Previous Page Next Page 
డాళింగ్ పేజి 66


    కృష్ణవందనకు ట్రీట్ మెంట్ చేసి, గాయానికి కట్టుకట్టి వెళ్ళిపోయాడు డాక్టర్.
    రాత్రంతా వందన బెడ్ పక్కనే మగత నిద్రలో గడిపాడు విమల్.
    అకస్మాత్తుగా, అర్థరాత్రి చలితో ముడుచుకుపోతున్న కృష్ణవందన నుదుటిమీద చెయ్యివేసి చూశాడు.
    వళ్ళు వేడిగా కాలిపోతోంది.
    అప్పటికప్పుడు డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. హైఫీవర్ ఇంజక్షన్ చేసి వెళ్ళాడు.
    "డోంట్ వర్రీ రేపుదయానికి ఎవ్వెరిథింగ్ ఒ.కే..."
    డాక్టర్ చెప్పినట్టుగా, మర్నాడు ఉదయానికి, కృష్ణ వందనకు జ్వరం తగ్గలేదు. కొమిలిలో కర్రలా ఉంది వందన శరీరం. పిచ్చి పిచ్చి మాటలు, అరుపులు.
    డాక్టర్ సలహా మీద, ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో చేర్చాడు కృష్ణవందనను విమల్.
    ఒక పక్క సినిమా డబ్బింగ్ పని, రెండో పక్క కృష్ణవందన ఆరోగ్యం. ఆయా సంరక్షణలో బాబు.
    జ్వరం తగ్గు ముఖం పట్టలేదు. డాక్టర్లు రకరకాల టెస్టులు చేస్తున్నారు. చిన్న జ్వరానికి అన్ని టెస్టులెందుకో అర్థం కాలేదు విమల్ కు.
    ఓ రోజు ఏ.వి.ఎమ్. డబ్బింగ్ థియేటర్లో ఉన్నాడు విమల్. అక్కడకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ని చూసి ఆశ్చర్యపోయాడు.
    "ఏంలేదు... విమల్, వందన గురించి నాకనుమానంగా ఉంది."
    "వాట్ డాక్టర్...ఏమైంది..." కంగారుగా అడిగాడు విమల్.
    బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి...ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది కాబట్టి, క్యూర్ చెయ్యడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎలాగూ వందన ఫాదర్...న్యూయార్క్ లోనే ఉంటున్నారు కాబట్టి, దేర్ యూకెన్ గెట్ మోర్ ఫెసిలిటీస్ దేన్ హియర్. నాకూ, ఇంకో ఇద్దరు డాక్టర్స్ తప్ప, మరెవరికీ విషయం తెలీదు...అంచేతకి ఎంత త్వరగా నువ్వక్కడకు తీసికెళ్తే అంత మంచిది..."
    కృష్ణవందనకు బ్రెయిన్ ట్యూమర్__విమల్ కి అదో పెద్ద షాక్.
    అయిదు నిమిషాల సేపు, ఆలోచనలో పడిపోయాడు... ఏదో అగాధంలోకి జారిపోతున్నట్టనిపించింది. మెదడంతా మొద్దుబారిపోయింది.
    "సడన్ గా తను న్యూయార్క్ ప్రయాణం పెడితే, వందనకు అనుమానం రాదా...ఈ విషయం వందనకు తెలియజేయడం, మంచిదా కాదా?"
    "రహస్యంగా ఉంచు...అసలే వీక్ హార్ట్...మరీ బెంబేలు పడిపోతుంది." డాక్టర్ సలహా ఇచ్చాడు.
    మరో రెండ్రోజుల తర్వాత కృష్ణవందనను డిస్ చార్జి చేశారు.
    నాలుగు రోజుల తర్వాత__
    "నాకేదో మగత, మగతగా ఉంటోందండి...ఏదీ చెయ్యాలని లేదు. ఏదో తలనొప్పి, మెదడంతా చిట్లిపోతున్నట్టుగా ఉంటోంది. నాకేమౌతోందో, తెలీడంలేదు." బాధగా అంది కృష్ణవందన.
    ఏమీ చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో పడ్డాడు విమల్.
    "కొన్నాళ్ళు మీ ఫాదర్ దగ్గర ఉంటావా? నువ్వు ప్రతిదాన్నీ గోరంతలు, కొండంతలు ఊహించుకుంతావ్... అందుకే ఇదంతా... చెప్పు న్యూయార్క్ వెళ్దామా!"
    "మీరూ రండి. ఓ నెలరోజులు అక్కడుండి వద్దాం."
    "నీతోపాటు నేనూ, నెల్రోజులుండాలంటే, ఇక్కడ షూటింగులు-నిన్ను డ్రాప్ చేసి! ఓ రెండ్రోజులుండి వస్తాను. మళ్ళీ నువ్వొచ్చే ముందు వస్తాను. ఇద్దరం కల్సొచ్చేద్దాం...అలాగేనా."
    ఏ మూడ్ లో వుందో "అలాగే మీ ఇష్టం" ఒప్పుకుంది కృష్ణవందన. న్యూయార్క్ వెళ్ళడానికి, ఒప్పుకోదేమోనని సంశయించిన విమల్ కు, సమస్య అంత సులభంగా సెటిలైపోయినందుకు హ్యాపీగా ఉంది.
    మర్నాడే కృష్ణవందన తండ్రి జె.ఆర్. రావుకి ఫోన్ చేశారు. విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. బ్రెయిన్ ట్యూమర్ విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరాడు. మొదట ఆయన కంగారుపడ్డాడు. బాధపడ్డాడు.
    వీళ్ళక్కడికి వచ్చేలోపలే, స్పెషలిస్టులతో మాట్లాడాడు. న్యూయార్క్ సిటీ హాస్పిటల్ సూపరెంటెండెంట్ స్వయంగా కల్సి, కూతురికి తెలియకుండా చూడమని గోరాడు.
    ఆయన అందుకు అంగీకరించాడు.
    కృష్ణవందన, బాబులతో కల్సి, విమల్ న్యూయార్క్ వెళ్ళాడు.
    రెండు రోజులు హ్యాపీగా గడిచిపోయింది.
    మూడో రోజున తల తిరిగి పడిపోయింది కృష్ణవందన.
    న్యూయార్క్ సిటీ హాస్పిటల్లో ఎడ్మిట్ చేశారు.
    వెంటనే వచ్చేద్దామనుకున్నాడు విమల్. డాక్టర్ రిపోర్ట్ చూసి, చెప్పడంతో, మరో మూడురోజులు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు విమల్.
    కృష్ణవందనకు ప్రిలిమినరీ టెస్ట్ లు, స్కానింగ్ లు లన్నీ చేసారు. కొన్నాళ్ళపాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పాడు న్యూయార్క్ సిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్.
    "నేనెందుకు అబ్జర్వేషన్లో ఉండాలి...నాకేమైంది?" ఓ రోజు అడిగింది కృష్ణవందన.
    "ఏంలేదు...బాడీ చెకప్...అంతే! ఈ చెకప్ పూర్తయితే, ఇంతకు పూర్వంలా నువ్వు ప్రతి చిన్న విషయానికీ బాధపడవు. ఈ చెకప్ నీ గురించి కాదు, నా గురించి...మన బాబు గురించి." ఆ సమాధానంతో సంతృప్తిపడింది కృష్ణవందన.
    అప్పటికే న్యూయార్క్ వెళ్ళి పదిరోజులైపోయింది. ప్రొడ్యూసర్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పి, మద్రాస్ వచ్చాడు విమల్.
    ....పదిహేనురోజులు గడిచాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS