"నన్ను టెస్ట్ చేద్దామనా..." ఆశ్చర్యపోయాడు విమల్. నన్నెందుకు టెస్ట్ చెయ్యడం..." అనుమానంగా అడిగాడు.
"నేనక్కడ లేకపోతే నువ్వెలా వుంటావో నేనూహించుకోగలను. హ్యాపీగా ఉంటావు... నీ సినిమా హీరోయిన్లతో నువ్వు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతావు...మనింటికి తీసుకొచ్చి, మన బెడ్ రూమ్ లో వాళ్ళతో నువ్వు గడుపుతున్నావ్...అవునా...బ్రెయిన్ ట్యూమర్ టెస్టులు పేరుతో నన్నిక్కడికి బలవంతంగా తీసుకొచ్చి పడేసింది అందుకే... నాకు తెలుసు... నాకెప్పుడైతే ఆరోగ్యం బాగులేదని తెల్సిందో, అప్పట్నించి నన్ను దూరంగా ఉంచడం మొదలుపెట్టావు... నేనన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాన్లే... నాతో గడిపినట్టుగా నువ్వు నీ హీరోయిన్లతో గడుపుతున్నావా లేదా... చెప్పు... అబద్ధం ఆడకుండా చెప్పాలి..."
కృష్ణవందన మాటకు, విమల్ వళ్ళు కుతకుతలాడిపోయింది. చాచిపెట్టి, కొట్టాలనిపించింది. నరనరాల్లో అంతెత్తున కోపం పరుగులు తీస్తోంది.
"నీకు బాగా పిచ్చి ముదిరిపోయినట్టుంది...ఏవేవో వూహించుకుని, నిన్ను నువ్వు హింసపెట్టుకోవడం వల్ల... నీ హెల్త్ కే నష్టం... గుర్తుంచుకో..." సాధ్యమైనంత తక్కువ గొంతుతో సానునయంగా అన్నాడు విమల్.
"నా హెల్త్ కి నష్టం... అంటే నీకు లాభం కదా... నువ్వు నీక్కావల్సిన ఆడపిల్లల్తో..." ఇంకేదో అనబోయింది కృష్ణవందన. తనని టెస్ట్ చెయ్యడానికే రప్పించానని అన్నప్పుడే విమల్ మనసు ముక్కలైంది. దానికితోడు ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్న కృష్ణవందన వాగుడుని ఆపకపోతే, అక్కడొక పెద్ద సీన్ ని క్రియేట్ చేస్తుంది.
"వందన షటప్ ఐసే..." ఫడేల్మని దవడమీద కొట్టాడు. అసలే నీరసంగా వున్న వందన కొడుకుతోపాటు బెడ్ మీద పడిపోయింది. ఆ పడిపోవడంలో కొడుకు కిందకు జారిపోయాడు. ఆ జారడంలో వాడి తల పక్కనే వున్న ఐరన్ స్టూల్ కి బలంగా ఢీకొంది. వాడు కెవ్వున అరిచాడు.
అప్పుడుగాని వాడివేపు చూడలేదు విమల్. వాడి తలనుంచి కారుతున్న రక్తం... ఆ రక్తాన్ని చూడగానే కెవ్వుమని అరిచి స్పృహ తప్పిపోయింది కృష్ణవందన. నర్సు అప్పటికప్పుడు బాబుని అక్కడ నుంచి తీసుకెళ్ళి గాయానికి చికిత్స చేసింది.
అలా జరుగుతుందని ఊహించలేదు విమల్.
వందనకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ని కలిసాడు. ఇద్దరి మధ్య జరిగిన డిస్కర్షన్స్ అన్నీ చెప్పాడు.
"మీరున్నప్పుడు మీతో అతిగా మాట్లాడడం తప్ప, మీరు లేనప్పుడు తన గదిలో తను తలుపులన్నీ వేసుకుని చీకట్లో ఉంటుంది... ష్యూర్ లీ సైకలాజికల్ ప్రాబ్లమ్. దానికితోడు బ్రెయిన్ ట్యూమర్... టెస్ట్ లన్నీ చేసాం... రాయల్ ఇన్ స్ట్యూట్ కి రిపోర్ట్ పంపాం... అక్కడ నుంచి రిప్లయ్ వచ్చాకగానీ ఏ విషయమూ చెప్పలేం... ఆపరేషన్ విషయంకూడా అప్పుడే తెలుస్తుంది..."
"నేనుండాలంటారా!" అడిగాడు విమల్.
"మీరుంటేనే ఎక్కువ ప్రమాదంలా వుంది..." నవ్వుతూ అన్నాడు డాక్టర్.
"మీ ఇద్దరి మధ్యా ఏవైనా గొడవలున్నాయా?"
"అలాంటివేం లేవు డాక్టర్. ఇక్కడకు వచ్చేవరకుగానీ, ఇక్కడకు వచ్చాకగానీ, ఏ గొడవలూ లేవు. కానీ, ఇటీవల నన్ను చూడగానే వందనలో ఏదో మార్పు..."
"దానికి నా జవాబు ఒకటే మిస్టర్ విమల్... ఒకటి మీమీద ఆమెకు పూర్తి ప్రేమ అయినా కావచ్చు. లేదా ద్వేషమైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలని బట్టి చూస్తే, ఆమెకు మీమీద అపారమైన ప్రేమ అని నేననుకొంటున్నాను... డోంట్ వర్రీ... ఇంతకంటే క్రానిక్ కేసుల్ని నేను చూసాను... షీ...విల్...బీ ఆల్ రైట్... నాకా నమ్మకం వుంది..."
విమల్ కి ఏం చేయాలో తోచలేదు. కొడుకును ఒకసారి చూసి ముద్దాడి వచ్చేసాడు.
మర్నాడు జె.ఆర్. రావు ప్రయాణం నుంచి వచ్చాడు. మావగారితో కల్సి చెప్పి మద్రాసు వెళ్ళిపోదామని నిర్ణయించుకొని జె.ఆర్.రావు ఎస్టేట్ కి వెళ్ళాడు.
విమల్ ని చూడగానే అంతెత్తు ఎగిరాడు జె.ఆర్. రావు.
"షీ ఈజ్ సెన్సిటివ్...యూ నో దట్... దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటావనుకున్నాను. నా చిన్నారి తల్లికేమైందో చూడు... అదిప్పుడు ఎవర్నీ నమ్మడంలేదు... ఏదో భయం, ఏదో బెంగతో నిరంతరం కుమిలిపోతోంది... నమ్మి నీ చేతుల్లో పెట్టినందుకు బాగా చేసావయ్యా. రోగిష్టి మనిషిని చేసి దాని మానాన దాన్ని వదిలేసావ్. నేను ఎంతో దూరంలో వున్నా, అది నాకెంత దూరంలో వున్నా, దానికి ఏ లోటూ రాకుండా చూసాను... నీనుంచి కూడా ఆశించిందదే... అది నిన్ను ప్రేమించినంతగా, దాన్ని నువ్వు ప్రేమించడం లేదు... నిన్ను ప్రేమించి మోసపోయానని కుమిలిపోతోందది. నీకిష్టం లేకపోతే ఇప్పుడే డైవర్స్ ఇచ్చేసెయ్... కానీ, దాన్ని నరకయాతనలు పెట్టకు. అర్థమైందా..."
కూతురిలాగే పూర్తిగా మొండిగా మాట్లాడుతున్న జె.ఆర్. రావుకి ఏం సమాధానం చెప్పాలో, ఎలా సమాధానం చెప్పాలో అర్థంకాలేదు విమల్ కి.
"మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన ప్రవర్తన ద్వారా వందన నన్నెంత క్షోభకు గురిచేస్తోందో మీకు తెలీదు."
"అంత ప్రేమలో నిన్ను కావాలని కోరుకున్న వ్యక్తి నిన్నిప్పుడు క్షోభకు గురిచేస్తోందంటే... ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. తండ్రినికాదని, తండ్రి కోట్లాది ఆస్తిని కాదని, నిన్ను ప్రేమించిన వందన, నిన్నిప్పుడు ద్వేషిస్తుందంటే లోపం నీలోనే ఉందని గుర్తుచేసుకో. ఆ లోపాన్ని సవరించుకోడానికి ప్రయత్నించు లేదా దానిమానాన దాన్ని వదిలెయ్. దాని జబ్బును ఎలా బాగుచేయించాలో నాకు తెలుసు."
జె.ఆర్.రావు మాటలు శూలాల్లా తగులుతున్నాయి విమల్ కు.


