Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 8


    "అదేమిటండీ అలా అనేశారు. నాకు పదిహేడేళ్ళకు పైగా వున్నాయండి. ఇప్పటి రోజుల్లో అమ్మాయిలు గౌన్లూ, ఫ్రాకులూ వేసుకుని అసలు వయసుకన్నా చిన్నగా కనిపిస్తారండీ. నిజం చెప్పాలంటే అలా కనిపించాలనుకోవటం ఓఫ్యాషనండీ. మరండీ అసలు పధ్నాలుగేళ్ళకే అన్నీ తెలిసి ప్రేమించటమూ అదీ తెలిసి పోతుందండీ. ఇంకో పాయింటండీ. మీరు కూడా షర్టూ, బనీనూ వేసుకుంటే చిన్నపిల్లాడిలాగే వున్నారండీ- మీ వయసెంతో తెలీదుగానీ."
    ఈ అమ్మాయి పిల్లా పిడుగా అనుకున్నాడు. తనని చిన్న పిల్లాడిలా వున్నాడనటం చాలా నామోషీ అనిపించింది. ఆ షాక్ లోంచి కోలుకుని "సరే ప్రేమించావు, ప్రేమిస్తే, వొంటరిగా రైలెక్కటం దేనికి?" అన్నాడు.
    "వొంటరిగా రైలెక్కటం కాదండీ, ఇంట్లోంచి పారిపోయి వచ్చానండీ."
    "అదే దేనికని?"
    "చాలా సింపుల్ అండీ. ఈ పెళ్ళి మా డాడీకిష్టంలేదు. అందుకని ఆ అబ్బాయిని వెదుక్కుంటూ యీ వూరు వచ్చానండీ."
    "అతన్ది యీ ఊరా?"
    "అవునండీ."
    "అదిసరే. పెద్దవాళ్ళ యిష్టానికి వ్యతిరేకంగా యిలాంటి పనులు చేయవచ్చా?"
    "అదేమిటిసార్ అలా అంటారు? ప్రేమ గ్రుడ్డిదండీ. లవ్ యీజ్ బ్లెయిండ్-ఎండ్ ఇటీజ్ వెరీ స్ట్రాంగ్. అందులో పడ్డవాళ్ళు యీ పెద్ద వాళ్ళ యిష్టాలూ అవీ ఖాతరు చెయ్యరండీ. మీరు చూడ్డానికి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా పాపం యీ విషయంలో ఎక్కువగా అనుభవం లేనట్లుంది" అంది జాలిగా.
    "ఇదిగో చూడమ్మాయి" అన్నాడతను చాలా కోపంగా.
    "నా పేరు ప్రియంవదండి."
    "ఆఁ చూడు ప్రియంవదా! నా దగ్గర యీ ప్రేమలూ గీమలూ యిలాంటి వ్యవహారాలు కుదరవు. అదంటే నాకు సానుభూతి కూడా లేదు. నాకల్లా చదువు, గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్...."
    "అమ్మో! మీరు ఆర్టిస్టులు కూడానా అండీ?"
    "అంటే ఆర్ట్ ను ప్రేమిస్తాను. తబలా అంటే నాకు ప్రాణం. వీణ అంటే యిష్టం. గిటార్ అంటే మోజు."
    "అవన్నీ అంటే నాకూ యిష్టమే కానండీ. నేర్చుకోవాలంటే బోర్.....బోర్ అండీ. నాకు బోలెడు సేపు నిద్రపోవాలంటే గొప్పసరదా అండీ.
    "అది సరే ఇప్పుడేంచేద్దాం?" అన్నాడు చాలా ఖచ్చితంగా తాను చాలా ఖచ్చితమైన మనిషిననీ ఆమెకు తెలియచెయ్యాలని చాలా తాపత్రయపడుతున్నాడు.
    "అదే నేనూ ఆలోచిస్తున్నానండీ."
    "ఆలోచించటంకాదు. తేల్చిపారెయ్యాలి. వింటున్నావా? తేల్చి పారెయ్యాలి."
    "వింటున్నానండీ."
    "ఇప్పుడు విషయమేమిటంటే-యీ వయస్సులో నువ్వు ఒకర్ని ప్రేమించావు."
