వెళ్ళాలో తెలీకుండానే రైలు దిగావా?"
"అవునండీ."
అతనికి కోపమొచ్చింది. "అదే ఎందుకని?" అంటూ అరిచాడు.
"ఏమోనండి అదే నాకూ సరిగ్గా తెలీటంలేదు."
"తెలీటం లేదూ? వయసులో వున్న ఆడపిల్లవి. అలా వొంటరిగా రైలు దిగకూడదనీ, రోడ్లమీద వంటరిగా తిరుగాడ కూడదనీ తెలీదూ?"
"అంతగా వయసున్న ఆడపిల్లవి కాదనుకోండి. అయినా ఆ విషయాలు తెలుసండీ కాని పరిస్థితులు అలా వచ్చాయండీ?"
"ఏమిటా పరిస్థితులు?"
"చెప్పాలంటే చాలా వుందండీ.... కాని మీరు ఫైటింగ్ బాగా చేస్తారు సుమండీ."
"నేనడిగేది నా ఫైటింగ్ కెపాసిటీ గురించి కాదు, నీ పరిస్థితుల గురించి."
"ఓహో! మీరడిగిన ప్రశ్న అదికదండీ. చెప్పాలంటే కొంచం యిదిగా వుందండీ."
"ఇదిగానా? అంటే?"
"అంటే..... కొంచం.... అంత ఎక్కువగా కాదనుకోండి. సిగ్గేస్తోందండీ."
"సిగ్గా?"
"అవునండీ. ఎందుకంటే.....నేనో అబ్బాయిని ప్రేమించానండీ."
అతను వులికిపడి ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు. పరీక్షగా చూశాడు. సుమారైన పొడవు, లేత మొగ్గలా.....వికసించీ వికసించనట్లున్న శరీరపు హొయలు ఫ్రాక్ లో చూస్తుంటే మరీ చిన్న పిల్లలా వుంది.
"పట్టుమని పధ్నాలుగేళ్ళున్నట్లు లేవు. అప్పుడే ప్రేమా నీకు?"
