మురళి ఆలోచిస్తున్నాడు. అవును- ఏమని చెబుతాడు? పెదనాన్న మరణాన్ని తనకు ముందుగా చెప్పగలిగిన వ్యక్తీ ఇతనే అంటే ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు.
"నాకూ సుదర్శనానికీ ఏవిధమైన సంబంధమూ లేదు. అతన్ని చంపడం వల్ల నాకేమీ లాభం లేదు. కానీ నన్ను పోలీసు స్టేషను కు తీసుకెళ్ళడం ద్వారా మీరు చిక్కుల్లో పడతారు. యాక్సిడెంట్ గా భావిస్తున్నదాన్ని హత్యగా మార్చి -- దానికో హంతకుణ్ణి వెతకాల్సిన అవసరం మీకే మొచ్చింది అనుకుంటారు పోలీసులు. దానికి తోడూ మీకు పెదనాన్న చనిపోవడం వల్ల ప్రయోజనం కూడా కలిగింది ఇక చూసుకోండి --" అన్నాడతను.
అతను తెలివైన వాడన్న విషయంలో సందేహమే లేదు. ఎదుటి మనిషి బలహీనతలనతను చక్కగా వినియోగించుకోగలడు. తనతన్ని ఏమీ చేయలేడని అలా చేయాలని ప్రయత్నించడం వల్ల తనే చిక్కుల్లో పడతాడని మురళి గ్రహించాడు.
'ఇంతకూ మీరిప్పుడు నన్నెందుకు పిలిచినట్లు?" అన్నాడు మురళి.
'అది చేబుదామనుకుంటూ ఉంటె మీరు సంభాషణను పెడదోవ పట్టించారు. మీకు సుధాకరరావు తెలుసా?" అన్నాడతను తాపీగా.
"ఏ సుధాకరరావు?" అనడిగాడు మురళి ఆశ్చర్యంగా.
'మీ కెంతమంది సుధాకరరావులు తెలుసు?" అతడు ఎదురు ప్రశ్న వేశాడు.
మురళి ఒక్క క్షణం అలోచించి - "అసలేవ్వరూ తెలియదు" అన్నాడు.
"బాగా గుర్తు చేసుకున్నారా?" అనడిగేడతను.
'ఆహా --" అన్నాడు మురళి.
"అయితే ధవళేశ్వరంలోని సుధాకరరావు మీకు తెలియదంటారు?" అన్నాడతను.
మురళికి చటుక్కున గుర్తుకు రాగా -- 'అతను తెలియకపోవడమేమిటి అతను వరసకి నాకు అన్నయ్యవుతాడు . ఇంచుమించు ఇద్దరమూ ఒకీడు వాళ్ళమే -- " అన్నాడు.
'చూశారా మీకు చటుక్కున గుర్తురాని బంధువులు కూడా నాకు తెలుసు" అన్నాడతడు నవ్వుతూ.
"అది సరే -- అతనికిప్పుడే మయింది?" అన్నాడు మురళి.
"ఈ రోజునుంచీ లెక్క పెట్టుకుంటూ వెడితే సరిగ్గా మూడవ రోజు రాత్రి ఏడు గంటల నలభై నిముషాలకు -- సుధాకరరావు మరణిస్తాడు--" అన్నాడతను.
మురళి ఉలిక్కిపడి -- "వాటీజ్ దిస్!" అన్నాడు.
అతను నవ్వి "ఇదే జోస్యం --చావు జోస్యం !" అన్నాడు.
"దిసీజ్ టూ మచ్" అన్నాడు మురళి.
"అవన్నీ నాకు తెలియదు. అతను పోయినట్లు మీకు తెలిశాక అతనలా పోతాడన్న విషయాన్ని ముందుగానే మీకు ఒక గొప్ప జ్యోతిష్కుడు చెప్పగలిగాడన్న సంగతి గుర్తుంచుకోండి చాలు -- వస్తాను మరి! ఇప్పటికే మీకు రెండు బస్సులు మిస్ కొట్టినట్లున్నాయ్"-- అన్నాడతను.
5
"హలో -- ఎవరండీ మాట్లాడుతుంట--"
"నేను -- సుధాకరాన్ని "
'అమ్మయ్య నువ్వేనా -- నేను కుసుమాని---"
సుధాకరరావు ముఖం వికసించింది -- "ఎక్కణ్ణించి ఆఫీసునించేనా?"
'అవును ఏమిటి విశేషాలు ?"
"ఫోన్ చేసింది నువ్వు, నువ్వే చెప్పాలి విశేషాలు?"
"విశేషాలు చెప్పటానికి కాదు ఫోన్ చేసింది. విశేషాలేక్కడ చెబుతానో చెప్పడానికి-"
"ఎక్కడ ?"
'ఆనకట్ట దగ్గర- మనం ఎప్పుడూ కలుసుకునే చోటనే అదే టైముకి --"
"ఒకే" అన్నాడు హుషారుగా సుధాకరరావు.
'ఒకే" అని ఫోన్ పెట్టేసింది కుసుమ.
సుధాకరరావు అప్రయత్నంగా ఈల వేశాడు. అతను చాలా హుషారుగా ఉన్నాడు.
సుధాకరరావు కుసుమను ప్రేమించాడు. ఇద్దరూ ఉద్యోగాలలో వున్నారు. ఒకే ఉళ్ళో ఉంటున్నారు. పెద్దవాళ్ళు కాదంటారన్న భయం ఇద్దరికీ లేదు. కుసుమ అక్కయ్యకు వివాహం కావడం కోసం ఇద్దరూ అగేరు. ఇటీవలే కుసుమ అక్కను చూచుకునేందుకు పెళ్ళివారోచ్చి వెళ్ళేరు. 'బహుశా దానికి సంబంధించిన విశేషాలే చెప్పాలనుకుంటూ ఉండి ఉండవచ్చు కుసుమ -- అనుకున్నాడు సుధాకరరావు.
సుధాకరరావు కుసుమ కలుసుకునే చోటు ఒకటుంది. అదే ఆనకట్ట దగ్గర. అక్కడ ఒక చిన్న లంక వంటి ప్రదేశమూ, అందులో చక్కని పూదోట వున్నాయి. ప్రేమికులు కలుసుకోవటానికి అద్భుతమైన స్థలమది. నిర్మానుష్యంగా వుండకపోయినా అవసరమైన ఏకాంతాన్ని ప్రసాదిస్తుందా ప్రదేశం.
వివాహమయ్యేవరకూ యువతీ యువకులు ఏకాంతం గురించి తపిస్తూఉంటారు. మాట్లాడుకుందుకు వారి మధ్య గల విశేషాలకు లెక్కే వుండదు. ఎంతసేపు కబుర్లు చెప్పుకున్నా తనివి తీరదు. విడిపోయేటప్పుడు బాధగా విడిపోతారు. వివాహమొక్కటే వారి సంభాషణకు నిలుపు చేయగలదు. అందుకు కారణం వేరే ఏమీ లేదు. వివాహమయ్యేక వారు కలిసి జీవిస్తారు. ఒకరికొకరు అందరన్న భయముండదు.
ప్రస్తుతం సుధాకరరావు కలలు కంటున్నాడు. చాలా ముఖ్యమైన విశేషమేదో చెప్పబోతూ వుండాలి కుసుమ. అందుకే ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందనుకుంటూన్నాడు. కానీ, కుసుమ ఎప్పుడూ అతనికి ఫోన్ లోనే మాట్లాడి చెబుతుంటుందని అతనికి తెలియకపోలేదు. కానీ, ప్రియురాలి సమాగమమనేసరికి ఏవో ఆశలు, ఎన్నో కలలు! సాధారణంగా వాళ్ళు కలుసుకునే సమయం ఏడున్నర, కుసుమ ఇంటి వద్ద అబద్దం చెప్పనవసరం లేదు. ఆమె ప్రాజ్ఞురాలయిందని తప్పటడుగులు వెయ్యదని ఇంట్లో అందరికీ నమ్మకముంది. పైగా సుధాకరరావు కప్పుడే ఆ ఇంట్లో ఇంటల్లుడిగా గుర్తింపు లభించేసింది. అయినా తొమ్మిది కాకుండా తిరిగి ఇల్లు చేరుకుంటుంది కుసుమ.
సాయంత్రం ఆఫీసు వదలగానే సుధాకరరావు తన రూమ్ కెళ్ళి అరగంటలో ట్రిమ్ గా తయారై ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాడు.
సుధాకరరావు టైము చూసుకున్నాడు. చాలా నెమ్మది నడుస్తోంది గడియారం. ఏడున్నర కావడానికి కింకా అరనిముషముంది. కుసుమ జాడలేదు.
చిరాకు, విసుగు కలుగుతున్నాయతనికి. అసహనంగా ఫీలవుతున్నాడతను.
"హలో -- మీరేనా మిస్టర్ సుధాకరరావు!"
సుధాకరరావు తలెత్తి చూశాడు. 'అవును - మీరు?"
"నేనేవరినైతే ఏం లెండి? కుసుమ నన్ను పంపింది."
"కుసుమ మిమ్మల్ని పంపిందా? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదే? ఆమెకు మీరేమవుతారు?"
"ఏదో దూరపు చుట్టాన్ని లెండి. నిన్ననే కుసుమ వాళ్ళింటికి వచ్చాను" అన్నాడతను.
"మీ పేరు?"
"తెలుసుకుని ప్రయోజనమేమిటి లెండి? చెప్పడానికి నాకూ బాధగానే ఉంది. కారణమేమీ లేదు. నేను మీకు తీసుకువచ్చిన వార్త మంచిది కాదు."
సుధాకరరావు కంగారు పడ్డాడు. "మీరేం చెబుతున్నారో నాకర్ధం కావడం లేదు.'
"ఇందులో అర్ధం కావడానికేముంది లెండి? ఉదయం మీకు కుసుమ ఫోన్ చేసి ఇక్కడకు రమ్మనమని చెప్పిందా? ఆమె ఏదో మీకు చెప్పాలను కుంది. అయితే ఆ విషయం చెప్పడానికి స్వయంగా తను మీ దగ్గర కొచ్చే అవకాశం లేదు. అందుకే నన్ను పంపింది."
"ఏమిటి మీరనేది?"
"కుసుమ తనే స్వయంగా మీ దగ్గరకు వద్దమనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళోప్పుకోలేదు."
"వ్వాట్-- నా దగ్గరకు రావడానికి కుసుమను అడ్డంకులా? అలా ఆ ఇంట్లో ఎన్నడూ జరుగదు."
"జరిగింది కాబట్టే నేను వచ్చాను"అన్నాడతను బాధగా నవ్వి.
సుధాకరరావు అసహనంగా , "కాస్త వివరంగా చెప్పండి" అన్నాడు.
"ఏమీ లేదు, కుసుమ అక్క లక్ష్మీకి సంబంధం కుదిరింది. వాళ్ళు చాలా ఆస్తి పరులు. లక్ష్మీకి కాబోయే భర్తకు ఓ దూరపు వరుస తమ్ముడున్నాడు. అతనికి కుసుమను చేసుకోవాలని వాళ్ళనుకుంటున్నారు. కుసుమ వాళ్ళకు బాగా నచ్చింది. రెండు సంబంధాలకూ ముడి పెట్టారు.'
"కుసుమ ఏమంది?"
"ఇందులో కుసుమ ప్రసక్తి ఏముంది? ఆమె తలిదండ్రులకు సంబంధం నచ్చింది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కారణంగా వీళ్ళ మోజు పెరిగింది. అదికాక రెండు సంబంధాలకీ ముడి పెట్టారు వాళ్ళు."
"ఇది అనుకోని దెబ్బ నాకు. మరిప్పుడు నేనేం చేయాలిట?"
"కుసుమ మిమ్మల్నే చేసుకోవాలనుకుంటోంది. అందు గురించి ఒక చిన్న ఉపాయం ఆలోచించింది. మీరొక చిన్న ఉత్తరం రాసివ్వండి. 'నేను ఈరోజు రాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఇందుకు ఎవరూ బాధ్యులు కారు' అని రాసి సంతకం పెట్టి తేదీ వేసి నాకివ్వండి. అది కుసుమకు నేనందజేస్తాను. అది తనకు ఏ కిటికీ లోంచో మీకు విసిరి అందజేశారని కుసుమ చెబుతుంది.
"ఈ ఉత్తరం సహాయంతో ఆమె ఇంట్లో దెబ్బలాడదలుచుకుంది. కుసుమ తలిదండ్రులు దురాశాపరులు కావచ్చు కానీ, దుర్మార్గులు మాత్రం కారు. వెతుక్కుంటూ ఈ రాత్రికే మీఇంటికి వస్తారు.