    "అబ్బ! చీటికీ మాటికీ వయసూ వయసూ అనకండి. ప్రేమించటానికి పనికొచ్చే వయసేనంటే నమ్మరేమిటండి.
    "అవునా?"
    "అవునండీ."
    "సరే ఏదో ఒక వయసులో ప్రేమించావు."
    "ఆ విషయం యిందాకే చెప్పానండీ."
    "సదరు ప్రేమించినతన్ని పెళ్ళిచేసుకునేందుకు మీ తల్లిదండ్రులు...."
    "తల్లిదండ్రులు కాదండీ. తండ్రే. మా అమ్మ చిన్నప్పుడే పోయింది."
    "అయ్యోపాపం" అని సానుభూతి కనబర్చాడు. తర్వాత "సరే తండ్రి ఇష్టపడకపోతే యింట్లోంచి లేచిపోయి వచ్చేశావు."
    "ఛీ ఆ మాట మరీ మోటుగా వుంటుందండీ. ఒక్కదాన్నే కదండీ వచ్చింది. అందుకని పారిపోయి వచ్చేశావు అనాలండి."
    "సరే పారిపోయి వచ్చేశావు."
    "ఆఁ యిప్పుడు కరెక్ట్ గా చెప్పారండీ."
    "సరే యిప్పుడెం చేద్దాం?"
    "అదేకదండీ మనమిప్పుడు ఆలోచిస్తున్నాం."
    "అవునా?"
    "అవునండీ."
    "నువ్వు ప్రేమించినబ్బాయి దొరికేదాకా మా గదిలో ఆశ్రయమివ్వవచ్చుగాని-నేను బ్రహ్మచారిని."
    "ఆ విషయం మిమ్మల్ని చూస్తే తెలిసిపోతోందండీ."
    "నాకు తోడు యింకో బ్రహ్మచారి."
    "పాపం యిద్దరూ బ్రహ్మచారులేనాండీ. కొంచం కష్టమే - మీ యిద్దరికీ-"
    "నేను చెబుతోంది మా కష్టం గురించి కాదు. నీ కష్టం గురించి. వయసుతో....అదే కొంచం వయసులో వున్నావు. ఇద్దరు బ్రహ్మచారుల మధ్య చాలా కష్టం."
    "ఆలోచిస్తోంటే కొంచెం కష్టమే అనిపిస్తోందండీ."
    "ఇప్పుడు నేను రెండు విషయాలాలోచిస్తున్నాను." అన్నాడు చాలా సీరియస్ గా.
    "ఏ విషయాలండీ?"
    "ఒకటి బాధ్యతగల వ్యక్తిగా నిన్ను మీ యింటికి చేర్చటం."
    "వ్యక్తిగా అనటంబావుండలేదండీ. ఎవరో పెద్ద మనిషిని సంబోధించినట్లు బాధ్యత గల కుర్రాడిలా అందామండీ."
    "కుర్రాడినా? నేను కుర్రాడినా?"
    "పోనీ బాధ్యతగల యువకుడిగా అని ఎడ్జెస్టు చేసుకుందామండీ."
    "సరే బాధ్యతగల యువకుడిగా నిన్ను మీ యింటికి చేర్చటం."
    ఒద్దండీ. ప్లీజ్! ఆ పనిమాత్రం చెయ్యకండి" అంది ప్రాధేయపడుతూన్నట్లుగా.
    "రెండోది నిన్ను ప్రేమించినవాడి దగ్గరకు నిన్ను చేర్చటం."
    "ఆఁ యిది బావుందండీ."
    "ఒకవేళ.....నేను యీ రెండూ చెయ్యకపోతే ఏమవుతుంది?"
    ఈసారి ఆమె వెంటనే సమాధాన మివ్వలేదు. అప్పుడప్పుడే ఉదయించే సూర్యకాంతిలో ఆమె ముఖం నల్లబడి పోవటం కనిపించింది. కళ్ళలో నీటిపొరలు క్రమ్ముతున్నాయి.
    ఎందుకో.....గుండె చెదిరినట్లయింది. తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం కరిగిపోయింది.
    "సరే, సరే. యింటికి.....అదే గదికి వెడదాం. కాని.....నాకు.....యిబ్బంది లేకుండా వుండాలంటే నువ్వు నా చుట్టాలమ్మాయివని చెబుతాను సరేనా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS