ఒకరోజు ఊటీలో ఉన్న విమల్ కు, జె.ఆర్.రావు ఫోన్ చేశాడు.
"వందనకు బ్రెయిన్ ట్యూమర్...డాక్టర్లు కన్ ఫర్మ్ చేశారు. ఆ విషయం పేషెంట్ కి తప్పనిసరిగా చెప్పాలని, సూపరింటెండెంట్ చెప్పాడు. తనకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిస్తే, అదెలా రియాక్టవుతుందోనని భయంగా ఉంది. నువ్వొకసారొస్తే బాగుంటుంది. వెంటనే బయల్దేరు."
మర్నాడే బయలుదేరాడు విమల్.
విమల్ వెళ్ళేసరికి హాస్పిటల్లో స్పెషల్ రూమ్ లో నిద్రపోతోంది కృష్ణవందన.
దూరంగా ఇంకో బెడ్ మీద బాబు_పక్కన ఆయా.
పక్కన కూర్చున్నాడు విమల్__
కాసేపటికి కళ్ళిప్పింది వంద. కళ కళ్ళాడే వందన ముఖం, ఈ కొన్ని రోజులకే పీక్కుపోయినట్టుగా అయిపోయింది.
"ఇంకో రెండు, మూడు రోజుల్లో నీ చెకప్ అయిపోతుంది. మనం మద్రాస్ వెళ్ళిపోదాం... డోంట్ వర్రీ." ఆ మాటంటున్నప్పుడు వందన ముఖంవేపు చూడలేదు విమల్.
వందనకు బ్రెయిన్ ట్యూమర్ అనగానే, విమల్ మనసు శతధా ముక్కలై పోయింది.
పేలవమైన నవ్వు నవ్వింది వందన. కళ్ళు చిత్రంగా తిప్పింది. ఆ కళ్ళల్లో రక్తలేమి స్పష్టంగా కన్పిస్తోంది.
"మనం ఎప్పుడు మద్రాసు వెళ్తున్నాం. టిక్కెట్లు బుక్ చేయించారా?"
ఆ ప్రశ్నలు అమాయకంగా అడిగిందనుకున్నాడు విమల్.
"డాక్టర్లు డిస్ చార్జి చెయ్యగానే" పెదిమలమీద నవ్వును పులుముకుంటూ చెప్పాడు విమల్.
"విమల్! నాతో డాడీ, మీరూ అబద్ధం చెప్పారు. అవునా... నాకు బ్రెయిన్ ట్యూమర్. నేను బతుకుతానో, లేదో డాక్టర్లక్కూడా తెలీదు...అవునా."
పెద్ద పిడుగు తలమీద పడినట్టయింది విమల్ కి. ఎవరు చెప్పారు కృష్ణవందనకు.
"నా వ్యాధి నాకు తెలీకుండా, చాలా జాగ్రత్తపడ్డావ్... బాడీ చెకప్ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశావ్... మద్రాసులోనే నీకీ విషయం తెల్సు...అవును కదూ! నాకెందుకు చెప్పలేదు. నేనెలాగూ బతకనని నీకు తెలుసు. అవును కదూ... రెన్నెల్లో, మూన్నెలలో నేను బాధపడి, బాధపడి ఛస్తానని నీకు తెల్సు. అంచేతే నన్ను జాగ్రత్తగా వదిలించుకుందామని మా డాడీ దగ్గరకు చేర్చేశావ్...నిజం కదూ!"
విసురుగా లేచి, కూర్చుంటూ అంది కృష్ణవందన.
ఆ పరిస్థితిలో కృష్ణవందన అలా మాట్లాడుతుందని ఊహించలేదు విమల్.
బాబు పక్కనున్న అమెరికన్ నర్సు వాళ్ళిద్దరివేపు అయోమయంగా చూస్తోంది.
"వందనా! మళ్ళీ మొదటికొచ్చావ్ నువ్వు. మద్రాసులోనే నాకు తెల్సు కానీ, నీకు తెలీకుండా ఎందుకు దాయాల్సి వచ్చిందో తెల్సా. నువ్వెక్కడ బాధపడి కుమిలిపోతావోనని..."
"ఓ.కే. నాకు డిసీజ్ ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఉన్నప్పుడు, ఈ మాత్రం హాస్పిటల్స్ మద్రాసులో లేవా, బొంబాయిలో లేదా, ఢిల్లీలో లేదా? ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చావ్....చెప్పు?" నిప్పులు కక్కుతూ అడిగింది కృష్ణవందన.
"ఇక్కడైతే ఎర్లీగా క్యూర్ అవుతుందని."
"నేన్నమ్మను. నామీద నీకేప్పుడో ప్రేమ పోయింది. దాంతోపాటు, నీకు లక్ కలిసొచ్చి నాకీ డిసీజ్ వచ్చింది. నన్ను దూరంగా తరిమేస్తే...నువ్వక్కడ హాయిగా, హీరోయిన్లతో తిరగొచ్చని..."
ఏం మాట్లాడుతోందో, తెలియని పరిస్థితిలో మాట్లాడుతున్న కృష్ణవందన వేపు జాలిగా చూసాడు విమల్.
మరి మాట్లాడదల్చుకోలేదు విమల్.
ఆ టాపిక్ ని ఆరా కొనసాగిస్తే, కృష్ణవందన ఎంతగా పెట్రేగి పోతుందో అతనికి తెల్సు. అందుకే గబగబా ఆ గదిలోంచి బయటికొచ్చేసాడు.
ఆ తర్వాత_రెండుగంటల తర్వాత_
"నాకు నెలరోజుల్లోపల డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. అంతవరకూ నువ్విండియా వెళ్ళడానికి వీల్లేదు." ఆ సమయంలో కృష్ణవందన పక్కలో బాబు పడుకుని ఉన్నాడు.
"ఒకసారి వెళ్ళాలి తప్పదు. నీ ఆపరేషన్ కి ఇక్కడే ఉంటాను." విమల్ మాటలకు ప్రతిస్పందనేం రాకపోతే, తలతిప్పి పక్కకు చూసాడు. చేత్తో గాజుని చిదిమి, ఒక గాజుముక్కతో తన అరచేతిమీద గీసుకుంటోంది.
ఆ గాజు ముక్కల్ని గబుక్కున లాక్కున్నాడు.
"ఏంటిది...వందనా, పిచ్చెక్కిందా?"
"అవును...పిచ్చే. నువ్వీ నెలరోజులూ ఇక్కడే ఉంటావ్." లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలీదు."
"ఓ.కే. అలాగేలే."
"అలాగే అని చెప్పి, డాడీతో చెప్పి వెళ్ళిపోతే...నీకూ, నాకూ పుట్టిన బాబుని విసిరికొట్టి, చంపేస్తాను...మైండిట్." అటుపక్క తిరిగి, బ్లాంకెట్ ని కప్పుకుంటూ అంది కృష్ణవందన.
"బాబుని విసిరికొట్టి చంపేస్తావా?" ఆ మాటకు గజగజా వణికిపోయాడు విమల్.
ముందు సైక్రియా ట్రిక్ చేత ట్రీట్ మెంట్ చేయించాల్సింది... తనదే తప్పు. మనసులో బాధపడ్డాడు విమల్.
కృష్ణవందన ప్రవర్తన విషయంకూడా, హాస్పిటల్ డాక్టర్లకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
మర్నాడు వందనని ట్రీట్ చేస్తున్న, సంబంధిత డాక్టర్ కి, పూర్తిగా చెప్పాడు.
"దానికి నెర్వస్ సిస్టమ్ లో లోపం కారణం కావచ్చు. ఎందుకైనా మంచిది. బాబుని ఆ గదిలో ఉంచకండి. మీరు కూడా ఆవిడ రియాక్ట్ అయ్యే విషయాలేవీ మాట్లాడకండి."
