Previous Page Next Page 
డాళింగ్ పేజి 68


    "బాబు తన గదిలో ఉంటేనే...హాస్పిటల్లో ఉంటానని చెప్పింది సార్ ఆవిడ." పక్కనున్న నర్సు చెప్పింది డాక్టర్ తో.
    "నాకు మద్రాసులో ఇంపార్టెంటు షూటింగులున్నాయి సర్... ఆపరేషన్ ముందు వస్తాను. ఈ లోపల మీకు ఫోన్ చెయ్యొచ్చుకదా!"
    "ఓ.కే. ష్యూర్. కానీ ఆపరేషన్ చేసేముందు, ఆవిడకి సైక్రియా ట్రిక్ చేత ట్రీట్ మెంట్ చేయిస్తే బాగుంటుంది."
    "ఓ.కే. యాజ్ యూ లైక్ డాక్టర్."
    ఆ రోజు రాత్రి కృష్ణవందన మానసిక పరిస్థితి గురించి జె.ఆర్. రావుతో చాలాసేపు మాట్లాడాడు విమల్.
    "మొదటి నుంచీ వందనది తనలో తను కుమిలిపోయే మనస్తత్వం తల్లి లేకపోవడం, నేను దూరంగా ఉండిపోవడం... ఐసొలేటెడ్ లైఫ్ లీడ్ చేసింది. పరుగెడుతున్న చిన్నపిల్లాడు రోడ్డుమీద పడిపోయాడనుకో. వాడికి తగిలిన గాయానికి వెంటనే కావల్సింది మందుకాదు... వాడ్ని లేపి, బుజ్జగించే ఓదార్పు, చిన్నప్పుడు దాని మనసునిండా ఎన్నో గాయాలు. ఆ గాయాల్ని పట్టించుకునేవాడెవడూ లేడు. అందుకే దాని పరిస్థితి ఇలా తయారైంది. దానికిపుడు అన్నీ ముదిరిపోయాయి." కృష్ణవందన బాల్యంలో, తల్లిపోయాక జరిగిన అన్ని విషయాలూ చెప్పుకొచ్చాడాయన. దాంతో కృష్ణవందన మానసిక పరిస్థితి, మరింత అర్థమైంది విమల్ కు.
    "లెట్ ఇట్ బీ...నువ్విండియా వెళ్తానంటున్నావ్...నీ కెరీర్ ని పాడుచేసుకోవద్దు. ప్రతిరోజూ, ఎక్కడున్నా ఒక్కసారైనా, దానికి ఫోన్ చెయ్యి. ఎందుకంటే, అది ఇవాళ నీతో ప్రవర్తించినట్టు, రేపు ప్రవర్తించదు. నాకంటే నీకు ఆ విషయం ఎక్కువ తెల్సు."
    విమల్ ఆ రోజు రాత్రే న్యూయార్క్ నుంచి వచ్చేసాడు.
    మర్నాడు విమల్ మద్రాసు వెళ్ళిపోయాడని తెల్సుకున్న కృష్ణవందన పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది.
    తనుంటున్న రూమ్ లోని వస్తువులనన్నీ చిందరవందర చేసేసింది దాంతో_
    వందనకు సైకలాజికల్ ట్రీట్ మెంట్ చాలా అవసరం అని డాక్టర్లు నిర్ణయించారు.
    ఒకపక్క బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ మెంట్, రెండోది సైకలాజికల్ ట్రీట్ మెంట్.


                                                     *    *    *    *


    న్యూయార్క్ నుంచి విమల్ రాగానే, అతని కోసమే ఎదురుచూస్తూ ప్రొడ్యూసర్లు చుట్టుముట్టేసారు.
    "మీరు కూడా...మమ్మల్ని ఇబ్బందిపెడితే ఎలా సార్...."
    "ఇకనుంచీ ఏ ఇబ్బందీ ఉండదు... అన్ని సినిమాలూ పూర్తిచేస్తాను..." హామీ ఇచ్చాడు విమల్.
    మళ్ళీ రెగ్యులర్ షూటింగుల్లో పడ్డాడు. ఎక్కడున్నా, రెండ్రోజుల కొకసారి న్యూయార్క్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు విమల్. కృష్ణవందన వేశేశాలు తెల్సుకుంటూనే ఉన్నాడు.
    పదకొండు రోజుల తర్వాత__
    రాత్రి పదకొండు గంటలకు ఫోన్ న్యూయార్క్ నుంచి.
    అతనితో మాట్లాడుతున్నది కృష్ణవందన పిన్ని.
    "బాబూ...కృష్ణవందన పరిస్థితేం బాగాలేదు...మీ మామగారు కూడా సిటీలో లేరు. నిన్ను అర్జంటుగా రమ్మని డాక్టర్ ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పారు... వెంటనే బయల్దేరి రా... వస్తావు కదూ..." ఫోన్ పెట్టేసిందావిడ.
    కృష్ణవందన పరిస్థితేం బాగా లేదు...
    కృష్ణవందన పరిస్థితేం బాగాలేదు...కృష్ణవందన విలవిల్లాడుతున్న దృశ్యం కళ్ళముందు కదలాడగానే, మర్నాడు డబ్బింగ్ కి వెళ్ళలేకపోయాడు. కనీసం ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఆ విషయం ఇన్ పార్మ్ చెయ్యాలని కూడా అన్పించలేదు.
    ఎవరితో చెప్పా చెయ్యకుండా న్యూయార్క్ బయలుదేరిపోయాడు.
    మూడోనాడు__
    న్యూయార్క్ లో దిగి, డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే ఆశ్చర్యపోవడం విమల్ వంతయింది.
    బాబుని వడిలో పెట్టుకొని నవ్వుతూ ఆడుకొంటుంది కృష్ణవందన.
    విమల్ ని చూడగానే కృష్ణవందనలో ఎక్కడి సంతోషం అక్కడ మాయమైపోయింది.
    కృష్ణవందన, పాలరాతి బొమ్మలా, మిలమిల మెరిసిపోయే కృష్ణవందనలో ఆ వెలుగు మాయమై పోయింది.
    పీక్కు పోతున్న దవడలు...లోతుకెళ్ళి పోయిన కళ్ళు నెరిసిపోతున్న జుత్తు, ఎండిపోయిన పెదాలు... క్షీణించి పోతున్న దేహం.
    "ఎలా ఉన్నావ్ వందనా..."
    అభిమానంగా పలకరించాడు.
    "ఇంకా చచ్చిపోలేదు...."
    అలాంటి జవాబుని ఊహించలేదు. అంతదూరం నుంచి శ్రమపడి వచ్చిన విమల్ మనసు కలుక్కుమంది ఆ జవాబుకి.
    "మీ పిన్నిగారు ఫోన్ చెయ్యడంతో, ఎంత భయపడ్డానో తెలుసా?" దగ్గరగా వెళ్ళి, కురులమీద చెయ్యేసి నిమిరి, బాబు బుగ్గల్ని తాకి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు విమల్.
    విమల్ వేపు చూస్తూ అదోలా నవ్వింది కృష్ణవందన. అలాంటి నవ్వును ఎప్పుడూ చూడలేదు విమల్.
    "నేను చచ్చిపోతానని భయపడ్డావా...విమల్...ఆనందించావా...చెప్పు. అబద్ధం చెప్పకూడదు... నిజం చెప్పాలి. నేను చచ్చిపోయేముందు ఆఖరిసారిగా చూసిపోదామని వచ్చావు కదూ..."
    కృష్ణవందనకు పిచ్చి బాగా ముదిరిపోయిందా అని అన్పించింది ఆ మాటకు.
    ఆమె ప్రతిమాటా తూటా దెబ్బల్లా మనసుకు తగులుతోంది.
    "నాకు సీరియస్ గా ఉందంటే వచ్చావా..." నవ్వింది...పొరలు పొరలుగా, తెరలు తెరలుగా నవ్వింది.
    "అలాగ నీకు ఇవ్వకపోతే, నువ్వు రావని నాకు తెలుసు. అందుకే వస్తావో, రావో నిన్ను టెస్ట్ చేద్దామని... అంతే..." ఫెళ్ళున నవ్వింది. కొడుకు నెత్తుకుని అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూనే ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS