Previous Page Next Page 
డాళింగ్ పేజి 65

 

    అప్పుడే చెట్టునుంచి తెంపిన నాజూకైన గులాబిలా కృష్ణ వందన.
    ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు విమల్.
    గంధపు వనంలో, ఉవ్వెత్తున లేచిన మంటల అలల్లా కృష్ణ వందన పరువుపు ప్రణయవేశంలో విమల్....
    ఆచ్చాదన లేని విమల్ ఎదమీద తాలాన్చుకొని .....అతని కళ్ళలోకి చూస్తోంది కృష్ణ వందన.
    "అంతా బావుంటుంది కానీ, వందనా.....అప్పుడప్పుడు నువ్వు చేసే అల్లరి , అ సమయంలో నువ్వు దెయ్యం పట్టిన దానిలా తయారౌతావ్ ......కదూ......"
    నవ్వేసింది కృష్ణ వందన.
    "అవును"
    ఆ మాటన్న వందన వేపు ఆశ్చర్యంగా చూసాడు విమల్.
    'అన్నీ తెలిసే చేస్తున్నావన్నమాట."
    "ఆ సమయంలో నాకేం తెలీదు విమల్ --ఏదో ఆవేశం, ఏదో పంతం, చిన్నప్పటి నుంచీ అంతే.....ఎన్నిసార్లు నన్ను నేను బోలరేట్ చేసుకునే ప్రయత్నం చేసినా కుదరడం లేదు. వంటరిగా కూర్చున్నపుడు, ఏవేవో ఆలోచన్లు వస్తాయి. ఆలోచన్లు పిచ్చి, పిచ్చిగా ఉంటాయి. ఎవరో నాకు, ఏదో అన్యాయం చేసిన ఫీలింగ్! ఎలాంటి అన్యాయమో నాకు తెలీదు . మమ్మీ చనిపోయిన దగ్గర్నుంచి , నాలో నేనే కుంచించుకుపోతున్న వంటరితనం......చాలా కాలం బిజినెస్సే సర్వస్వం అనుకుని దూరంగా తిరిగిన తండ్రి మిగిల్చిన వంటరితనం, ఖరీదైన స్కూల్లో ఖరీదైన హాస్టల్లో పెంచుతున్నానని మా డాడీ అనుకునేవాడు. కానీ నేను ఎవరి అభిమానానికి నోచుకోలేక, ఎవరి అత్మీయతకూ నోచుకోక, నాకు చెల్లీ, తమ్ముడూ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నా మీద, ప్రేమ, కానీ నేను వాళ్ళని మనస్పూర్తిగా ఒప్పుకోను.నాకు చీకటంటే ఏంతో ఇష్టం. స్కూల్లో హాస్టల్లో ఉన్నప్పుడు , బ్లేడులు తీసుకుని చేతిమీద గాయాలు చేసుకునే దాన్నట. ఎవరిమీదైన కోపంవస్తే, నన్ను నేను దారుణంగా హింసించుకునే మనస్తత్వం ఏదో ఫోభియా.
    అప్పుడప్పుడు మా పిన్నిని చంపేయ్యాలన్నంత కోపం......కొన్ని రోజుల వరకూ నేను తెరుకోలేని మానసికమైన అలసట.......నేను నటిగా ఉన్నపుడు ఇద్దరు, ముగ్గురు సైకియాట్రిక్స్ దగ్గర కెళ్ళాను. నాది జబ్బో బలహీనతో వాళ్ళకు అర్ధం కాలేదు. ప్రతిదానికీ వర్రీ కావద్దనీ వాళ్ళ ట్రీట్ మెంట్. నువ్వు కలిసాక, నాకు ఆనందమంటే ఏమిటో , తెల్సింది ఒక సాధారణమైన, గృహిణిలా, భర్త ప్ర్రేమను పూర్తిగా పొందగలిగే గృహిణిలా, హాయిగా బతకాలని నా కోరిక. అందుకే నేను సినిమాలకు స్వస్తి చెప్పేసాను.'
    నెమ్మదిగా చెప్పింది కృష్ణ వందన.
    "అన్ని విధాల......నన్ను అర్ధం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. నిజం విమల్." కళ్ళమీద ముద్దు పెట్టుకుంటూ మళ్ళీ అంది కృష్ణ వందన.
    కృష్ణ వందన మమత, మమకారం, ఆరాధన, ప్రేమ అన్నీ తెలుసు విమల్ కి. వాటితో పాటు లోపాలు కూడా తెలుసు. అందుకే వందనంటే ఇంకా, ఇంకా ఇష్టం పెంచుకున్నాడు విమల్.
    వారం రోజుల తర్వాత....
    అప్పుడు విమల్ షూటింగ్ లో , భువనేశ్వర్ లో ఉన్నాడు.
    "బాబుకి జ్వరం .......సీరియస్ గా ఉంది. "ఫోన్ చేసి చెప్పింది వందన. సినిమాకి అది లాస్ట్ షెడ్యుల్. అప్పటికే ప్రొడ్యుసర్ నానా బాధల్లో ఉన్నాడు. కొడుక్కి జ్వరంగా ఉందంటే , కాళ్ళా, వెళ్ళా పడ్డాడు ప్రొడ్యుసర్. వీలుకాని పరిస్థితుల్లో మద్రాసులోని కొంతమంది స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పటికప్పుడు కృష్ణ వందనకు ఫోన్ చేసి, బాబు పరిస్థితి కనుక్కుంటూనే ఉన్నాడు.
    షూటింగ్ అయిపోయిన మరుక్షణం, మద్రాసు వచ్చేసాడు విమల్.
    బాబుకు జ్వరం తగ్గుముఖం పట్టింది.
    "మీరూ, మీ షూటింగ్ లూనూ, కొడుక్కి సీరియస్ గ ఉందంటే ఫోన్ చేసి డాక్టర్లను పంపిస్తే సరిపోతుందా? వాడంటే  మొదట్నుంచీ మీకు ఇష్టం లేదు. పాప కావాలన్నారు....వీడు పుట్టాడు. వీడికి మీ అమ్మ గారి పేరు పెట్టుకుంటానన్నారు......మా డాడీ పేరు పెట్టాను....అంచేతే వీడంటే మీకు అసహ్యం, ద్వేషం." ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది వందన.
    "వందనా! అవతల సిన్మా ఎడిటింగ్ లో ఉంది. మళ్ళీ ఆర్టిస్ట్ కాంబినేషన్ దొరకదు. ప్రొడ్యుసర్ కాళ్ళా వెళ్ళా పడ్డాడు. చెప్తే వినిపించుకోవేం.'
    "నాక్కదలు చెప్పొద్దు......మీరేం కాలినడకన రారుగాదా.....ఫ్లయిట్ లో వచ్చి ఫ్లయిట్ లో వెళ్ళడానికి ఇన్ని కధలు చెప్పాలా.....నేను చూస్తున్నాను గదా! వీడు పుట్టింతర్వాత, వీడికి మా డాడీ పేరు పెట్టిం తర్వాత, నాతొ కూడా మీరు అంతంత మాత్రంగానే ఉంటున్నారు. మీ మొక్కుబడి వ్యవహారం నాకేం నచ్చడం లేదు. చాలాసార్లు చెబ్ధమనుకున్నాను. సమయం వచ్చింది గదా .....చెప్తున్నాను.'
    ఆ సమయంలో కృష్ణ వందనకు ఎలా జవాబు చెప్పాలో అర్ధం కాలేదు విమల్ కు.
    'అయితే ఎవంటావ్?" చిరాగ్గా అన్నాడు.
    "మీరు సినిమాలు మానెయ్యాలి. న్యూయార్క్ వెళ్ళిపోదాం. అక్కడ బిజినెస్ చెయ్యండి...అంతే."
    "సడన్ గా న్యూయార్క్ ఎందుకెళ్ళిపోవాలి."
    "ఇక్కడ నాకు నచ్చలేదంతే......వచ్చిన పేరు ప్రఖ్యాతలు చాలు."
    "పేరు ప్రఖ్యాతులు కోసం నేను నటించడం లేదు."
    "మరి డబ్బుకోసమా, ఆ డబ్బు మన దగ్గర లేదా? అవసరమైతే మా డాడీ నడిగి తీసుకుందాం.'
    "నేను యాక్ట్ చేస్తున్నది డబ్బు కోసం కూడా కాదని నీకు చాలా సార్లు చెప్పాను. మా అమ్మగారు చనిపోతూ......నన్నడిగిన ఏకైక కోరిక నటించమని .మంచి నటుడిగా తన వారసత్వాన్ని నిలబెట్టమని.
    'అయితే .....ఆవిడ వారసత్వాన్ని మీరు నిలబెడుతున్నారంటారు. ఆ పాతకాలం మనిషి కోరిక కి, కట్టుబడి నిలబడతానంటారు. ఓ.కే. అయితే, మీరుండండి, నే వెళ్తాను." విసురుగా అంది కృష్ణ వందన.
    "చనిపోయిన వాళ్ళని కించపరచడం వల్ల , మన కుసంస్కారమే బయటపడుతుంది." వచ్చిన కోపాన్ని సాధ్యమైనంత అణచుకుంటూ అన్నాడు విమల్.
    "నాకు సంస్కారమే లేదు, అంతే కదా! నేను స్లమ్ లోంచి వచ్చిందాన్ని అంతే గదా! సంస్కారం లేనపుడు నేనెలా మీ ఇంట్లో ఉంటాను.....ఇపుడే మా డాడీకీ ఫోన్ చేస్తాను..." విసురుగా ఫోన్ వేపు వెళ్తోన్న కృష్ణ వందనకు అడ్డుగా నించున్నాడు విమల్.
    "మా డాడీ క్కూడా ఫోన్ చేయ్యనివ్వరా......" విమల్ ని పక్కకు తోసేస్తూ ముందు కెళ్ళాబోయిన, కృష్ణ వందన చేతిని పట్టుకుని ఆపబోయాడు. ఆ చేతిని పక్కకు తీసేయ్య బోతూ , తూలిపోయి టీపాయ్ మీద పడిపోయింది.
    గ్లాస్ టీపాయ్ భళ్ళున బద్దలైపోయింది. విరిగిన గాజు ముక్క కృష్ణ వందనకు బలంగా గుచ్చుకుని, సర్రున రక్తం ఎగజిమ్మింది. అరుస్తూ కింద పడిపోయిన కృష్ణ వందన వేపు వెళ్ళబోయిన విమల్ ని దగ్గరకు రానివ్వకుండా------
    "నా దగ్గరకు రావొద్దు.....వస్తే చచ్చిపోతాను." నుదుటిని\ , పక్క నున్న స్తంభానికి కొట్టుకుంటూ , హిస్టీరిగ్గా అరిచింది కృష్ణ వందన.
    "వందనా! ఏంటిది?" వారించబోయాడు. కానీ అప్పటికే దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాజ్ ని తీసి, అతని కేసి విసిరి, భీకరంగా అరుస్తూ తలాని స్థంభానికేసి కొట్టుకుంటుంది.
    ఆ దృశ్యాన్ని చూడలేక పోయాడు విమల్.
    గబగబా , ఫోన్ వేపు నడిచాడు. ఫామిలీ డాక్టర్ కి ఫోన్ చేసాడు.
    ఫోన్ చేసి తిరిగొచ్చిన విమల్ కి, స్పృహ తప్పిపడిపోయిన కృష్ణ వందన , ఆ ప్రక్క బలంగా తగిలిన నుదుటి గాయం నుంచి ధారాపాతంగా స్రవిస్తున్న రక్తం కనిపించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS