తనభర్త. మధుమూర్తి. ఎస్.టి.డి కాల్.
"సునీ! బాగున్నావా?" అంటున్నాడు.
"రాత్రేగా వచ్చాను. అప్పుడే ఏమయింది?" అంది చాలా విసుగ్గా.
"ఏమయిందా-?" చిన్నగా ఏదో అన్నాడు.
"ఛీ" అంది.
"ఇందాక చాలాసార్లు చేశాను. జవాబు లేదు."
"హరిణి తనతో కలిపి బయటకు తీసుకెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు."
"ఎప్పుడు వొచ్చేస్తావు?"
"యమచెర" అనుకుంటూ" వొస్తా, యింకో అయిదారు రోజులు" అంది.
"అమ్మో! అన్నిరోజులే అప్పటిదాకా...." "యింకో రూడ్ జోక్"
"......"
"ఏమిటి?"
"సరేలెండి"
ఫోన్ పెట్టేసింది-ఛీ ఏం మనిషి, అనుకుంటూ.
తాను హరిణిదగ్గరకు వెడుతున్నాననే చెప్పి వచ్చింది. లేకపోతే కదలనివ్వడు. పాడు అనుమానం అతనూనూ, పైగా శాడిస్ట్.
ఫోన్ దగ్గర రెండు నిమిషాలు కదలకుండా అలాగే నిలబడింది. ఇదంతా ఏమిటి? ఆమెకు ఫోన్ చేసేస్తే? చంద్రాన్నడిగి నంబరు కూడా తీసుకొంది.
రిసీవరు చేతిలోకి తీసుకుని నంబరు డయల్ చేసింది. అవతల్నుంచి ఫోన్ రింగవుతోంది. ఒకటి......రెండు......మూడు......గుండె దడదడమని కొట్టుకుంటోంది. ఏదో తప్పుచేస్తోన్న భావన. చప్పున ఫోన్ పెట్టేసింది.
స్నానం చేస్తూ మహేష్ గురించే ఆలోచిస్తోంది. ఎంత యాక్టివ్ గా వుండేవాడు?
ఈ పూట అన్నం వండి క్యారియర్ తీసుకువస్తానంది. స్నానం పూర్తిచేసి చీరె కట్టుకుని బెడ్ రూంలోకి వెళ్ళింది. గదిలో సోనీ టి.వి. ప్రక్కనే స్టాండ్ మీద వి.సి.ఆర్ కనిపించాయి.
వి.సి.ఆర్ లో క్యాసెట్ అమర్చి వుంది.
డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తలదువ్వుకుంటూ యధాలాపంగా టి.వి. ఆన్ చేసి, వి.సి.ఆర్ బటన్ ప్రెస్ చేసింది.
టి.వి. స్క్రీన్ మీదకు బొమ్మ వచ్చింది.
సునంద ఉలికిపడింది. స్క్రీన్ మీద హరిణి చిన్నపిల్లలా, లేత మొగ్గలా, నవనవలాడే బిగువుతో "హలో" అంది.
3
డాక్టర్ భార్గవ పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు.
సునంద కిటికీ దగ్గర నిలబడి వుంది. "ఏం నిర్ణయం తీసుకున్నావు?" అనడిగింది కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచాక.
డాక్టర్ భార్గవతో యించుమించు అరగంటసేపు మహేష్ తన డిసీజ్ గురించి క్షుణ్ణంగా, నిశితంగా చర్చించటం ఆమె వింటూనే వుంది.
"నేను ఆపరేషన్ చేయించుకుంటాను".
"మహేష్!"
"అవును ఒక్కక్షణం కూడా నాశరీరంలోని రుగ్మతను భరించలేకుండా వున్నాను. నేను మళ్ళీ మామూలు మనిషిని కావాలి. ఈ స్వేచ్చా ప్రపంచంలొ విహంగంలా ఎగరగలగాలి. సునందా! ఐ కాంట్..... ఐ కాంట్ బేర్ దిస్.
"కాని.... నువ్వేమీ అనుకోకు మహేష్. థై మెక్టమీ చేసినా ఛాన్సెస్ చాలా రిమోట్ అంటున్నారు డాక్టరుగారు".
"ఒక్కశాతం.... ఒక్క శాతం అవకాశమున్నాసరే సునందా. ఆ ఒక్క శాతం ఆధారం చేసుకుని నేను అల్లుకుపోగలను". అంటూ మహేష్ బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు.
"మహేష్ రెస్ట్ తీసుకో. చాలా నీరసంగా వున్నావు."
"నో ఐయామ్ ఆల్ రైట్" అంటూ మహేష్ గదిలో అటూ యిటూ నడిచాడు.
"సునందా! నేను అనుక్షణం యిలా కదలగలగాలి. నాలోని ప్రతి అణువూ నిరంతరం స్పందిస్తూ వుండాలి" అంటూ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
"సునందా! ఏమిటిది? వై యూ ఆర్ వీపింగ్?"
"ఏమీలేదు" అంటూ ముఖం ప్రక్కకి త్రిప్పుకోబోయింది.
"కాదు" అంటూ ఆమె ముఖాన్ని రెండుచేతుల్లో పట్టుకుని తనవైపు త్రిప్పుకున్నాడు.
"సునందా! దుఃఖం దేనికి? స్వార్ధం లేకుండా చేసే స్నేహంలో దుఃఖం వుండకూడదు."
సునంద కనురెప్పలు క్రిందకు వాలివున్నాయి. వాటిచుట్టూ చిన్న తడి.
ఆమె ముఖాన్ని పట్టుకునివున్న అతని చేతుల్లో ఏదో మార్పు తెలిసి ఆమె ఒళ్ళు జలదరించింది. కనురెప్పలు పైకెత్తింది.
అతని చెంపలు.... వాటి తాలూకు కండరాలు, కదలటానికి నిరాకరిస్తోన్న పెదవులు, ఆగిపోయివున్న కనురెప్పలు, తన తలచుట్టూ చలనం లేకుండా నిలబడిపోయివున్న చేతులు.... కెవ్వున అరవబోయి, తమాయించుకుంది.
* * *
ప్రిమెడికేషన్ యివ్వబడింది. సునంద గోడకానుకుని నిలబడి కళ్ళప్పగించి చూస్తోంది. మహేష్ ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు.
ప్రత్యూష దగ్గరకొచ్చి అతని భుజంమీద చెయ్యివేసి "విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ డాక్టర్" అంది.
మహేష్ నవ్వాడు. "థాంక్యూ సిస్టర్"
స్ట్రెచర్ కదుల్తోంది.
మహేష్ కి మగతగా వుంది.....కళ్ళముందు దృశ్యాలన్నీ అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాను.....తానెంత కఠినుడు! ఎంత మూర్ఖంగా హరిణిని యింకా యింకా దూరం చేసుకుంటున్నాడు.
హరిణి వస్తే?
ఆమెను చూడాలనివుంది..... యీ స్థితిలో.
నిద్రముంచుకు వస్తోంది.
దగ్గర్లో.....చాలా హడావుడిగా, కంగారుగా అడుగుల చప్పుడు.....చిన్న వగర్పు.
"మహేష్! మహేష్!" పసిపిల్ల గొంతులాంటి తియ్యటి స్వరం చాలా ఆందోళనతో.
బలవంతాన కళ్ళువిప్పి చూస్తున్నాడు.
మత్తుగావున్న శరీరంలోంచి ఉవ్వెత్తు భావాలతో మనసు ఎగసిపడుతోంది.
చాలా అస్పష్టమైన రూపంతో, కళ్ళనిండా తడితో తన ముఖానికి దగ్గరగా వచ్చి "అతను తన....." ఆమె తన....
మనసులు జ్వలించిపోతున్నాయి.
